Home News నిఖా ముసుగులో ముస్లిం అమ్మాయిలతో వ్యభిచారం

నిఖా ముసుగులో ముస్లిం అమ్మాయిలతో వ్యభిచారం

0
SHARE
  • గల్ఫ్‌లో నరక కూపంలో ఇరుక్కున్న పాతబస్తీ మహిళలు
  • డబ్బు కోసం భార్యలతో అనధికారికంగా వ్యభిచారం చేయిస్తున్న భర్తలు
  • ఆదుకునేవారు లేక అల్లాడుతున్న బాలికలు
  • ఎదురు తిరిగితే దొంగతనం నేరం కింద జైలుకే
  • వారికి విముక్తి కల్పించేందుకు హైదరాబాద్‌ పోలీసుల ప్రయత్నాలు

అభం శుభం తెలియని చిన్నారులు వారు. పెళ్లి పేరుతో గల్ఫ్‌కు తీసుకువెళ్లారు. వందల మంది చిన్నారుల చేత అక్కడ అనధికారికంగా వ్యభిచారం చేయిస్తున్నారు. కట్టుకున్న భర్తలే వీరిని 15 రోజులకొకరికి అప్పగించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఆదుకునే వారు లేక ఆ బాలికలు నెలల తరబడి వ్యభిచార నరకకూపంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిని గుర్తించి, గల్ఫ్‌ దేశాల సహకారంతో మన దేశానికి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒమన్‌లాంటి దేశం మాత్రం తమ దేశ పౌరులు హైదరాబాద్‌లో చేసుకున్న పెళ్లిళ్లను సమర్థిస్తున్నాయి. ‘మా వాళ్లేం తప్పుచేశారు. వారిని ఎందుకు అరెస్టుచేశారు? అంటూ ఆ దేశ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ అవాంతరాలను అధిగమించి హైదరాబాద్‌ ఆడపడుచులను ఇక్కడికి తీసుకురావడానికి పోలీసులు అన్ని ఆధారాలను సంపాదించే పనిలో ఉన్నారు.

వందల మంది బతుకు నాశనం

హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మైనర్‌ బాలికల్ని నిఖా చేసుకోవడానికి వచ్చిన అరబ్‌ షేక్‌లతోపాటు దాదాపు 20 మందిని పోలీసులు ఇటీవల అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక భూమికను పోషించిన ముంబయి ఖాజీ పరిదీ అహ్మద్‌ ఖాన్‌, హైదరాబాద్‌ ఖాజీ అబ్దుల్లా రఫై కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. వారం రోజుల కిందట మహారాష్ట్ర పోలీసుల తోడ్పాటుతో ముంబయిలోని ఖాజీ ఇంటిపై దాడిచేసి ఈ పెళ్లిళ్లకు సంబంధించిన రికార్డుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.

దాదాపు 27 ఏళ్ల నుంచి ఈ ఖాజీ తప్పుడు ధ్రువపత్రాలతో వందల మంది ముస్లిం బాలికలను అరబ్‌ షేక్‌లకు అప్పగించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఈ పెళ్లిళ్లను మైనారిటీ సంక్షేమ శాఖ ఆమోదించాల్సి ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిఖాలకు ఆమోదం తెలిపినట్లు ముంబయి ఖాజీ తప్పుడు పత్రాలను సృష్టించాడు. మైనర్లను మేజర్లుగా మార్చే ప్రతాలను కూడా అతనే తయారుచేశాడని విచారణలో తేలింది. ఇలా దాదాపు 500 పెళ్లిళ్లకు పైగా చేశాడని వెలుగులోకొచ్చింది. ఇలా వివాహం చేసుకున్న మైనర్‌ బాలికలంతా ఎక్కడున్నారని పోలీసులు ఆరా తీశారు. వీరిలో 200 మంది వరకు ఇక్కడే ఉండగా.. మిగతా 300 మంది అరబ్బు దేశాల్లో ఉన్నారని తేలింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, షార్జా, అబుదాబి, ఖతార్‌, ఒమన్‌, సూడాన్‌ తదితర దేశాల్లో ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మహిళలే చెప్పారు..

