Home Telugu Articles మత విశ్వాసమా? శరీరధర్మ శాస్త్రమా?

మత విశ్వాసమా? శరీరధర్మ శాస్త్రమా?

0
SHARE

తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం కనిపించడం లేదు.

ప్రస్తుతం జరుగుతున్నది ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన అనుభవం ఉన్నట్టు అనిపించే ‘డిజావూ’[పూర్వం ఎప్పుడో జరిగినట్లుగా అనిపించడం] లాంటి భావనలాగా అనిపిస్తుంది ఇది. 1849 డిశంబర్ లో ప్రస్తుతం ట్యునీషియాగా పిలవబడుతున్న ట్యునిస్ లోని బేలిక్ ప్రాంతంలో  కలరా వ్యాధి బయటపడింది. దాంతో భయభ్రాంతుడైన అప్పటి ప్రగతిశీల పాలకుడు అహ్మద్ ముస్తఫా రాజధాని ట్యునిస్ ని వదిలిపెట్టి, తన పరివారంతో కార్తేజ్ లోని ఒక ఉద్యానవన సౌధం లో ఉంటున్న అప్పటి ప్రధాన మంత్రి అయిన ముస్తఫా ఖజంధర్ వద్దకు వెళ్ళిపోయాడు. అక్కడినుండి పాలనను కొనసాగించిన అతను, సైనిక శాలల్లో తాత్కాలిక వైద్యశాలలను  ఏర్పాటు చేసి, చికిత్స చేసేందుకు నిజాం జాదిద్ (ఐరోపా తరాహాలోని నూతన ట్యునీషియా సైన్యం) కి చెందిన ఇటాలియన్ వైద్యులను రంగంలోకి దింపాడు.  ప్రతి రోజూ వ్యాధి సంక్రమణ, మరణాలు, వ్యాధి నుండి కోలుకున్న వారి వివరాలతో పాటు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ అరబ్ మరియు ఇటాలియన్ భాషలలో ఒక నివేదికను ముద్రించేవాడు. ఈ జాగ్రత్తలను ప్రజలు నిష్టగా పాటించేందుకు నివేదిక  ప్రతులను మసీదులలో, చర్చిలలో పంపిణీ చేయించేవాడు.

1850 జనవరి 27  న వచ్చిన మీలాద్ ఉన్ నబి (ప్రవక్త జన్మదినం) సందర్భంగా పరిస్థితిలో పెనుమార్పు చోటు చేసుకుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ ఉత్సవం జరుపుకునేందుకు ప్రజలందరూ గుమిగూడటం, వారితో తాను కూడా చేరడం ఎంతవరకు సబబుగా ఉంటుంది అన్న మీమాంసలో పడ్డాడు అహ్మద్ ముస్తఫా.  కానీ చివరకు అతను యధావిధిగా ఉత్సవం జరుగుతుందని ప్రకటన చేసి, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసాడు. ఆ ఉత్సవం  సందర్భంగా ఫిరంగులు పేల్చడం, కష్టాలలో ఉన్న ప్రజలకి ధైర్యం కలిగేలా ఖురాన్ లోని రెండు ఐయాలను చదివి వినిపించడం లాంటివి చేశారు.

అది జరిగిన కొద్ది రోజుల్లోనే ముస్లీములు ఉన్న ప్రాంతాలలో కలరా పెల్లుబికి, తరువాత ట్యునిస్ నగరం మొత్తం కలరా గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ట్యునిస్ నగరంలో ప్రసిద్ధుడైన మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఫిబ్రవరి ఆరవ తేదీన మరణించగా, తరువాత అతని కుటుంబ సభ్యులు, ఇంకా అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్న అనేకమంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన  నాన్సీ ఎలిజబెత్ గల్లాఘర్ రచించిన “మెడిసిన్ అండ్ పవర్ ఇన్ ట్యునీషియా, 1780-1900’’ అనే పుస్తకంలో వివరించబడింది.

