Home Telugu Articles మరో టిబెట్ కానున్న బెలోచిస్తాన్!

మరో టిబెట్ కానున్న బెలోచిస్తాన్!

0
SHARE

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (ఆర్ధిక నడవా) ప్రాజెక్ట్‌ ఖరారు కాగానే పాకిస్తాన్‌ ప్రభుత్వం బెలోచీలను పిలిచి ఈ ప్రాజెక్ట్‌లో వారిదే కీలకపాత్ర అని చెప్పింది. అలాగే దీనివల్ల వారి పేదరికం తొలగిపోతుందని నమ్మబలికింది. కానీ ఎప్పుడైతే చైనా తన కార్మికులను అక్కడికి రప్పించడం మొదలు పెట్టిందో అప్పుడు బెలోచిలకు నిజం అర్ధమయ్యింది.
ఆసియా దేశాల్లో ప్రభుత్వాల మార్పు, త్వరితమైన రాజకీయ మార్పులు ఇప్పటివరకు చైనా ప్రయోజనాలకు, పెట్టుబడులకు అనువుగా, అనుకూ లంగా సాగాయి. అంతర్జాతీయ ఒత్తిడి, విమర్శలతో సంబంధం లేకుండా చైనా తన విస్తరణ విధానాన్ని అనుసరించింది. కానీ ఒకపక్క ఆర్చిపెలాగోలో చైనా పెట్టుబడుల గురించి సమీక్ష చేయడం కోసం మాల్దీవుల నూతన విదేశాంగ మంత్రి బీజింగ్‌కు పయనమవుతుంటే, మరోపక్క దక్షిణ కరాచీలోని విలాసవంతమైన చైనా రాయబార కార్యాలయంలో కలకలం చెలరేగింది. రాయబార కార్యాలయంలో ప్రవేశించి విధ్వంసం సృష్టించాలనుకున్న తీవ్రవాదు లను ఆఖరి నిముషంలో పాకిస్థాన్‌ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. గంటపాటు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. అందులో ముగ్గురు తీవ్ర వాదులు కూడా ఉన్నారు. కార్యాలయంలో ఉన్న 21 మందిని సింధ్‌ పోలీసులు సురక్షిత ప్రదేశానికి తరలించారు.
బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) ఈ దాడులు తమ పనేనని ప్రకటించింది. 2005లో పాకిస్తాన్‌ దళాలు తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలో బలోచ్‌ తిరుగుబాటు నేత నవాబ్‌ అక్బర్‌ భుగ్తి చనిపోయాడు. కానీ 2006లో తిరిగి బలం పుంజుకున్న తిరుగుబాటుదారులు పాకిస్తాన్‌ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న పాకిస్తాన్‌ నైరుతి ప్రాంతం బెలూచిస్తాన్‌ గ్వాదర్‌ నౌకాశ్రయానికి ముఖద్వారం. ఈ నౌకాశ్రయం చైనా – పాకిస్థాన్‌ ఆర్ధిక నడవాలో కీలకమైనది. ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌’లో ముఖ్యభాగమైన ఆర్ధిక నడవా ఏర్పాటుకు చైనా, పాకిస్తాన్‌లు 2014లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం విలువ 62 బిలియన్‌ డాలర్లు. చైనా జింజియాంగ్‌ను గ్వాదర్‌ పోర్టుకు కలపడం కోసమే ఈ నడవా. ఈ ప్రాజెక్ట్‌లో అనేక ఇతర మౌలిక సదుపాయాల అభివద్ధి పధకాలు కూడా ఉన్నాయి. అందులో రోడ్ల నిర్మాణం, చమురు పైపుల ఏర్పాటు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం పెద్ద సంఖ్యలో చైనా కంపెనీలు పాకిస్తాన్‌లో అడుగుపెట్టాయి. చైనా ఏ దేశంలో ప్రాజెక్టులు చేపట్టినా వాటిలో పనిచేసేందుకు తమ దేశానికి చెందిన పనివారినే అక్కడికి తరలిస్తుంది.
