Home Telugu Articles జనహితమే… అభిమతమై! భాజపా 37 ఏళ్ల ప్రస్థానం

జనహితమే… అభిమతమై! భాజపా 37 ఏళ్ల ప్రస్థానం

0
SHARE

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలక చారిత్రక సందర్భాన భాజపా 37వ సంస్థాపక దినోత్సవం జరుపుకొంది. ఈ ప్రయాణం సాధారణమైంది కాదు. ఒక జాతీయవాద పార్టీగా ఆవిర్భవించి, జాతీయపార్టీగా మారి, సామాన్య ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని క్రమంగా దేశమంతటా విస్తరించడం- భాజపా చారిత్రక గమనంలో అపూర్వ ఘట్టం. లక్షలాది కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి భాజపా సిద్ధాంతాన్ని విస్తరింపజేసినందువల్లే పార్టీకి నేడు దేశవ్యాప్త ఆమోదయోగ్యత లభించిందనవచ్చు. అటల్‌ బిహారి వాజ్‌పేయీ, అడ్వాణీల నాయకత్వంలో పరిణతి చెందిన భాజపా ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వం, అమిత్‌ షాల సారథ్యంలో కొత్త శిఖరాలను అధిరోహించింది. మరింత విస్తరిస్తోంది! కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా, పటిష్ఠ జాతీయవాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందే భారతీయ జనతా పార్టీ! ఆ పార్టీ ఆవిర్భావానికి ఓ చరిత్ర ఉంది. దానికో సిద్ధాంతం ఉంది. 1980 ఏప్రిల్‌ 5, 6 తేదీల్లో దిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో దాదాపు 3,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. భారతీయ జనతాపార్టీ పేరుతో కొత్త రాజకీయ పక్షం ఏర్పడాలని ఏప్రిల్‌ 6న సదస్సులో తీర్మానించారు. వాజ్‌పేయీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కమలాన్ని కొత్త చిహ్నంగా- మూడింట ఒకవంతు ఆకుపచ్చ, మిగిలిన రెండు భాగాల్లో కాషాయం రంగుపై చిత్రించిన కమలంతో జెండాను నిర్ణయించారు. ఆ తరవాత 1980 డిసెంబర్‌ 28-30 తేదీల్లో ముంబయిలో జరిగిన భాజపా జాతీయమండలి ప్లీనరీ సదస్సులో అటల్జీ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైంది. ‘ఒక చేతిలో భాజపా రాజ్యాంగం, మరో చేతిలో సమానత్వ నినాదంతో మనం ముందడుగు వేద్దాం…’ అని ఆయన ప్రకటించారు. ‘అంధేరా ఛటేగా, సూరజ్‌ నికలేగా… ఔర్‌ కమల్‌ నికలేగా’… (అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు… కమలం వికసిస్తుంది) అని ఆయన భవిష్యవాణి వినిపించారు.

