Home Telugu Articles ముస్లిం దేశాల్లోనూ ఏకాకి అయిన పాకిస్థాన్

ముస్లిం దేశాల్లోనూ ఏకాకి అయిన పాకిస్థాన్

0
SHARE

భారత, పాకిస్థాన్ ల మధ్య సంఘర్షణ కేవలం నియంత్రణ రేఖ వద్దనే ఆగిపోలేదు, అది అంతర్జాతీయ వేదికలపైనా కూడా సాగుతోంది. అన్నీ రంగాల్లో, అంతర్జాతీయ సంస్థల్లో పాకిస్థాన్ ను ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాదించింది. కానీ పాకిస్థాన్ ను ఎక్కువగా బాధపెట్టే, ఇబ్బందిపెట్టే పరిణామం ఏమిటంటే వ్యవస్థాపక సభ్యత్వం కలిగిన ఆ దేశం మొట్టమొదటసారిగా ఆ సంస్థ సమావేశాలకు దూరం అయింది. అబుదాభిలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (OIC) సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా పాకిస్థాన్ ప్రకటించింది. ముస్లిం దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత విదేశాంగ మంత్రిని ఆహ్వానించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. వ్యవస్థాపక సభ్యత్వం కలిగిన తమకు ఈ సమావేశాలకు భారత్ ను ఆహ్వానిస్తున్నట్లు కనీసం మాటమాత్రంగా కూడా చెప్పలేదని వాపోయింది. అయితే పాకిస్థాన్ అభ్యంతరాలను ముస్లిం దేశాల సంస్థ ఏమాత్రం పట్టించుకోలేదు. ఏ ఒక్క ముస్లిం దేశం పాకిస్థాన్ కు మద్దతు కూడా పలకలేదు. ముస్లిం దేశాల్లో తనకు ఎంతో పలుకుబడి, ప్రాబల్యం ఉందని భావిస్తున్న పాకిస్థాన్ కు ఇంతకు మించి అవమానం మరొకటి లేదు. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్, ఇందుకు కారణం భారత్ ను పిలవడమేనని స్పష్టంచేసింది. భారత్ పై ఎప్పుడూ చేసే ఆరోపణలు, విమర్శలే మళ్ళీ చేసింది. ముస్లిం సంస్థ ఏర్పడిన తరువాత 50ఏళ్లలో పాకిస్థాన్ ఇలా సమావేశాలను బహిష్కరించడం ఇదే మొదటిసారి.

1969లో ప్రారంభమయిన OIC లో మొత్తం 57 ముస్లిం దేశాలకు సభ్యత్వం ఉంది. ముస్లిం దేశాల ప్రయోజనాలను కాపాడటం, సామాజిక, మత, శాస్త్రసాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం ఈ సంస్థ లక్ష్యాలు. ఈ సంస్థ ద్వారా కాశ్మీర్ విషయంలో భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. పుల్వామా ఉగ్ర దాడి తరువాత కూడా భారత్ ను ఇరుకున పెట్టడానికి ముస్లిం దేశాల మద్దతు కూడగట్టాలని పాకిస్థాన్ ప్రయత్నించింది. కానీ అది సఫలం కాలేదు. పైగా ఇప్పుడు ఏకంగా ఆ భారత్ నే సంస్థ సమావేశాలకు ఆహ్వానించడంతో కంగుతిన్న పాకిస్థాన్ ముఖం చాటేసింది.

Source: JammuKashmirNow