Home News మహిళా ప్రతిభకు పద్మం..

మహిళా ప్రతిభకు పద్మం..

0
SHARE

సంగీతంలో రాణించారు.. క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు.. వైద్యంతో ప్రాణాలు పోశారు.. అంతరాలను అధిగమిస్తూ అన్నింటిలోనూ పోటీ పడి నిలిచారు.. ముదిమి వయసు మీదపడుతున్నా.. పరుల సేవే పరమావధిగా సేవకు కదిలిన చేతులు అవి. అందుకే ఈ ఏటి పద్మశ్రీలుగా వికసించారు. తొంభై ఏడేళ్ల మంత్రసాని, డెబ్బయ్ ఐదేళ్ల అడవి బిడ్డల అమ్మ ఉన్నారు. ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారు.

జనని అమ్మ…

కర్నాటక ప్రజలు ‘జనని అమ్మ’ అని పిలుచుకుంటారు. వ్యవసాయ కూలీగా పనిచేసే ఈ తొంభై ఏడేళ్ల అవ్వ మురికివాడల్లోని మహిళలకు పురుడు పోయటంలో సిద్ధహస్తురాలు. కూలీ పనులు చేసుకుంటూనే తన సేవలు అందిస్తోంది. వైద్య సదుపాయాలు లేని వెనుకబడిన ప్రాంతాలను ఎంచుకుని తన సేవలు అందిస్తోంది. గర్భంలో ఉన్న శిశువు పల్స్ చూడటంలో సిద్ధహస్తురాలు. కడుపులో ఉన్న బిడ్డ తల, ఆరోగ్యం గురించి చక్కగా చెబుతుంది. పేద ప్రజలకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా పురుడు పోస్తుంది. గత డెబ్బయి సంవత్సరాల్లో 15,000 మందికి ఎలాంటి సర్జరీ లేకుండా పురుడు పోసింది. తుంకుర్ యూనివర్శిటీ డాక్టరేట్ సైతం ప్రదానం చేసింది. ఇపుడు పద్మశ్రీ వరించింది

గల్ఫ్‌లో యోగా పాఠాలు

ముప్పయి ఎనిమిది సంవత్సరాల నౌఫ్ మార్వాయి సౌది అరేబియన్. ముస్లింల దేశం. ఇక్కడ నౌఫ్ మార్వాయి యోగా పాఠాలు చెబుతుంది. అరేబియాలో యోగా సర్ట్ఫికెట్ పొందిన తొలి టీచర్ ఈమె. ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చింది. అంతేకాదు మరో 70 మంది యోగా టీచర్లను తయారుచేసింది. పుట్టుకతోనే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధితో జన్మించిన ఈమె వ్యాధి తీవ్రమై కిడ్నీలు పాడైపోయే దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలో చదువుకున్న నౌఫ్ మార్వాయి యోగా గురించి చదవి దీని ద్వారా తన వ్యాధిని నయం చేసుకోవాలని భావించి ఇండియాలోని కేరళకు వచ్చింది. అక్కడ ఆయుర్వేదం వైద్యాన్ని అభ్యసించింది. దీంతో పాటు ఢిల్లీ, హిమాలయ ప్రాంతాలకు వెళ్లి యోగా శిక్షణ తీసుకుంది. తదనంతరం అరేబియా వెళ్లి అక్కడ క్లినిక్‌ను ప్రారంభించింది. తొలినాళ్లలో తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరగవ్వటం గమనించి ఆమెకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలా అరేబియాలో యోగా గురించి విస్తత్ర ప్రచారం చేసింది. ఆమె చేసిన కృషికి ప్రభుత్వం సైత తలవొగ్గి అరేబియాలో యోగా పాఠాలకు అనుమతి ఇవ్వటం జరిగింది. మార్వాయి చేసిన కృషి ఫలితంగా ఇపుడు అరేబియాలో పలు యోగా సెంటర్లు వెలిశాయి. తన క్లినిక్‌లో ప్రతి ఏడాదా 40 మందికి శిక్షణ ఇస్తోంది. ‘‘యోగా అంటే ఆధునిక పరిభాషలో ‘యూనియన్’అని నా భావం. ఇది సమస్త మానవులకు అవసరం. శారీరక ఆరోగ్యానికే కాదు మనస్సు, భావోద్వేగాలకు కూడా సంబంధించినది. యోగా అంటే ఆత్మ.’’- ఇది మార్వాయి అభిప్రాయం.

