Home Telugu Articles ఇస్లాం ఆధారిత షరియా న్యాయస్థానాలు భారత లౌకిక విశ్వాసాలకు ప్రమాదం

ఇస్లాం ఆధారిత షరియా న్యాయస్థానాలు భారత లౌకిక విశ్వాసాలకు ప్రమాదం

0
SHARE

దేశంలోని అన్ని జిల్లాల్లో షరియా న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) నిర్ణయించడం తీవ్ర వివాదం రేపుతోంది. ఏడు దశాబ్దాల క్రితం రాజ్యాంగ నిర్మాణ సభలో లౌకిక రాజ్య మౌలిక సూత్రాలపై హోరాహోరీగా సాగిన చర్చను ఈ నిర్ణయం మళ్ళీ తిరగదోడింది. ఉమ్మడి పౌరస్మృతికి ఆ సభలో కొందరు సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడం పట్ల బీఆర్‌ అంబేడ్కర్‌తోపాటు ఇతర న్యాయనిపుణులూ ఆందోళన వ్యక్తీకరించారు. ఏఐఎమ్‌పీఎల్‌బీ తాజా నిర్ణయం పాత ఆందోళనలకు మళ్ళీ ఊపిరి పోస్తోంది. కాంగ్రెస్‌తో సహా వివిధ రాజకీయ పార్టీలు ఏళ్లతరబడి మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిన ఫలితమే ఇది. ఇటీవల సంభవించిన కొన్ని రాజకీయ పరిణామాలూ ఈ పరిస్థితికి హేతువయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ నాయకత్వం తీసుకున్న కొన్ని అపసవ్య నిర్ణయాలనూ దీనికి నిందించాల్సిందే!

విడ్డూర ప్రతిపాదనలు

ఇక్కడ ఒకసారి గతంలోకి వెళ్లాలి. 1946 డిసెంబరు తొమ్మిది నుంచి రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశాలు నిర్వహించసాగింది. ఆపైన ఎనిమిది నెలలకు భారత్‌కు స్వాతంత్య్రం లభించింది. దాంతోపాటే దేశ విభజన జరిగి ముస్లిములు పాకిస్థాన్‌ అంటూ సొంత ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది జరిగిన రెండేళ్ల తరవాత రాజ్యాంగ నిర్మాణ సభలోని ముస్లిం సభ్యులు తమ వర్గ ప్రతినిధులను తామే ఎన్నుకోవడానికి విడిగా ఎన్నికలు జరిపించాలనే డిమాండు లేవనెత్తారు. ఇది షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పరచడం వంటిది కాదు. ఎస్సీ నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ఓటర్లు కలిసి ఎస్సీ ప్రతినిధిని ఎన్నుకుంటారు. కానీ, ముస్లిం ఓటర్లు మాత్రమే కలిసి ముస్లిం ప్రతినిధిని ఎన్నుకొనే వీలు కల్పించాలని మైనారిటీ వర్గ సభ్యులు డిమాండు చేయడం గమనించాల్సిన అంశం. దేశ విభజన తరవాత లౌకిక భారతంలోనే ఉండిపోయిన ముస్లిం ప్రజల కోసం విడిగా ఎన్నికలు జరిపించాలనడం నిజంగా చోద్యం. మత ప్రాతిపదికన భారత్‌ను విభజించిన దరిమిలా స్వతంత్ర దేశంలో హిందూముస్లిములకు ఉమ్మడి పౌరస్మృతి ఉండాలన్న ప్రతిపాదనకు ఈ ప్రతినిధులు గండి కొట్టారు. ఉమ్మడి పౌరస్మృతి పట్ల వారి తీవ్ర వ్యతిరేకత చూసి అంబేడ్కర్‌ సహా రాజ్యాంగ సభలోని ఇతర సభ్యులూ నిర్ఘాంతపోయారు.

ముస్లిముల సొంత పౌరస్మృతికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టపరమైన యంత్రాంగం ఏర్పరచుకోవడానికి నేడు ఏఐఎమ్‌పీఎల్‌బీ అడుగు ముందుకేస్తోంది అంటే కారణం- అప్పట్లో జవహర్‌లాల్‌ నెహ్రూ ముస్లిం ప్రతినిధుల దూకుడును గట్టిగా అడ్డగించకపోవడమే. దాని విష ప్రభావం నేడు భారతీయుల లౌకిక విశ్వాసాలపై ప్రసరిస్తోంది. ఇక్కడ 1948 నవంబరు 23న ఈ అంశంపై రాజ్యాంగ సభలో నడిచిన చర్చను గుర్తుచేసుకోవాలి.

‘భారత దేశ ప్రజలందరికీ ఏకరూప పౌరస్మృతిని ఏర్పరచడానికి మన రాజ్య వ్యవస్థ కృషి చేయాలి’ అని రాజ్యాంగ ముసాయిదాలో పొందుపరచిన అధికరణను రాజ్యాంగ నిర్మాణ సభలోని ముస్లిం సభ్యులు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ సాహిబ్‌, నజీరుద్దీన్‌ అహ్మద్‌, మహబూబ్‌ అలీ బేగ్‌ సాహిబ్‌ బహదూర్‌, పాకర్‌ సాహిబ్‌, హుసేన్‌ ఇమామ్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ముస్లిములకు వర్తించే సూత్రాలు పూర్తిగా మతం మీదే ఆధారపడినవని మహబూబ్‌ అలీ బేగ్‌ వాదించారు. ఇతర ముస్లిం సభ్యులూ దీన్ని బలపరచారు. దేశంలో ఏ వర్గం, ఏ బృందం తమ వ్యక్తిగత న్యాయ సూత్రాలను వదులుకోనక్కర్లేదనే సూత్రాన్ని పై అధికరణలో చేర్చాలని మహమ్మద్‌ ఇస్మాయిల్‌ సాహిబ్‌ డిమాండు చేశారు. ప్రజలకు తమ తమ మతాలు నిర్దేశించిన వ్యక్తిగత న్యాయ సూత్రాలను అనుసరించే స్వేచ్ఛ ఉన్నట్లయితే అసంతృప్తికి తావు ఉండదన్నారు. పై అధికరణ నిరంకుశమైనదని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని పాకర్‌ సాహిబ్‌ వాదించారు.

