Home News ‘పడికట్టు’ పంథా వీడని విరసం

‘పడికట్టు’ పంథా వీడని విరసం

0
SHARE

విప్లవ రచయితల సంఘం (విరసం) నక్సల్‌బరి ఉద్యమంపై ఇటీవల జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించింది. గత మే మాసంలోను 50 ఏళ్ల నక్సల్‌బరి ఉత్సవాన్ని విరసం నిర్వహించింది. నక్సల్‌బరి పంథాని బలంగా ముందుకు తీసుకువెడుతున్న మావోయిస్టుల కార్యాచరణకు ఉత్సవంలో, సదస్సులో సంఘీభావం ప్రకటించారు. మావోయిస్టుల మనస్సులోని మాటలన్నీ విరసం నాయకుల నోట వినిపించాయి.

విరసం జాతీయ సదస్సు జరిగిన సమయంలోనే ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలు జరిగాయి. ప్రజాకవి కాళోజీ అభిప్రాయాలకు, ఆలోచనలకు ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్నామని చెప్పుకుంటున్న విప్లవ రచయితల మాటలకు హస్తిమశకాంతరం కనిపిస్తోంది. కాళోజీ జయంతి సందర్భంగాను పలు సభలు, సమావేశాలు, కవితా గోష్టులు జరిగాయి. వీటన్నింటిలో కాళోజీ పలుకు, పదం, ప్రజాశ్రేణుల తరఫున నిలిచి చేసిన ‘గొడవ’ను మరోసారి మననం చేసుకున్నారు.

పుటక నీది, చావు నీది బతుకంతా దేశానిది అన్న కాళోజీ కవితా వాక్యాన్ని మనసారా మరోసారి స్మరించుకున్నారు. విరసం నాయకులు మాత్రం పుటక నీది, చావు నీది, బతుకంతా మార్క్సిజానిది, మావోయిజానిది…అని గత 47 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నారు. మరోసారి జాతీయ సదస్సులో స్వరం పెంచి చెప్పకనే చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టిగా నొక్కి వక్కాణించారు.

కాళోజీ ధిక్కార స్వరానికి, ఆత్మగౌరవానికి, ప్రజల పలుకుబడికి విరసం సాయుధ స్వరానికి, సుత్తి కొడవలి పతాకానికి, సిద్ధాంతాల పారిభాషిక పదాలకు మధ్యగల వ్యత్యాసాలను సులభంగానే తెలుసుకోవచ్చు. ఏది సహజమైనది, ఏది కాదో ఇట్టే అవగతమవుతుంది.

మార్క్స్ ఈ దేశానికి చెందినవాడు కాదు, మావో ఈ దేశానికి చెందినవాడు కాదు. భారత ప్రజల ఆత్మను పట్టుకున్న వారు అంతకన్నా కాదు. తెలుగు ప్రజల ధిక్కార తత్వాన్ని గుర్తెరిగిన వారు కాదు. అయినా విరసం నాయకులు మాత్రం మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావో, తదితరులు చెప్పిన సిద్ధాంతాలను, ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.

ఆధిపత్యం చెలాయించే వారిని ఎదిరించమని కాళోజి నారాయణరావు పిలుపునిస్తే విరసం నాయకులు మాత్రం మావోయిస్టుల ఆధిపత్యం నియంతృత్వంలోకి రా రమ్మని ఆహ్వానిస్తున్నారు. సభలు-సమావేశాలు-సదస్సులు పెట్టి మరీ పిలుపునిస్తున్నారు. అలాంటి చోట మావోయిస్టుల కన్నా రెండాకులు ఎక్కువే చదువుతున్నారు. ‘మోర్ లాయల్ దాన్ కింగ్’ అన్న స్వభావాన్ని బయటపెట్టుకుంటున్నారు.

మార్క్స్ రెండు వందల సంవత్సరాల క్రితం వాడు. జర్మన్ దేశీయుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతానికి భారతదేశంలో ఇప్పటికీ ప్రాసంగికత ఉందని దూరదృష్టికల, ఆగామి పరిస్థితులను పసిగట్టే కవులు…కళాకారులు.. రచయితలు చెబితే వారి మస్తిష్కాలపై అనుమానం కలగక మానదు. నాలుగు దశాబ్దాలకు పైగా విరసం నాయకులు చెబుతున్న దాంట్లో వీసమంత తేడాగాని, వ్యత్యాసం గాని కనిపించదు. కాని బయట ప్రపంచంలో అనూహ్యమైన మార్పు.. గొప్ప విప్లవాలు చోటుచేసుకున్నాయి. అంతెందుకు విరసం నాయకుల కుటుంబాల్లోనే రెండు కొత్తతరాలొచ్చాయి. ఆ కొత్త తరాల ప్రతినిధుల భావాలకు, ఆలోచనలకు, ఆకాంక్షలకు, అభిరుచులకు వీరికి పొంతన కనిపిస్తోందా?..లేదు! ఈ సూక్ష్మమైన తేడాను ప్రతినిత్యం ఇళ్లల్లో కనిపిస్తున్న విప్లవాత్మక మార్పులను పట్టించుకోకుండా సాయుధ పోరాటం, దండకారణ్యం, జనతన సర్కారు, గెరిల్లా పోరాటం, మందుపాతరలు, మర తుపాకుల గూర్చి ప్రసంగాలు చేస్తే భావ్యంగా వుంటుందా? వాస్తవ స్థితికి దగ్గరగా అనిపిస్తుందా?