గాంధేయ మార్గంలో సేవ..

అది నాగాలాండ్ కొండల మధ్య ఉన్న చుచైమిలాంగ్ అనే కుగ్రామం. అక్కడకు వెళితే గాంధీ ఆశ్రమం కనిపిస్తోంది. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నట్వర్ భాయ్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన భార్య లెంటినోఆ థక్కర్ కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆ ఆశ్రమాన్ని ఓ వృత్తివిద్యాకేంద్రంగా మలచి వేలాది నాగాలాండ్ యువతకు ఉపాధి చూపిస్తోంది. వేర్పాటువాద ఉద్యమాల వైపు నాగాలాండ్ యువత వెళ్లిపోకుండా చైతన్యం వంతుల్ని చేయటమనే ఆదర్శాన్ని పెట్టుకుని ఆ వృద్ధ దంపతులు గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరుగకుండా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఎన్నో దాడులను సైతం ఎదుర్కొన్నారు. రాత్రి వేళల్లో వారు చేసే దాడులకు ప్రాణాలను కాపాడుకోవటానికి తమ ఇంటి నుంచి వెళ్లిపోయి వేరచోట తలదాచుకుని పగలు ఇంటికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రామస్తులే ఈ ఆదర్శ దంపతులను కాపాడుకుంటారు. ప్రాణభయంతో తమ ఆశయాలకు తిలోదకాలు ఇవ్వకుండా ఈనాడు ఈ ఆశ్రమంలో కార్పెంటరీ, టైలరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తూ వేలాది మంది యువతీ యువకుల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు. జవహార్‌లాల్ నెహ్రు ప్రధానిగా ఉన్నపుడు ఇక్కడ పర్యటిస్తూ నట్వర్‌భాయ్‌ను పేరుపెట్టి పిలిచి వేదికపైకి రప్పించుకుని ఆయన సేవలను కొనియాడారు. నట్వర్‌భాయ్‌కు సైతం పద్మ పురస్కారం దక్కింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఈ ఆదర్శదంపతులు యువతకు ఇస్తున్న శిక్షణ పరిశీలించి ఈ సంస్థ సైతం ఇక్కడ తన తోడ్పాటునందిస్తోంది. నట్వర్‌భాయ్‌కు ఇపుడు ఎనభైరెండేళ్లు. అయినప్పటికీ ఆయన చేతికర్రతో గ్రామం అంతా కలియతిరుగుతూ గ్రామస్తుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఇక్కడ క్రిస్టమస్ పండుగ అద్భుతంగా నిర్వహిస్తారు.

భక్తి సంగీతమే ప్రాణం..

విజయలక్ష్మీ నవనీతకృష తమిళ జానపద సంగీతంలో నిష్ణానితురాలు. మధురై కామరాజ్ యునివర్శిటీ ప్రొఫెసర్‌గా తన సేవలు అందించి పదవీ విరమణ చేశారు. తమిళ జానపద సంగీతంలో దాదాపు పదివేల ఆడియోలు రూపొందించిన కళాకారిణి. అలాగే ఈ సంగీతంపై పదకొండు పుస్తకాలను సైతం రాశారు. తమిళనాడులో తన గళంతో భక్తి పరిమళాలు వెదజల్లుతున్న గాయని. జీవిత పర్యంతం భక్తి సంగీతం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాల జానపద సంగీతాభివృద్ధికి అంకితమవుతానని వెల్లడించింది.

జానపదంలో ఎగిసిన కెరటం..

