Home News ఎన్.డి.ఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు గారి రాజకీయ ప్రస్థానం

ఎన్.డి.ఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు గారి రాజకీయ ప్రస్థానం

0
SHARE

ఆయన నోట పదాలు పరవళ్లు తొక్కుతాయి… మాటలు ముత్యాల దండల్లా మురిపిస్తుంటాయి..గుక్క తిప్పుకోని వాగ్ధాటి ఎంతటివారినైనా మంత్రముగ్ధులను చేస్తుంది…వేదిక ఏదైనా…సమయం…సందర్భం ఏవైనా సరే! విద్యార్థి దశలో పడిన నాయకత్వ లక్షణాలు అంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి దేశంలోనే రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి పదవికి ఆయనే సరైన వ్యక్తి అని గుర్తించే స్థాయికి చేర్చాయి. మారుమూల గ్రామం, రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవటానికి స్వీయ ప్రతిభే కారణం. కష్టాలెన్ని ఎదురైనా అచంచలమైన నిబద్ధత, నమ్ముకున్న పార్టీని చివరి వరకు అంటిపెట్టుకున్న క్రమశిక్షణ… ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచారు ముప్పవరపు వెంకయ్యనాయుడు.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవటపాళెేం మారుమూల గ్రామంలోని సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్యనాయుడు జన్మించారు. పసి ప్రాయంలోనే తల్లి చనిపోవటంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడి పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం నెల్లూరు వెళ్లటానికి సుమారు 6 కి.మీలు నడిచి వెళ్లాల్సి వచ్చింది. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్‌ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు.

విలక్షణ వ్యక్తిత్వం

ఎన్‌డీఏ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ఎంపికైన వెంకయ్యనాయుడిది విలక్షణమైన వ్యక్తిత్వం. ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మార్చుకునే ఆయన రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందారు. సమయస్ఫూర్తి, వాగ్ధాటి, లౌక్యం, మాటకారితనం, కష్టపడి పనిచేసే తత్వం ఈ స్థాయికి తీసుకెళ్లాయి. విద్యార్ధి దశ నుంచి నాలుగు రకాల ఉద్యమాలు వెంకయ్యని విభిన్న రాజకీయవేత్తగా మలిచాయి. విశాఖపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించేటప్పుడు.. జైఆంధ్రా ఉద్యమంలో కీలక భూమిక నిర్వహించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. విద్యార్ధి నేతగా ఆవిర్భవించారు. ఉద్యమంలో అరెస్టయి తొలిసారి జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్ధి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 17నెలలపాటు జైలులో ఉన్నారు. ఇవన్నీ ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి వేదికగా మారాయి. తొలిసారి 1977లో జనతా పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1978లో రాష్ట్రమంతటా ఇందిర ప్రభంజనం వీస్తే… నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి వెంకయ్య గెలుపొందారు. 1983లో ఎన్‌టీఆర్‌ ప్రభంజనంలోనూ అదే స్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు. 1984లో ఎన్‌టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కరరావు అధికారంలోకి వచ్చినప్పుడు… ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జరిగిన ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు. నాలుగు ఉద్యమాల్లోనూ వెంకయ్య నాయుడు ప్రసంగాలు అన్ని వర్గాల ప్రజల్ని ఉర్రూతలూగించాయి. 1987 డిసెంబర్‌ 31 నుంచి నాలుగు రోజులపాటు విజయవాడలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో 45నిమిషాలపాటు వెంకయ్య చేసిన ప్రసంగానికి సభికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. వేదికపైనున్న పార్టీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీలను ఇది అమితంగా ఆకర్షించింది. జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికి ఈ అంశమే దోహదపడింది. ఆపై పార్టీ జాతీయ నేతగా వివిధ పదవులు వెంకయ్యనాయుడును వరించాయి. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి ఉన్నప్పుడు భాజపా జాతీయ అధ్యక్షునిగా పనిచేసే అవకాశం వెంకయ్యకి లభించింది. పార్టీ రాజకీయాల్లో అదొక అత్యున్నత స్థాయి. వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధిశాఖని, మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధిశాఖ బాధ్యతలు చూడటం విశేషం. పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, రాజకీయంగా పీటముడులు విప్పాల్సి వచ్చినప్పుడు అందరి దృష్టి వెంకయ్యనాయుడుపైనే! ఎవరినీ నొప్పించిక వ్యవహారాలు చక్కబెట్టే వారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు.

