Home Telugu Articles కేరళ భీభత్సం: తెచ్చిపెట్టుకున్న వరద

కేరళ భీభత్సం: తెచ్చిపెట్టుకున్న వరద

0
SHARE

తెచ్చిపెట్టుకున్న వరద

పశ్చిమ కనుమల సంరక్షణకు ఏర్పరచిన విధానాన్ని నిర్లక్ష్యం చేయడం, అడ్డుఅదుపు లేని క్రైస్తవ చర్చి ఆక్రమణలు, విపత్తు నిర్వహణ పూర్తిగా విఫలమవడం వంటివి కేరళలో ఎన్నడూలేని వరదలకు కారణమయ్యాయి.

విపరీతమైన వర్షాల మూలంగా కేరళ ఎన్నడూలేనంత వరద ముంపుకు గురయ్యింది. రాష్ట్రంలో సగం ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ఆపారమైన జన నష్టం, ఆస్థి నష్టం జరిగాయి. ఈ ఏడాది కేరళలో భారీగా వర్షాలు కురిసినమాట నిజమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టాన్ని సగానికిపైగా తగ్గించగలిగేవారని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రకృతి మాతను పరిరక్షించుకోకపోతే ఇలాంటి విపత్తులే ఎదురవుతాయి.

పర్యావరణ శాస్త్రవేత్తలు సూచించిన పరిష్కారాలను అమలుచేసి ఉంటే ఇప్పుడు వరద నష్టం బాగా తగ్గిఉండేది. అలా జాగ్రత్త పడకపోవడంతో ఇప్పుడు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కూడా మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచమంతటా పర్యావరణ విపత్తులు ఎక్కువయ్యాయి. ప్రకృతి పైనే మనమంతా ఆధారపడి జీవిస్తున్నా ఆ ప్రకృతిని నాశనం చేసే పనులకు మాత్రం మనం స్వస్తి చెప్పలేకపోతున్నాము.

కేరళ వరదలు తెచ్చిన నష్టంతో అందరి దృష్టి 2011లో వెలువడిన మాధవ గాడ్గిల్ నివేదిక పైకి మరలింది. పశ్చిమ కనుమల ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గాడ్గిల్ నివేదిక పేర్కొంది. కేరళతోపాటు ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సంవేదనశీలమైన ప్రదేశంగా ప్రకటించాలని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ కనుమల్లో ఉన్న ప్రాంతం పర్యావరణం దృష్ట్యా మూడవ స్థాయి సంవేదనశీలమైనదని పేర్కొంది. కొత్త పరిశ్రమలు ఏర్పరచకుండా, గనుల తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని గాడ్గిల్ కమిటీ సూచించింది. అంతేకాదు స్థానిక సంస్థలు, పంచాయత్ ల సమన్వయంతో `అభివృద్ధి’ కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా పర్యవేక్షించాలని పేర్కొంది.

మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదిక ముఖ్య సూచనలు

  1. నీటి ప్రవాహాలు, చెరువులు, ప్రత్యేక నివాస ప్రదేశాలు, జీవవైవిధ్య ప్రదేశాలు, పవిత్రమైన చెట్లు మొదలైనవాటిని పరిరక్షించాలి. అక్కడ భవనాలు నిర్మించకూడదు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టకూడదు.
  2. పశ్చిమ కనిమాల్లో ప్రత్యేక ఆర్ధిక జోన్ లు, హిల్ స్టేషన్ లు ఏర్పాటుచేయకూడదు.
  3. ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేయకూడదు.
  4. 1, 2 జోన్ లలో గనుల తవ్వకాలకోసం కొత్తగా అనుమతులు ఇవ్వకూడదు. ఇప్పుడు జరుగుతున్నా పనులను కూడా క్రమంగా తగ్గిస్తూ 2016నాటికి పూర్తిగా నిలిపేయాలి.
  5. పరిమిత జీవిత కాలం(ఆనకట్టలకు 30-50 ఏళ్ళు) మించిపోయిన ఆనకట్టలు, జలవిద్యుత్ కేంద్రాల వాడుకను క్రమంగా వదిలిపెట్టాలి.
  6. జోన్ 1 లో పర్యావరణ పర్యాటక ప్రయోజనాలకు అవసరమైతే తప్ప కొత్తగా ఏ రైల్వే లైన్ లుగానీ, రోడ్లుగానీ నిర్మించకూడదు.
  7. జల వనరులపై ప్రభావాన్ని అంచనా వేసిన తరువాత, పరిమిత స్థాయిలోనే వాడకం ఉంటుందని నిర్ధారించుకున్నతరువాతనే ఆనకట్టలు, గనులు, పర్యాటక కేంద్రాలు, నివాసాలకు అనుమతులు ఇవ్వాలి.
చర్చించకుండానే తిరస్కరించారు!

ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గాడ్గిల్ నివేదికను వ్యతిరేకించాయి. దానితో కమిటీ నివేదికను సంపూర్ణంగా, ఇతర రంగాలను దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు అనుసరించవచ్చును అనే విషయాన్ని నిర్ధారించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంతరిక్ష శాస్త్రవేత్త కె. కస్తూరి రంగన్ నేతృత్వంలో ఒక పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం గాడ్గిల్ నివేదికపై ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులు తెలిపిన అభ్యంతరాలు, అభిప్రాయాలను కూడా పరిశీలిస్తుంది. కస్తూరి రంగన్ కమిటీ 2013లో తన నివేదిక సమర్పించింది. అందులో గాడ్గిల్ నివేదిక సూచనలను చాలామటుకు కొట్టివేసింది. పశ్చిమ కనుమల్లో మూడవ వంతు ప్రాంతాన్ని సంవేదనశీలమైనదని ప్రకటిస్తే సరిపోతుందని పేర్కొంది.

కేంద్ర మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆనకట్టల భద్రతకు సంబంధించిన జాతీయ నిబంధనల అమలును పరిశీలించిన కాగ్ కేరళలోని 61 ఆనకట్టలకు `ఆనకట్ట బలాన్ని నిర్ధారించే విశ్లేషణ’ జరగానేలేదని తేల్చింది.

ఈ రెండు నివేదికలను కొన్ని చర్చ్ లు తీవ్రంగా వ్యతిరేకించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా తిరువనంతపురం సంచిక (20 జనవరి, 2013) ప్రకారం `సైరో – మలబార్ చర్చ్ పత్రిక సంపాదకీయం మాధవ గాడ్గిల్ నివేదికను అమలుచేయాలంటున్న కొన్ని పర్యావరణ సంస్థలపై తీవ్రమైన విమర్శలు చేసింది. గాడ్గిల్ నివేదికను అమలు చేయడానికి `అంతర్జాతీయ కుట్ర’ జరుగుతోందని ఆరోపించింది. అలాగే లైటీ వాయిస్ సంపాదకీయం కూడా `గాడ్గిల్ నివేదిక అమలుకు అంతర్జాతీయ కుట్ర’ జరుగుతోందని విమర్శించింది. ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు వి సి సెబాస్టియన్ పర్యావరణ సంస్థలు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, సలీం ఆలీ ఫౌండేషన్, అశోక ట్రస్ట్ లు విదేశీ నిధులు అందుకున్నాయని, అందుకనే గాడ్గిల్ నివేదిక అమలుకు పట్టుబడుతున్నాయని ఆరోపించారు. స్వతంత్రంగా జరిపిన విచారణలో ఈ విషయం తేలిందని లైటీ పత్రిక అంటోంది. “పశ్చిమ కనుమల పరిరక్షణ, అక్కడ నివసించే గిరిజనుల ఉపాధిని కాపాడటం కోసం భారత ప్రభుత్వం డా. మాధవ్ గాడ్గిల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా ఎక్కడ నుండి వచ్చిందో అర్ధం కాలేదు. నివేదికపై పూర్తి చర్చ ప్రారంభం కావడానికి ముందే దానిని కొందరు తిరస్కరించారు” అని పర్యావరణవేత్త సుమైరా అబ్దుల్ అలీ అన్నారు.

