Home Telugu Articles కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

0
SHARE

– అనంత్ సేథ్

భరతభూమి పండుగలు, వేడుకలు, ఉత్సవాలకు నిలయం. రక్షాబంధన్ తరువాత వర్షఋతువులో వచ్చే మరో ముఖ్యమైన పండుగ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి.

మహావిష్ణువు ఎనిమిదవ అవతారం, మహాభారతం, భాగవత పురాణం, భగవద్గీతలకు మూలమైన శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని జరుపుకునేది ఈ రోజునే. చంద్రమానాన్ని పాటించేవారు శ్రావణమాసంలోని కృష్ణపక్షంలో ఎనిదవ రోజున జరుపుకుంటారు. ఇక సూర్యమానాన్ని పాటించేవారు భాద్రపద మాసంలోని ఎనిమిదవ రోజున ఈ వేడుక చేసుకుంటారు.  

శ్రీకృష్ణుడు ఒక గొప్ప పరిపాలనావేత్త, సామాజిక వేత్త. ఆయన జీవితం భారతీయ సంస్కృతి, నాగరకత, తత్వాన్ని ఎన్నో విధాలుగా, ఎంతో ప్రభావితం చేసింది. మహాభారతంలో భాగమైన భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన సందేశం. 700 శ్లోకాలు కలిగిన ఈ గీత ద్వారా శ్రీకృష్ణుడు క్షత్రియునికి ఉండవలసిన యోగా, కర్మ, జ్ఞాన, భక్తి లక్షణాలను తెలియజెప్పాడు.

ఆధ్యాత్మిక, తాత్విక సందేశంతోపాటు శ్రీకృష్ణుని జీవితం భారతీయ కళలు, సంగీతం, నృత్యం మొదలైనవాటిని కూడా ఎంతో ప్రభావితం చేసింది. కృష్ణుని బాల్యం, శైశవ దశలకు సంబంధించిన సంఘటనలు ఇతివృత్తలుగా అనేక కళా రూపాలు రూపుదిద్దుకున్నాయి. ఎంతో శ్రద్ధ, నిష్ట, ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఆ పరమాత్మ సందేశాన్ని, వాణిని వినగలరని చెప్పేదే `రాసలీల’. కృష్ణునిపట్ల అపరిమితమైన భక్తి, శ్రద్ధ కలిగిన కొద్దిమంది గోపికలకు  మాత్రమే ఆయన వేణుగానం వినిపించింది. కేరళకు చెందిన నృత్య కళారూపం కృష్ణాట్టం  కృష్ణ భక్తి ఆధారంగా ఏర్పడినదే.

కృష్ణునికి సంబంధించిన గాధలు జైనం, బౌద్ధం, సిక్కు మొదలైన హిందూ ధర్మానికి చెందిన అనేక మతాల్లో కనిపిస్తాయి. గురు గోవింద్ సింగ్ ఏర్పాటుచేసినదిగా చెప్పే దశమ గ్రంథ్ లో 24 అవతారాలలో శ్రీకృష్ణునిది కూడా ఒకటని పేర్కొన్నారు.  

జైన సంప్రదాయం ప్రకారం కృష్ణుడు 22వ తీర్థంకరుడైన నేమినాథ్ ని దగ్గరి బంధువు. బౌద్ధ మతంలోని జాతక కధల్లో శ్రీకృష్ణుని ప్రస్తావన బాగా కనిపిస్తుంది.

భారతదేశం బైట కూడా శ్రీకృష్ణుని గాధలు, భక్తి సంప్రదాయం కనిపిస్తాయి. ముఖ్యంగా ఆగ్నేయాసియా చరిత్ర, కళలపై కృష్ణుని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇండోనేషియా లోని యోగ్యకర్త దగ్గర ఉన్న విశాలమైన, భవ్యమైన ప్రాంబనన్ దేవాలయ ప్రాంగణంలో శ్రీకృష్ణునికి సంబంధించిన శిల్పాలు, గాధలు అనేకం కనిపిస్తాయి. మధ్యయుగపు వియత్నాం, కంబోడియా కళా రూపాల్లో కూడా కృష్ణ ప్రభావం బాగా కనిపిస్తుంది. 7వ శతాబ్దానికి చెందిన అంగ్కోర్ ఫ్నోమ్ గుహల్లో చెక్కిన శిల్పాలుగానీ, 6వ శతాబ్దానికి చెందిన దమంగ్ (వియత్నాం) గోవర్ధన కళా రూపంలో గానీ కృష్ణుని లీలన్నే మన ముందు ఉంచుతాయి. ఉత్తర థాయిలాండ్ లోని ఫెట్చ్చాబున్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కృష్ణ విగ్రహాలు, శిల్పాలు బయటపడ్డాయి.

అబ్రహాం మతాలకు చెందిన ఆధునిక సంప్రదాయాలలో కూడా ఆశ్చర్యకరంగా కృష్ణ ఆరాధన, కృష్ణ భక్తి కనిపిస్తుంది. ఆంగ్ల విగ్రహారాధకుడు, తెలమా మత స్థాపకుడు అయిన అలిస్టర్ క్రాలే ఇలాంటి పద్దతినే ప్రచారం చేశాడు. శ్రీకృష్ణుడు ఎక్లేసియాకు చెందిన ఒక యోగి అంటూ క్రాలే ప్రచారం చేశాడు.

క్రమంగా పరిణతి చెందుతున్న మానవాళికి భగవంతుని సందేశాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రవక్తల శ్రేణిలో శ్రీకృష్ణుడు కూడా ఒకదాని బహాయ్ మతస్తులు విశ్వసిస్తారు. కృష్ణుడు భగవంతుని అవతారమని చెపుతారు.

20వ శతాబ్దపు ఇస్లాం సంప్రదాయమైన అహ్మదియాకు చెందిన వారు కూడా కృష్ణుడిని ప్రవక్తగానే భావిస్తారు. ధియోసోఫికల్ సంప్రదాయానికి చెందినవారు కృష్ణుడిని మైత్రేయుని(ప్రాచీన గురువు) అవతారంగా గౌరవిస్తారు.

కృష్ణాష్టమి సందర్భంగా ప్రాచీనమైన ఆధ్యాత్మిక, ధార్మిక పరంపరను, అందులో శ్రీకృష్ణుని పాత్రను మరోసారి గుర్తుచేసుకుందాం.