Home Telugu Articles పాకిస్తాన్ లోని ఉగ్రవాదలకు అందుతున్న ఆర్థిక వనరుల సరఫరా నిరోధానికి అంతర్జాతీయ ప్రయత్నం

పాకిస్తాన్ లోని ఉగ్రవాదలకు అందుతున్న ఆర్థిక వనరుల సరఫరా నిరోధానికి అంతర్జాతీయ ప్రయత్నం

0
SHARE

అక్రమ ధనాన్ని సక్రమమైనదిగా చలామణి చేయడం, ఉగ్రవాదులకు నిధులు అందించడం వంటి అవాంఛనీయ కార్యక్రమాలను నిరోధించే అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నయవంచక పాకిస్థాన్‌ పనిపట్టింది. జీ-7 దేశాల చొరవతో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్థాన్‌ను మళ్లీ ‘గ్రే లిస్ట్‌’లో పెట్టింది. ఈ జాబితాలో తమను చేర్చవద్దంటూ ఆ దేశ తాత్కాలిక ప్రధాని షంషాద్‌ అఖ్తర్‌ అభ్యర్థించినా ససేమిరా అన్నది. అక్రమ ధన చలామణినీ, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడానికి చేయవలసినంత ప్రయత్నం చేయని దేశాలను ‘గ్రే లిస్ట్‌’లో పెడతారు. 2012-2015 మధ్యకాలంలో పాకిస్థాన్‌ ఈ జాబితాలో ఉన్నా దాని వైఖరి మారక పోవడంతో ఇప్పుడు మళ్లీ అదే జాబితాకు ఎక్కింది. దీనివల్ల పాకిస్థాన్‌ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతుంది. విదేశీ అప్పులు కట్టలేక సతమతమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి అప్పులు పుట్టవు. అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్‌లో నిధుల సేకరణకు ప్రభుత్వం జారీచేసే బాండ్లను కొనేవాళ్లు కరవవుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం పాకిస్థాన్‌ పాలిట మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందం వంటిది.

పావులు కదిపిన పెద్దన్న

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హక్కానీ నెట్‌ వర్క్‌, జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద బృందాలకు మద్దతు ఇవ్వడం ఆపాలంటూ పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. మొదట్లో పాక్‌ దీన్ని తేలికగా తీసుకుని ముంబయి దాడుల సూత్రధారి జమాత్‌ ఉద్‌ దవా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ను 2017 నవంబరులో గృహ నిర్బంధం నుంచి విడుదల చేసింది. దీంతో పాకిస్థాన్‌కు ఎంత సహాయం చేసినా దాని వైఖరి మారడం లేదని ట్రంప్‌ మండిపడ్డారు. అంతేకాక పాక్‌కు 100 కోట్ల డాలర్ల సహాయాన్ని నిలిపేశారు. ఇందులో సైనిక సహాయం, అఫ్గానిస్థాన్‌లో పోరాటానికి తోడ్పడినందుకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయమూ ఉన్నాయి. అమెరికా ఎఫ్‌ఏటీఎఫ్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని ముందే పసిగట్టిన పాక్‌ ఇంటిని చక్కదిద్దుకునే పని ప్రారంభించింది. 1997 ఉగ్రవాద నిరోధ చట్టాన్ని సవరించడానికి అధ్యక్షుడు మమ్నూన్‌ హుసేన్‌ అత్యవసరాదేశం జారీ చేశారు. హఫీజ్‌ సయీద్‌కు చెందిన జమాత్‌ ఉద్‌ దవానూ, ఫలాహ్‌ ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌నూ నిషేధించారు. ప్రభుత్వం ఈ రెండు సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ పనులు చేయడానికి పాక్‌కు పదేళ్లు పట్టడం విడ్డూరం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2008లోనే జమాత్‌ ఉద్‌ దవాను ఉగ్రవాదుల ముసుగు సంస్థగా ప్రకటించినా, పాక్‌ ఇన్నాళ్లూ దానికి పాలుపోస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ చర్యల నుంచి తప్పించుకోవడానికి చైనా, సౌదీ అరేబియా, టర్కీల సాయం కోరినా పాకిస్థాన్‌కు ఫలితం దక్కలేదు. గత ఫిబ్రవరి ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీలో టర్కీ మద్దతు పలికినా ఒరిగిందేమీ లేదు. చైనా, సౌదీలు ముఖం చాటేశాయి. అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వస్తున్నా ఉగ్రవాదులతో పాక్‌ అంటకాగడమే దీనికి కారణం. లష్కరే తోయిబాను ప్రధాన రాజకీయ స్రవంతికి చెందిన సంస్థగా చలామణి చేయించడానికి పాక్‌ ఇప్పటికీ ప్రయత్నించడం చూస్తే దాని తీరు మారలేదని అర్థమవుతోంది. ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు చెందిన మిల్లీ ముస్లిం లీగ్‌ (ఎంఎంఎల్‌) గత ఏడాది రాజకీయ పార్టీ అవతారమెత్తింది. ఇది నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో అల్లాహు అక్బర్‌ తెహ్రీక్‌ అనే అనామక పార్టీ ఛత్రం కింద హఫీజ్‌ అనుయాయులు బరిలో దిగుతున్నారు. సైన్యం, పాలనా యంత్రాంగం అండదండలు లేకుండా ఇది సాధ్యమయ్యే పని కాదు.

