Home Telugu Articles ఒకే దేశం-ఒకే ప్రజ!

ఒకే దేశం-ఒకే ప్రజ!

0
SHARE

జమ్మూకశ్మీరం- భారతావని శిరోభూషణం. దాన్ని కబళించడానికి గోతికాడ నక్కలా పాకిస్థాన్‌ ఎన్ని కుతంత్రాలు పన్నినా, కీలక సరిహద్దు రాష్ట్రం- దేశ సార్వభౌమాధికార పరిధిలోనిదేనన్నది నిర్ద్వంద్వం! రాజ్యాంగంలోని 370 అధికరణ రీత్యా దఖలుపడ్డ ప్రత్యేక హోదా దృష్ట్యా- తమ రాష్ట్రానికి సార్వభౌమాధికారం ఉందని, అది అనుల్లంఘనీయమనీ వాదించే రాజకీయ నేతాగణానికి అక్కడ ఏనాడూ కొదవలేదు. రాజ్యాంగ చట్టం స్ఫూర్తిని అవగాహన చేసుకోవడంలో జమ్మూకశ్మీర్‌ ఉన్నత న్యాయస్థానమూ తప్పుదోవ పట్టడంతో ఉత్పన్నమైన సంక్షోభస్థితిని సర్వోన్నత న్యాయపాలిక ఇటీవలి తీర్పు సమర్థంగా చక్కదిద్దింది. ఆస్తిపాస్తుల్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇచ్చినప్పుడు రుణ గ్రహీతలు బాకీలు చెల్లించని పక్షంలో వాటిని బ్యాంకులు వేలంవేసి బకాయిల్ని రాబట్టుకోవడానికి భారత పార్లమెంటు 2002లో ఓ చట్టం చేసింది. ‘సర్‌ఫేసీ యాక్ట్‌’గా ప్రాచుర్యంలో ఉన్న ఆ చట్టం ప్రత్యేక రాజ్యాంగ హోదాగల జమ్మూకశ్మీర్‌కు వర్తించబోదని ఆ రాష్ట్ర ద్విసభ్య డివిజన్‌ బెంచ్‌ నిరుడు జులైలో ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. జమ్మూకశ్మీరుకు సంబంధించిన నిర్దిష్ట విభాగాలకు వర్తించేలా శాసనాలు చేసే అధికారం భారత పార్లమెంటుకు లేనేలేదని స్పష్టీకరించింది. దానిపై అప్పీళ్లను పరిష్కరిస్తూ సుప్రీం న్యాయపాలిక ఇచ్చిన ఆదేశం, చేసిన వ్యాఖ్యలు- కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిపై కమ్ముకొన్న రాజకీయ పొగమంచును పటాపంచలు చేస్తున్నాయి. పార్లమెంటు శాసనాధికార పరిధిలోనే సర్‌ఫేసీ చట్టం రూపుదాల్చిందని, జమ్మూకశ్మీర్‌లోనూ అది అమలవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత రాజ్యాంగ పరిధికి ఆవల జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి ఈషణ్మాత్రం సార్వభౌమాధికారం లేదని, రాష్ట్ర రాజ్యాంగమైనా భారత రాజ్యాంగానికి లోబడినదేనని వివరించింది. ‘హైకోర్టుకు గుర్తుచేస్తున్నాం… జమ్మూకశ్మీర్‌ ప్రజలు మొట్టమొదట, మరీ ముఖ్యంగా భారత పౌరులు’- అని ఎలుగెత్తి చాటిన సర్వోన్నత తీర్పు, సంకుచిత రాజకీయ భావజాలాన్ని తునాతునకలు చేసేటంత ప్రభావాన్వితమైనది!

రుణగ్రహీతలు కుదువ పెట్టిన మొత్తాల్ని న్యాయస్థానాల పరిధికి ఆవల విక్రయించి బకాయిలు రాబట్టుకొనేందుకు సర్‌ఫేసీ చట్టం అనుమతిస్తోంది. 1920నాటి రాష్ట్ర ఆస్తుల బదిలీ చట్టం నిబంధనలకు అది విరుద్ధమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారతీయ స్టేట్‌బ్యాంకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తన తీర్పులో పలుచోట్ల జమ్మూకశ్మీర్‌కు తిరుగులేని సార్వభౌమాధికారం ఉందని పేర్కొనడం ఆందోళన కలిగిస్తోందన్న సుప్రీంకోర్టు- తీర్పు పూర్తిగా తప్పుదారి పట్టిందంటూ దాన్ని కొట్టేసింది. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉన్నట్లు ద్వంద్వ పౌరసత్వం ఇక్కడ లేదని, జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసులూ భారత పౌరులేనని కుండ బద్దలుకొట్టిన తీర్పు- వేర్పాటువాద మూకలకు ఏమాత్రం మింగుడుపడనిది. జమ్మూకశ్మీర్‌ ప్రజలకు గల సొంత రాజ్యాంగాన్ని, సార్వభౌమత్వ ఉనికిని ఎవరూ ప్రశ్నించలేరు, మార్చలేరంటూ హైకోర్టు నిరుడు ఇచ్చిన తీర్పును వెన్నంటి మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలూ వెలుగుచూశాయి. ‘సదరే రియాసత్‌’గా పరిగణించాల్సిన పదవిని గవర్నరుగా మార్చడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని నిరుడీ రోజుల్లో అక్కడి ఉన్నత న్యాయస్థానమే అభిప్రాయపడింది. జాతీయ పతాకంతో పాటు రాష్ట్రపతాకనూ ప్రభుత్వ కార్యాలయాలన్నింటి మీదా ఎగరేయాలని ఆదేశాలు జారీచేసింది, ‘ప్రజలు చేసిన ఉద్యమాలను, వారి త్యాగాలను గుర్తుచెయ్యడానికే కాదు- మన ఆకాంక్షల పట్ల మనలో చేతనత్వాన్నీ మన పతాక పెంచుతుంది’ అని ప్రకటించిన న్యాయమూర్తి తీర్పును మరికొన్నాళ్లకు డివిజన్‌ బెంచ్‌ నిలుపు చేసింది. ఉన్నత న్యాయపాలిక స్థాయిలోనే రాష్ట్ర ప్రత్యేక అస్తిత్వ భావన, భావితరంలోనూ వేర్పాటు భావజాల విస్తృతికి వూతమవుతున్న వేళ- సుప్రీంకోర్టు న్యాయనిర్ణయం ‘ఒకే దేశం, ఒకే ప్రజ’ అన్న స్ఫూర్తికి గొడుగు పట్టింది!

దశాబ్దాలుగా కశ్మీర్‌ వివాదగ్రస్తం కావడానికి తొలినాళ్లలో నెహ్రూ వ్యవహార సరళే పుణ్యం కట్టుకొంది. కీలక సరిహద్దు రాష్ట్రంలో సంకుచిత రాజకీయాలు నెరపి, స్వతంత్ర ప్రతిపత్తి వంటి సున్నితమైన అంశాన్నీ సూత్రరహిత గాలిపటం చేసిన భ్రష్ట చరిత్ర కాంగ్రెస్‌ జమానాలో పోగుపడింది. రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటే కశ్మీర్‌ అటానమీకి ఆకాశమే హద్దు అంటూ ప్రధానిగా పీవీ చేసిన వ్యాఖ్యల్ని తనకు అనుకూలంగా వక్రీకరించిన ఘనుడు ఫరూక్‌ అబ్దుల్లా. ఆయన పుత్ర రత్నానిదీ అదే పంథా! రాష్ట్రానికి పరిపూర్ణ స్వయం ప్రతిపత్తి సాధనకు అవసరమైన చర్యలు సూచించేందుకు ‘స్టేట్‌ అటానమీ కమిటీ’ ఏర్పాటు చేసి, దాని సూచనల అనుసారం కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నాయకులకు వాజ్‌పేయీ హయాములో చుక్కెదురైంది. చరిత్రకు వక్రభాష్యాలు చెబుతూ, ఎదిరిపక్షాలపై రాజకీయంగా పైచేయి సాధించడమే అజెండాగా పరస్పరం పోటీపడుతున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీల వంటి పార్టీలూ తమదైన వాదనలతో ప్రజల మనసుల్ని విషకలుషితం చేస్తున్నాయి. భారత పార్లమెంటుకు గల శాసనాధికారం తిరుగులేనిదన్న సుప్రీం తాజా తీర్పునూ- భారత వ్యతిరేక భావజాల విస్తృతికి వేర్పాటు శక్తులు ఉపయోగించుకొంటున్నాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో గట్టి పూనిక కనబరుస్తున్న మోదీ ప్రభుత్వం- కశ్మీరీ యువజనం మనసుల్ని గెలుచుకొనే పరిణత వ్యూహంతో ముందడుగేయాలి. కశ్మీరులో స్థిరాస్తుల్ని కశ్మీరీలే కొనాలంటున్న స్థానిక చట్టాలకు సొడ్డుకొట్టేలా- ‘సుప్రీం’ తీర్పు నేపథ్యంలో, దొడ్డిదారిన క్రయవిక్రయాలు జోరెత్తుతాయన్న భయాందోళనల్నీ దూరం చెయ్యాలి. వేర్పాటుశక్తుల విషప్రచార ధూమాన్ని తిప్పికొట్టే పరిణత వ్యూహం సత్వరం పట్టాలకెక్కాలి!

(ఈనాడు సౌజన్యం తో )