Home Telugu Articles మొదటి హక్కు ముస్లిములకేనట!

మొదటి హక్కు ముస్లిములకేనట!

0
SHARE

మండువేసవి. మిట్ట మధ్యాహ్నం. స్కూలు నుంచి 3 కిలోమీటర్లు చెమటలు కక్కుతూ నడిచి 14 ఏళ్ల శ్రుతి ఇంటికొచ్చింది. ఒంటిమీద చెంబెడు నీళ్లు కుమ్మరించుకుందామంటే పెరట్లో కుండ ఖాళీ. వీధి నల్లాలో రెండురోజులుగా నీళ్లు రావటం లేదు.
ఉసూరుమంటూ కూలబడి ‘అమ్మా! ఆకలేస్తోంది అన్నం పెట్టు’ అంది. కంచంలో అన్నం తెచ్చిన తల్లికి బిడ్డ కళ్లనీళ్లతో కనిపించింది. ‘ఎందుకమ్మా! ఏమైంది’ అంటే జవాబివ్వలేదు. వెక్కుతూ అన్నం తిని, కాసేపటికి స్థిమిత పడ్డాక రెట్టించి అడిగితే కారణం చెప్పింది.
తనతోపాటు చదువుకునే అమీనాకు కొత్త సైకిలు గవర్నమెంటు ఇచ్చిందట. తనలాగా కాళ్లుకాలే ఎండలో బోలెడు దూరం నడవాల్సిన బాధ లేకుండా ఆ పిల్ల హాయిగా సైకిలెక్కి తిరుగుతున్నదట. ఈ సంగతి చెప్పి ‘అమ్మా! నాకూ సైకిల్‌ కావాలి’ అంది శ్రుతి ఆశగా.
‘నీకు సైకిల్‌ కొనిచ్చేంత శక్తి మీ నాన్నకు లేదమ్మా’ అంది తల్లి.
‘అమీనాకు ఇచ్చినట్టు గవర్నమెంటు నాకెందుకు సైకిల్‌ ఇవ్వదు?’
‘అమీనా ముస్లింకదమ్మా! 9, 10 క్లాసుల్లోని ముస్లిం, క్రిస్టియన్‌ అమ్మాయిలకే తప్ప హిందువుల పిల్లలకు సర్కారు సైకిళ్లను ఇవ్వదు తల్లీ!’
‘అలాంటప్పుడు మనమెందుకు ముస్లింలము కాకూడదు? అప్పుడు నాకూ అమీనా లాగా సైకిలు దొరుకుతుంది కదా?’
కూతురు వేసిన ప్రశ్నకు తల్లి మనసులో తుఫాను లేచింది.
‘లేదమ్మా లేదు. సైకిలు కోసం మనం మతం మారకూడదు. దిగులు పడకు. నా గాజులైనా కుదవబెట్టి నీకు సైకిల్‌ కొనిస్తానులే’ అంది తల్లి. శ్రుతి సంతోషంతో గంతులేసింది.

…ఐదారేళ్ల కింద సోషల్‌ మీడియాలో తెగ తిరిగిన కథ కాని కథ ఇది.
సంకర సెక్యులర్‌ భారతదేశంలో హిందువుగా పుట్టటం శాపం! జనాభాలో 80 శాతం ఉంటేనేమి వారు ప్రభుత్వాల నుంచి ఏ ఉపకారానికీ నోచుకోరు. కడుపేద హిందూ పిల్లల మీద కూడా సర్కారుకు కనికరం ఉండదు. సైకిళ్లయినా, స్కాలర్‌షిప్పులైనా, లోన్లయినా, ఫీజుల రాయితీలైనా ఇతర మతాల వారికి మాత్రమే.