ఈ నాటకాలు చూశాక ఉగ్రవాదుల కట్టడికి పాక్‌ చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదన్న నిర్ణయానికి అమెరికా వచ్చింది. అమెరికన్ల మీదే దాడులు చేస్తున్న హక్కానీ నెట్‌ వర్క్‌ పని పట్టడానికి పూనుకోవడం లేదంటూ సైనిక సహాయం నిలిపేసింది. పాకిస్థాన్‌ అబద్ధాలకూ, వంచనకూ పాల్పడుతోందని ట్రంప్‌ విరుచుకుపడ్డారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికన్లపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ఆగ్రహించారు.       ఎఫ్‌ఏటీఎఫ్‌ ఫిబ్రవరిలోనే కొరడా బయటకు తీసినప్పుడు చైనా, సౌదీలు ఆదుకుంటాయేమోనని పాక్‌ ఎదురుచూసింది. దాని మాయమాటలకు వంతపాడలేమని అవి స్పష్టం చేశాయి.

ఇంతకీ హక్కానీ ఎవరు, అతని నెట్‌ వర్క్‌ వంటి అంశాలు ఆసక్తికరం. జలాలుద్దీన్‌ హక్కానీ 1980ల్లో సోవియట్‌ సేనలపై పోరాడిన అఫ్గాన్‌ సాయుధదళ నాయకుడు. సున్నీ ఇస్లామిస్ట్‌ దళం పేరిట హక్కానీ అనుచరులు సోవియట్లపై దాడులు చేసేవారు. అప్పట్లో అతని వర్గానికి అమెరికా అండదండలు ఉండేవి. తరవాత సంబంధాలు చెడిపోవడంతో అమెరికా 2012లో హక్కానీ నెట్‌ వర్క్‌ను విదేశీ ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది. ఇది ఇప్పుడు పాక్‌లోని వజీరిస్థాన్‌ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకుని అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతాలపైనా, రాజధాని కాబూల్‌ పైనా దాడులు జరుపుతోంది. దక్షిణాసియాలో మరి కొన్ని చోట్ల సైతం దాని కార్యకలాపాలు నడుస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌పై తాలిబన్‌ ఆధిపత్యాన్ని పునరుద్ధరించి ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ను నెలకొల్పాలన్నది హక్కానీ నెట్‌ వర్క్‌ ధ్యేయం. 1990ల్లో తాలిబన్ల ప్రభుత్వంలో హక్కానీ గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2001లో అమెరికా దండయాత్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలిపోయింది. హక్కానీ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌కు అండగా నిలిచేవాడు.

అఫ్గాన్‌, భారత్‌లపై దాడులే లక్ష్యం

అఫ్గానిస్థాన్‌లో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి హక్కానీ పనికొస్తాడని పాకిస్థాన్‌ భావిస్తోంది. అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల పైన, భారత్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద హక్కానీ దళంతో దాడులు చేయిస్తోంది. మొదట్లో దీని ఆగడాలను అడ్డుకోవడానికి కావలసినంత బలం అమెరికా సంకీర్ణ దళాలకు లేకపోయింది. ఇటీవలి కాలంలో సంకీర్ణ దళాలు, సంప్రదాయ బలగాలను పెంచుకొని హక్కానీ యంత్రాంగం పని పడుతోంది. ఉత్తర వజీరిస్థాన్‌లోని దాని స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులు ముమ్మరం కావడంతో అది గుక్కతిప్పుకోలేకపోతోంది. స్థిమితంగా కూర్చుని అఫ్గానిస్థాన్‌పై దాడులకు వ్యూహం రచించి దాన్ని అమలులో పెట్టలేకపోతోంది. హక్కానీ యంత్రాంగం రెక్కలు కత్తిరించాలంటే దానికి హవాలా మార్గంలో డబ్బు చిక్కకుండా చేయడం అవసరమని అమెరికా భావించింది. తదనుగుణంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ హక్కానీల మహారాజ పోషకురాలైన పాకిస్థాన్‌ను ‘గ్రే లిస్ట్‌’లో పెట్టింది.

