Home News నేపాల్ దుస్సాహసం: భారత్ పై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

నేపాల్ దుస్సాహసం: భారత్ పై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

0
SHARE

చైనాతో భారత్ సరిహద్దు వివాదం మరోసారి తెరమీదకు వచ్చిన నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత భూభాగాలను తమ దేశంలోని ప్రదేశాలుగా చూపిస్తూ నూతన భూగోళ పటాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని  కేపీ ఓలీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్‌లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని, ఈ వైరస్ తమ దేశంలో వ్యాపించడానికి భారతే కారణమన్నారు. భారత్‌లోని లిపులేఖ్, కాలపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్ కి చెందినవేనని పేర్కొన్న ప్రధాని ఓలీ.. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు.

నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. నేపాల్ చేసిన ఈ వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, నేపాల్‌తో చైనానే ఈ మాటలు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు

మే 11న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మానస సరోవర్‌ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం  ఉత్తరాఖండ్‌ మీదుగా లిపులేఖ్‌ వరకూ నిర్మించిన రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్‌.. ఆ దేశంలోని భారత రాయబారికి నోటీసులు జారీ చేసింది.

నేపాల్ తీరుపై భారత ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఈ అంశంపై మాట్లాడుతూ.. నేపాల్‌ ప్రభుత్వ ఏకపక్ష చర్యను అంగీకరించబోమని, ఈ అంశంపై భారత్‌ వైఖరి ఏమిటో నేపాల్‌కు స్సష్టమైన అవగాహన ఉందని అన్నారు. భౌగోళిక రేఖలను వక్రీకరిస్తూ తయారుచేసిన ఇటువంటి పటాలు విడుదల చేయడం ఆపేయాలని నేపాల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, నేపాలీ అధినాయకత్వం సానుకూల వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం అని భారత్ హితవు పలికింది.

200 ఏళ్ల నాటి వివాదం:
భారత్‌-నేపాల్‌-చైనా సరిహద్దులో గల లిపులేఖ్‌ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత్‌ తరఫున సంతకాలు చేయగా… ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్‌ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here