ఇంతింతై వటుడింతై…

వాజ్‌పేయీ సారథ్యంలో 1998, 1999ల్లో భాజపా అధికారంలోకి వచ్చింది. నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్‌ తప్ప దేశాన్ని మరెవరూ పాలించలేరన్న భ్రమలు కొనసాగుతున్న రోజులవి. ఆ తరుణంలో ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్‌పేయీ భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించారు. అనుసంధాన విప్లవానికి శ్రీకారం చుట్టారు. కార్యదక్షతతో దాదాపు 23 పార్టీలను ఒక్కతాటిపై నిలిపి అయిదేళ్లపాటు జనరంజకంగా పాలించారు. అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావంనుంచీ లోక్‌సభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్‌పట్ల సానుభూతి పవనాలు వీచాయి. ఆ నేపథ్యంలో ఎనిమిదో లోక్‌సభలో భాజపా రెండు సీట్లకే పరిమితమైంది. ఆపై అడ్వాణీ రథయాత్ర తదనంతర పరిణామాలవల్ల భాజపాకు ప్రజల మద్దతు పెరుగుతూ వచ్చింది. తొమ్మిదో లోక్‌సభలో 85సీట్లు, 10వ లోక్‌సభలో 120 సీట్లు, 11వ లోక్‌సభలో 161 సీట్లు, 12వ లోక్‌సభలో 182 సీట్లు, 13వ లోక్‌సభలో 182 సీట్లు రావడం ఇందుకు నిదర్శనం. ఆ తరవాత 14వ లోక్‌సభలో బలం 138 సీట్లకు, 15వ లోక్‌సభలో 116 సీట్లకు తగ్గినా- 2014లో నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించిన తరవాత ప్రజలకు భారతీయ జనతాపార్టీలో దీటైన ప్రత్యామ్నాయం కనబడింది. ఎన్నడూ లేనంతగా భాజపాను 282 స్థానాల్లో ప్రజలు గెలిపించారు. ప్రప్రథమంగా కాంగ్రెసేతర ప్రత్యామ్నాయానికి పూర్తి మెజారిటీ ఇచ్చారు. మిత్రపక్షాలతో కలిసి నేడు ఎన్డీయే సంఖ్యాబలం 352కు పెరిగింది.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ- ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ భాజపా తాజాగా సాధించిన విజయం చిరస్మరణీయమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి అజెండాపట్ల ప్రజలు మరోసారి తమ విశ్వాసం ప్రకటించారు. కుల, మత రాజకీయాలను అధిగమించి అభివృద్ధి, సుపరిపాలన అజెండాను ప్రజల ముందుకు తెచ్చిన ప్రధాని మోదీ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. చరిత్రాత్మకమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి; నల్లధనం, అవినీతిపై మోదీ పోరాటానికి ఈ ఎన్నికల ఫలితాలు అండగా నిలిచాయి. కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలకు ఈ ఎన్నికలు తిలోదకాలిచ్చాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 403 స్థానాల్లో 325 భాజపాకు ఇచ్చి ప్రజలు ఆ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం 690 సీట్లలో భాజపా 406 స్థానాలు సాధించింది. ఓట్లశాతం సైతం గణనీయంగా పెరిగింది. ఉత్తరాఖండ్‌లో 40 శాతం నుంచి 46.5 శాతానికి, మణిపూర్‌లో 2.13 శాతం నుంచి 36.3 శాతానికి, గోవాలో 30 శాతం నుంచి 32.5 శాతానికి భాజపా ఓట్ల శాతం మెరుగైంది.

