Home News నేతాజీ అంగరక్షకుడు కల్నల్‌ నిజాముద్దీన్‌ మృతి

నేతాజీ అంగరక్షకుడు కల్నల్‌ నిజాముద్దీన్‌ మృతి

0
SHARE
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు అంగరక్షకుడిగా, డ్రైవర్‌గా పనిచేసిన కల్నల్‌ షేక్‌ నిజాముద్దీన్‌ అలియాస్‌ సైఫుద్దీన్‌ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 116 ఏళ్లు. ఆయనకు భార్య షేక్‌ హబీబున్నీసా, ఏడుగురు పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనల అనంతరం కుటుంబసభ్యులు ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. యూపీలోని ఆజంగఢ్‌ జిల్లా ధక్వా గ్రామంలో 1900లో జన్మించిన నిజాముద్దీన్‌ 1943 ఆరంభంలో తండ్రికి తెలియకుండా బ్రిటిష్‌ నియంత్రణలోని భారత సైన్యంలో చేరారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఓ ఆంగ్లేయ అధికారిని కాల్చి చంపిన నేరం నుంచి తప్పించుకునేందు కు సింగపూర్‌ పారిపోయారు.

 1943లో నేతాజీ జర్మనీ నుంచి సింగపూర్‌ వ చ్చి ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ను పునరుద్ధరించి ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదానికి ఆకర్షితుడైన నిజాముద్దీన్‌ ఐఎన్‌ఏలో చేరారు. షేక్‌ సైఫుద్దీన్‌గా పేరు మార్చు కున్న నిజాముద్దీన్‌ నిబద్ధత, కార్యదక్షతకు ముగ్ధుడైన నేతాజీ తన డ్రైవర్‌గా నియమించుకున్నారు. బోస్‌ వాడిన 12 సిలిండర్ల వాహనాన్ని నిజాముద్దీన్‌ నడుపుతూ, అంగరక్షకుడిగానూ, వ్యక్తిగత సహాయకుడిగానూ సేవలందించా రు. గత ఏడాది చివర్లో బ్యాంకు ఖాతా తెరిచి నిజాముద్దీన్‌ దేశంలోనే అత్యధిక వయసులో ఖాతా తెరిచిన వ్యక్తిగా నిలిచారు. భూమిపై జీవించి ఉన్న అత్యధిక వయస్కుడిగానూ కల్నల్‌ నిజాముద్దీన్‌ రికార్డు సృష్టించారు.
బోస్‌ను కాపాడిన ధీరుడు!

1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే వాదనను నిజాముద్దీన్‌ కొట్టిపారేశారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారన్నారు. ప్రమాదం జరిగిన 3, 4 నెలల తర్వాత నేతాజీని తానే బర్మా-థాయ్‌లాండ్‌ సరిహద్దుల్లోని సీతాంగపూర్‌ నది వద్ద వదిలిపెట్టానని నిజాముద్దీన్‌ గతంలో తెలిపారు. 1943లో బ్రిటిష్‌ సైన్యంతో పోరాడుతూ బర్మా యుద్ధ క్షేత్రంలో ఓ సారి నేతాజీని హత్యాయత్నం నుంచి కాపాడారు. చెట్ల పొదల నుంచి బోస్‌ వైపు గురి పెట్టిన ఒక తుపాకీకి అడ్డుపడిన నిజాముద్దీన్‌ ఆయనను రక్షించి గాయాలపాలయ్యారు. ఈ ఘటన తర్వాత నుంచి నేతాజీ ఆయనకు ‘కల్నల్‌’ అని కితాబు ఇచ్చారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో )