Home Telugu Articles ఇస్లామిక్ స్టేట్ పై ఉమ్మడి పోరు

ఇస్లామిక్ స్టేట్ పై ఉమ్మడి పోరు

0
SHARE

అదను చూసి ఆత్మాహుతి దాడులతో భయోత్పాతం సృష్టించే ఐఎస్‌ ముద్రాంకిత మృత్యుమేఘం ఉపఖండంపై దట్టంగా ముసురేసింది. ఉగ్రవాదాన్నే ప్రచ్ఛన్న యుద్ధసాధనంగా మలచి దశాబ్దాలుగా ఇండియాలో నెత్తుటి నెగళ్లు ఎగదోస్తున్న పాకిస్థాన్‌లో శాంతిభద్రతల్ని ఛిద్రం చేస్తూ ఐఎస్‌ పంజా విసరుతోంది. సింధ్‌ ప్రాంతంలోని సెహ్వాన్‌ పట్టణంలో సూఫీ లాల్‌ షహ్వాజ్‌ ఖలంధర్‌ దర్గాలో జరిగిన ఆత్మాహుతి దాడి వందమంది అభాగ్యుల్ని బలిగొని మరెంతోమందిని క్షతగాత్రుల్ని చేసింది. మొన్న సోమవారం నుంచే చూసినా పాక్‌లోని విభిన్న ప్రాంతాల్లో జరిగిన ఎనిమిదో ఉగ్రదాడి అది. ఆ ఘోరకలికి పాల్పడింది తామేనని ఐఎస్‌ ప్రకటించుకొన్నా- ఆ ఉగ్రభూతానికి తమ గడ్డమీద ఉనికే లేదని అధికారగణం స్పష్టీకరిస్తోంది. నిరుడు నవంబరులోనూ బలూచిస్థాన్‌లోని సూఫీ దర్గాపై జరిగిన ఆత్మాహుతి దాడి 52మంది అభాగ్యుల్ని కబళించింది. ఆ ఘోరానికీ తమదే బాధ్యత అని చాటుకొన్న ఐఎస్‌ దీర్ఘకాలిక వ్యూహంతో నెత్తుటేళ్లు పారిస్తోందన్నది సుస్పష్టం.

చిందిన ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకొంటామంటూ ప్రతిదాడుల్లో 39మంది ఉగ్రవాదుల్ని పాక్‌ సైన్యం చిదిమేసినా- ఈ సంక్షోభం అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కాదన్నది నిర్ద్వంద్వం! షియా వర్గానికి చెందిన పౌరుల్ని లక్ష్యంగా చేసుకొన్నామంటూ ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఐఎస్‌ చేసిన కారుబాంబు దాడి 51మంది ఉసురు తీసేసింది. ఇరాక్‌లో సద్దాం ప్రభుత్వం ప్రపంచశాంతికి తీవ్రాఘాతమంటూ ఉగ్రవాదం మీద యుద్ధాన్ని బాగ్దాద్‌ దిశగా మళ్లించిన అమెరికా అగ్రవాదం- ఐఎస్‌ పుట్టుకకు కారణభూతమైంది. ఇరాక్‌, సిరియాల్లో గట్టిగా కాలూనుకుని భయవిహ్వల దాడులతో బెంబేలెత్తిస్తున్న ఐఎస్‌, రెండేళ్ల క్రితం ‘ఖొరసాన్‌’ రాజ్యసంస్థాపన లక్ష్యాన్ని ప్రకటించింది. అఫ్గాన్‌, పాకిస్థాన్లలో పెచ్చరిల్లిన ఆత్మాహుతి దాడుల్ని ఆ కోణం నుంచే గమనించాలి. ఏటికేడు ఐఎస్‌ పడగనీడ విస్తరిస్తున్న వాస్తవాన్ని గుర్తించి, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పాకిస్థాన్‌ కూడి వస్తేనే- ఉపఖండంలో శాంతి రహించేది!

చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్నది హితోక్తి. అలాంటిది ఉగ్రవాద విషభుజంగానికి పాలు పోసి పెంచడం ద్వారా కశ్మీరును కబళించడానికి పాకిస్థాన్‌ నాయకగణం కుయుక్తులు పన్నింది. పాక్‌ గడ్డమీదే భారత వ్యతిరేక ఉగ్రసంస్థలు కత్తులు నూరుతుంటే- అఫ్గాన్‌, ఇస్లామాబాద్‌లను కబళించడానికి ఐఎస్‌ కోరచాస్తోంది. ఇరాక్‌, సిరియాలను మినహాయించి చూసినా, 2014 జూన్‌ లగాయతు ఇప్పటిదాకా 29 దేశాల్లో 140కి పైగా ఉగ్రదాడులకు ఐఎస్‌ పాల్పడిందని గణాంకాలు చాటుతున్నాయి. ఆయా దారుణాల్లో రెండు వేలమందికిపైగా బలైపోగా, మరెన్నో వేలమంది క్షతగాత్రులయ్యారు. 2011-’15 మధ్యకాలంలో ఒక్క ఇరాక్‌లోనే భయానక పేలుళ్లకు పాల్పడిన ఐఎస్‌ 50 వేలమందికి పైగా పొట్టన పెట్టుకొంది. వారిలో 82 శాతం సాధారణ పౌరులేనన్న నిజం గుండెల్ని పిండేస్తుంది. 2003-’17 నడిమి కాలంలో పాకిస్థాన్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదం 21,527 మంది పౌరుల్ని, 6,674 మంది భద్రతా సిబ్బందిని పరిమార్చిందని గణాంకాలు చాటుతున్నాయి. 2014లో పెషావర్‌ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి దాదాపు 150మంది ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో షరీఫ్‌ ప్రభుత్వం- దేశీయంగా తన ప్రయోజనాలకు భంగకరంగా విరుచుకుపడుతున్న ఉగ్రవాద శక్తులపై యుద్ధాన్ని ప్రకటించింది. ఉగ్రదాడుల్లో మంచి, చెడు అన్న విభజనలు ఉండరాదంటూనే- భారత్‌ పక్కలో బాకుగా మారిన ఉగ్రమూకల్ని ఇప్పటికీ ముద్దుచేస్తూనే ఉంది. కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్‌ సరిహద్దుల్ని పునర్లిఖించాలని పాక్‌ కలలు కంటుంటే- అఫ్గాన్‌, పాకిస్థాన్‌లతోపాటు ఇండియాలోని గుజరాత్‌ సహా వాయవ్య ప్రాంతం అంతా తమ చెప్పుచేతల్లో ఉండాలని ఐఎస్‌ తలపోస్తున్నది. ఏ విధంగా చూసినా ఈ ముప్పును ఎదుర్కోవడం పాకిస్థాన్‌ ఒక్కదానివల్లా కాని పని!

ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తే కూలేవి భవంతులే కాదు; ప్రజాస్వామ్య వ్యవస్థల పునాదులూ కదిలిపోతాయని అమెరికా అధ్యక్షుడిగా జార్జి బుష్‌ చెప్పింది అక్షర సత్యం. ఆయన వారసుడైన బరాక్‌ ఒబామా పదవీకాలంలో ఒసామా బిన్‌ లాడెన్‌ హతమారిపోయినా, ఐఎస్‌ ప్రాబల్యం చిలవలు పలవలు వేసుకుపోయిందన్నది నిజం. ‘ఐఎస్‌ను ఓడించడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఈ తరానికి గడ్డు సవాలు; దాన్ని విశ్వజనీన స్థిర సంకల్పంతోనే సాధించాల్సి ఉంటుంది’ అని ‘నాటో’ సెక్రటరీ జనరల్‌ మూన్నాళ్ల క్రితం వెల్లడించారు. ఐఎస్‌ను తుదముట్టించడమే లక్ష్యమని గట్టిగా చాటుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- అందుకు అనువైన వ్యూహనిర్మాణాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయాలంటూ పెంటగాన్‌ను ఆదేశించారు. సిరియాలో తొలిసారి పదాతి దళాల్ని కదం తొక్కించడం సహా పలు ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్న ట్రంప్‌ సర్కారు- మొట్టమొదటగా ఉగ్రవాదానికి విస్పష్ట నిర్వచనం సమితి ద్వారా వెలువడేలా చూడాలి. సీఐఏ మాజీ అధికారి కెవిన్‌ హూల్బర్ట్‌ హెచ్చరించినట్లు- ప్రపంచానికి పాకిస్థాన్‌ అత్యంత ప్రమాదకారి! ఒకవంక లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో అంటకాగుతూ, మరోపక్క ఐఎస్‌ టెర్రరిజంతో అట్టుడుకుతున్న పాకిస్థాన్లో అణ్వస్త్రాలు ఏ ఉగ్రవాదుల చేజిక్కినా ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది. ఆ ముప్పును తప్పించేలా అన్ని రకాల ఉగ్రవాదాన్ని తుదకంటా నిర్మూలించే సమష్టి కార్యాచరణ సమితి ఆధ్వర్యంలోనే అమలు కావాలి. అమాయక జనహననమే ఉగ్రవాదమన్న తీర్మానంతో ప్రతీపశక్తులకు నిలువనీడ లేనివిధంగా సమితి స్థాయిలో ఉమ్మడి వ్యూహాలు పదునుతేలినప్పుడే- టెర్రరిజం పీడ విరగడయ్యేది!

(ఈనాడు సౌజన్యం తో)