మహమ్మదీయుల పాలన నడచినన్ని శతాబ్దాలూ ఏ రంగంలోనైనా ఏ విషయంలోనైనా మహమ్మదీయులకే ప్రాధాన్యం. తెల్లవాళ్లు రాజ్యమేలిన నూట యాభై ఏళ్లూ క్రైస్తవులది రాజభోగం. స్వతంత్రం అనబడేది వచ్చిందన్న తరువాత కూడా హిందువులు సెకండ్‌ క్లాసు సిటిజన్లు. సహాయాలు, రాయితీలు అన్నీ ముస్లింలూ క్రిస్టియన్లకే.

ఇది ‘నవభారత నిర్మాత’గా కీర్తించబడే నెహ్రూ చాచా పెట్టిన ఒరవడి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెసు సర్కార్లన్నీ నిష్ఠగా పాటిస్తున్నదే కాబట్టి ఆధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదని అర్థశతాబ్దం పాటు అనుకున్నారు. హిందువులకు అంతో ఇంతో అనుకూలమైన ప్రభుత్వం వచ్చి పడ్డాకగానీ హిందూ ద్వేషులు తమ పొరపాటును గ్రహించలేదు. వెలిగిపోతున్నాననుకున్న వాజపేయి సర్కారు మలగిపోయి సోనియామాత చల్లని రాజ్యం వచ్చీరాగానే హిందువులను ఆధికారికంగా అణగదొక్కే పుణ్యకార్యం పకడ్బందీ పథకం ప్రకారం చకచకా జరిగిపోయింది.

ఏదైనా వెధవ పని చేయాలనుకున్నప్పుడు జనాన్ని మభ్యపెట్టేందుకు బతకనేర్చిన సర్కార్లకు అలవాటైన విద్య ఒకటుంది. ముందుగా ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను వేస్తారు. తమకు కావలసిన రీతిలో దానినుంచి నివేదిక రాబడతారు. తరవాత కమిషన్‌ను పీటల మీద కూచోబెట్టి అది సూచించిందే చేస్తున్నామంటూ – తాము చేయదలిచింది చేసి పడేస్తారు. ఇక్కడా అదే నాటకం ఆడారు.

2004 ఎన్నికల తరవాత ప్రధానమంత్రి కుర్చీలో తన బినామిగా ఇటలీ పెద్దమ్మ కూచోబెట్టిన మన్‌మోహన్‌సింగ్‌ అనే కీలుబొమ్మ దగ్గరికి 26 గురు ముస్లిం ఎంపీలు, ముగ్గురు ముస్లిం మంత్రుల ప్రతినిధి వర్గం వెళ్లి ఓ మెమోరాండం ఇచ్చింది. అది చేతికందీ అందగానే 2005 మార్చి 9న ఓ హైలెవెల్‌ కమిటీని వేశాడు. ఇండియాలో ముస్లిం సమాజం తాజా స్థితిగతులను పరిశీలించి రిపోర్టు ఇమ్మని దానిని పురమాయించారు. పాలకవర్గానికి సన్నిహితుడుగా పేరుపడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌జస్టిస్‌ రాజీందర్‌ సచార్‌ను ఏరికోరి దానికి అధిపతిగా నియమించారు. మెంబర్‌ సెక్రటరీ ముస్లిం. ఐదుగురు మెంబర్లలో నలుగురు ముస్లింలు. ఐదవవాడు కమ్యూనిస్టు అడ్డా అయిన ఢిల్లీ జవహర్లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసరు.

సచార్‌ కమిటీ తనకు అప్పజెప్పిన పనిని నమ్మకంగా పూర్తి చేసి 2006 నవంబర్‌ 17న నివేదిక సమర్పించింది. కీలుబొమ్మ సర్కారు అసాధారణ వేగంతో కదిలింది. నివేదిక ఇలా అందగానే అలా, మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి జానత్‌ ఎ.ఆర్‌.అంతూర్‌ నవంబర్‌ 30న పార్లమెంటు ముందు ఉంచాడు. అన్నట్టు మున్నెన్నడూ లేని మైనారిటీ వ్యవహారాల శాఖను అంతకుముందే (2006 జనవరి 29న) కేంద్ర కేబినెట్లో కొత్తగా గజ్జె కట్టించారు.