ఆర్ధిక నడవాకు మూలమైన బెలూచిస్తాన్‌లో వేలాదిమంది చైనా కార్మికులు స్థిరపడ్డారు. క్రమంగా చైనా వారి జనాభా ఈ ప్రాంతంలో పెరుగుతుండడం స్థానిక బెలోచిలకు ఆందోళన కలిగించింది. 1948 నుంచి పాకిస్తాన్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి చైనా నుంచి కొత్త బెడద వచ్చిపడింది. విస్తారమైన భూమి, సహజ వనరులు ఉన్న బెలూచిస్తాన్‌లో జనాభా మాత్రం తక్కువే. అలాగే అభివృద్ధి కూడా అంతంతమాత్రమే. పక్కనే ఉన్న పంజాబ్‌ ప్రాంతంతో పోలిస్తే 45 శాతం బెలోచీలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. ఆర్ధిక నడవా ప్రాజెక్ట్‌ ఖరారు కాగానే పాకిస్తాన్‌ ప్రభుత్వం బెలోచీలను పిలిచి ఈ ప్రాజెక్ట్‌లో వారిదే కీలకపాత్ర అంటూ చెప్పింది. అలాగే దీనివల్ల వారి పేదరికం తొలగిపోతుందని నమ్మబలికింది. కానీ ఎప్పుడైతే చైనా తన కార్మికులను అక్కడికి రప్పించడం మొదలుపెట్టిందో అప్పుడు బెలోచిలకు నిజం అర్ధమయ్యింది. పాకిస్తాన్‌ మాటలన్నీ నీటిమీద రాతలేనని, తమ ఆశాలన్నీ అడియాశలేనని వారికి తేలిపోయింది. బెలోచ్‌ యువతకు ఉపాధి అవకాశాలు ఏవీ రాలేదు. తమ ప్రాంతంలో చైనా వారి జనాభా ఇలాగే పెరిగిపోతే కొంతకాలానికి తాము మైనారిటీలుగా మారిపోతామనే సందేహం కలిగింది. తక్కువ అంచనా ప్రకారం చూసినా బెలూచిస్తాన్‌లో ఇప్పటికే 30వేలకు పైగా చైనావారు స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన బెలోచీలు చైనా ప్రాజెక్టులను, చైనా పెట్టుబడులను వ్యతిరేకించడం ప్రారంభించారు.
ఈ సంవత్సరం ఆగస్టు మాసంలో చైనా ఇంజనీర్లను తీసుకువెళుతున్న బస్సుపై బెలోచ్‌ వేర్పాటువాద దళాలు దాడిచేశాయి. 2014 నుంచి జరుగుతున్న ఇలాంటి దాడుల్లో ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్న కనీసం 44 మంది చైనా జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలతో ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఆర్ధిక నడవాను ఎలాగైనా పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న పాకిస్తాన్‌ అదనంగా 15 వేల భద్రతా సిబ్బందిని చైనా ఆస్తులను రక్షించడానికి నియోగించింది.
చైనా ఎప్పుడు ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నా, అందులో తమ ప్రయోజనాలు ఏమిటన్నది మూడవ కంటికి తెలియకుండా రహస్యంగా ఉంచుతుంది. 2017 పాకిస్తాన్‌ మీడియా రిపోర్ట్‌ల ప్రకారం 2023 నాటికి బెలూచిస్తాన్‌లో ఐదు లక్షల మంది చైనా వత్తి నిపుణుల కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. వీటిని ప్రముఖ అంతర్జాతీయ ఇంజనీ రింగ్‌ కంపెనీ నిర్మిస్తోంది. అలాగే గ్వాదర్‌లో పెద్ద చైనా కమ్యూనిటీ సెంటర్‌ కూడా నిర్మాణంలో ఉంది.
ఆర్ధిక నడవా నిజానికి చైనా, పాకిస్తాన్‌ల మధ్య సైనిక నడవా అని నిరూపిస్తూ అమెరికా సైన్యానికి చెందిన మాజీ కల్నల్‌ లారెన్స్‌ సోలిన్స్‌ వ్యాసాలు వ్రాశాడు. ఆర్ధిక సహకారం పేరుతో సైనిక సహకారం సాగించడమే ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రెండు దేశాల లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా చైనా మధ్య, దక్షిణ, పశ్చిమ ఆసియాల్లో రవాణా మార్గాలను ఏర్పాటు చేసుకోవా లనుకుంటోంది. పర్షియా గల్ఫ్‌పై పట్టు సాధించి హిందూ మహాసముద్ర మార్గాలను మూసి వేయాలన్నది చైనా వ్యూహం. డిగో గార్సియాలో అమెరికా నౌకా స్థావరపు ప్రభావాన్ని తగ్గించడం కూడా చైనా లక్ష్యం.
2005లో గ్వాదర్‌ జిల్లాలో పాకిస్తాన్‌ నావికాదళం 2500 ఎకరాలలో తీర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే తీరం వెంబడి భూములను సేకరించడం ప్రారంభించింది. ఆర్ధిక నడవా పేరు చెప్పి పాకిస్తాన్‌ ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. దీనిని చైనాకు అప్పగించడానికి సిద్ధమయింది.
