Home News రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయవలసిందే – డా. మోహన్ భాగవత్

రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయవలసిందే – డా. మోహన్ భాగవత్

0
SHARE

కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. అయోధ్య విషయమై విచారణ చేపట్టి ఒక నిర్ణయాన్ని త్వరితంగా తీసుకునేందుకు కోర్ట్ నిరాకరించడం, తమ ప్రాధామ్యాలు వేరని చెప్పడంతో చట్టం అనివార్యమవుతుందని ఆయన అన్నారు. కనుక చట్టం చేసే విధంగా ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రామమందిర నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడానికి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వహిందూ పరిషత్ ఆద్వర్యంలో నవంబర్, 25న ధర్మ సభలు జరిగాయి.

విదర్భలో జరిగిన హూంకార్ సభలో ఆయన మాట్లాడారు. 1992 సంవత్సరంలో కూడా అప్పటి  ప్రభుత్వం, కోర్ట్ ల వైఖరితో విసుగుచెందిన హిందువులు వివాదాస్పద కట్టడాన్ని కూల్చేశారని ఆయన గుర్తుచేశారు. 2003లో వివాదాస్పద కట్టడం క్రింద పురాతన హిందూ మందిరం ఉందని భారతీయ పురాతత్వ శాఖ తేల్చిందని, అక్కడ మందిరం ఉండేదని తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకుని హిందువులకు అప్పగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత ఆ మాట మరచిపోయిందని డా.మోహన్ భాగవత్ అన్నారు.

2010లో రామనజన్మభూమిలో మందిరం ఉండేదని స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్ట్ సున్నీ వక్ఫ్ బోర్డ్ పిటిషన్ ను కొట్టివేసినా ఆ స్థలాన్ని ముగ్గురికి కేటాయిస్తూ నిర్ణయాన్ని ప్రకటించిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి ఏడేళ్లు తీసుకున్న సుప్రీం కోర్ట్ చివరికి  ఏ నిర్ణయం ప్రకటించకుండానే విచారణ వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఆ చట్టం కోసం ప్రజా ఉద్యమం అవసరమని ఆయన అన్నారు. 1980 నుండి రామమందిర ఉద్యమాన్ని నిర్వహించిన వారే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని చేపడతారని ఆయన స్పష్టం చేశారు.

విదర్భతో పాటు అయోధ్య, నాగపూర్, మంగళూర్, హుబ్లీ, గౌహతి మొదలైన ప్రదేశాల్లో కూడా ధర్మ సభలు జరిగాయి. ఇందులో పాల్గొన్న సాధుసంతులు రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో కోర్టు తగిన నిర్ణయం తీసుకోవడంలేదుకనుక ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

అయూధ్యలో జరిగిన ధర్మ సభలో రామజన్మభూమి న్యాస్ అధ్యక్షులు మహంత్ నృత్యగోపాల్ దాస్, రామానందాచార్య రామభద్రాచార్యజీ, స్వామి హంసదేవాచార్య, వాసుదేవాచార్య, ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ కృష్ణగోపాల్, విశ్వహిందుపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ చంపత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. రామజన్మభూమి స్థలాన్ని విభజించడాన్ని హిందూ సమాజం అంగీకరించలేదని వక్తలు స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం తప్ప మారేదీ అంగీకారయోగ్యం కాదని తేల్చిచెప్పారు.

హుబ్లీలో జరిగిన సభలో శ్రీ పూజ్య మహా మండలేశ్వర్ స్వామి అఖిలేశ్వరానంద్ గిరి జీ మహరాజ్, స్వామి బసవలింగ మహస్వామి, పూజ్య శ్రీశ్రీశ్రీ సిద్ధ శివయోగిజీ, జైన్ ముని జ్యోతిషాచర్యలతో పాటు విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటనామంత్రి శ్రీ కేశవ హెగ్డే, ప్రాంత సంఘటనామంత్రి శ్రీ కేశవ రాజులు పాల్గొన్నారు. చట్టం ద్వారా రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇక అన్నీ రాజకీయ పక్షాలు హిందువులు మనోభావాలను గౌరవించవలసిందేనని స్పష్టం చేశారు.

మంగళూరు ధర్మ సభలో పూజ్య శ్రీ వీరేంద్ర హెగ్డే, బజారంగ్ దళ్ అఖిల భారత సంయోజక్ శ్రీ సోహాన్ సింహ్ సోలంకీ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిరం తప్ప మరొకటి అంగీకరించేది లేదని, మందిర నిర్మాణం గురించి ఇక ఎంతమాత్రం నిరీక్షించే అవకాశం కూడా లేదని బజారంగ్ దళ్ నేత సోహాన్ సింహ్ సోలంకి స్పష్టం చేశారు. మందిర నిర్మాణం కోసం సాధుసంతుల మార్గదర్శనంలో పనిచేసేందుకు బజారంగ్ దళ్ కార్యకర్తలు సిద్దంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

విధర్బలో జరిగిన విశ్వహిందూ పరిషత్ హూంకార్ సభలోని డా. మోహన్ భాగవత్ ప్రసంగం