403 పేజీల మహా నివేదికలో ఏమి తేల్చారో తెలుసుకుందుకు మొత్తం గ్రంథం చదవాల్సిన పనిలేకుండా తమ అద్భుత పరిశోధన సారాన్ని రెండో పేజీలోనే ప్రకటించారు ఇలా :
“The Muslims, the largest minority community constituting 13.4 per cent of the population, are seriously lagging behind in terms of most of the human development indicators”.
(జనాభాలో 13.4 శాతం ఉన్న అతిపెద్ద మైనారిటీ సమాజమైన ముస్లింలు మానవ అభివృద్ధికి పరిగణించే సూచీలలో అత్యధిక సూచికల ప్రకారం సీరియస్‌గా వెనకబడ్డారు.)

అది పచ్చి అబద్ధం. అయితేనేమి? రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడన్నట్టు యు.పి.ఎ. సర్కారు కావాలనుకున్నదే హైలెవెల్‌ కమిటీ నివేదికలో ఉంది. అందుకు బినామీ ప్రధాని బోలెడు సంతోషపడ్డాడు. నివేదికను పార్లమెంటు ముందు పెట్టి పదిరోజులు తిరక్కుండా (2006 డిసెంబర్‌ 9న) జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌.డి.సి.) సమావేశంలో అదే ఊపున ఈ దేశ ప్రధానమంత్రి ఒక అద్భుతమైన విధాన ప్రకటన చేశాడు :
“Minorities, particularly Muslims must have the first claim on national resources.”
(మైనారిటీలు, అందునా ముఖ్యంగా ముస్లింలకు జాతీయ వనరులపై మొదటి హక్కు ఉంది.)

ఏ రకంగా చూసినా ఇది బుద్ధి తక్కువ మాట. ఎక్కడైనా జాతీయ వనరుల మీద జాతి జనులందరికీ సమాన హక్కు ఉంటుంది. జనాభాలో కేవలం 20 శాతం ఉన్న మైనారిటీలకు (అందులోనూ ముఖ్యంగా మహమ్మదీయులకు) మొదటి హక్కు ఉంటుంది అనడమంటే 80 శాతం ఉన్న మెజారిటీకి ప్రథమ హక్కును నిరాకరించడమే ! 80 శాతం ఉన్న హిందువులను దేశంలో రెండో తరగతి కింద దిగజ్చారడమే!

”రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకుని, ఎవరి మీద కక్షగాని, పక్షపాతం లేకుండా ప్రజలందరి పట్లా సవ్యంగా వ్యవహరిస్తానని” ప్రధానమంత్రిగా పదవీ స్వీకారానికి ముందు ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి ముస్లిముల పట్ల పక్షపాతం చూపి, వనరుల్లో మొదటిహక్కు వారిదేనని, 80 శాతం ప్రజలకు హక్కు లేదని సిగ్గుఎగ్గు లేకుండా ఎలా అనగలిగావని అప్పుడే అందరూ కీలుబొమ్మ ప్రధానమంత్రి గొంతు పట్టుకుని ఉండాల్సింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని శాఖల అధికారులు కొలువుతీరిన ఎన్‌.డి.సి. వేదిక మీద ఈ తెంపరి ప్రకటన చేసినందుకు, ఒక్క రాజకీయ వికర్ణుడూ ఆక్షేపించలేదు. మతం కారణంగా ఏ పౌరుడి పట్లా రాజ్యం వివక్ష చూపదని 15వ అధికరణం ఇచ్చిన రాజ్యాంగ వరాన్ని కాలరాచి వనరుల వినియోగంలో మమ్మల్ని దారుణ వివక్షకు గురి చేసే హక్కు మీకెక్కడిదని హిందూ సమాజం మండిపడలేదు. ఏ పత్రికా, ఏ టీవీ ఛానెలూ, ఏ హిందూ మేధావీ ఈ దుర్మార్గానికి పెద్దగా స్పందించలేదు. భయపడినంత ప్రతిఘటన హిందూ సమాజం నుంచి లేకపోవటంతో యు.పి.ఎ. దొరతనం పట్టపగ్గాలు లేకుండా బరితెగించింది. విద్య, ఉపాధి, ఆర్థిక విషయాలకు సంబంధించి ముస్లింలకు, ఇతర మైనారిటీలకు ప్రధానమంత్రి 15 పాయింట్ల కొత్త ప్రోగ్రాం” కింద వేలకోట్ల రూపాయల భూరివరాలు ప్రకటించింది.