బీహార్‌కు చెందిన ఈ సంగీత కెరటం జానపదంలో తనదైన ముద్ర వేసుకున్నారు. భోజపురి పాటలు అంటే డాక్టర్ శారదా సిన్హానే గుర్తుకువచ్చేంతగా రమ్యంగా ఆలపిస్తారు. జానపద సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న శారదాసిన్హా సామాజిక జీవితంలోని అనేక అంశాలను తన పాటల్లో స్పృశించారు. సాంఘిక అంశాలతో రూపొందించిన ‘లోక్‌గీత్’ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈమె గాత్ర మాధుర్యం ఒక్క బీహార్‌కే పరిమితం కాకుండా దేశ విదేశాలలో ఎన్నో కచ్చేరీలు ఇచ్చారు. బీహార్‌లో జరిగే వివాహ వేడుకల్లో ఈమె ఆలపించిన పాటలు లేకుండా ఉండవంటే అతిశయోక్తికాదు. ఖాయల్ సింగర్ రఘుజా, సీతారామ్ హరి దండేకర్, పన్నాదేవి, బేగం అక్బర్ వద్ద సంగీత శిక్షణ తీసుకున్నారు. ‘దులారాభాయ్’ ఆల్బమ్ పాటల ప్రపంచంలో సరికొత్త ఒరివడిని సృష్టించాయి. ఆమె పాడిన భోజపురి పాటలు దేశ,విదేశాల్లోని శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది పాటలు ఆమె గళం నుంచి వచ్చాయి. బీహార్ కోకిల అని ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటారు,‘ భోజపురి లతామంగేష్కర్’ అని కూడా అంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న శారదాసిన్హా సమస్తిపూర్ మహిళా కళాశాలలో సంగీత అధ్యాపకురాలిగా తన సేవలు అందిస్తున్నారు.

అడవి బిడ్డలకు అమ్మ…

అది కేరళలోని తిరువనంతపురంలోని కల్లార్ అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో నివశించేది గిరిజనులే. అక్కడ ఓ గుడిసె ఉంటుంది. ఆ గుడిసె చుట్టూ వనమూలికల చెట్లతో పచ్చటి పొదరిల్లును తలపిస్తోంది. ఆ గుడిసెలో గిరిజనులు నోరారా ‘అమ్మ’ అని పిలుచుకునే డెబ్బయ్ ఐదేళ్ల లక్ష్మీకుట్టీ నివశిస్తోంది. నాటు వైద్యం అని కొట్టి పారేస్తాం. కాని ఆమె చేసే వైద్యమే ఆ అడవి బిడ్డలకు రక్ష. మూలికావైద్యంలో సిద్ధహస్తురాలు. ఆ అడవిలో లభించే మూలికలన్నీ ఆమెకు కంఠస్తమే. వాటి వివరాలను పుస్తకంలో రాసి అటవీ అధికారులకు సైతం అందజేసింది. అడవిబిడ్డలను ఏ పాము కరిచినా.. విష పురుగు కుట్టినా ‘అమ్మా’ అంటూ ఆమె వద్దకు వస్తారు. ఆమె వెంటనే ఉచితంగా తన వద్ద మూలికలతో వారికి చికిత్స చేసి ప్రాణాలు పోస్తుంది. ఆమె మస్తిష్కంలో దాదాపు 500 మూలికల పేర్లు నిక్ష్తిపమై ఉన్నాయంటే హెర్బల్ వైద్యంలో ఆమెకున్న ప్రతిభ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. చిన్నప్పుడు పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న ఈమె 16 ఏట పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకర్ని అడవిలో ఏనుగు వెంటపడి చంపేసింది. మరొకరు కూడా ప్రమాదంలో చనిపోయారు. మూడవ కుమారుడు రైల్వేలో పనిచేస్తున్నాడు. ముదిమి వయసు వచ్చినా ఆ గుడిసెను వదలిపెట్టి పోవటానికి ఇష్టపడదు. ఆ గుడిసెను గిరిజనుల కోసం ఓ వైద్యశాలగా మార్చాలాని ఈ వృద్ధురాలి సంకల్పం. అందుకే ఆ ఇంటి చుట్టూ వనమూలికల చెట్లను పెంచుతుంది. ఆమె వైద్య సేవలకు అచ్చెరవొందిన అనేక మంది సైన్స్ మేధావులు సైతం ఆమెను తమ సంస్థలకు ఆహ్వానించుకుని మూలికావైద్యం గురించి పాఠాలు చెప్పించుకుంటారు. కేరళ ప్రభుత్వం సైతం అడవి బిడ్డలకు ఆమె చేస్తున్న వైద్య సేవలను గుర్తించి ‘నాటు వైద్య రత్న అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇది కాకుండా ఎన్నో అవార్డులు పొందారు.

– టి.ఆశాలత

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here