ఆ సంఘటన తరువాత ట్యునీషియా ప్రజాభిప్రాయంలో పెనుమార్పు వచ్చింది. ఎక్కువ మంది ప్రజలు ఐరొపా వైద్యులను, వారి చికిత్సా పద్ధతులను విమర్శించడం మొదలుపెట్టారు. వైద్యులను దూషించడం, వారిని కొట్టడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తన వ్యక్తిగత వైద్యుడైన ఇటాలియన్ వైద్యుడు అబ్రహం లుమ్బ్రోసో సలహా మేరకు అహ్మద్ ముస్తఫా తనకి తాను దిగ్బంధనం విధించుకున్నాడు. కానీ ఈ తీవ్రమైన చర్య అతని మంత్రులలో కొందరికి ఆగ్రహం కలిగించింది. వారు అతని దగ్గరకు వెళ్లి, ఇలా దిగ్బంధనం విధించుకోవడం అనేది ఖురాన్ లో ఎక్కడా లేదనీ, ఇస్లాంతో పోలిస్తే వ్యాధులు, వైద్యం విషయంలో ఎంతో వెనుకబడి ఉన్న క్రైస్తవం కనిపెట్టిన పద్ధతి ఇది అని సౌమ్యంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

స్వీయ దిగ్బంధనం విధించుకోవడం వలన కలిగే ఉపయోగం గురించిన చర్చ మతపరమైన రంగు పులుముకుంది. యూరోపియన్ వైద్యవిధానాన్ని తీవ్రంగా విమర్శించే ప్రధాన మంత్రి ఖజాందర్ స్వీయ దిగ్బంధనం అనే విధానాన్ని ఖండించి, కలరా వలన మరణించిన ముస్లీములందరూ అమరవీరులని ప్రకటించాడు. అయితే అహ్మద్ ఐ ఇబ్న్ ముస్తఫాకి వ్యక్తిగత కార్యదర్శి అయిన బిన్ దయాఫ్ మాత్రం స్వీయ దిగ్బంధనం విధించుకోవడం ద్వారా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం చట్టబద్ధమే అనీ, ఏ మత గ్రంధమూ దానిని వ్యతిరేకించలేదని అభిప్రాయపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒక మత గురువు వద్దకు వెళ్ళారు. ఆ తరువాత అహ్మద్ ముస్తఫా కుమారుడు మరియు అతనికి వారసుడుగా భావించబడుతున్న ఇబ్రహీం అల్ రియాహి (అతను గ్రేట్ మాస్క్ ఆఫ్ ట్యునిస్ కి ఇమాము కూడా), కలరా వలన మరణించిన వారు అంతర్గత గాయాలతో మరణించారు కాబట్టి, వాళ్ళ మతపరమైన న్యాయ గ్రంధంలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అమరవీరులే అని ప్రకటించాడు.  అటు పిమ్మట బిన్ దయాఫ్ మరియు ఖాజాందర్ లు ముఫ్తీ మహమ్మద్ బిన్ సలామా అనే మత గురువు దగ్గరకు వెళ్తే, ఆయన కలరా వలన మరణించిన వారు అమరవీరులు కారు అని ప్రకటించాడు. వాస్తవం ఏదైనప్పటికీ ‘అలీములు’ (ఇస్లాం పండితులు) కూడా కలరా వలన మరణిస్తున్నారు అని ఆ చర్చను అంతటితో ముగించాడు బిన్ దయాఫ్.