ఆ వివరాల్లోకి వెళ్లేముందు కొన్ని వాస్తవాలను గమనించాలి.
1. సచారయ్య హై లెవెల్‌ కమిటీకి ప్రధానమంత్రి పురమాయించిన పని సాంఘిక, ఆర్థిక, విద్యారంగాల్లో ముస్లింల స్థితిగతులపై నివేదిక ఇమ్మని! ముస్లింలు కాక ఇతర మైనారిటీ వర్గాల పరిస్థితి పరిశీలించమని ప్రభుత్వం అడగలేదు. కమిటీ పరిశీలించనూ లేదు.
2. తాము సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నామని గాని, తమను ఆదుకుని పైకి తేవాలని గాని క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, పార్శీ మైనారిటీలు ప్రభుత్వాన్ని ఏనాడూ దేబిరించలేదు. అసలు తాము వెనకబడి ఉన్నామన్న భావనే ఆ వర్గాలకు లేదు. వారికి లేని వెనుకబాటును మన్‌మోహన్‌ సర్కారు పనిగట్టుకుని వారికి అంటగట్టింది. ముస్లింల సంగతి చూడమని సచార్‌ కమిటీకి చెప్పి, దాని నివేదికను అడ్డం పెట్టుకుని ముస్లింలకు, వారితోబాటు ఇతర మైనారిటీలకూ ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అది మిగతా మైనారిటీల మీద వల్లమాలిన ప్రేమతో కాదు. కేవలం ముస్లింలకే ఉపకారం చేస్తే ఒక్క మతం వారి మీద పక్షపాతం చూపారన్న చెడ్డపేరు వస్తుంది. అందుకే ఎవరూ అడగకపోయినా మిగతా మతాలవారినీ ఈ ఛత్రం కిందికి తెచ్చి, మైనారిటీల సంక్షేమం వంకన ప్రధానంగా ముస్లింలకు భూరి వరుమానాలు విరజిమ్మారు.
3. మైనారిటీలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి, వారి అవసరాలేమిటో కనుక్కోవాలి అన్న నిజాయితీ యు.పి.ఎ. సర్కారుకు నిజంగా ఉండి ఉంటే దానికోసం ప్రత్యేకంగా ఒక హైలెవెల్‌ కమిటీని వేయాల్సిన అవసరమే లేదు. మైనారిటీల మంచిచెడ్డలు చూడటం కోసమే, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు సూచించడం కోసమే, వారికి అన్ని విధాల న్యాయం జరిగేందుకు పాటుపడటం కోసమే ఎప్పుడో 1993 లోనే చట్టబద్ధంగా ఏర్పాటైన నేషనల్‌ మైనారిటీస్‌ కమిషన్‌ ప్రభుత్వానికి అందుబాటులో ఉండనే ఉన్నది. ఒక్క ముస్లింలే కాదు, ఏ మతానికి, ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా సాధికారికంగా సేకరించడానికి కావలసిన అన్ని హంగులు దానికి ఉన్నాయి. రాజ్యంగబద్ధంగా పార్లమెంటు ప్రత్యేక చట్టంకింద ఏర్పాటైన ఆ సాధికారిక సంస్థను వదిలేసి, కేవలం ఒక మైనారిటీ మతం కోసం పనిగట్టుకుని ఒక హైలెవెల్‌ కమిటీని వేయటమే ఆక్షేపణీయం, అభ్యంతరకరం.
4. పోనీ ఆ హైలెవెల్‌ కమిటీ అయినా తిన్నగా పని చేసిందా? ఏ దేశంలో ఏ సామాజిక వర్గమైనా ఏ స్థితిలో ఉంది, ఏ మేరకు అభివృద్ధి చెందింది అన్నది మదింపు చేయడానికి ప్రపంచమంతటా అందరూ అంగీకరించిన సూచికలు ఇవి.