‘ఒకసారి పరిచయమైతే పదేళ్ల తరువాత కలిసినా పేరు పెట్టి చనువుగా పిలిచేంత జ్ఞాపక శక్తి ఆయన సొంతం. ఇక కలిసి పనిచేస్తే దశాబ్దాల తరబడి ఎంత సన్నిహితంగా వ్యవహరిస్తారో మాటల్లో చెప్పలేం’ అని జైఆంధ్రా ఉద్యమంలో వెంకయ్యతో కలిసి పనిచేసిన విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. ‘ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా చిన్ననాటి మిత్రుల్ని మరవరు. ప్రతి సంక్రాంతికీ స్వర్ణభారతికి స్నేహితులు, శ్రేయోభిలాషులు, గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి రోజంతా గడుపుతారు. యోగక్షేమాలు తెలుసుకుంటారు. వివాదాలకు దూరంగా, నిరాడంబరంగా ఉంటారు’ అని రెండు దశాబ్దాలకు పైబడి వెంకయ్యతో సన్నిహిత సంబంధాలున్న స్వర్ణభారతి ట్రస్ట్‌ ఛైర్మణ్‌ విష్ణురాజు వ్యాఖ్యానించారు. ‘చేపట్టిన పదవికల్లా వన్నె తెచ్చారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా పర్యటనలప్పుడు మిత్రుల ఇళ్లలోనే బసచేసేందుకు, వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యమిచ్చే వారు. దిల్లీలో మనకు పెద్దదిక్కుగా ఉన్నారు’ అని ఆయనతో నాలుగు దశాబ్దాల అనుబంధమున్న ఏపీ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ‘జనం కోసం పని చేస్తున్న మనం ఎలాంటి ఉద్యమంలోనైనా వారికి ఇబ్బందిపెట్టే కార్యక్రమాల్ని తీసుకోవద్దనే వారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐకాస పిలుపిచ్చిన సందర్భాల్లో తప్ప మరెప్పుడూ వెంకయ్య మాటల్ని తుచ తప్పక ఆచరించాను’ అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు.

దక్షిణాది వారికి సహజంగా హిందీపై పట్టు తక్కువగా ఉంటుంది. కానీ, వెంకయ్యనాయుడు తెలుగుతో సమానంగా హిందీలో మాట్లాడగలిగేలా పట్టు సాధించారు. పల్లె నుంచి దిల్లీకి ఎదిగినా పుట్టిపెరిగిన గ్రామం, జిల్లాను మరువని అరుదైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు వెంకయ్యనాయుడు. ఆయన జీవిత పుస్తకంలోకి తొంగి చూస్తే జ్ఞాపకాల దొంతరలు ఎన్నో! ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావమే ఆయన్ను ఇంతటి వాడిని చేసింది. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వెంకయ్యనాయుడు పార్టీనే తల్లిగా భావించారు. ఈ విషయం పార్టీలోని ప్రతి కార్యకర్తకూ చెబుతూ స్ఫూర్తి నింపారు.

ప్రజాజీవిత ప్రస్థానం

1973-74: ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు

1974-75: లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ యువజన సంఘర్ష్‌ సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్‌

1977-80: జనతాపార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు

1978-83: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నిక

1980-83: ఏపీ భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి

1983-85: ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నిక (భాజపా శాసనసభపక్ష నేత)

1988-93: ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

1993-2000: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

1998: కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక. భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.

1998-99: హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ, వ్యవసాయ కమిటీల్లో సభ్యుడు.

2000-02: వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

2002-04: భాజపా జాతీయ అధ్యక్షుడు

2004: కర్ణాటక నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపిక

2014-: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి. కొన్నాళ్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు.

2016: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక

వ్యక్తిగత ఆసక్తి: వ్యవసాయం, సామాజిక సేవ, పత్రికల్లో రాజకీయాలు, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఆర్టికల్స్‌ రాయడం, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయం, వైద్యం, పశుసంరక్షణ, వృత్తి విద్యలో శిక్షణ కల్పించే వారికి స్ఫూర్తి నివ్వడం.

ప్రవృత్తి: పుస్తకాలు చదవడం. ప్రజలను చైతన్యపరుస్తూ స్ఫూర్తి నింపడం.

పర్యటించిన దేశాలు: అమెరికా, యూకే, మలేషియా, సింగపూర్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, నెదర్‌ల్యాండ్స్‌, ఆస్ట్రేలియా, మారిషస్‌, మాల్దీవ్స్‌, దుబాయ్‌, హాంకాంగ్‌, థాయిల్యాండ్‌, స్పెయిన్‌, ఈజిప్ట్‌, జర్మనీ

జీవిత విశేషాలు..

పేరు: ముప్పవరపు వెంకయ్యనాయుడు

జన్మస్థలం: చవటపాళెం, వెంకటాచలం మండలం,

నెల్లూరు జిల్లా

పుట్టిన తేదీ: 1949, జులై 1

తల్లిదండ్రులు: రంగయ్యనాయుడు, రమణమ్మ.

విద్యార్హతలు: బీఏ, బీఎల్‌.

విద్యాభ్యాసం: నెల్లూరు వీఆర్‌ కళాశాలలో డిగ్రీ, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా

సతీమణి: ఉష

పిల్లులు: కుమార్తె దీపా వెంకట్‌,

కుమారుడు హర్షవర్దన్‌

(ఈనాడు సౌజన్యం తో)