భారతీయ జనతా పార్టీ చారిత్రక ప్రయాణంలో ఎన్నో అపవాదులు, అపోహలు, తప్పుడు ముద్రలకు లోనైంది. భాజపాను ఉత్తరాది రాజకీయ పక్షంగా, వ్యాపారుల పార్టీగా, అగ్రవర్ణాల పార్టీగా, చివరకు శాకాహారుల పార్టీగా కూడా చిత్రించారు. మతతత్వ రాజకీయ పక్షమనీ అన్నారు. నేను జనసంఘ్‌లో ‘వలంటీర్‌’గా పనిచేయాలనుకున్నప్పుడు ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నన్ను నిరుత్సాహపరచారు. ‘అది ఉత్తరాది పార్టీరా… దక్షిణాదిన దానికి బలం ఎక్కడుంది…’ అని అన్నారాయన. అలాంటి పార్టీ ఇప్పుడు అంచెలంచెలుగా విస్తరించి ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పక్షంగా ఎదిగింది. పదకొండు కోట్లమంది ఈ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో భాజపాకు ప్రస్తుతం 352మంది సభ్యులున్నారు. దేశవ్యాప్తంగా శాసన సభల్లో పార్టీకి 1,385మంది ఎమ్మెల్యేలున్నారు. పదిహేను రాష్ట్రాల్లో భాజపా దాని మిత్రపక్షాలు- 11 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చాయి. భౌగోళిక ప్రాతిపదికన దేశంలో 65శాతం భూభాగంలో పార్టీ విస్తరించింది. జనాభాలో 59శాతం ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలున్నాయి. ఒకప్పుడు భాజపాను అగ్రవర్ణాల పార్టీ అని ఎద్దేవా చేశారు. కానీ, పార్టీలో షెడ్యూల్డు కులాల సభ్యులే నేడు పార్లమెంటులో అధికంగా ఉన్నారు. గిరిజన ఎంపీలు అత్యధిక సంఖ్యలో భాజపాలోనే ఉన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో వెనకబడిన వర్గాల ఎంపీలు, రైతు ప్రతినిధులు, యువతరం ప్రతినిధులు పార్లమెంటులో అందరికన్నా భాజపాలోనే ఎక్కువ. మహిళా ఎంపీల్లోనూ అధికులు పార్టీలోనే ఉన్నారు. (ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది). వాజ్‌పేయీ సారథ్యంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం దేశంలో అనుసంధాన విప్లవానికి, స్వావలంబనకు పునాదులు వేసింది. ప్రస్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలో సంస్కరణ, ఆచరణ, పరివర్తన (రిఫార్మ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌) మంత్రంగా సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు చేరవేసేందుకు కృషి జరుగుతోంది. సమాజంలో అన్ని వర్గాలను చేరుకోవడమే ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ (అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం) లక్ష్యం. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యత్యాసాలు తొలగించడం, అవినీతిపై పోరాటం, నల్లధనాన్ని వెలికి తీయడం, పారదర్శక, కుంభకోణాలు లేని స్వచ్ఛమైన పాలన అందించడం; పేదలు, రైతులు, మహిళలు, మధ్యతరగతి వర్గాలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని సాకారం చేయడం మోదీ సర్కారు ధ్యేయం. ఈ నమూనా పాలన, అభివృద్ధి పథంలో సాధించిన విజయాలు మోదీని ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన పేద ప్రజలకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశం అంతటా అస్థిరత, విధానాల ప్రతిష్టంభన, నాయకత్వలేమి కొనసాగుతున్నాయి. ఆ తరవాత మోదీ సర్కారు ఈ జడత్వాన్ని బద్దలు కొట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం స్వతంత్ర భారత చరిత్రలో వినూత్న పరిణామం. మూడు సంవత్సరాల పాలన తరవాత వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా అద్భుత పాలన సాధ్యపడింది. ఒక్క అవినీతి ఆరోపణ కానీ, కుంభకోణం కానీ మచ్చుకైనా తలెత్తలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్తృత్వం, వ్యక్తిత్వం, వక్తృత్వం, నేతృత్వం కారణంగా పార్టీకి దేశవ్యాప్త ఆమోదం లభిస్తోంది. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాతో కలిసి ఆయన పార్టీని దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సన్నిహితం చేశారు.

————————————————————————————-

స్ఫూర్తి దాత దీన్‌దయాళ్‌

భాజపా సిద్ధాంతకర్త దీన్‌దయాళ్‌ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా సమాజంలో అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరవేయాలనే ధ్యేయమే పార్టీని ప్రజలకు చేరువ చేసింది. ఉత్పత్తిని, సంపదను పెంచి అందరికీ పంచాలన్నదే భాజపా ప్రధాన లక్ష్యం. దేశమే తొలి ప్రాధాన్యంగా, ఆ తరవాత పార్టీ ప్రాముఖ్యంగా ప్రస్థానిస్తున్న భాజపాలో స్వప్రయోజనాలది చిట్టచివరి స్థానమే!