1. శిశు మరణాలు, 2. ఆయుః ప్రమాణం, 3. పట్టణీకరణ స్థాయి, 4. అక్షరాస్యత, 5. ఆర్థిక స్తోమత.

వీటికి సంబంధించి వాస్తవ గణాంక వివరాలు పబ్లిక్‌ డొమెయిన్‌లో ఎవరికైనా అందుబాటులో ఉన్నాయి. ఒక్క అక్షరాస్యత విషయంలో మాత్రమే హిందువుల (65%) కంటే ముస్లింలు (59%) కొంచెం వెనకబడి ఉన్నారు. సగటు గణాంకం కంటే స్వల్పంగా వెనకబడినంత మాత్రాన ఒక సామాజిక వర్గం విద్యావిషయకంగా వెనకబడిందని చెప్పటానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు (AIR 1963 SC 649) ప్రకారం ముస్లింల అక్షరాస్యత జాతీయ సగటు కంటే 5 శాతం తగ్గటం భారీ వెనకబాటు కిందికి రానేరాదు.
ఇక పట్టణ ప్రాంతాల శిశుమరణాల్లో హిందువుల (54.7శాతం) కంటే ముస్లింలు (44.8శాతం) చాలా నయం అని 2005-06 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-3) గణాంకాలు చెబుతాయి. గ్రామ ప్రాంతాల్లోనూ ముస్లిం శిశుమరణాలు (82.2 శాతం) హిందువుల (82.5 శాతం) కంటే మేలే!

పట్టణీకరణలో హిందువుల (26 శాతం) కంటే ముస్లింలు (36 శాతం) ఎంతో ముందున్నారు. హిందువుల సగటు ఆయుః ప్రమాణం 65 ఏళ్లు కాగా ముస్లింలది దానికంటే 3 ఏళ్లు ఎక్కువ (68). అలాగే 2006-07 జాతీయ సర్వే ప్రకారం సగటు కుటుంబ వ్యయం హిందువులది రూ.40,009 కాగా ముస్లింలది రూ.40,327. తేడా చాలా స్వల్పం.

ఇలా ప్రపంచంలో నిపుణులందరూ అనుసరించే ఏ కొలమానాన్ని బట్టి చూసినా దేశంలో మహమ్మదీయుల పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదు. శిశుమరణాలు, ఆయుఃప్రమాణం వంటి మూడు ముఖ్యమైన మానవాభివృద్ధి సూచికల ప్రకారం ముస్లింల స్థితి హిందువులకంటే మెరుగ్గా ఉన్నదని సచార్‌ కమిటీ నివేదికే అంగీకరించింది. అయినా – వంకపెట్టలేని జాతీయ సర్వేలనూ, 2001 జనాభా లెక్కలనూ, శాస్త్రీయ అధ్యయనాలనూ కమిటీ పక్కకు నెట్టింది. ముస్లింలు మహా దరిద్రంలో గంపెడు సంసారాలతో కొట్టుమిట్టాడుతున్నారని కొన్ని దశాబ్దాలుగా మార్క్సిస్టు, ముస్లిం మేధావులు ఏ ఆధారాలు లేకుండా వినిపిస్తూ వచ్చిన వాదనకే సచార్‌ బృందం తందాన తాన అంది. దేశంలో అన్ని మతాలలోకీ మహమ్మదీయులే మహా వెనకబడి, నానా బాధలు పడుతున్నారని రడీమేడ్‌ నివేదిక ఇచ్చి హైలెవెల్‌ కమీటి లోలెవెల్‌కి దిగజారింది.