ప్రతీదీ రూపాంతరం చెందుతుందన్నది ప్రాథమిక అవగాహన. శాస్ర్తియ విశే్లషణ. వేల సంవత్సరాలుగా ఈ అవగాహన అంతటా కనిపిస్తుంది. మార్క్స్ చెప్పిన పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం..వారి మధ్య వైరుధ్యాలు రూపాంతరం చెందకుండా అలాగే వున్నాయి…ఉంటాయన్న భావన ఎంతటి హాస్యాస్పదం?

నక్సల్‌బరి పోరాటం ప్రారంభమై అర్ధశతాబ్దం గడిచినా ఆనాటి పరిస్థితులు భారతదేశంలో అలాగే కొనసాగుతున్నాయని విశే్లషించి విరసం నాయకులు పదే పదే పేర్కొనడం ఎంతటి అన్యాయం?

ప్రపంచంలో మూడవ పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న సందర్భంలో నక్సల్‌బరి రైతులు-కూలీలు కడుపుమండి స్థానిక భూస్వాములపై తిరుగుబాటు చేసారు. ఆ తిరుగుబాటు స్వభావం అంతే సాంద్రతతో నాల్గవ పారిశ్రామిక విప్లవం వేగంగా విస్తరిస్తున్న 2017 సంవత్సరంలోనూ కొనసాగుతోందని చెప్పడం అవివేకం. ఈ యాభై ఏళ్లలో ప్రపంచ తీరుతెన్నులే మారిపోయాయి. కొత్త ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ చెల్లింపుల కాలమిది. పేద ప్రజల బాగు కోరేవారు, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటున్న వారు.. ‘సాధికారత’ వైపు కదం తొక్కమని పిలుపునివ్వాలి గాని సాయుధ పోరాటం చేయండి, రాజ్యాధికారం మీ చేతిలోకి వస్తేనే మీకు ముక్తి.. విముక్తి అని మాయమాటలు మైక్‌లో చెబితే ఎలా?

ఎవరు పొలం దున్నాలో, ఎవరు యంత్రం నడపాలో, ఎవరు వైద్యం చేయాలో, ఎవరు విద్య చెప్పాలో, ఎవరు తుపాకీ పట్టాలో, ఎవరు రాజ్యాధికారం చేపట్టాలో తెలియనంత అమాయకులు కాదు ప్రజలు. ‘నీవారే అయినా నీ వెనుక గోతులు తవ్వే వారి గొంతు నులుమాల’ని కాళోజీ ఎప్పుడో పిలుపునిచ్చాడు. ఆ చైతన్యం, ఆ భావ తరంగం తెలుగు ప్రజల్లో దండిగానే కనిపిస్తోంది. అది స్వతఃసిద్ధమైంది. దీన్ని కావాలని తొక్కిపెట్టి విరసం నాయకులు మార్క్స్, మావో, చారుమజుందార్‌ల నామస్మరణ చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. కాళోజీ ప్రశ్నలు.. ధిక్కార స్వరం ప్రజల సహజాతాలుగా నిలిచాయి. ఈ ధిక్కారానికి సాయుధ పోరాటానికి భూమి ఆకాశమంత తేడా కనిపిస్తోంది. మావోయిస్టుల మౌలిక విశ్లేషణ తప్పయినప్పుడు దానిపై నిర్మించుకున్న సౌధాలన్నీ తప్పుల తడకలే అవుతాయి…వారి ‘థింక్ ట్యాంక్’గా వ్యవహరించే విరసం నాయకులు పూర్తి ఊహా ప్రపంచంలో తేలిపోతూ ప్రజలకు కాలం చెల్లిన సిద్ధాంతాల వెలుగులో పిలుపునిస్తున్నారు. ఇది ఏ రకంగానూ ఆహ్వానించదగ్గది కాదు.

దండకారణ్యంలో జనతన సర్కార్ ఆధ్వర్యంలో ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం గురించి సదస్సులో గొప్పగా చెప్పుకుంటున్న సమయంలోనే పత్రికల్లో ‘రోబోసైన్యం’ గురించిన కథనాలు ప్రచురితమైనాయి. కృత్రిమ మేథ పరాకాష్ఠకు చేరిన తీరును ప్రతి నిత్యం పత్రికలు, మీడియా కళ్లకు కడుతోంది. మానవుడినే రోబో శాసించనుందా? అన్న అనుమానం కలుగుతోందని కొందరు భయాల్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) టెక్నాలజీ ఆధారంగా ప్రజా జీవితం సంపూర్ణంగా మారబోతోందని చెప్పుకుంటున్న సందర్భంలో, స్మార్ట్ ఫోన్ లేకుండా రోజు గడవని పరిస్థితులు ఏర్పడిన కాలంలో, పాలన సైతం మొబైల్ ‘మోడ్’లోకి మారుతున్న సమయంలో అంతటా ప్రజల భాగస్వామ్యం కొనసాగుతున్న వేళ, కొత్త ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నప్పుడు.. మీరంతా దోపిడీకి గురవుతున్నారు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు కాబట్టి విముక్తి కోసం సాయుధ పోరాటం చేయడానికి దండకార్యం దండులో చేరండి అని విరసం నాయకులు పిలుపునివ్వడంలో ఏమైనా పాజిటివ్ ఆలోచనలు అగిపిస్తోందా? కాళోజీ నారాయణరావు ఎంతో బలంగా వ్యతిరేకించారు. ఇది కదా కావలసింది. ప్రజల సాధికారత కదా కీలకమైన వనరు. విరసం నాయకులు దీన్ని విస్మరిస్తే ఎలా? ఏ వెలుగులకీ ప్రస్థానం అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా?

– వుప్పల నరసింహం 9985781799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)