Home RSS జాతి జాగృతిలో సంఘ్

జాతి జాగృతిలో సంఘ్

0
SHARE

–రాంపల్లి మల్లికార్జున్‌

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఈ విజయదశమికి 94 ఏళ్ళు పూర్తిచేసుకుని 95వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క సంఘం వేగంగా విస్తరిస్తూంటే మరో పక్క సంఘాన్ని బలహీన పరచాలని చేసే ప్రయత్నాలూ ముమ్మరమయ్యాయి. సంఘాన్ని బలహీన పరచాలంటే సంఘ సిద్ధాంతాన్ని బలహీనపరచాలి. దానికోసం అనేకమంది పనిగట్టుకొని పని చేస్తు న్నారు. సంఘం చెప్పే సిద్ధాంతం హిందుత్వం. కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ ఏకంగా ‘Why i am a hindu’ పేరుతో ఒక పుస్తకం రాశాడు. సంఘం చెప్పే హిందుత్వం, అసలు హిందుత్వం ఒకటి కాదని నిరూపించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ హిందు ధర్మం గురించి, సంస్కృతి గురించి అనేక వివరాలు ఇచ్చాడు. ఆ పుస్తకం చూస్తే హిందుత్వం ఒక జీవన విధానం, సంస్కృతి అని అనిపిస్తుంది.

ఆంగ్లేయుల పాలనా కాలంలో మూడుసార్లు సంఘ్‌ స్వయం సేవకుల కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రయత్నాలు జరిగాయి. డాక్టర్‌జీ, గురూజీ కార్యకుశలత వల్ల, సంఘానికి ఉన్న ప్రజా సమర్థన కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమైనాయి. స్వతంత్ర భారతంలో కూడా ఎదుగుతున్న జాతీయ శక్తి రాజకీయులకు కంటగింపుగా ఉన్నది. బ్రిటిష్‌ పాలకులకంటే ఎక్కువగా సంఘాన్ని అణచివేయాలని విఫలయత్నాలు చేశారు. అందులో మొదటిది 1948లో గాంధీజీ హత్యానేరాన్ని మోపి సంఘాన్ని నిషేధించారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో, బాబ్రీ కట్టడం కూల్చివేత తరువాత సంఘాన్ని నిషేధించాలని చూశారు. ఇవేవీ ప్రజల ముందు, న్యాయస్థానాలలో నిలబడలేదు. సంఘం ద్విగుణీకృతంగా విస్తరిస్తూనే ఉన్నది. నేడు ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది.

చదవండి: రిజర్వేషన్ల పై ఆర్.ఎస్.ఎస్ దృష్టికోణం

2014 సెప్టెంబర్‌ 27న ఢిల్లీలో 30 దేశాలకు చెందిన 50 మీడియా సంస్థలు, 80 మంది విదేశీ పాత్రికేయులతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ సర్‌ సంఘచాలక్ మోహన్ జీ భాగవత్‌ రెండు న్నర గంటలు ఇష్టాగోష్ఠి జరిపారు. హిందుత్వం అనేది భారతీయ సాంస్కృతిక విలువల సారాంశమని, విభిన్న విశ్వాసాలున్న ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడమే దాని లక్ష్యమని చెప్పారు; హిందు రాష్ట్రమంటే ముస్లింలకు ఇక్కడ స్థానం లేదని అర్థం కాదు, అన్ని విశ్వాసాలు, మతాలను కలుపుకొని పోవటమే ఈ భావన అసలు ఉద్దేశమని, హిందుత్వం అంటే వసుధైక కుటుంబం అని వివరించారు. వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో వికసించిన సర్వ పంథ సమ భావనే హిందుత్వం. ఈ దేశం బాధితులు, దుఃఖితులకు ఆశ్రయమిచ్చి ఆదరించిన దేశం. పర్షియన్లు, యూదులు ఇక్కడికి వచ్చారు. వాళ్లను ఆదరించిన ఒకే ఒక్క ప్రపంచ దేశం భారత్‌. ప్రపంచంలో వికసించిన అనేక ఆలోచనలను స్వాగతించినది కూడా భారత దేశమే. అన్నింటిని సమన్వయ పరచుకుకొని మధ్యే మార్గంలో ప్రయాణం చేసే ఏకైక దేశం భారత్‌. ఇందుకు మనం ఎంతో గర్వపడాలి. సంఘం అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నది. సంఘం హిందూ సమాజ సంఘటన లక్ష్యంగా పని చేస్తున్నది. ఈ సమాజంలోని సామాజిక దురాచారాలను రూపుమాపి హిందూ సమాజంలో సామాజిక ఐక్యతను నిర్మాణం చేయ టానికి వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ పనిని సాధించటానికి ధర్మాచార్యులను భాగస్వాములను చేసింది. 1966 జనవరిలో ప్రయాగ కుంభమేళాలో ‘సహిందుక పతిలోభవేత్‌’ అని తీర్మానం చేయించటంలో గురూజీ గోల్వాల్కర్‌ సఫలమైనారు. ఆ తదుపరి కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన విశ్వహిందూ పరిషత్‌ సభలలో ‘హైందవః సోదరాస్సర్వే’ అని తీర్మానం కూడా చేయించారు. అనేక మంది స్వామీజీలు ఈ సామాజిక దురాచారాలను దూరం చేయటానికి పని చేస్తున్నారు. ఈ రోజున దేశమంతా ‘సామాజిక సమవసత్‌’ వేదిక ఆధారంగా స్వయం సేవకులు పని చేస్తున్నారు.

https://youtu.be/AcSo-Jpx2Mw

ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో అనేక జన జాగరణ కార్యక్రమాలు కూడా నిర్వహించింది. 1952లో గోవధ నిషేధాన్ని కోరుతూ స్వయం సేవకులు కోటి 74 లక్షల మంది వయోజనుల సంతకాలు సేకరించిరాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌కు అందజేసారు. వేల సంఖ్యలో మహ్మదీయులు, క్రైస్తవులుకూడా ఈ వినతి పత్రంపై సంతకాలు చేశారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో ఎదురైన పరాభవానికి దేశ ప్రజలు ఎంతో వ్యధ చెందారు. ప్రజలను జాగృతం చేసేందుకు 1963లో స్వామి వివేకానంద జన్మ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు. స్వామి అమెరికాకు వెళ్లేముందు మూడురోజల పాటు కన్యా కుమారి వద్ద తీరానికి కొద్ది దూరంలో సముద్ర జలాల మధ్య ఉన్న ఒక శిలాఖండపై అంతర్ముఖులై భారత భవితవ్యం గురించి ఆలోచించారు. ఆ శిలపైన వివేకానందుని స్మారకం నిర్మాణం చేయటానికి ఏక్‌నాథ్‌జీ రానడే ప్రయత్నించారు.

దేశమంతాఆయనవెనుక నిలబడింది. పార్లమెంటు, తమిళనాడు ప్రభుత్వంతమ సహకారాన్ని అందించాయి. వివేకానంద శిలా స్మారకం 1970లో జాతికి అంకితం చేశారు. 1983లో దేశ వ్యాప్తంగా భారత మాత, గంగామాత రథయాత్రలు సాగాయి. దేశంలో ఏకాత్మతాభావం నిర్మాణం చేస్తూ ఆ రథాలు ‘ఏకాత్మతా యాత్ర’లో 50వేల కి.మీ. తిరిగాయి. ఈ యాత్రలో మూడు లక్షల గ్రామాల నుండి 10 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు.

1989లో ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాపకుడు డాక్టర్‌ హెడ్గేవార్‌ శతజయంతి ఉత్సవాలు దేశమంతలా 2,16,284 గ్రామాలలో జరిగాయి. ఈ సందర్భంగా సేవాభారతి ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ఇదిలక్షా యాభైవేలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నది. 2006లో ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వితీయ సర్‌సంఘచాలక్‌గురూజీ గోల్వాల్కర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా స్వయం సేవకులు దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా గ్రామాలలో పర్యటించారు.

ఇలా ఆరెస్సెస్‌ ప్రజలతో మమేకమవుతూ సమాజ హితం కోసం పలువిధాల పాటుపడుతున్నది. సంఘం నేడు దేశంలోని అన్ని సామాజిక రంగాలలో ప్రవేశించి పని చేస్తున్నది. ఒక జాతీయ శక్తిగా సంఘం ఎదుగుతున్నది. దేశం సర్వాంగీణ ఉన్నతే లక్ష్యంగా స్వయం సేవకులు చురుగ్గా, పటిష్ఠంగా పని చేస్తున్నారు.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here