దాన్నే అక్షర సత్యంగా ఔదలదాల్చి, పనిలో పనిగా ఇంకో నాలుగు మైనారిటీ మతాలను కూడా ముస్లింలకు తోడు చేసి, మైనారిటీ సంక్షేమం పేరుపెట్టి, వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని హిందువులకు మాత్రం అందనివ్వకుండా సోనియా జమానా విరజిమ్మింది ఇలా :
– ఏడాదికి 25 లక్షల చొప్పున ప్రీమెట్రిక్యులేషన్‌ స్కాలర్‌షిప్పులు. వార్షిక ఆదాయం లక్ష రూపాయలకు మించని ముస్లిం, క్రిస్టియన్‌, బౌద్ధ, సిక్కు, పార్శీల పిల్లలకు మాత్రమే! వారి పిల్లలకు కిందటి ఫైనల్‌ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. కన్నవారి వార్షిక ఆదాయం అరలక్ష కంటే తక్కువ అయి, కిందటి ఫైనల్‌ పరీక్షలో 90శాతం మార్కులు తెచ్చుకున్నా సరే హిందువుల పిల్లలకు మాత్రం పైసా కూడా ఇవ్వరు.
– 2 లక్షల లోపు సాలుసరి ఆదాయం, మెట్రిక్‌ (10వ తరగతి) పరీక్షలో 50 శాతం మార్కులు ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌, బౌద్ధ, సిక్కు, పార్శీ పిల్లలకు 11వ తరగతి నుంచి పి.హెచ్‌.డి. స్థాయి వరకూ ఏడాదికి 5 లక్షలకు పైగా స్కాలర్‌షిప్పులు. 99 శాతం మార్కులు తెచ్చుకున్న నిరుపేద హిందూ పిల్లలకు మాత్రం నోట్లో మట్టిగడ్డ.
– వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షలలోపు ఉన్న మైనారిటీ పిల్లలకు పై చదువులకు తీసుకునే లోన్లమీద వడ్డీ పూర్తిగా సబ్సిడీ. షెడ్యూల్డు కులాలు, తెగలు, ఒ.బి.సి.లకు చెందిన హిందువుల పిల్లలకు ఈ సదుపాయం ససేమిరా వర్తించదు.
– టెన్త్‌లో కనీసం 55 శాతం మార్కులు తెచ్చుకుని ప్లస్‌టు (ఇంటర్‌)లో చేరిన మైనారిటీల అమ్మాయిలకు తండ్రి ఆదాయం సాలుకు లక్ష లోపు అయితే – మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ అనబడే కేంద్ర ప్రభుత్వ పోషిత సంస్థ ద్వారా ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్పులు.
– హయ్యర్‌ సెకండరీ, డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకున్న మైనారిటీల పిల్లలకు పై చదువుల్లో 20 వేల స్కాలర్‌షిప్పులు.
– ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. లాంటి టాప్‌ విద్యాసంస్థల్లో చేరే మైనారిటీల పిల్లలకు మొత్తం ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది.
– కాలేజి అడ్మిషన్ల కోసం కోచింగ్‌ సెంటర్లలో చేరే మైనారిటీల పిల్లలకు ఫీజులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపు.
– 9, అంతకంటే పై తరగతిలో చదువుతున్న మైనారిటీల అమ్మాయిలకు కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో ఫ్రీగా సైకిళ్లు.
(ఈ వ్యాసంలో పేర్కొన్న వివరాలకు ఆధారం : ఢిల్లీకి చెందిన రిటైర్డ్‌ ఐ.పి.ఎస్‌. ఆధికారులు రామ్‌కుమార్‌ ఓహ్రీ, జైప్రకాశ్‌ శర్మలు వెలువరించిన పరిశోధన గ్రంథం “The Majority Report”)

– ఎంవీఆర్ శాస్త్రి

Source: Jagriti Weekly