Home Telugu Articles విప్లవవీరుడు నారాయణబాబు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర -1 )

విప్లవవీరుడు నారాయణబాబు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర -1 )

0
SHARE

“ ఆజాద్ హైద్రాబాద్‌” నినాదం మారుమ్రోగుతోంది. అక్కడక్కడ నిజాం సంస్థానానికి చెందిన అసఫియా పతాకం గర్వంగా ఎగురుతోంది. ఖాన్‌సాబ్ రజాకార్ల ముఠాలకు సంబంధించిన సైనికులు నినాదాలు చేస్తూ సగర్వంగా ధ్వజానికి వందనాలు సమర్పిస్తున్నారు. “షాహె ఉస్మాన్ జిందాబాద్, ఆజాద్ హైద్రాబాద్ జిందాబాద్, కాయదెమిల్లత్ జిందాబాద్‌” అనే నినాదాలు సరిగ్గా 1947 ఆగస్టు 15 నాడే హైద్రాబాద్‌లో ప్రతిధ్వనిస్తున్నాయి. హైద్రాబాద్ సంస్థానానికి చెందిన పాలకవర్గ మహమ్మదీయులు కోలాహలంగా తమ స్వతంత్ర హైద్రాబాద్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు.

హిందువులకు “ఆజాద్ హైద్రాబాద్‌” అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసు. స్వతంత్ర ప్రతిపత్తి అనగానే హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లినదనే అర్థం, శాశ్వతంగా ఆత్మాభిమానం మట్టిలో కలిసి పోతుందని భయం. ఆ రోజు భారతావని నాలుగు చెరగులా స్వతంత్ర భారత త్రివర్ణ పతాకం భారతీయులలో నూతనోత్తేజాన్ని ప్రస్ఫుటిస్తూ స్వేచ్ఛగా అడుగిడుతోంది. కాని ఆ భారతదేశంలో భూభాగమైన హైద్రాబాద్‌లో హిందువులు బానిస శృంఖలాలలో మగ్గుతున్నారు.

మృత్యుఛాయలు కమ్ముకుంటున్నాయి. తమ పిత్రార్జితమైన ఆస్తిపాస్తులను వదలి ఆలుబిడ్డలతో సహా రాజ్యపు సరిహద్దులను దాటి చాలామంది హిందువులు వెళ్ళిపోతున్నారు. చివరకు నాయకులు కూడా సంస్థానంలో ఉండటం మేలుకాదనుకున్నారు.

1947లో భారతదేశం విముక్తి చెందగా, దేశంలో పెద్ద సంస్థానమైన హైద్రాబాద్‌లో అధిక సంఖ్యాకులు భయాందోళనలతో జీవిస్తున్నారు. ఎంతోకాలం నుండి స్వతంత్ర హైద్రాబాద్‌కై కలలుగంటున్న నిజాం ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.

హిందువులు అధికసంఖ్యలో ఉన్నా వారికి సాధారణమైన ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేశాడు. హైద్రాబాద్‌ను సార్వభౌమాధికారాలు గల ఇస్లాం రాజ్యంగా రూపొందించాలని ప్రయత్నించాడు. లార్డ్ రీడింగ్ హయాంలోనే నిజాం “విశ్వాసపాత్రుడైన మిత్రుడుగా” పరిగణన పొందాడు. ఆ నమ్మకంతోనే స్వతంత్ర ప్రతిపత్తి రాగాన్ని ఆలాపించటం మొదలు పెట్టాడు. కాని బ్రిటీషు ప్రభుత్వం చాకచక్యంగా తన ఉద్యోగులను కీలకస్థానాల్లో నియమించి నిజాం కలలను వమ్ముచేసింది.

ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో హైద్రాబాద్ పరతంత్ర ప్రజలు స్వేచ్ఛకోసం ఆందోళన ప్రారంభించారు. నిజాం దమన నీతిని చేపట్టి నిరంకుశంగా పాలనా యంత్రాంగాన్ని బిగించాడు. తనకు సహాయంగా “ఇత్తెహాదుల్ ముసల్మీన్‌” అనే మతసంస్థనొక దానిని సంపాదించాడు. మహమ్మదీయులు పాలకులని, హిందువులు పాలితులని నిజాం తమ సత్తాకు ప్రతీక అని ఆ సంస్థ ప్రచారం సాగించింది. ఈ మత సంస్థ రజాకార్లనే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. సంస్థానంలోకి ఇతర ప్రాంతాలలో మహమ్మదీయులను రప్పించి సంఖ్యను పెంచుకుంటూ పోయాడు.

సిడ్నీ కాటన్ వంటి విదేశీయుల సహాయంతో ఆయుధాలు సేకరించడం మొదలయింది. రహస్యంగా విమానాల ద్వారా ఆయుధాలు హైద్రాబాద్ చేరుతున్నాయి. హైద్రాబాద్‌లో కార్మాగారాలను ఆయుధాల ఫ్యాక్టరీలుగా మార్చివేశారు.  నిజాం తన సైనిక బలాన్ని వృద్ధిచేస్తూ మరొకవైపు భారత ప్రభుత్వంతో సంధి మంతనాలు ఆడుతున్నాడు. హిందువులపై ద్వేషం వెదజల్లుతూ “జిహాద్‌” (మతయుద్ధం) పేరిట అత్యాచారాలు సాగించాడు. రజాకార్లు స్వేచ్ఛగా లూటీలు, మానభంగాలు చేస్తూ భయావహమైన వాతావరణాన్ని సృష్టించారు.

విప్లవవీరుడు నారాయణబాబు

ద్వేషపూరితమైన ఈ విష వాతావరణంలో నారాయణబాబు అనే యువకుని రక్తం ఆవేశంతో పరవళ్ళు తొక్కింది. “మీ రక్తాన్ని ఇవ్వండి. స్వాతంత్య్రాన్ని ఇస్తాను” అనే సుభాష్ పిలుపు ఈ యువకున్ని ప్రేరేపించింది. హైద్రాబాద్‌లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అత్యాచారాలను దృఢంగా ఎదుర్కొనాలని నారాయణబాబు ఆలోచించసాగాడు. స్వతంత్ర హైద్రాబాద్ అనే హైద్రాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని అతను కృతనిశ్చయుడైనాడు.

ఈ ఆశయంతో మరో హైద్రాబాద్ యువకుడు తన వ్యక్తిగత హోదాలో పూర్వరంగాన్ని సృష్టిస్తున్నాడు. అతనే బాలకృష్ణ అనే తెనుగు యువకుడు. ఇతను స్వాతంత్య్రేచ్ఛతో నిజాం విమోచనోద్యమం లేవదీయాలని దేశంలో పలు ప్రాంతాలు పర్యటించాడు. పంజాబ్ తదితర ప్రాంతాలలో విప్లవకారులతో ఐదారు నెలలు గడిపి అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ హైద్రాబాద్‌లో సిద్ధిఅంబర్ బజార్‌లో “స్పెషల్ బాంబే టైలర్స్‌” అనే దుకాణం తెరచి రహస్య కార్యకలాపాలు ప్రారంభించాడు.

(విజయక్రాంతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here