పాకిస్థాన్‌లో ఇస్లామీ దాతృత్వ సంస్థల పాత్ర, ప్రభావం అపారం. వీటిల్లో అత్యధికం ఇస్లామిక్‌ రాజకీయ పార్టీలతో, ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరపుతాయి. విదేశాల్లో స్థిరపడి ధనవంతులైన పాక్‌ సంతతి ప్రజల నుంచి ఇస్లామీ దాతృత్వ సంస్థలు విరాళాలు సేకరిస్తాయి. ఏటా భారీ మొత్తాలు వాటి ఖాతాలో జమ అవుతున్నాయి. జమాత్‌ ఉద్‌ దవా మాతృసంస్థ అయిన మర్కాజ్‌ ఉద్‌ దవా వల్‌ ఇర్షాద్‌, లష్కరే తోయిబాలు సంఘసేవ చేస్తామంటూ పాక్‌ సంతతివారి నుంచి విరాళాలు తీసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు వెచ్చిస్తున్నాయి. 2001 డిసెంబరులో జమాత్‌, లష్కర్‌లు కలసికట్టుగా భారత పార్లమెంటుపై దాడి చేశాయి. 2008లో జమాత్‌ ఉద్‌ దవా ముంబయిపై దాడి చేసింది. భారత పార్లమెంటుపై దాడిని పురస్కరించుకుని పాక్‌ ప్రభుత్వం లష్కరే తోయిబాను నిషేధించినా, అది జమాత్‌ ఉద్‌ దావా పేరు మీద కార్యకలాపాలు కొనసాగించింది. అమెరికా విదేశాంగ శాఖ లష్కర్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో లష్కర్‌, మర్కాజ్‌ దవాలు ఫలాహే ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ ఛత్రం కింద క్రియాశీలమయ్యాయి. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలు కొత్త పేర్లతో ముందుకురావడం పాకిస్థాన్‌లో మామూలే. ఈ కపట నాటకాల వల్లనే పాకిస్థాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రే లిస్ట్‌’లో చేర్చింది.

అప్పులూ పుట్టవు

ఎఫ్‌ఏటీఎఫ్‌ చర్య వల్ల పాకిస్థాన్‌ విదేశీ లావాదేవీలు మందగిస్తాయి. విదేశీ మారక ద్రవ్య సరఫరా తగ్గిపోతుంది. ఇప్పటికే భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ఇబ్బందుల పాలవుతుంది. అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఆర్థికంగా దిగజారుతుంది. అక్రమ ధన చలామణినీ, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడానికి గట్టిగా చర్యలు తీసుకోని దేశాలను గుర్తించడానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ బ్లాక్‌, గ్రే లిస్ట్‌లంటూ రెండు జాబితాలను రూపొందించింది. నిర్దేశిత ప్రమాణాలను పాటించని దేశాలను ఈ జాబితాల్లో చేర్చడం వరకే ఎఫ్‌ఏటీఎఫ్‌ బాధ్యత. అంతేతప్ప ఆంక్షలు విధించే అధికారం దానికి లేదు. ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో చేరిన దేశాన్ని ఇతర దేశాలు కొత్తకోణంలో చూస్తాయి. దాని ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఆ దేశ అంతర్జాతీయ లావాదేవీలపై ఇతర దేశాలు నిఘా పెంచుతాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కంపెనీలు ఆ దేశంతో కలసి పనిచేయడానికి ఇష్టపడవు. పెట్టుబడులు రాకపోవడమే కాదు, అప్పులు కూడా పుట్టవు. ఒకవేళ అప్పులు లభించినా అధిక వడ్డీ రేట్లకు తెచ్చుకోవలసి వస్తుంది. అంతర్జాతీయ రుణ రేటింగ్‌ సంస్థలు గ్రేడును తగ్గిస్తాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో రుణాలు, పెట్టుబడులు దొరకవు. ‘గ్రే లిస్ట్‌’లో చేరిన పాక్‌కు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంబంధాలు తెగిపోతాయి. పాక్‌ బ్యాంకులతో సంబంధాలు నెరపడానికి విదేశీ బ్యాంకులు ముందుకు రావు. పాక్‌లో 116 శాఖలతో స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకు అతి పెద్ద విదేశీ బ్యాంకుగా ఉంది. దీనితోపాటు సిటీ బ్యాంక్‌, డాయ్చ్‌ బ్యాంకులూ పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌ చర్యతో అవి అక్కడి నుంచి నిష్కమ్రిస్తే ఆర్థికంగా ఏకాకి అవుతుంది. అక్రమ ధన చలామణి, ఉగ్రవాదులకు నిధుల సరఫరా వంటి నేరాల్లో తాము భాగస్వాములు కాదలచుకోలేదని అంతర్జాతీయ బ్యాంకులు చెప్పేస్తాయి. పాకిస్థాన్‌ పదేళ్ల నుంచి 5 శాతం వృద్ధి రేటుతో 30,000 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ చర్యతో అది పదేళ్లు వెనక్కుపోతుంది. వాణిజ్యలోటు పెరిగిపోతుంది. 2013లో విదేశాలకు చెల్లింపులు చేయలేక సతమతమైనప్పుడు ఐఎంఎఫ్‌ రుణమే గట్టెక్కించింది.ఇప్పుడు ఎఫ్‌ఏటీఎఫ్‌ చర్యతో ఆ దారీ మూసుకుపోనుంది.

-నీరజ్‌ కుమార్‌

(ఈనాడు సౌజన్యం తో)