Home News కర్ణాటక లోని కుముద్వతి నదికి పునరుజ్జీవం

కర్ణాటక లోని కుముద్వతి నదికి పునరుజ్జీవం

0
SHARE
  • -ఉరికే నీటిని.. ఒడిసిపట్టిన ఘనత
  • -బెంగళూరు తాగునీటి సమస్యకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరిష్కారం
  • -నీటిని భూమిలోకి ఇంకించేందుకు చర్యలు
  • -పలు సంస్థల ఆర్థిక సాయం

బెంగళూరు మహానగరానికి నిత్యం తాగునీరు అందిస్తున్న కుముద్వతి నది ఒక్కసారిగా ఎండిపోయింది. దానికి తిరిగి ప్రాణం పోయడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చతుస్సూత్ర పథకంతో మళ్లీ జీవకళను తీసుకొచ్చింది. ఉరికే నీటిని నడిచేలా చేయ టం.. నడిచే నీటిని పాకేలా చేయటం.. పాకే నీటిని ఒకచోట స్థిరంగా నిలబడేలా చేయడం.. నిలబడిన నీటిని భూమిలోకి ఇంకేలా చేయటమన్న నాలుగు సూత్రాలను ఆధారం చేసుకొని అనితరసాధ్యమైన పనిని సులువుగా చేయగలిగింది. ఈ నేపథ్యంలో కుముద్వతి నదిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం అనంతరం నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.

బెంగళూరుకు కూతవేటు దూరంలో శివగంగె గుట్టల్లో పుట్టిన కుముద్వతి నది నుంచే నగర ప్రజలకు అవసరమయ్యే నీటిలో 30శాతం నీటిని సేకరిస్తారు. మరో 278 గ్రామాలకు ఆ నదే ఆధారం. ఈ నది నీరుతో తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్‌ను నింపి బెంగళూరుకు అందిస్తారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. కొద్దిరోజుల క్రితం ఈ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. నదీ పరీవాహక ప్రాంతంలో నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నాలు చేయకపోవడం, విచ్చలవిడిగా యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను పెంచడం, ఏండ్ల తరబడి పూడిక తీయకపోవడంతో నది ఎండిపోయింది. కర్ణాటక రాజధానికి వచ్చిన నీటి కరువు గురించి తెలుసుకున్న రవిశంకర్ దీని పరిష్కారానికి శాస్త్రీయ పంథాలో నిపుణులు, శాస్త్రవేత్తలతో సమాలోచనలు చేసి ప్రణాళికలు వేశారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ప్రజలకు నీటి రీచార్జి చేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు.

క్షేత్రస్థాయిలో శిష్యుల ద్వారా పనులను ప్రారంభించారు. భూమిలోకి నీరు ఇంకేందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. నదీ ప్రవాహ ప్రాంతంలో 300 నుంచి 500 మీటర్లకు ఒకటి చొప్పున చిన్న చిన్న ప్రవాహాలకు అడ్డుగా రాళ్ల కట్టడాలను నిర్మించారు. ప్రవహించే నీటిని ఆపి.. భూమిలోపలి పొరల్లోకి ఇంకేలా చేసేందుకు రీచార్జ్ బావులు, బోర్లను సిమెంటు రింగులు, రాళ్లతో నిర్మించారు. వర్షం పడినప్పుడు వచ్చే నీరు ఈ బావుల్లోకి చేరి 12 నుంచి 15 మీటర్ల లోతుల్లోకి వెళ్లే చేశారు. రీచార్జ్ బావులలో 50-60 మీటర్ల లోతుల్లో డ్రిల్ చేసి బోరుబావులను ఏర్పాటు చేశారు. చెరువుల్లోని పూడికను తీసి, నీరు ఆవిరి కాకుండా వాటర్ ఫూల్ (చిన్నకుంట) లను నిర్మించారు. చెరువుల చుట్టుపక్కల మొక్కలను పెంచారు. నీటిని ఎక్కువగా వినియోగించే యూకలిప్టస్ మొక్కలను పూర్తిగా తగ్గించారు. దీంతో భూగర్భజల మట్టం పెరిగింది. మొత్తం 448 రాళ్ళ కట్టడాలు (బౌల్డర్ చెక్స్), 444 రీచార్జ్ బావులు, 45 రీచార్జ్ బోర్లు, 71 చిన్ననీటి కుంటలు (వాటర్ పూల్) నిర్మించి.. 44,750 మొక్కలను నాటారు. ఫలితంగా కుముద్వతి నదిలో మళ్లీ నీటి ప్రవాహం మొదలైంది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో భూగర్భ నీటి మట్టం పెరిగింది. చెరువుల్లో నీరు చేరింది. కొంతమేర నీరు తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్‌కు చేరింది. ఈ బృహత్కార్యం కోసం ఆయా గ్రామాల్లో ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులుచేశారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ది హన్స్ ఫౌండేషన్, సిస్కో, రాబర్ట్ బాష్, థామస్ రాయిటర్, ఇంటెల్, ఆల్టేర్ ఇంజినీరింగ్, మహీంద్రా ఫైనాన్స్, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్ లాంటి సంస్థలు, కంపెనీల సామాజిక బాధ్యత నిధులు (సీఎస్‌ఆర్) అందించాయి. 2013లో మొదలైన పనులు 2019లో ముగించాలని లక్ష్యం పెట్టుకొన్నా.. ముందుగానే పూర్తిచేశారు.

జీవం చుట్టూ నీరే ఉన్నది

జీవం చుట్టూ ఏమున్నదని ప్రశ్నించుకుంటే.. ఎటు చూసినా.. చుట్టూరా నీరే ఉంటుంది. నీరు లేనిది జీవం లేదు. అలాంటి నీటిని రక్షించుకోవడాన్ని మనం విస్మరిస్తున్నాం. అందుకే నదుల పునరుజ్జీవం కార్యక్రమాన్ని చేపట్టాం. భూగర్భ జలాలను పెంపొందించి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్నది. ఇదికూడా భూగర్భ జలాలను పెంపొందిస్తుంది.

-శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)