Home Telugu Articles లచిత్ బోర్ఫుకాన్: చరిత్ర విస్మరించిన అహోం రాజ్య వీరుడు

లచిత్ బోర్ఫుకాన్: చరిత్ర విస్మరించిన అహోం రాజ్య వీరుడు

0
SHARE

డాక్టర్ సరోజ్ కుమార్ రద్

వీరుడు, అసహాయ శూరుడైన అహోంసైన్యాధికారి లచిత్ బోర్ఫుకాన్ 17వ శతాబ్దం ప్రారంభంలో ఆధునిక అస్సాంలోని గోలఘాట్ జిల్లాలోని బెటియోనిలో జన్మించాడు.అతని అసలు పేరు  లచిత్ డెకా.అతని తండ్రి, మొమై తములి బోర్బరువా,‘రాజా ప్రతాప్ సింఘా’ పాలనలో1603-1639అహోం రాజ్యానికి గవర్నర్ మరియు సర్వసైన్యాధికారిగా ఉన్నారు. లచిత్ చిన్న వయస్సు నుండే సైనిక శిక్షణ పొందడం వల్ల అహోమ్ రాజు ‘జయధ్వజ సింఘా’ (1648-1663) వద్ద `కండువా మోసేవాడి’గా/‘సోలాధర బారువా’గా ఉండేవాడు, వీరిని రాజుగారి వ్యక్తిగత సిబ్బందిలో భాగంగా పరిగణించేవారు. తదనంతరం సైనిక శిక్షణ కారణంగా, లచిత్‌ను ‘అశ్వాధికారి’గా -గుర్రాలదళ అధికారిగా నియమించారు. ఆ తరువాత లచిత్‌ బ్రహ్మపుత్రానది దక్షిణ ఒడ్డున ఉన్న సిముల్‌ఘడ్కోట సర్వాధికారిగా పదోన్నతి పొందారు. అహోం రాజవంశపు రాజు `చక్రధ్వజ సింఘా’ హయాంలో 1663-1669 వరకు, లచిత్‌ను రాజు వ్యక్తిగత భటులకు రక్షణాధికారిగా నియమించాడు. చివరకు, రాజు `చక్రధ్వజ్ సింఘా’, లచిత్‌ను ‘బోర్ఫుకాన్’ గా నియమించారు. అప్పటి నుంచే లచిత్‌ డెకా, లచిత్‌ బోర్ఫుకాన్ గా ప్రసిద్ది చెందారు. అహోం రాజ్యంలో ఐదుగురు పరిషద్ సభ్యులలో ఒకటైన `బోర్ఫుకాన్’ స్థానo రాజ్యపాలన, న్యాయాధీశ అధికారాలతో కూడుకున్నది, లచిత్ బోర్ఫుకాన్ తమ ప్రధాన కార్యాలయాన్ని కలియాబోర్నుంచి గువహతిలోని ఇటాఖులికి మార్చారు.

సివరాగే, లాసిట్ను బోర్ప్ అస్సాం జనవరి 1662 నుండి నిరంతర ఇస్లామిక్ దండయాత్రలను ఎదుర్కుంది. నవాబ్ ముఅజ్జమ్ ఖాన్ అని పిలువబడే మొఘల్ సైన్యాధికారి `మీర్ జుమ్లాII’ అహోమ్ రాజధాని గర్గావ్‌పై దాడి చేశాడు. అహోం రాజు `జయధ్వజ సింఘా’ కొండమీదనుంచి గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడంతో మీర్ జుమ్లాII అహోంరాజును ఓడించలేకపోయాడు. దీర్ఘకాలిక పోరాటం, ప్రతిష్టంభన కారణంగా విసిగిపోయిన మొఘల్ సైన్యాధికారి మీర్ జుమ్లా, అహోం రాజుతో అవమానకరమైన ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది, దీనిని అతని అధికారిక చరిత్రకారుడు షిహాబుద్దీన్ తాలిష్ తన ‘ఫాతియా-ఇ-ఇబ్రియ’ లో ‘ఇలాంటి ఒప్పందం ఢిల్లీచరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు’ అని రాశాడు. ఈ సమయంలో లచిత్ కలియాబోర్లో ఉన్నాడు. అయితే కొంత రాజ్యం కోల్పోయిన కారణంగా, అహోం రాజ్యంపై మొఘల్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని తన వారసుడు `చక్రధ్వజ సింఘా’ను కోరుతూ రాజు `జయధ్వసింఘా’ అసంతృప్తితో 1663లో మరణించాడు. చక్రధ్వజ సింఘా ఆగష్టు 1667లో, లచిత్ బోర్ఫుకాన్‌ను అహోం రాజ్య సర్వ సైన్యాధికారిగా నియమించినవెంటనే, ఆక్రమణలో ఉన్న గువహతిని తిరిగి పొందటానికి లచిత్ మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్దాన్ని ప్రారంభించాడు. నవంబర్ 1667 నాటికి, లచిత్ తన సైనిక పరాక్రమంతోఅస్సాం సరిహద్దుల్లోకూడా మొఘల్ సైన్యo ఆనవాళ్ళు లేకుండా వారిని వెళ్ళగొట్టాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఓటమికి రగిలిపోతూ, అంబేర్ రాజా ‘రామ్ సింగ్ కచ్వాహా’ ఆధ్వర్యంలోబలమైన మొఘల్ సైన్య బృందాన్నిజనవరి 1668లో,లచిత్ బోర్ఫుకాన్ సైన్యాన్ని ఓడించడానికి పంపాడు.

ఫిబ్రవరి 1669 నుండి  పోరాడుతున్న రాజా `రామ్సింగ్ కచ్వాహా’కు 71000మంది మొఘల్ దళాలతో(4000 మంది సైనికులు, చక్రవర్తి స్వీయ అశ్వదళానికి చెందిన 1500 మంది సైన్యబృందం, 500మంది సామ్రాజ్య తుపాకీదారులు, 30000 పదాతిదళాలు, 15000 విలుకాళ్ళు-పదాతిదళం, 20000 అశ్వికదళాలు)యుద్ధం చేసాడు. మరోవైపు, లచిత్ బోర్ఫుకాన్ కొన్ని వేలమంది సైనికులతో మాత్రమే పోరాడుతున్నాడు. ప్రత్యర్థి సైన్యాల మధ్య జరిగిన అనేక చిన్న పోరాటాలకు పరాకాష్ట 1671 లో జరిగిన సారైఘాట్ యుద్ధం. శ్రీ జదునాథ్ సర్కార్‘ది కాంప్రహెన్సివ్ హిస్టరీ ఆఫ్ అస్సాం’ పుస్తకంలోఇలా వివరించారు. భారీ మొఘల్ సైన్యాన్ని పరిశీలించిన లచిత్  ఆందోళన చెందినప్పటికీ ‘నేను `ఫుకాన్‌’గా ఉన్న సమయంలో నా దేశం ఈ ఘోర విపత్తును ఎదుర్కోవడం ఒక విషాదం. నా రాజును, నా ప్రజలను ఎలా కాపాడుకోవాలి? రాబోయే కాలాన్ని ఎలా పరిరక్షించుకోవాలి?’అని ఆలోచిస్తూ నిరాశ చెందక,దృఢసంకల్పంతో వీరోచితంగా మొఘల్ సైన్యoతో యుద్ధం కొనసాగించాడు.

లచిత్ ముందుండి పోరాటానికి నాయకత్వం వహించడమే కాక ప్రతి పోరాటంలో మొఘలులను ఓడించాడు.లచిత్ `రాజారామ్ సింగ్’ సైన్యాన్ని యుక్తితో ఓడించడంతో, యుద్ధం ప్రతిష్టంభనకు దారితీసింది. దాంతో దౌత్యనీతితో చర్చలు జరిపి అప్పటికి ఒప్పందం చేసుకోవాలని ఔరంగజేబు తన సైన్యాధికారిని ఆదేశించాడు. అయితే లచిత్ కి విశ్వసనీయమైన సైన్యాధికారి `అటాన్ బుర్హాగోహైన్’మొఘల్ కపట ద్రోహబుద్ధికిఇది నిదర్శనమని, సంధి వద్దని చెప్పాడు. చివరి సరైఘాట్ యుద్ధం 1671లో ప్రారంభమైంది. సారైఘాట్ యుద్ధంరోజు, లచిత్ చాలా అనారోగ్యంతో ఉన్నాడు. అయినప్పటికీ, అతను అద్భుతమైన శౌర్యం, అసాధారణ ధైర్యసాహసాలు, ఆదర్శ నాయకత్వాన్ని ప్రదర్శించాడు. అనారోగ్యంతో ఉన్నాకూడా లచిత్ చూపిస్తున్న యుద్దపటిమ అతని దళాలకు ప్రేరణ అయింది,  వారు కూడా అత్యంత వీరోచితంగా పోరాడి యుద్ధం చేయగా, మొఘల్ సైన్యం లచిత్ సైన్యం చేతిలో ఘోర పరాజయం పాలైంది. మొఘల్ సైన్యాధికారి రాజారామ్ సింగ్ తన విరోధి పోరాటపటిమకు విస్మయం చెందాడు. ఓడిపోయిన రాజారామ్ సింగ్ ‘జయహో సైన్యాధికారీ, ఒకే ఒక్క వ్యక్తి వివిధ దళాలను నడిపించాడు. ఆయనను ఓడించడానికి, నాకు అయన యుద్ధప్రణాళికలో ఎటువంటి లొసుగులు,అవకాశాలు కనపడలేదు’ అని లచిత్ ను ఎంతో ప్రశంసించాడు. గౌహతి రాజభవనంపైన అహోం జెండాను తిరిగి స్థాపించిన లచిత్ ఘనత, విశిష్టత అటువంటిది. సారైఘాట్ లో నిర్ణయాత్మక యుద్ధం జరిగిన సంవత్సరం తరువాత ఏప్రిల్ 1672లో, లచిత్ తన కాలిబోర్ ప్రధాన కార్యాలయంలో వీర మరణం పొందాడు. అసాధారణమైన వీరత్వం ప్రదర్శించిన లచిత్ బోర్ఫుకాన్ తరతరాల అస్సామీలకు ప్రేరణ. ధైర్యంగా పోరాడటానికి, ఓటమి అంచునుండి గెలవటానికి,అస్సాంలోని అన్నివర్గాల ప్రజలు లచిత్ పేరును స్మరించుకుంటారు. లచిత్ బోర్ఫుకాన్ – ధైర్యం, రాజనీతిజ్ఞతకు ఒక నిలువెత్తు  ఉదాహరణ.

First Published On 24.11.2019