లౌకిక వాదానికి మహబూబ్‌ అలీ బేగ్‌ ఓ వికృత భాష్యం చెప్పారు. లౌకిక రాజ్యంలో భిన్న మతస్థులు తమ తమ వ్యక్తిగత న్యాయ సూత్రాలను పాటిస్తూ తమ పంథాలో తాము జీవించే హక్కు కలిగి ఉండాలన్నది ఆయన వాదన సారాంశం. ప్రతి మైనారిటీ వర్గ పవిత్ర హక్కులను కాపాడటం మెజారిటీ ప్రజల విధి అని పాకర్‌ సాహిబ్‌ వాదించారు. ఈ వాదనలను మున్షీ గట్టిగా సవాలు చేశారు. ‘ఏ ఆధునిక ముస్లిం దేశంలోనూ ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మైనారిటీల వ్యక్తిగత న్యాయ సూత్రాలు అడ్డురాలేదు, రానివ్వలేదు. అవి తిరుగులేనివని ప్రకటించలేదు. కావాలంటే టర్కీ, ఈజిప్ట్‌ లను చూడండి. అక్కడ ఏ మైనారిటీ వర్గానికీ సొంత వ్యక్తిగత న్యాయసూత్రాలను అనుమతించలేదు’ అని మున్షీ గుర్తుచేశారు. మన దేశంలోనూ ముస్లిముల్లో మైనారిటీలైన ఖోజా, కుఠి మెమన్‌లకు సొంత వ్యక్తిగత న్యాయ సూత్రాలను మెజారిటీ ముస్లిములు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సభలోని ముస్లిం సభ్యుల వాదనలు భారత్‌ను సమైక్య దేశంగా పటిష్ఠం చేస్తాయా అని ఆళడి కృష్ణస్వామి అయ్యర్‌ ప్రశ్నించారు. ఈ దేశంలో వివిధ వర్గాలు నిత్యం పోటీపడుతూ కలహించుకుంటూ జీవితం గడపాలా అని నిలదీశారు. బ్రిటిష్‌వారు దేశమంతటికీ ఒకే నేర న్యాయస్మృతిని ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించని ముస్లిములు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు ప్రతిఘటించాలని అయ్యర్‌ సవాలు చేశారు. మారుతున్న కాలానికి తగినట్లు మారడానికి ఈ దేశంలో సిద్ధంగా ఉన్న ఏకైక వర్గం మెజారిటీ హిందూ వర్గమేనని ఆయన అన్నారు. సమకాలీన హిందువులూ ఇదే మాట అంటున్నారు.

అహేతుక వాదనలు

దేశంలో కొందరు వ్యక్తులు ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే అందుకు ఓ ఉమ్మడి చట్టం ఉంది. అలాగే ఆస్తుల బదిలీకి, చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించీ ఉమ్మడి చట్టాలున్నాయి. అంటే ఇప్పటికే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉన్నట్లు లెక్క. దీన్ని వివాహాలు, వారసత్వాలకూ వర్తింపజేయడం సహజమే. అయినా ముస్లిములు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడం పట్ల అంబేడ్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి ముస్లిం సభ్యులు తమ వర్గం పాటించే నియమాలు, సూత్రాలు ఖురాన్‌ నుంచి సంక్రమించాయని, 1300 సంవత్సరాలకు పైగా వీటిని పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంబేడ్కర్‌ దీన్ని సవాలు చేశారు. ఉదాహరణకు వాయవ్య సరిహద్దు రాష్ట్ర ముస్లిములు 1935 వరకు వారసత్వం, తదితర వ్యక్తిగత విషయాల్లో హిందూ వ్యక్తిగత న్యాయ సూత్రాలనే అవలంబించేవారు. కేరళలో మలబార్‌ ప్రాంతంలోని హిందూ ముస్లిములు మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన మరుమక్కతైయం న్యాయ సూత్రాలను పాటించేవారు. అలాంటప్పుడు ముస్లిం వ్యక్తిగత న్యాయ సూత్రాలు అనాది నుంచి మార్పు లేకుండా తిరుగులేకుండా వర్తిస్తూ వస్తున్నాయని ఎలా వాదించగలరని అంబేడ్కర్‌ ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి రూపకర్తలు ముస్లిముల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాదించడం అర్థరహితమన్నారు. రాజ్యాంగ నిర్మాణ సభ తన కాలంకన్నా చాలా ముందుకెళ్లి ఆలోచిస్తోందని నజీరుద్దీన్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌరస్మృతి వచ్చే రోజు బహుశా ముందున్నదన్నారు. ఏఐఎమ్‌పీఎల్‌బీ తాజా నిర్ణయాన్ని చూస్తే అలాంటి రోజు ఎన్నటికీ రాకపోవచ్చునని అర్థమవుతోంది. ఆనాడు జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వం వేసిన తప్పటడుగుకు భావి భారత తరాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది!

ఏ సూర్య ప్రకాష్
ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)