Home Telugu Articles కిరాతక చర్యల వెనుక ఒక హిందువు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-33)

కిరాతక చర్యల వెనుక ఒక హిందువు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-33)

0
SHARE

తయ్యబ్ రజ్వీ జరుపుతున్న ఆ కిరాతక చర్యల వెనుక ఒక హిందువు సహాయం ఉంది. అతను ఇమరోజు మల్లయ్య అనే వ్యక్తి. డబ్బుకు, తిండికి ఆశపడి మల్లయ్య గ్రామాలలో తిరిగి తనకు అనుమానం ఉన్న గ్రామస్థులందరినీ కమ్యూనిస్టులుగా చిత్రించేవాడు. తయ్యబ్‌కు రహస్యాలు చేరవేసి దాడి చేయమనేవాడు. చాలాకాలం అనేక గ్రామాలు ఈ మల్లయ్యవల్ల పీడించబడ్డాయి.

చివరికి ఒకరోజు పొలంలో పట్టుకొని ఆ మల్లయ్యని గ్రామస్థులు కసిగా హతమార్చి వేశారు. తన బంటు మల్లయ్య హత్య తయ్యబ్‌ని కలవరపెట్టింది. మల్లయ్య విషయం తెలిసినవాడు పటేల్ లక్ష్మీకాంతరెడ్డి తప్ప మరొకడు కాదని తయ్యబ్ అనుకున్నాడు. అందువల్ల ఆ పటేల్‌ను పట్టి తెప్పించాడు. మూడురోజులపాటు తీవ్రంగా హింసించి మల్లయ్యను చంపింది ఎవరో చెప్పమని బాధించాడు. చివరికి నడవలేని స్థితిలో లక్ష్మీకాంతరెడ్డిగారిని గ్రామం చావిడిమీద వదిలేసి వెళ్ళిపోయారు. మాలీ పటేల్ జగ్గారెడ్డి కూడా తయ్యబ్ మనుషులచేత హింసించబడ్డాడు. ఆ తర్వాత డి.ఐ.జి మజీదుల్లా స్వయంగా వచ్చి లక్ష్మీకాంత రెడ్డి పరిస్థితి చూచాడు.

వెంటనే తిరిగి మరోసారి పోలీసు బలగాన్ని ట్రాన్స్‌ఫర్ చేయించాడు. ఈ సారి ఒక హిందూ ఇన్‌స్పెక్టర్‌ని అధికారిగా పంపించాడు. సిక్కు అధికారి కిషన్‌సింగ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాడు. పటేల్ అతని వెనకాల నీడలా ఉండి దిక్కులేకుండా పారిపోయారు. బీబీనగర్ ప్రజలకు పోలీసు యాక్షన్ విషయం తెలియకపోవటం వల్ల తయ్యబ్ ప్రాణాలు దక్కించుకొని ఆచూకీ తెలియకుండా వెళ్ళిపోయాడు. ఇస్లామ్ ఆసఫియా సామ్రాజ్యాన్ని (సల్తనతే – ఆసఫియా ఇస్లామియా) స్థాపించాలని కలలుగన్న నిజాం 1947 తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని మహా ఘనత వహించిన (హిజ్ మెజెస్టీ) ప్రభువుగా మారిపోయాడు.

సర్వ స్వతంత్రమైన భారతదేశం నడిబొడ్డులో స్వతంత్ర ప్రతిపత్తికోసం ప్రాకులాడిన నిజాం ప్రజలపై క్రూర దమనకాండను అమలు జరిపాడు. ముస్లిం మత ప్రాబల్యాన్ని పెంచి ఇత్తెహాదుల్ సంస్థ అండతో రజాకార్ల గూండా చర్యలతో తన అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించాడు. చివరికి బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కూడా స్వతంత్ర హైదరాబాద్‌ను సమర్థించాడు. యూరప్‌లో బఫర్‌స్టేట్‌గా ఉన్న స్విట్జర్లాండ్ పద్ధతిలో హైద్రాబాద్ సంస్థానం ఉండవచ్చునని వాదించాడు. రజాకార్ల సైన్యాధిపతిగా ఖాసిం రజ్వీ చివరికి నిజాం తలపై భస్మాసురహస్తంలా పరిణమించాడు. రజ్వీ తనను తాను ఫీల్డ్ మార్షల్ రోమెల్ జుకాఫ్ మాంటే గుసరీలాంటి ప్రఖ్యాత సైన్యాధిపతిగా ఊహించుకొని విర్రవీగిపోయాడు.

ఒకసారి రజ్వీ ఉక్కుమనిషి సర్దార్ పటేల్‌ను కలుసుకొని హైద్రాబాద్ స్వతంత్రంగా ఉంటుందని చెప్పాడు. సర్దార్ పటేల్ ఒకే ఒక్కమాటలో ఇలా అన్నారు “ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాణ్ణి ఎవరూ ఆపలేరు”. తర్వాత రజ్వీ విషపూరితమైన ఉపన్యాసాలవల్ల ముస్లింలను రెచ్చగొట్టాడు. ఢిల్లీ రాజధానిని వశం చేసుకొని ఎర్రకోటపై ఆసఫియా జెండాని ఎగురవేస్తానని డంబాలు పలికాడు. కాని భారత సైన్యం ప్రవేశించిన మూడు రోజులకే నిజాం సైన్యం, రజాకార్లు ఆయుధాలు దించేసి మోకరిల్లారు.

నిజాం తప్పునంతా రజ్వీపైన, రజాకార్లపైన మోపి తాను ధూర్తుడిగా లొంగిపోయాడు. పోలీసు యాక్షన్ తర్వాత ఖాసిం రజ్వీని ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. సవివరంగా హంతకుడిగా, దోపిడీ దొంగగా రజ్వీ న్యాయస్థానంలో నిలుచున్నాడు. న్యాయస్థానం రజ్వీకి ఏడు సంవత్సరాలు కఠిన కారాగారశిక్షను విధించింది. మామూలుగా ప్లీడరు నుండి ఫీల్డ్‌మార్షల్‌గా తనను తాను నిలుపుకొన్న రజ్వీ దోపిడీ దొంగగా నిజస్వరూపాన్ని చూపుకోక తప్పలేదు. గూఢచారి విభాగం అధికారి శ్రీ నర్సింగ్ ప్రసాద్ కృషివల్ల స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు దొరికాయి. ఫలితంగా ఖాసిం రజ్వీ తానుచేసిన నేరాలకు కఠిన శిక్షను అనుభవించాడు.

Source: Vijaya Kranthi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here