ఏప్రిల్‌, 2017లో గ్వాదర్‌ పోర్ట్‌ను చైనా కంపెనీకి 40 ఏళ్లకి లీజుకు ఇస్తూ పాకిస్తాన్‌ ఒప్పందంపై సంతకం చేసింది. హిందూ మహా సముద్రంలో చైనా, పాకిస్తాన్‌ సంయుక్త గస్తీ కొనసాగుతుందని ఇస్లామాబాద్‌ ప్రకటించింది. డిసెంబర్‌ నాటికి బెలూచిస్తాన్‌లోని సోన్‌ మియని వద్ద ఆయుధ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. అరేబియా సముద్రంలో తమ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌లను తిప్పడానికి వీలుగా సోన్‌ మియని దగ్గర సముద్రంలో సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. ఇలాంటి సొరంగం యులిన్‌లో ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ అన్ని పరిణామా లను గమనించినట్లయితే బెలూచిస్తాన్‌ త్వరలోనే చైనా చేతికి చిక్కి మరో టిబెట్‌ కాగలదనే అనుమానాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
చైనా రాయబార కార్యాలయంపై దాడి జరిగిన సందర్భంలో తమ మధ్య అగాధాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ‘చైనా పెట్టుబడి దారులను భయానికి గురిచేసి ఆర్ధిక నడవాను దెబ్బతీయడం కోసమే ఈ దాడి జరిగింది’ అని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు కూడా.
తమ ప్రాంతంలో పెరిగిపోతున్న సైన్యపు జోక్యం, చైనా వ్యవహారాల పట్ల బెలూచిస్తాన్‌ ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్‌ చెపుతున్న సామాజిక – ఆర్ధిక అభివృద్ధి ఏదీ కనిపించకపోగా తమ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందని వారు సందేహిస్తున్నారు. దీనివల్ల వేర్పాటువాదులు ఆయుధాలు పట్టుకుని చైనా ప్రాజెక్టులపై దాడులకు పూనుకుంటున్నారు. వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌ ప్రాజెక్టు వల్ల నష్టాలను, అందులోని మోసాన్ని ప్రపంచం దృష్టికి తేవడం కోసమే వేర్పాటువాదులు చైనా రాయబార కార్యాలయంపై దాడి చేశారు. చైనా పెట్టుబడుల వెనుక ఉన్న ఆర్ధిక శోషణను వివరిస్తూ బెలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది కూడా.
అనేక దేశాలు చైనా పెట్టుబడులను తిరస్క రిస్తుంటే శ్రీలంక, మలేషియా, మాల్దీవులలో ప్రజలు చైనా అనుకూల పాలకులకు స్వస్తి పలికారు. నామమాత్రపు ప్రజాస్వామ్యం ఉన్న పాకిస్తాన్‌లో కూడా చైనా పెట్టుబడులు, విస్తరణ పట్ల తీవ్ర వ్యతి రేకత వ్యక్తమవుతోంది. చైనా రాయబార కార్యా లయం, చైనా పౌరులపై దాడులే ఇందుకు నిదర్శనం.
చైనా అనుసరిస్తున్న నయా సామ్రాజ్యవాదాన్ని అన్ని దేశాలూ నిరసిస్తున్నాయి. తమ అప్పుల గురించి చిన్న దేశాలు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ దగ్గరకి వెళుతున్నాయి. పాకిస్తాన్‌, అంగోలా, జాంబియా వంటి దేశాల అప్పుల పట్ల ఆందోళన చెందుతున్న ద్రవ్యనిధి సంస్థ చైనా పెట్టుబడుల వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భావిస్తోంది. 2014లో చిన్న దేశాల్లో కేవలం ఆరింటిలో ఒకటి మాత్రమే అప్పుల ఊబిలో కూరుకుని పోతే ఇప్పుడు 45 శాతం దేశాలు రుణభారంతో కుంగిపోతున్నాయి. వీటిలో చాలా మటుకు దేశాలు చైనా బెల్ట్‌, రోడ్‌ ప్రాజెక్ట్‌లో చిక్కుకున్నవే. వీటిలో కూడా 75 శాతం దేశాలు పెట్టుబడులు స్వీకరించే సామర్ధ్యం, అప్పులు తీసుకునే శక్తి లేనివిగా పేరుపడ్డాయి. ఇలా అత్యంత బలహీనమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన జాంబియా వంటి దేశాలకు అప్పులు అంటగట్టిన చైనా క్రమంగా వాటి పోర్టులు, విద్యుత్‌ కేంద్రాలు, ప్రసార సంస్థలను చేజిక్కించుకుంటోంది.
ఆర్ధిక కష్టాల నుంచి బయటపడే మార్గం కనిపించక, సహాయం అందించేవారు లేక అనేక చిన్న దేశాలు పెట్టుబడుల పేరుతో చైనా పన్నుతున్న అప్పుల వలలో చిక్కుకుంటున్నాయి. కనుక ఇప్పటికైనా ఇతర దేశాలు ఒక బృందంగా ఏర్పడి చిన్న దేశాలకు ఆర్ధిక, శాస్త్రసాంకేతిక సహాయాన్ని అందించగలిగితే బాగుంటుంది. వైశ్విక వాణిజ్యం, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల పేరుతో చైనా అనుసరిస్తున్న ఆర్ధిక విస్తరణవాదం ఎలాంటి దుష్ఫలితాలకు దారితీస్తుందో ప్రపంచానికి మెల్లగా అర్ధమవుతోంది.
– డా.రామహరిత

జాగృతి సౌజన్యంతో.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here