Home Hyderabad Mukti Sangram ఇస్లాం ముసుగులో స్వతంత్రంగా ఉండాలని నిజాం తీవ్ర ప్రయత్నాలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-10)

ఇస్లాం ముసుగులో స్వతంత్రంగా ఉండాలని నిజాం తీవ్ర ప్రయత్నాలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-10)

0
SHARE

శీఘ్రగతిని మారిపోతున్న రాజకీయ పరిస్థితులలో నిజాం తన మతం అనే ముసుగులో స్వతంత్రంగా ఉండాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన యొక్క ఇస్లాం మూఢభక్తి, రాచరికమైన కటుత్వం అతనే రచించిన ఈ పద్యపాదాలలో వ్యక్తమవుతుంది.

“సలాతీనే సల్ఫ్ సబ్ హోగయే నజరె అజల్ ఉస్మాన్
ముసల్మానోంకా తేరీ సల్తనత్ సేహై నిశాన్ బాకీ”

(ఇస్లాం సామ్రాజ్యాలు రాజకీయ పరిణామాలకు బలి అయిపోయాయి. కాని ఈనాడు హే ఉస్మాన్! నీ రాజ్యమే ముస్లింలకు గుర్తుగా మిగాలిపోయింది.)

“బంద్ నాఖూస్ హువా సున్‌కే నారాఏ తకిబీర్
జల్‌జలా ఆహీ గయా రిశ్త ఏ జున్నార్‌పర్‌”

(అల్లాహో అక్బర్ ఉద్ఘోషవల్ల శంఖనాదాలు ఆగిపోయాయి. యజ్ఞోపవీతాలు ధరించిన వాళ్ళపై ప్రళయం వచ్చినట్లుంది.)

స్వతంత్ర భారత్‌లో విలీనం కావటం తనకు అవమానమని రాచరిక గౌరవానికి భంగకరమని భావించాడు నిజాం. రాజ్యాంగ సలహాల కోసం ప్రత్యేకించి ఇంగ్లండ్ నుండి ప్రఖ్యాత న్యాయవాది మాలకన్‌ను అన్ని ఖర్చులు భరించి పిలిపించాడు. అతనికి ప్రతిరోజూ ఫీజు కింద విడిగా లక్షరూపాయలు చెల్లించాడు. తన పన్నాగానికి ఆధారంగా ముస్లిం ప్రజల్లో ఇస్లాం మతావేశాన్ని రేకెత్తించాడు. తన సంస్థానం చుట్టూ స్వతంత్ర భారత రాష్ట్రాలు ఉండడం  ప్రమాదకరం. కావున తనకు రేవు పట్టణం అవసరం. అందుకు పోర్చుగీసు ప్రభుత్వం నుండి గోవాను ఖరీదు చేయాలనే ఆలోచన కూడా చేశాడు.

తన కాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న భారత ప్రభుత్వ వైఖరిని నిజాం గ్రహించాడు. తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన భారత సైన్యంతో తలపడటం సాధ్యం కాదు. అందువల్ల కొత్త ప్రయత్నాలు ప్రారంభించాడు.

గెరిల్లా పోరాట పద్ధతిలో భారత సైన్యాన్ని ఎదుర్కోవడానికి తన సైనికుల సంఖ్యను పెంచసాగాడు. అవసరమైన ఆయుధాలను విదేశాల నుండి తెప్పించుకోవాలని తన సంస్థానంలోనే మరికొన్ని ఆయుధాలను తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సెకెండ్ ఫ్రంట్‌గా రజాకార్ల దళాన్ని నిర్మించాడు. తన సరిహద్దుల రక్షణకు పఠాన్‌లు ప్రత్యేకించి చేర్చుకున్నాడు. విమానాల ద్వారా రహస్యంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. బీదర్, వరంగల్, రాయచూర్‌లలో విమాన స్థావరాలను పునర్నిర్మించాడు.

హైదరాబాద్ సంస్థానంలో హిందువుల సంఖ్యతో సమంగా ముస్లింల జనసంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది ముస్లింలను ఎన్నో ఆశలు చూపించి ఆకర్షించాడు. మతం మార్పిడిని ప్రోత్సహించాడు. హరిజనులకు  సవర్ణులకు మధ్య తగాదాలు సృష్టించి, హరిజనులకు  హిందువులకు మధ్యలో కల్లోలాలను సృష్టించాడు. రజాకార్లు ఇష్టానుసారం దోపిడీలు, గృహదహనాలు, మానభంగాలు చేయడం ప్రారంభించారు. నిజాం తన మంత్రివర్గంలో విశ్వాసపాత్రులైన హిందువులను ఉంచాడు. భారతప్రభుత్వం అనుకూలంగా ఎన్ని సూచనలు చేసినా తిరస్కరించి తన పన్నాగాలు కొనసాగించాడు.

ఏజెంట్ జనరల్

ఈలోగా భారత ప్రభుత్వం తన ప్రతినిధిగా ఏజెంట్ జనరల్ హోదాలో శ్రీ కె.యం. మున్షీని హైద్రాబాద్ పంపించింది. ఆయనపట్ల నిజాం వ్యవహరించిన తీరు ముందే తెలుసుకున్నాం. మున్షీ అసలు అంతరార్థాన్ని పసిగట్టారు. స్థానికంగా ఉన్న కొందరు యువకుల సహాయంతో నిజాం చేస్తున్న పన్నాగాలను బట్టబయలు చేయాలని నిశ్చయించుకున్నారు. హైద్రాబాద్‌లో అప్పుడు న్యాయవాదిగా ఉన్న శ్రీ వినాయక్‌రావ్ విద్యాలంకార్ ప్లీడర్ ప్రొటెస్ట్ కమిటీ అధ్యక్షులు. ఆయనతో మున్షీగారు సలహా సంప్రదింపులు జరిపారు. నిజాం వ్యవహారాన్ని, రహస్యాల్ని లాగడానికి గూఢచారులుగా శ్రీ వందేమాతరం సోదరుల్ని ఉపయోగించుకొనడం సముచితంగా ఉండగలదని శ్రీ వినాయకరావు సూచించారు. వందేమాతరం సోదరులలో శ్రీ వీరభద్రరావు పెద్దవారు, తమ్ముడు శ్రీ రామచంద్రరావు.

ఒకసారి ఆయన ‘వందేమాతరం’ అని నినాదం చేసినందుకు నిజాం పోలీసులు బెత్తంతో కొట్టారు. అయినా రామచంద్రరావుగారు ఆపకుండా ప్రతి బెత్తం దెబ్బకు ‘వందేమాతరం’ అంటూ స్పృహతప్పి పోయేవరకూ దెబ్బలు తిన్నారు. ఆనాటి నుండి ఆయన ‘వందేమాతరం రామచంద్రారావు’గా ప్రసిద్ధి చెందారు. వరంగల్ దగ్గరలో ఉన్న మామ్‌సూర్ ప్రాంతంలో విమానాలు దిగడానికి చిన్న స్థలం ఉండేది. దట్టంగా అలుముకున్న చీకట్లో దూరంగా పొలంలో గుడిసెలో యువకుడైన రైతు ఇంకా మేల్కొనే ఉన్నాడు. అర్ధరాత్రి. అంతా నిశ్శబ్దం. ఎయిర్‌స్ట్రిప్ దగ్గర మాత్రం దీపాలు వెలుగుతున్నాయి.

(విజయక్రాంతి సౌజన్యం తో)