Home News పద్ధతి మార్చుకోకపోతే పాక్‌ పది ముక్కలవుతుంది

పద్ధతి మార్చుకోకపోతే పాక్‌ పది ముక్కలవుతుంది

0
SHARE

* దీనిలో భారత్ పాత్ర ఏమీ ఉండదు

* ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు

* మత ప్రాతిదికన విభజించేందుకు కుట్ర

* పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్‌ విమర్శలు

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పరోక్ష యుద్ధానికి తెగబడుతున్న పాకిస్థాన్‌పై హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మండిపడ్డారు. ఆ దేశం ఉగ్రవాదులకు ఊతమిస్తోందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. తన విధానాలను మార్చుకోకపోతే.. ఇప్పటికే రెండు ముక్కలైన పాకిస్థాన్‌ పది ముక్కలవుతుందని ఆయన హెచ్చరించారు. అయితే అలా చేయడంలో భారత హస్తం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. పక్కదేశాలను ఆక్రమించుకునే ఉద్దేశం లేని ఏకైక దేశం భారత దేశమేనని పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. భారత దేశాన్ని మతప్రాతిపదికన విడగొట్టేందుకు పాకిస్థాన్‌ కుట్ర చేస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు.

అయితే ఈ విషయంలో అది ఎన్నటి విజయం సాధించదని స్పష్టం చేశారు. 1947లో దేశం ఒకసారి మత ప్రాతిపదికన విభజితమైందని, దానినే ఇప్పటివరకు మరిచిపోలేకపోతున్నామని ఆయన అన్నారు. ముస్లిం అమ్మకు పుట్టినా.. హిందూ తల్లికి పుట్టినా అందరూ భారతీయ సోదరులేనని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భారత ఎప్పుడూ కయ్యం కోరుకోలేదని, భారత ప్రధానులందరూ ఆ దేశంతో స్నేహ సంబంధాలనే ఆకాంక్షించారని చెప్పారు. కానీ ఆ దేశం మాత్రం నాలుగుసార్లు యుద్ధానికి తెగబడిందని ఆయన విమర్శించారు. కానీ ప్రతిసారీ ఓడిపోవడంతో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి బుల్లెట్‌ను ప్రయోగించవద్దని మాత్రమే తాను సైనికులకు చెప్పానన్నారు. పాక్‌ కాల్పులు జరిపితే మాత్రం బుల్లెట్లను లెక్కించకుండా విరుచుకుపడాలని సూచించానన్నారు. కాగా దేశంలో వేళ్లూనాలని ఇస్లామిక్‌ స్టేట్‌ చేస్తున్న ప్రయత్నాలను భారతీయ ముస్లింలు సమర్థంగా తిప్పికొడుతున్నారని ఆయన ప్రశంసించారు.

మీరు చేసేదీ మత ప్రాతిపదిక విభజనేకదా: రాహుల్‌

కాగా రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. భారతను మత ప్రాతిపదికన విభజించాలని పాక్‌ చూస్తోందన్న అంశం నిజమేనని, అయితే హోం మంత్రి రాజ్‌నాథ్‌, ఆయన బాస్‌( ప్రధానిమోదీ) కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)