 

————————————————————————————-

మహనీయుల బాటలో…

ప్రతి స్థాయిలోనూ భాజపాకు సమర్థ నాయకత్వం ఉంది. అన్నిదశల్లో ఉన్న నేతలను గౌరవించి వారి ద్వారా ఆశయాలను ముందుకు తీసుకుపోవడం వల్లనే పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతోంది. అడ్వాణీ, వాజ్‌పేయీ, మురళీ మనోహర్‌ జోషీ తదితరులు పార్టీకి ఆదర్శంగా నిలిచారు. నానాజీ దేశ్‌ముఖ్‌, జగన్నాథరావు జోషీ, సుందర సింగ్‌ భండారి, ఠాక్రే, యజ్ఞదత్‌ శర్మ, ప్యారేలాల్‌ ఖండేలాల్‌ వంటి నాయకులు ఎనలేని త్యాగాలు చేసి పార్టీని విస్తరింపజేశారు. అటల్జీ, అడ్వాణీ తరవాత అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినవారంతా తమవంతు కృషి చేసి పార్టీ విస్తరణకు తోడ్పడ్డారు. భాజపా ఒక ప్రవాహం లాంటిది. అది కొత్త గాలుల్ని, నీటిని మోసుకుంటూ నిత్యం కళకళలాడుతూ స్వచ్ఛంగా, నవనవోన్మేషంగా సాగుతోంది. ఈనాటి భాజపా అటు చరిత్రకు, ఇటు ఆధునికతకు సంకేతం. అటు గత వైభవానికి, ఇటు మారుతున్న కాలానికి ప్రాతినిధ్యం వహించగల గొప్ప లక్షణం భాజపా సొంతం. ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాలతో ఎంత బురద చల్లుతున్నప్పటికీ సత్యం పార్టీవైపు ఉన్నందువల్లే అది నిత్యనూతనంగా మారుతోంది. కాలానికి ఎదురీది సమకాలీనంగా ఎదుగుతోంది.

ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమైనట్లే ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థి పక్షాలన్నీ ఒకటి కావాలని- అప్పుడే భాజపాకు గట్టిపోటీ ఇవ్వగలమనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ, అది ఆచరణ సాధ్యం కాదు! ఎందుకంటే కాంగ్రెస్‌ తన మౌలిక లక్షణాలను కోల్పోయింది. నిజాయతీని పక్కన పెట్టి అప్రజాస్వామిక లక్షణాలను, అవినీతిని ప్రోత్సహించింది. కుటుంబ వారసత్వ రాజకీయాలకు అది ప్రతీక అయింది. భాజపాకు అలాంటి లక్షణాలు లేవు. సుపరిపాలన, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కల్పించడం, సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయమైన భాజపాను ప్రజలనుంచి దూరం చేయడం సమీప భవిష్యత్తులో ఏ పార్టీకీ, కూటమికీ సాధ్యం కాదన్నదే నా అభిప్రాయం. ఈ 37ఏళ్లలో భారతీయ జనతా పార్టీ 50శాతం విజయాలు మాత్రమే సాధించిందని అంగీకరించక తప్పదు. సమాజంలోని మరిన్ని వర్గాలకు, దేశంలో ఇతర ప్రాంతాలకు భాజపా చేరుకోవాల్సి ఉంది. ఇవాళ మారుమూల గ్రామాల్లోనూ మోదీ అంటే ఎవరో తెలుసు. ఆయనపై వారికి అభిమానం ఉన్నది. అయినా, భారతీయ జనతా పార్టీ మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మైనారిటీల విశ్వాసం చూరగొనాల్సి ఉంది. ఎందుకంటే దేశ జనాభాలో 15శాతం మైనారిటీలు ఉన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్రా కీలకమే. భాజపా తమ ప్రయోజనాలను కూడా కాపాడుతుందనే నమ్మకం వారిలో కలిగించాలి. ఎవర్నీ బుజ్జగించడం భాజపా చేయదని, అదే సమయంలో అందరికీ న్యాయం చేకూరుస్తుందనే సందేశం వ్యాప్తి కావాలి. భావనాత్మక అంశాలెన్నో ఉన్నప్పటికీ మౌలిక ప్రజాసమస్యలపై దృష్టి కేంద్రీకరించి దేశాభివృద్ధి కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం మరింత పాటుపడాల్సిన అవసరం ఉంది!

ఎం వెంకయ్య నాయుడు

కేంద్ర పట్టణాభివ్రుద్ది, గృహనిర్మాణ,                                                                                         పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖల మంత్రి

(ఈనాడు సౌజన్యం తో)