Home News ” బృహత్ నాగాలిమ్ (నాగాలాండ్) డిమాండ్ ను వదిలి పెడుతున్నాం ” – నేషనల్ ...

” బృహత్ నాగాలిమ్ (నాగాలాండ్) డిమాండ్ ను వదిలి పెడుతున్నాం ” – నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్

0
SHARE

బృహత్ నాగాలిమ్ (నాగాలాండ్) డిమాండ్ ను వదిలిపెడుతున్నట్లు నేషనల్  సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ప్రకటించడంతో చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ ఊపిరి తీసుకుంటున్నాయి. దీనితో నాగా సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నాయి. 20 సంవత్సరాలపాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో కలిపి బృహత్ నాగాలాండ్ (గ్రేటర్ నాగాలాండ్) ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నాగా తిరుగుబాటుదారులతో కేంద్ర ప్రభుత్వ చర్చలు చివరికి ఫలితాన్ని ఇచ్చాయి. నాగాలాండ్ కు చుట్టూ ఉన్న రాష్ట్రాల సరిహద్దుల జోలికి పోమని ఎన్ ఎస్ సి ఎన్ అంగీకరించింది. అయితే నాగాలకు ప్రత్యేక రాజ్యాంగ హోదాను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది.

చుట్టూ ఉన్న రాష్ట్రాలలో నాగాలు నివశిస్తున్న ప్రదేశాలను కలుపుకుని గ్రేటర్ నాగాలాండ్ ఏర్పరచాల్సిందేనని, `విలీనం లేకపోతే పరిష్కారం లేదు’ అంటూ ఇంతకాలం తెగేసి చెప్పిన నాగా నేతలు ఇప్పుడు మెత్తబడి పోరుగు రాష్ట్రాల జోలికి వెళ్ళమని అంగీకరించారని ఎన్ ఎస్ సి ఎన్ తో జరిపిన సంభాషణాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున మధ్యవర్తి (ఇంటర్ లాక్యూటర్) ఆర్ ఎన్ రవి వెల్లడించారు.

దీనికి బదులు నాగాలకు వారు ఎక్కడ ఉన్న ప్రత్యేక హోదా లభించేట్లుగా చర్యలు తీసుకునే అవకాశం పరిశీలిస్తున్నామని, దానితో పాటు అనేక ఇతర అంశాల పైనా చర్చలు కొనసాగుతున్నాయని రవి తెలిపారు.

ఎన్ ఎస్ సి ఎన్ తో సంభాషణలు ముందుకు సాగుతున్నా ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని సాయుధ బృందాలను కూడా కలుపుపోవాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి అవరోధాలు ఏర్పడుతున్నాయని రవి తెలిపారు. ఇతర బృందాలను భాగస్వాములను చేస్తే తాము చర్చల నుండి వైదొలుగుతామని ఎన్ ఎస్ సి ఎన్ హెచ్చరిస్తోంది. అయితే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం వల్ల ఆరు నాగా బృందాలు ఒకటిగా ఏర్పడి శాంతి ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చాయి.

ఒకప్పుడు నాగా ప్రత్యేకవాదం, ప్రత్యేక రాజ్యం తప్ప మరొకటి తమకు అంగీకారం కాదని చెప్పిన నాగా తిరుగుబాటుదారులు 20 ఏళ్ల సుదీర్ఘ చర్చల తరువాత మెత్తబడ్డారు. ప్రభుత్వం కూడా నాగా ప్రత్యేక చరిత్రను గుర్తిస్తూ ఆ ప్రత్యేకతను కాపాడేందుకు ముందుకు వచ్చింది. అలాగే రాజ్యాంగ పరిధిలో చర్చలు జరిపేందుకు నాగా నేతలు కూడా అంగీకరించారు. దీనితో చివరికి గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ ను వదిలిపెడుతున్నట్లు ఎన్ ఎస్ సి ఎన్ ప్రకటించింది.