Home Telugu కొత్తగా ప్రవేశ పెట్టె తీవ్రవాద నిరోధక చట్టాలకు అవరోధంగా ఉన్న మానవహక్కుల చట్టాలను తొలగిస్తాం :...

కొత్తగా ప్రవేశ పెట్టె తీవ్రవాద నిరోధక చట్టాలకు అవరోధంగా ఉన్న మానవహక్కుల చట్టాలను తొలగిస్తాం : బ్రిటన్ ప్రధాని

0
SHARE

దేశ అంతర్గత భద్రత విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలానుకుంటున్న బ్రిటిష్ ప్రధాని థెరసా  మే అందుకు అవసరమైతే మానవహక్కుల చట్టాలను సైతం సవరించడం గాని అడ్డుగా ఉన్న అంశాలని తొలగిస్తామని స్పష్టం చేశారు. విదేశీ అనుమానితులను త్వరగా దేశం నుండి బహిష్కరించడానికి, తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి ఇలాంటి చర్యలు అవసరమని మే అన్నారు. లండన్ బ్రిడ్జ్, మాంచస్టర్, వెస్ట్ మినిస్టర్ మొదలైన ప్రదేశాలలో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత థెరసా మే ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది. ఇంటలిజెన్స్ వైఫల్యం, ప్రభుత్వ మెతక వైఖరి కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అవసరమైన వెంటనే కర్ఫ్యూ విధించడం, అనుమానితుల కదలికలపై ఆంక్షలు విధించడం మొదలైన చర్యలు చేపట్టడానికి వీలుగా తీవ్రవాద నిరోధక, విచారణ విధానాన్ని పటిష్టవంతం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిందితులను ఎలాంటి విచారణ లేకుండా జైలులో ఉంచగలిగే కాల పరిమితిని కూడా 14రోజులనుండి 28 రోజులకు పెంచాలని యోచిస్తోంది.

ఈ చర్యలన్నీ చేపట్టడానికి అవసరమైతే మానవహక్కుల చట్టాలను సవరించడానికి ప్రభుత్వం సిద్దంగాఉంది. ఇప్పటివరకు యూరోపియన్  మానవహక్కుల సంస్థలో బ్రిటన్ ది కూడా కీలక పాత్ర. అయితే భద్రతా దళాలపై వస్తున్న మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలను కూడా తగ్గించడానికి మే ప్రభుత్వం చట్టాలకు సవరణలు చేయాలని చూస్తోంది. ఇంగ్లండ్ లో కన్సర్వేటివ్ పార్టీ ఇప్పటికే యూరోపియన్  మానవహక్కుల సంస్థ నుండి తమ దేశం వైదొలగాలని చాలా కాలంగా కోరుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటోంది. అందుకు మానవహక్కుల చట్టాలలో సవరణలతో ప్రారంభించాలని భావిస్తోంది.

తీవ్రవాదులకు సంబంధించి సమాచారం ఉన్నప్పటికి ఇంటలిజెన్స్ వర్గాలు వారిపై నిఘా వేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖుర్రం భట్ అనే తీవ్రవాది 2015 నుండి అనుమానితుడు. అలాగే మరో తీవ్రవాది యూసుఫ్ ను ఇటలీ పోలీసులు 2016లోనే కొంతకాలం నిర్బంధించారు. సిరియాకు రహస్యంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడే యూసుఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే అతను `నేను తీవ్రవాదిని అవుతాను’ అని బాహాటంగా ప్రకటించాడు. కానీ ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఇంగ్లండ్ ఇంటలిజెన్స్ వర్గాలు సేకరించలేక పోయాయి.

పోలీసు బలగాల సంఖ్యను తగ్గించాలనుకుంటున్న మే ప్రభుత్వ ఆలోచనతో సహా మానవహక్కుల చట్టాలకు సవరణలు చేయాలన్న యోచనను కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఇది బ్రిటిష్ ప్రజాస్వామ్య విలువలకు, వ్యవస్థకు చేటు తెస్తుందని విమర్శిస్తున్నాయి. హోం మంత్రిగా ఉన్నప్పుడూ ఇదే థెరసా మే పోలీసు బలగాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారని అలా పోలీసు శక్తిని నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నాయి.

ది గార్డియన్ సౌజన్యం తో