Home Telugu Articles జ‌న‌వ‌రి 19.. కాశ్మీరీ పండిట్‌లకు కాళరాత్రి

జ‌న‌వ‌రి 19.. కాశ్మీరీ పండిట్‌లకు కాళరాత్రి

0
SHARE

– కల్నల్‌ తేజ్‌కుమార్‌ టికో

జమ్మూకాశ్మీర్‌లో పనిచేసిన కల్నల్‌ తేజ్‌కుమార్‌ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్‌లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కాశ్మీరీ పండిట్‌లపై జరిగిన దాడుల గురించి టికో అందించిన ప్రత్యక్ష కథనాన్ని ఇక్కడ ఇస్తున్నాం….

జనవరి 4,1990 స్థానిక ఉర్దూ పత్రిక ఆఫ్తాబ్‌లో ఒక ప్రకటన ప్రచురితమైంది. హిజిబ్‌ ఉల్‌ ముజాహిదీన్‌ ఆ ప్రకటన లో ఒక హెచ్చరిక చేసింది. కాశ్మీరీ పండిట్‌లో వెంటనే లోయను వదిలి వెళిపోవాలన్నది ఆ ప్రకటన సారాంశం. మరొక స్థానిక ఉర్దూ పత్రిక అల్‌ సఫాలో కూడా అదే ప్రకటన ప్రచురితమైంది. ఈ హెచ్చరికల తరువాత ఎకె 47 తుపాకులు పట్టుకున్న జిహాదీలు వీధుల్లో కవాతులు చేశారు. కాశ్మీరీ పండిట్‌లపై దాడులు ప్రారంభమయ్యాయి. బాంబు పేలుళ్ళు, తీవ్రవాద దాడులు నిత్యకృత్యాలయ్యాయి.

మసీదుల నుంచి ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రసంగాలు పెరిగిపోయాయి. ఇలాంటి ప్రసంగాలు ఉన్న వీడియో క్యాసెట్లు లోయ అంతటా విరివిరిగా పంపిణీ అయ్యాయి. ఇదంతా అప్పటికే భయభ్రాంతులకు లోనవుతున్న కాశ్మీరీ పండిట్‌లలో మరింత భయాన్ని కలిగించడానికేనని వేరుగా చెప్పనవసరంలేదు. ఆనాటి పరిస్థితుల గురించి జమ్మూ కాశ్మీర్‌ పోలీస్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌  ఎం.ఎం ఖజూరియా ఇలా వివరించారు – ”కాశ్మీర్‌లోని మైనారిటీ వర్గానికి(హిందువులు) చెందిన ప్రముఖులకు లోయ వదిలిపోవాలంటూ (కొందరు) హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని ఉద్దేశించిన లేఖలో ఇలా హెచ్చరించారు ‘మీరు వెంటనే కాశ్మీర్‌ వదిలిపోవాలని మేం ఆదేశిస్తున్నాం. అలా వెళ్ళకపోతే మీ పిల్లలకు చెడు జరుగుతుంది. మిమ్మల్ని మేం భయపెట్టడం లేదు. ఇది ముస్లిముల భూమి. అల్లా భూమి. సిక్కులు, హిందువులు ఇక్కడ ఉండడానికి వీలులేదు.’ లేఖ చివర ఇంకా ఇలా ఉంది ‘మా ఆదేశాల్ని ఖాతరు చేయకపోతే మీ పిల్లలతోనే ప్రారంభిస్తాం. కాశ్మీర్‌ విముక్తి జిందాబాద్‌’ ”

లోయలోని దాదాపు 1100 మసీదుల నుంచి ఈ నినాదమే పదేపదే వినిపించేది. దీనితో అల్లరి మూకలు జిహాద్‌కు సిద్ధమయ్యాయి. వాళ్ళు కార్యాచరణ ప్రారంభించారు. జనవరి 5, 1990 శ్రీనగర్‌లో ఎం.ఎల్‌ భాన్‌ అనే ప్రభుత్వోద్యోగిని చంపేశారు. అదే రోజు లాల్‌చౌక్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న బలదేవ్‌రాజ్‌ దత్‌ను కిడ్నాప్‌ చేశారు. నాలుగురోజుల తరువాత అతని మృతదేహం నయీ సరక్‌ దగ్గర లభించింది. అతన్ని తీవ్రంగా హింసించి చంపినట్లు శవంపై అనేక గాయాల గుర్తులు కనిపించాయి.