చర్చ్ మొండి వైఖరి

కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులను కూడా వ్యతిరేకించాలని క్రైస్తవ డయోసిస్ లకు సూచనలు వెళ్ళాయి. పర్వత సానువుల్లో వ్యవసాయం చేసుకునే చిన్న రైతులకు ఇబ్బందులు కలుగుతాయని చర్చ్ వాదించింది. నివేదికను సమర్ధిస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో తగిన సమాధానం చెపుతామని హెచ్చరించింది కూడా. రైతులకు మద్దతు తెలిపే ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా ఇచ్చి గాడ్గిల్, కస్తూరి రంగన్ నివేదికలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనాలని లేఖలు పంపింది. ముఖ్యంగా చర్చ్ మద్దతు ఉన్న కేరళ కాంగ్రెస్ (ఏం) సభ్యులకు ఈ ఆదేశాలు అందాయి.

కొండలపై స్థిరపడి సాగుచేసుకుంటున్న చిన్న రైతులకు వెంటనే పట్టా పుస్తకాలు అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని కూడా చర్చ్ తన లేఖలో హెచ్చరించింది. ముఖ్యంగా గాడ్గిల్, కస్తూరి రంగన్ నివేదికల ప్రకారం ఖాళీ చేయిస్తారని భావించిన ఇడుక్కీ ప్రాంతంలో రైతులు ఆందోళనలకు సిద్ధమయ్యారు కూడా. కానీ ఇప్పుడు వరదల్లో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇడుక్కీ కూడా ఉంది. ఇక్కడ వందలాదిమంది చనిపోయారు.

గాడ్గిల్ నివేదిక ప్రజల ముందుకు వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాంది అసెంబ్లీలో మాట్లాడుతూ నివేదిక పట్ల ప్రభుత్వానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా నివేదికలో పశ్చిమ కనుమల పర్యావరణ సంస్థ (వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీ) ఏర్పాటుకు చేసిన కీలకమైన సిఫార్సును తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రం పర్యావరణ పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోగలదని, అందుకని ప్రత్యేక సంస్థ అవసరం లేదని స్పష్టం చేశారు. నివేదికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న తొమ్మిది అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేసినట్లు ఆయన అసెంబ్లీలో తెలిపారని ఒక పత్రిక వెల్లడించింది.

తెచ్చిపెట్టుకున్న విపత్తు

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విపత్తు నిర్వహణ నిపుణుడు అమిత్ సింగ్ వరదలను నివారించడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవి తెచ్చిపెట్టుకున్న వరదలని తీవ్రంగా విమర్శించారు. “నివారించగలిగిన విపత్తును నివారించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని స్వచ్చమైన పాలన అందిస్తున్నారంటూ ప్రశంసించడమేమిటో నాకైతే అర్ధంకాలేదు. కేరళలో వరదలు అతివృష్టివల్ల కలగలేదు. మూడునెలలపాటు 40శాతం ఎక్కువ వర్షపాతం వల్లనే ఇంత భారీ ఎత్తున వరదలు ముంచెత్తవు. ఇది కేవలం మానవ తప్పిదమే. ఈ ముప్పును ప్రభుత్వం నివారించగలిగేదే. కానీ అందుకు కావలసిన ముందుచూపు, ముందు జాగ్రత్త కొరవడ్డాయి. జులై నాటికి రిజర్వాయర్లు పూర్తిగా నిండాయని వారికి తెలుసు. ఆగస్ట్ లో 2000 మి. మీ అదనపు వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. నీటిని నిల్వ చేయడమే ఆనకట్టల పని. కనుక వాటి నుండి నీటిని ఎప్పుడు విడుదల చేయాలి. ఎంతవరకు నీటిని నిల్వచేయాలి అనే ముందు చూపు, నిర్వహణ ఉండాలి. వాతావరణ శాఖ అంచనాలను బట్టి ముందస్తు హెచ్చరికలను చేసే వ్యవస్థ ఉండాలి. కనీసం కొన్ని వారాలముందు రాబోతున్న ముప్పును కనిపెట్టి చర్యలు చేపట్టగలగాలి. దానికి బదులు ప్రాజెక్ట్ లు పూర్తిగా నిండిపోయి పొగిపొరలుతున్నప్పుడు ప్రభుత్వం మేలుకోంది. వెంటనే ముందువెనుకా ఆలోచించకుండా గేట్లు ఎత్తివేసింది. దీనితో నీరు ఉధృతంగా ప్రవహించడానికి బదులు వరదలా మారింది. ఒక పక్క భారీ వర్షం, మరోపక్క ఆనకట్టల నుంచి వచ్చిన వరదతో అనేక ప్రాంతాలు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంవల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి ప్రభుత్వాన్ని సుపరిపాలన అంటూ ప్రశంసించడం ఎందుకో? ఏ ప్రమాణాల ప్రకారమో అర్ధంకాదు.’’

కేరళలో రెండవ అతిపెద్ద జిల్లా ఇడుక్కీ. 4,479 చ.కి.మీ ల విస్తీర్ణం కలిగిన ఈ జిల్లా 97శాతం పర్వతాలు, అడవులతో నిండిఉంది. ఇక్కడ సెటిలర్లు ఎక్కువ.

పర్యావరణం కంటే కాథలిక్ క్రైస్తవుల మత ప్రయోజనాలకే పెద్దపీట

ఇడుక్కీలోని కాథలిక్ క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడాలని చర్చి అనుకున్నదంటే అర్ధం చేసుకోవచ్చును. కానీ ఆ పని పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయమైన సమాచారం ఆధారంగా చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఆ కాథలిక్ క్రైస్తవుల ప్రాణాలనే కాపాడి ఉండేది. నష్టాన్ని చాలామటుకు తగ్గించి ఉండేది. అలా చేయకపోగా గాడ్గిల్ నివేదికను గుడ్డిగా వ్యతిరేకించడమేకాక బెదిరింపులకు దిగింది. గాడ్గిల్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పట్టుబడుతున్న పర్యావరణవేత్తలు, సంస్థలకు విదేశాల నుండి నిధులు వస్తున్నాయని, వాటికోసమే అలా మాట్లాడుతున్నారని లైటి వాయిస్ అనే చర్చ్ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది.

అయితే గాడ్గిల్, కస్తూరి రంగన్ నివేదికలను సరిగా అమలు చేసి ఉంటే కేరళలో ఇంత భారీ నష్టం జరిగేది కాదన్నది మాత్రం నిజం. చిన్న రాష్ట్రమైన కేరళలో జనసాంద్రత చాలా ఎక్కువ. ఇక్కడ అక్రమ కట్టడాలు కూడా ఉత్తరాఖండ్ లో మాదిరిగా ఎక్కువే. ఈ రెండు రాష్ట్రాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువకావడం వల్ల హోటళ్లు, రిసార్ట్ లు నిర్మించడానికి అడవులు కొట్టేస్తారు.  ఆ మధ్య ఉత్తరాఖండ్ ను కూడా వరద ముంచెత్తి భారీ నష్టాన్ని తెచ్చింది. ఇప్పుడు కేరళ వంతు. పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్లనే రెండు రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. ఇప్పటికైనా మత, రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రకృతి హెచ్చరికలను పట్టించుకుని జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏ ముప్పు వచ్చినా చివరికి నష్టపోయేది సామాన్య ప్రజానీకమే.

– అనుపమ హరీష్

ఆర్గనైజర్ సౌజన్యంతో…..
అనువాదం: విశ్వాసంవాద కేంద్రం, తెలంగాణా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here