Home Telugu Articles వైదిక సంస్కృతి ప్రచారకులు జగద్గురువు శంకరాచార్యులు

వైదిక సంస్కృతి ప్రచారకులు జగద్గురువు శంకరాచార్యులు

0
SHARE

వైశాఖ శుద్ధ పంచమి – జగద్గురువు ఆదిశంకరులు అవతరించిన రోజు. ఆయన కారణజన్ముడు. దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేసేందుకు త్రేతాయుగంలో శ్రీరామ చంద్రమూర్తి , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఎలా అవతరించాడో అలాగే ఈ కలియుగంలో మన(హైందవ) ధర్మానికి ముప్పు వాటిల్లు సమయంలో ధర్మపరి రక్షనార్ధామై , వైదిక సంస్కృతిని కాపాడేందుకు సాక్షాత్తు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా భువిన అవతరించాడు.

        మనం ఈరోజు ఇన్ని పండుగలు ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే కారణం శంకరులే. ఆయన అవతరించి ఉండకపోతే మనం ఇవన్ని జరుపుకునే వాళ్ళం కాదేమో. మన వైదిక సంస్కృతిని నిలబెట్టింది శంకరులు. మన ధర్మానికి మూల స్తంభం శంకరులు. తన 32సం|| అత్యల్ప జీవితకాలంలో మనవ సమాజానికి ఎంతో ఉపకారం చేసారు. ఆసేతు హిమాచలపర్యంతం భ్రమణం చేసి ఎన్నో ఆలయాలు స్థాపించాడు. శ్రీచక్రాలను నెలకొల్పారు. అద్వైత సిద్ధాoతాన్ని ప్రతిపాదించారు.

ఆయన జగద్గురువుగా అందరిచే స్తుతించబడ్డారు. సాధారణంగా ‘జగద్గురువు’ అను పదము అందరికి వర్తించదు. దశావతారాలలో ఒక్క శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే “క్రిష్ణమ్ వందే జగద్గురుమ్”  అని అందరు ఆ పరమాత్ముణ్ణి స్తుతిస్తారు. కాని ఆయన తర్వాత ఈ లోకంలో ‘జగద్గురు’ అనుపదం ఆది శంకరులకు మాత్రమే వర్తిస్తుంది. నిజానికి మన దేశంలో ఎన్నో మతాలున్నాయి , ప్రతి మతానికి మఠాలున్నాయి. కాని ఆ మఠాదిపతులెవ్వరూ జగద్గురువులని చెప్పబడలేదు. ఎందుకంటే వారు కేవలం తమ ప్రత్యేక మార్గాలను భోధిస్తూ , ఇతర మార్గాలను ఖండించేవారు. కాని శంకరులు అలా కాదు ఆ సమయంలో బౌద్ధం , సంఖ్యా యోగం మొదలగు వాటిని మంచిని స్వీకరించారు. అందుకే ఆయన జగద్గురువులని పిలుచుకున్నారు.

కేరళలోని కాలడిలో ఆర్యమాంబ, శివగురులకు శంకరులు జన్మించారు. మూడేళ్ళు నిండక ముందే సర్వ శాస్త్ర జ్ఞానాన్ని సంతరించుకున్నారు. 5వ సం|| లో ఉపనయనం , 8వ సం|| లో సర్వ శాస్త్రాలు , వేదాలు అభ్యసించి పరిపూర్ణత్వాన్ని పొందారు. తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరించారు.

తల్లి ఆర్యమాంబ అనారోగ్యంగా ఉండి నదీ స్నానానికి వెళ్ళలేక పోతే పూర్ణనది ప్రవాహ మార్గాన్ని తన ఇంటివైపు మరల్చిన మహానుభావుడు. బాల బ్రహ్మచారిగా ఉన్నప్పడు ఒక పేదరాలి ఇంటికి భిక్షకై వెళ్ళి , ఆమె దీన పరిస్థితిని గ్రహించి, కనకధారాస్తవం చేసి బంగారు ఉసిరికల వర్షం కురిపించారు.

సన్యాసం స్వీకరించిన తర్వాత వారు నర్మదా నదీ తీరాన గుహయందు ఉన్న గోవింద భగవత్పాదుల వారి దర్శనం చేసుకొని, ఆయన దగ్గర శిష్యరికం వహించాడు. గోవింద భగవత్పాదులు, ఆయనను సాక్షాత్తు శివుని అవతారంగా గ్రహించి , బ్రహ్మ జ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహా వాక్యాలుగా బోధించారు. నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గురువుగారి తపస్సుకు భంగం కల్పించబోతుందని భావించి తన తపశక్తితో నర్మదానది ఉదృతిని ఆపారు శంకరులు.

ఆ తర్వాత గురువు ఆజ్ఞతో వారణాసి చేరుకొని విశ్వేశ్వరుని సన్నిదిలో కొన్ని రోజులు గడిపారు. అక్కడే చండాలుని రూపంలో శంకరుని దర్శనం లభించింది.  మనీషాపంచకం స్తోత్రం చేసి సాష్టాంగపడ్డారు.

లౌకిక విద్యాలతోనే కాలం గడిపేస్తున్న వారికి  గోవింద భజన చేయమని  జ్ఞానోదయం కల్గించారు. ‘మోహ ముద్గరం’ స్తోత్రం రచించారు. దేశమంతా తిరిగి, వైదిక సంస్కృతి పరిరక్షణకు శృంగేరి, పూరి, ద్వారకా, బధరీ మఠాలను స్థాపించారు.

గణేశ పంచరత్నమాల, లలిత పంచరత్నమాల, గుర్వష్టకం, సౌందర్యలహరి,  శివానందలహరి, లక్ష్మి నృసింహ కరవాలంబాన స్తోత్రం మొదలగునవి దాదాపు 108 గ్రంధాలు రచించారు. నేడు అవి అందరికి నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఉపయోగ పడుతునాయి. 12 సం|| ల చిరుప్రాయం లోనే శంకరులు ఉపనిషత్తులు, బ్రహ్మసుత్రాలు , భగవద్గీతకు భాష్యాలు వ్రాశారు.

– విద్యారణ్య