జనవరి 19 కాళరాత్రి

ఆఫ్గన్‌పాలన తరువాత ఏనాడూ ఎదురుకాని భయానకమైన, దారుణమైన అనుభవాలు కాశ్మీరీ పండిట్‌లు ఆ రాత్రి చూశారు. ఆనాడు తాము పొందిన భయం, ఆందోళన వారు ఎప్పటికీ మరచిపోలేరు. జిహాదీల క్రూరత్వం, నిర్దాక్షిణ్యమైన దాడులు తరతరాల వరకు వారికి గుర్తుండిపోతాయి. దాడులు చేయడానికి జిహాదీలు ‘అనువైన’ సమయాన్నే ఎంచుకున్నారు. ఏ మాత్రం ప్రభావం చూపలేని ఫరూక్‌అబ్దుల్లా ప్రభుత్వం రాజీనామా చేసింది. జగ్‌మోహన్‌ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకునేందుకు వచ్చారు. సరిగ్గా అంతకు ముందు రాత్రే ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు రోజే శ్రీనగర్‌ చేరుకోవాలని ఆయన ప్రయత్నించారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో పీర్‌పంజాల్‌ లోయ నుంచి ఆయన విమానం తిరిగి జమ్మూకు వెళిపోయింది. శాంతిభద్రతలను కాపాడేందుకు శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించినప్పటికీ దాని ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. కర్ఫ్యూని లెక్కచేయకుండా పండిట్‌లకు వ్యతిరేకంగా జిహాద్‌ సాగించడానికి సన్నద్ధంకావాలంటూ మసీదుల నుంచి సందేశాలు వస్తూనే ఉన్నాయి. ఆయుధాలు ధరించిన జెకెఎల్‌ఎఫ్‌ తీవ్రవాదులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

చీకటి అవుతున్నకొద్దీ లోయలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జాగ్రత్తగా ఎంచుకున్న నినాదాలతో జిహాదీలు మైనారిటీ వర్గాన్ని భయానికి గురిచేశారు. లోయ అంతా జిహాదీల యుద్ధనినాదాలతో నిండిపోయింది. ‘బానిసత్వపు’ సంకెళ్ళు తెంచుకోవాలంటూ ‘ప్రబోధించే’ నినాదాలు, పాటలు మారుమోగాయి. జిహాద్‌కు సిద్ధంకావాలంటూ సాధారణ ముస్లిములను రెచ్చగొట్టాయి. ఈ నినాదాలలో పండిట్‌లకు నేరుగా హెచ్చరికలు ఉన్నాయి. ఇస్లాంను కాపాడుకోవాలనే  ఆదేశాలు ఉన్నాయి. కాఫిర్లకు మూడు ప్రత్యామ్నాయాలు సూచించారు జిహాదీలు. అవి – ‘ఇస్లాం లేదా కాశ్మీర్‌ వదిలిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం’. వేలాది మంది కాశ్మీరీ ముస్లిములు వీధుల్లోకి వచ్చారు. ‘భారత్‌ వినాశనం’, ‘కాఫిర్ల నాశనం’ అంటూ నినాదాలు చేశారు.

ఈ నినాదాలు మసీదులలోని లౌడ్‌స్పీకర్ల ద్వారా లోయ అంతటా ప్రతిధ్వనించాయి. పురుషులంతా ఈ జిహాద్‌లో పాల్గొనాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని కలిగించడం వెనుక జిహాదీల లక్ష్యం ఒక్కటే – మైనారిటీ వర్గం వారిలో ప్రాణభయాన్ని కలిగించడం. అప్పటివరకు భారతీయ మీడియా వర్ణిస్తూ వచ్చిన కాశ్మీరీ ముస్లిముల సెక్యులర్‌, సహనశీల, విశాల దృక్పధం ఆనాటి అరాచక, ఉద్రిక్త వాతావరణంలో ఎక్కడా కనిపించలేదు.

కాశ్మీరీ పండిట్‌లు అసలు ఎవరో కూడా తెలియదన్నట్లు సాధారణ ముస్లిములు కూడా వ్యవహరించారు. పండిట్‌లను హతమార్చాలి లేదా తరిమికొట్టాలనే అరాచక ధోరణే అందరినీ ఆవహించింది.

బ్రిటిష్‌ పాలన తరువాత మొట్టమొదటసారి కాశ్మీరీ పండిట్‌లు తమ స్వస్థలంలోనే ఏకాకులుగా, రక్షణలేనివారుగా మిగిలారు. చుట్టూ హింసాత్మక మూకలతో ఇళ్ళలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. జిహాదీల రూపంలో అసహనశీల ఇస్లాంను వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. కాశ్మీరీ సంస్కృతి అంటూ ప్రచారం చేసిన విలువలు, ఆ కాశ్మీరియత్‌ వారికి కనిపించకుండా పోయాయి.

చేష్టలుడిగిన కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. ఆదేశాలు లేకపోయినా అలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సిన పారామిలటరీ, సైన్యం కదలలేదు. కొద్దిపాటి అధికార యంత్రాంగం (శీతాకాలం దృష్ట్యా నవంబర్‌లోనే రాజధానిని కాశ్మీర్‌ నుంచి జమ్మూకు మార్చారు.) వేలసంఖ్యలో ఉన్న అల్లరిమూకలతో తలపడలేమనే నిర్ణయానికి వచ్చేసింది. ఇక ఢిల్లీ చాలా చాలా దూరంలో ఉంది.

వందలాదిమంది కాశ్మీరీ పండిట్‌లు తమను కాపాడాలంటూ జమ్మూ, శ్రీనగర్‌, ఢిల్లీల్లోని ప్రతి అధికారికి ఫోన్లు చేసి వేడుకున్నారు. కానీ వారి వేడుకోళ్ళన్నీ వ్యర్థమయ్యాయి. ఒక్క సైనికుడు కూడా వారిని రక్షించేందుకు ముందుకు రాలేదు. దానితో ఆ రాత్రి గడిస్తే చాలునని ప్రార్థిస్తూ పండిట్‌లు ఎవరి ఇళ్ళలో వాళ్ళు నిద్ర కూడా లేకుండా భయంతో గడిపారు. ఆ రాత్రి గడిస్తే చాలు తాము లోయను వదిలిపోవాల్సిందేనని వాళ్ళకు తెలిసిపోయింది. లేకపోతే టిక్కాలాల్‌, టప్లూ మొదలైనవారికి పట్టిన గతే తమకూ పడుతుందని వాళ్ళు గ్రహించారు. తెల్లవారిన తరువాత కూడా జిహాదీ నినాదాలు ఆగలేదు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి – ‘ కాఫిర్‌లారా కాశ్మీర్‌ వదిలిపొండి’, ‘ఓ ముస్లిములారా మేల్కొనండి, కాఫిర్‌లారా పారిపొండి’, ‘ఇస్లాం మా లక్ష్యం, ఖురాన్‌ మా రాజ్యాంగం, జిహాద్‌ మా జీవనవిధానం’, ‘కాశ్మీర్‌ పాకిస్థాన్‌ అవుతుంది’, ‘భయాన్ని కలిగించేవిధంగా కలష్నికోవ్‌లను ఝుళిపించండి’, ‘షరియత్‌ ప్రకారమే పాలనసాగాలి’, ‘పీపుల్స్‌లీగ్‌ సందేశం ఏమిటి – విజయం, స్వేచ్ఛ, ఇస్లాం’.

First Published On 19.01.2020