పాతబస్తీకి చెందిన కొందరు మహిళల్ని పోలీసులు విచారిస్తే.. నిఖా చేసుకుని అరబ్బు దేశాలకు తీసుకువెళ్లిన మైనర్లు అక్కడ దారుణాతి దారుణంగా ఉన్నారన్న విషయం వెలుగులోకొచ్చింది. మైనర్ల నిఖా కోసం అరబ్బు షేక్‌లు దాదాపు రూ.4 లక్షల వరకు హైదరాబాద్‌లో ఖర్చు పెట్టి తీసుకువెళుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత నెల రోజులపాటు ఈ మైనర్‌ బాలికతో కాపురం చేస్తున్నారు. ఆ తరువాత ఆ బాలికను అనధికారికంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో మహిళలు వ్యభిచారం చేస్తే తీవ్రంగా శిక్షిస్తారు. అందువల్ల ఈ బాలికలను రహస్యంగా తమకు తెలిసిన వారికి, 15 రోజులకు ఒకరికి అప్పగించి.. వారి నుంచి డబ్బు తీసుకుంటున్నారు. కొందరు పాతబస్తీ మహిళలు ఇలాంటి కూపంలోనే మగ్గుతున్నారని పోలీసు విచారణలో తేలింది. ఇలా ఒక్కో మహిళ ద్వారా రూ.లక్షల్లోనే ఈ షేక్‌లు సంపాదిస్తున్నారని తేలింది. ఎదురుతిరిగిన వారిని చిత్రహింసలకు గురిచేసి… దొంగతనమో ఇతరత్రా నేరమో మోపి, జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని వెలుగులోకొచ్చింది.

అరబ్బు దేశాలను ఒప్పించి….

ముంబయి, హైదరాబాద్‌ ఖాజీల ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అరబ్బుషేక్‌ల నిఖాలపై సమగ్ర నివేదికను తయారుచేసి విదేశాంగ శాఖ ద్వారా అరబ్బు దేశాలకు పంపించి, అక్కడి వ్యభిచారం కూపంలో ఉన్న పాతబస్తీ మహిళల్ని ఇక్కడికి రప్పించేందుకు ప్రణాళికను రూపొందించారు.

సమర్థించుకుంటున్న ఒమన్‌

తమ దేశ పౌరులను హైదరాబాద్‌లో అరెస్టు చేయడంపై ఒమన్‌ దేశం అధికారికంగా స్పందించింది. రికార్డుల ప్రకారం చూస్తే 22 ఏళ్ల బాలికను వారి తల్లిదండ్రుల అనుమతి మేరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? అని ఒమన్‌ అధికారి ఒకరు హైదరాబాద్‌ పోలీసుల్ని ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి ఇక్కడి పోలీసులు తీవ్రంగా స్పందించారు. ‘‘మీ దేశానికి చెందిన షేక్‌ పెళ్లి చేసుకున్న బాలిక వయస్సు కేవలం 18 ఏళ్లే. ఆమె వయస్సు 22 ఏళ్లు అంటూ నకిలీ పత్రాలు సృష్టించారు. పైగా తెలంగాణ మైనారిటీ శాఖ ఈ నిఖాకు ఆమోదం తెలియజేయలేదు. ఆమోదించినట్లు ఖాజీ ఇచ్చినది తప్పుడు పత్రం. ఈ అక్రమాలకు మీ దేశ పౌరుడే కారణం. ఏ విధంగా చూసినా ఇది నేరమే’’ అని ఒమన్‌ దేశానికి మన పోలీసులు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఒమన్‌ స్పందన నేపథ్యంలో- ఇప్పటి వరకు జరిగిన అన్ని నిఖాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినవేనని మిగతా అరబ్బుదేశాలకు వివరించడం కోసం పూర్తి ఆధారాలతో నివేదికను ఆయా దేశాలకు పంపించబోతున్నారు. ఈ షేక్‌ల అక్రమ పెళ్లిళ్లను వీడియో ఆధారాలతో సహా పంపనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లేఖల్ని కూడా వీటికి జతచేయబోతున్నారు. తద్వారా అక్కడ వ్యభిచారంలో మగ్గుతున్నవారిని తీసుకురాబోతున్నారు.

వారిని ఆదుకుంటాం

ముంబయి, హైదరాబాద్‌ ఖాజీలు తప్పుడు పద్ధతుల్లో మైనార్‌ బాలికలకు నిఖా చేసి వందల మందిని విదేశాలకు పంపించారు. అక్కడ వందల మంది వ్యభిచారంలో మగ్గుతున్నారని మా దృష్టికి వచ్చింది. వీరందరినీ గుర్తించి ఆ దేశాల సహకారంతో హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రణాళికను రూపొందించాలని కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. దీనికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. పాతబస్తీలో ఇటువంటి పెళ్లిళ్లు జరగకుండా అనేక మందిపై కఠిన చర్యలు తీసుకున్నాం.

– వి.సత్యనారాయణ, దక్షిణ మండలం డీసీపీ

(ఈనాడు సౌజన్యం తో)