గతంలో చాలా సార్లు మతపరమైన అభ్యంతరాలు అంటువ్యాధుల మీద పోరాటానికి అడ్డుపడ్డాయి. అంటువ్యాధుల నియంత్రణ కోసం ఏకాంతాన్ని లేదా దిగ్బందాన్ని విధించడానికి సంబంధించిన విధానాన్ని రూపొందించడానికి ఓట్టోమాన్ సామ్రాజ్యానికి నాలుగు శతాబ్దాల కాలం పట్టింది. రెండవ సుల్తాన్ ముహమ్మద్ ఆస్ట్రియాకు చెందిన వైద్యుడు ఆన్టన్ లాగోస్ సలహా మేరకు, మరియు హమ్దాన్ బిన్ ఎల్-మేహ్రం ఒస్మాన్ హోకా తన గ్రంధములో వ్రాసిన విషయాలను విశ్వసించి, 1838లో ఓట్టోమాన్ సామ్రాజ్యంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు వైద్యపరమైన దిగ్బందాన్ని విధించడానికి అంగీకరించాడు.  ఆ రోజుల్లో ఓట్టోమాన్ రాజనీతిజ్నుడైన ఇద్రిస్ ఇ బిట్లిసి మరియు ప్రముఖ న్యాయమూర్తి అయిన ఇసమెద్దిన్ అహమద్ బిన్ ముస్తఫా లాంటి హేతుబద్ధంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉండి ఉంటె రెండవ సుల్తాన్ ముహమ్మద్ తీసుకున్న చర్యలకు మరింత ప్రాధాన్యత ఉండేదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే ఆ రోజుల్లో, దిగ్బంధనం విధించడం మరియు ప్లేగు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముస్లీములకు ఉన్న దైవ విశ్వాసానికి ద్రోహం చేయడమే అని వాదించిన ఒస్మాన్ బిన్ సులేమాన్ పెనా లాంటి వైద్యులు కూడా ఉన్నారు.

తన ప్రముఖ రచన అయిన “ప్లేగు, దిగ్బంధనం మరియు ఓట్టోమాన్ ప్రాంతీయ రాజకీయాలు” అనే పుస్తకం లో బిర్సేన్ బుల్ముస్  అనే రచయిత టర్కిష్ సామ్రాజ్యంలో ప్లేగు మరియు దానికి సంబంధించిన అంటువ్యాధులను ఎదుర్కొనడానికి రూపొందించిన విధి విధానాలకు సంబంధించిన చరిత్రను గురించి పేర్కొన్నాడు. క్రైస్తవులను చంపే వ్యాధి ఏదైనా అది ముస్లీములను కూడా చంపుతుంది. అలాగే హిందువులను బ్రతికించే మందు ఏదైనా అది ముస్లీములను కూడా బ్రతికిస్తుంది.  శరీర ధర్మ శాస్త్రం మత సంబంధమైన విశ్వాసాలకన్నా ఎక్కువ సమానత్వాన్ని ప్రదర్శిస్తుంది అని కూడా అభిప్రాయపడ్డాడు ఆయన.

1831 లో కలరా బారిన పడ్డ పవిత్ర నగరం మక్కా, అక్కడి నుండి ప్రతి సంవత్సరం భక్తుల యాత్ర సమయంలో దానిని ఎదుర్కుంది. దాని తీవ్రత అత్యంత ఎక్కువగా కనిపించిన 1865 లో అక్కడకి యాత్రకి వచ్చిన వారిలో మూడవ వంతు మంది మృత్యువాత పడ్డారు. 1866 కాన్ స్టాంట్ నోపుల్ (ఇస్తాంబుల్) లో జరిగిన అంతర్జాతీయ శానిటారీ కాన్ఫరెన్స్ లో ఈ సమస్యను గురించే ఎక్కువ చర్చ జరిగింది. 1867 లో అరబ్బులు, యూరోపియన్లతో కూడిన ఆరుగురు సభ్యులున్న కమిటీ సముద్ర మార్గం గుండా హజ్ యాత్రకు వచ్చే యాత్రీకులను నియంత్రించడానికి ఒక నివేదికను తయారు చేసింది.

గత చరిత్ర బాగా తెలుసు కాబట్టే సౌది అరేబియా కోవిడ్-19  కారణంగా మక్కా, మదీనాలను లాక్ డౌన్ లో పెట్టి, జూలై 28 నుండి ఆగస్ట్ 2 దాకా జరగాల్సిన హజ్ యాత్రను కూడా వాయిదా వేయాలని భావిస్తోంది. అలాగే భారత దేశం కూడా మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది. శుక్రవారం సహా అన్ని రోజులూ ఇంట్లోనే నమాజు చేసుకోమని ముస్లీములకు ఉలేమా పిలుపునిచ్చారు.

కానీ, ముస్లీము సమాజములోని ఒక వర్గము యొక్క  బాధ్యతారాహిత్య ప్రవర్తన మొత్తం సమాజాన్ని కోవిడ్-19 కి సంబంధించిన ప్రమాదంలో  పడేస్తోంది. మార్చ్ 13-15 మధ్య నిజాముద్దీన్ మర్కాజ్ మసీదులో జరిగిన తబ్లిగి జమాత్ కి సంబంధించిన ఒక పెద్ద స్థాయి కార్యక్రమం కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి దారి తీసింది. అప్పటికీ భారత దేశంలో లాక్ డౌన్ లేకున్నప్పటికీ, డిల్లీ ప్రభుత్వం రెండు వందలకు మించి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో గుమికూడరాదని నిషేదాజ్ఞలు జారీ చేసింది. కానీ ప్రధాన కార్యక్రమం  అయిపోయినప్పటికీ అక్కడ ఉన్న ఆరు అంతస్తుల వసతి గృహంలో  రెండు వేలమంది గుమికూడి  సమావేశాలు కొనసాగిస్తూనే వచ్చారు.  డిల్లీ పోలీసులు నోటిస్ ఇచ్చినాక కూడా, తబ్లిగి జమాత్ యాజమాన్యం వెనక్కు తగ్గలేదు. అక్కడ ఉన్న 2361 మందిని ఖాళీ చేయింఛి వాళ్ళని వైద్య పరమైన దిగ్బంధనం లో ఉంచడానికి   పోలీసులకు 36 గంటలు పట్టింది.

కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గాలికి వదిలేయమని టిక్ టాక్ ద్వారా ముస్లీం యువతను పెడదోవ పట్టించడం అత్యంత దారుణం. అలాంటి దుష్ట సలహాలను విన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని, ఇతరుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిజానికి ముస్లీములు తమ ఆరోగ్యం కోసం వైద్య శాస్త్రం మీద కాక కేవలం వాళ్ళ దేవుని మీదనే ఆధారపడి ఉంటె, ఢిల్లీ లోని ఆసుపత్రులలో వాళ్ళ సంఖ్య ఇప్పుడున్నంత ఉండేది కాదు. అలాగే ఇక్కడున్న సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను  ఆఫ్గనిస్తాన్,ఇరాన్, మధ్య ఆసియా దేశాలనుండి అంతమంది రోగులు సందర్శించి ఉండేవాళ్ళు కాదు. చలికాలంలో ముస్లీములు కూడా అందరిలాగానే ఉన్ని దుస్తులు ధరించి తరువాత వాటిని విడిచిపెడతారు. అలాంటప్పుడు ఈ కోవిడ్ కాలంలో బాధ్యత అంతా అల్లా మీదకి నెట్టడం ఎంతవరకు సమంజసం?

1850 లో అహ్మద్ ముస్తఫా  చెప్పినట్టుగా, “దైవాజ్ఞ మరియు విధిరాతను అనుసరించి నేను ఈ రోగంతో (కలరా) మరణిస్తే, నేను ఇలా చెప్పేవాడినేమో, “నేను దిగ్బంధనాన్ని పాటించి ఉంటె, ఇలా జరిగి ఉండేది కాదేమో, ఎందుకంటే ప్రతిదీ అల్లా ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందన్న నాకు  విశ్వాసము ఉంది కనుక”

Source: The Pioneer

Translation: VSK Andhra