Home Telugu మతమార్పిడికి గురై ఇస్లామిక్ జిహాది గా ఉగ్రవాద దాడులకు రచన చేస్తున్న ఒమర్‌

మతమార్పిడికి గురై ఇస్లామిక్ జిహాది గా ఉగ్రవాద దాడులకు రచన చేస్తున్న ఒమర్‌

0
SHARE
  • పాకిస్తానీయులతోనూ పరిచయాలు!
  • ఐసిస్‌ సానుభూతిపరుడు ఒమర్‌ వ్యవహారమిది
  • ఫేస్‌బుక్‌ ద్వారానేపలువురితో సంప్రదింపులు
  • సిట్‌ విచారణలో పలు కీలకాంశాలు వెల్లడి

ఐసిస్‌ సానుభూతిపరుడు కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్‌ ఒమర్‌ సీసీఎస్‌ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో కీలకాం శాలు వెల్లడించాడు. గత నెలలో అరెస్టు చేసిన ఇతడిని ఇటీవల సిట్‌ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఒమర్‌ పాకిస్తాన్‌తో పాటు నైజీరియాకు చెందిన వారి తోనూ సంప్రదింపులు జరిపాడని తేలింది. ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని కొత్తమాజేరుకు చెందిన సుబ్రహ్మణ్యం ఇంటర్‌లో పరిచయమైన స్నేహి తుల ప్రభావంతో మతం మార్చుకుని ఒమర్‌గా మారాడు. హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, గుజరాత్‌ల్లోని అనేక మదర్సాల్లో స్వల్పకాలిక శిక్షణ తీసుకున్నాడు.

ఉగ్రమార్గం పట్టించిన అల్‌హింద్‌…

ఒమర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్‌హింద్‌తో పరిచయమైంది. అతడితో ఒమర్‌ నిత్యం ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌ ద్వారా చాటింగ్‌ చేసేవాడు. అల్‌హింద్‌ స్ఫూర్తితోనే ఐసిస్‌ వైపు ఆకర్షితుడైన ఒమర్‌ ఆ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరుడిగా మారాడు. ‘భవిష్యత్తు కార్యాచరణ’ సిద్ధం చేసుకోవడానికి గత నవంబర్‌ లో ముంబై వెళ్లిన ఒమర్‌ను అల్‌ హింద్‌ కలిశాడు. తన పేరు డాక్టర్‌ ఖాలిద్‌ అని, దంతవైద్యుడినని పరిచయం చేసుకున్నాడు.

డార్మిటరీలో బస…

ఉగ్రవాద చర్యల్ని ఎలా చేపట్టాలి, యువతను ఐసిస్‌ వైపు ఎలా ఆకర్షించాలన్న విషయాలను ఒమర్, అల్‌హింద్‌ చర్చించారు. ఒమర్‌ మూడు రోజులు అక్కడి అల్‌ సబ డార్మిటరీలో ఉన్నాడు. శ్రీనగర్‌కు చెందిన ఇస్లామిక్‌ గ్లోబల్‌ స్కూల్‌ నిర్వాహకుడు మహ్మద్‌ అమీర్‌ గత ఏడాది మేలో ఇతడికి పరిచయమయ్యాడు. చందాల వసూలు కోసం మరో నలుగురితో కలసి హైదరాబాద్‌ పంపిస్తున్నానని, ఆశ్రయం కల్పించమని కోరాడు. వీటికి టోలిచౌకికి చెందిన అమీరుద్దీన్‌ ద్వారా బస కల్పించిన ఒమర్‌ చందాల వసూళ్లకూ వారితో తిరిగాడు. వివాదాస్పద ఐఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుడు జకీర్‌నాయక్‌తో పాటు మరో 8 మంది ప్రసంగాలను అమీర్‌ సూచనలతో యూట్యూబ్‌లో ఒమర్‌ వీక్షించాడు.

పాస్‌పోర్ట్‌ ఉంటే ముజాహిదీన్‌గా…

ఒమర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా పాక్‌కు చెందిన అబు మహ్మద్, అల్‌ హింద్‌ అల్‌ ఘాజీ, మహ్మద్‌ ఉమర్, ఇస్మాయిల్‌షా సాహిల్, నైజీరియాకు చెందిన అబ్దుల్‌ జలీల్, జోహన్నెస్‌బర్గ్‌కు చెందిన సుమాలీ, గోవాకు చెందిన మూసా, మధురైకి చెందిన అబు సిద్ధిఖ్‌లతో పరిచయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్‌లో అబుమహ్మద్‌తో చాటింగ్‌ చేసిన ఒమర్‌… పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజహర్‌ విషయం చర్చించాడు. తనకు పాస్‌పోర్ట్‌ లేదని, ఉంటే తాను కూడా ముజాహిదీన్‌గా (క్షేత్రస్థాయిలో ఉగ్రవాది) మారేవాడినని ఈ సందర్భంగా చెప్పాడు. పలువురితో చాటింగ్స్‌ చేసిన ఒమర్‌ తాలిబన్లు, బిన్‌ లాడెన్‌ తదితర అంశాలను చర్చించాడు.

పెట్రోల్‌ బాంబులపై ఆన్‌లైన్‌ శిక్షణ

ఒమర్‌ను వినియోగించి విధ్వంసాలు సృష్టించాలని అల్‌హింద్‌ పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చ్‌ 3న టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా పెట్రోల్‌ బాంబుల తయారీ, ఉపయోగించడం వంటి వివరాలను పంపాడు. అల్‌హింద్‌ సూచనల మేరకు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి తాను కుట్ర పన్నినట్లు సిట్‌ విచారణలో ఒమర్‌ చెప్పుకొచ్చాడు. అల్‌ హింద్‌ ఎవరనే కోణంలో సిట్‌తో పాటు నిఘా వర్గాలూ ఆరా తీస్తున్నాయి.

(సాక్షి సౌజన్యం తో)

For latest updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp