Home Telugu Articles ముగిసిన మేడారం జాతర – జనంలోనుండి వనంలోకి వెళ్ళిన తల్లులు

ముగిసిన మేడారం జాతర – జనంలోనుండి వనంలోకి వెళ్ళిన తల్లులు

0
SHARE

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర శనివారం నాడు అమ్మవార్ల వన ప్రవేశం తో ముగిసింది. గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతరలో చివరి రోజు అమ్మవార్ల వన ప్రవేశానికి మార్గాన్ని పరిశుభ్రం చేస్తూ మేడారం పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత గద్దెపైకుంకుమ భరిణె రూపములో ఉన్న సమ్మక్కను చిలకలగుట్టకు పూజారి కొక్కిర కృష్ణయ్య తీసుకొనివెళ్లగా, వెదురు బుట్టలో పసుపు, కుంకుమ రూపంలో ఉన్నసారలమ్మను కన్నెపల్లి కి పూజారి కాక సారయ్య తీసుకుని వెళ్లారు. పడగ రూపములో ఉన్న సమ్మక్క భర్త పగిడిద్ద రాజును పూను గుండ్లకు పూజారి కల్తీ జగ్గారావు తీసుకుని వెళ్లగా, సారలమ్మ భర్త గోవిందరాజులును కొండాయి గ్రామానికి పూజారి దబ్బకట్ల గోవర్ధన్ తోడుకొని వెళ్లారు. ఈ తంతు తో మహాజాతర ముగిసింది. చివరి రోజు అమ్మవార్ల దర్శనానికి కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానితో మాట్లాడి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేలా కృషి చేస్తానన్నారు .  సుమారు కోటి 20 లక్షల మంది పాల్గొన్న ఈ జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పది వేల మంది పోలీసులను, మరో పదివేల మంది వివిధ శాఖల ఉద్యోగులను నియమించింది. జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించేది. ఈ సంవత్సరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జాతరకు అధికారిక సెలవు ప్రకటించ లేదు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండటం ఒక కారణంగా అనుమానిస్తున్నారు.

This image has an empty alt attribute; its file name is me5-1024x683.jpeg

అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా.