Home Telugu Articles కాందిశీకుల రైలు పేల్చివేతకు పథకం..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-3)

కాందిశీకుల రైలు పేల్చివేతకు పథకం..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-3)

0
SHARE

నిజాం తన హైద్రాబాద్ సంస్థానంలో హిందువులను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగా ముస్లిం జనసంఖ్యను పెంచుతున్నాడు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది మహమ్మదీయులను తీసుకువచ్చాడు. ప్రత్యేకించి రైల్వేవాళ్ళు స్పెషల్ ట్రైన్సు ద్వారా కాందిశీకులను తరలించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ లోక్‌సభలో ప్రకటనచేస్తూ హైద్రాబాద్‌లో ఎనిమిది లక్షల మంది కాందిశీకులకు నివాసం ఏర్పాటుచేశారని, అందులో పదివేల నాలుగువందల మందిని నిజాం తన సైన్యంలో చేర్చుకున్నాడని చెప్పారు.

ఇలాంటి వాతావరణంలో ప్రతిఘటన కొనసాగాలని నారాయణబాబు స్నేహితులు తీవ్రంగా ఆలోచించారు. మొదట రెఫ్యూజీ గుంపులను తగులబెట్టాలని అనుకున్నారు. చేతి బాంబు కావాలని శ్రీ వందేమాతరం రామచంద్రరావుని కోరారు. కాని అది తరుణం కాదని ఆయన సలహా ఇచ్చారు. అయినా నారాయణబాబు నిరుత్సాహం చెందక స్వయంగా ప్రయత్నాలు కొనసాగించాడు. చివరకు కాందిశీకుల రైలును పేల్చివేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. రైలును పేల్చివేయటం వలన కాందిశీకులు భయపడి రావడం మానేస్తారని నారాయణబాబు అనుకున్నాడు.   రెఫ్యూజీ ట్రైన్ వచ్చే వేళలు కనుక్కొని కార్యక్రమం రూపొందించుకున్నారు.

బలార్షా నుండి వచ్చే రైలు ఘటకేసర్ గుండా హైదరాబాద్‌కు వస్తోంది. హైదరాబాద్‌కు సుమారు 15 మైళ్ళ దూరంలో ఉన్న ఘటకేసర్  మౌలాలీ స్టేషన్ల మధ్య ఒక చోటును ఎన్నుకున్నారు. నారాయణబాబు లోకో ఆఫీసులో పనిచేస్తున్న నారాయణ స్వామి, విశ్వనాథ్‌ల సహాయంతో పరికరాలు సంపాదించాడు. నారాయణబాబు రెండు గంటలు కష్టపడి షిష్ ప్లేట్లను తొలగించాడు. నారాయణస్వామి, విశ్వనాథ్‌లు రెండువైపులా ఉండి కాపలా కాశారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి దగ్గరలో ఉన్న పొదలో దాక్కొని రైలుకోసం చూస్తున్నారు. అనుకోకుండా ఇద్దరు లైన్‌మెన్‌లు చెకింగ్ చేస్తూ వచ్చారు. తొలగించబడిన ఫిష్ ప్లేట్లను చూసి, వచ్చే రైలును ఆపివేశారు. రైలు కూల్చివేత కార్యక్రమం విఫలమైంది. ఆ తర్వాత రైల్వేశాఖ వారు గాంగ్‌మెన్‌లను తీవ్రంగా బాది చూశారు. కానీ ఎవరూ పట్టుబడలేదు.

లక్ష్యసిద్ధికై….

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ముస్లిం పక్షపాతి. ఒకవిధంగా ద్విజాతి సిద్ధాంతం ఇతని కల్పనే. దాని ఆధారంగానే భారతదేశం ముక్కలై పాకిస్తాన్ ఏర్పడింది. మతకల్లోలాలు చెలరేగి భయంకర రక్తపాతం ఏర్పడింది. అయినా డాక్టర్ లతీఫ్ ద్విజాతి సిద్ధాంతాన్ని హైద్రాబాద్‌కు వర్తింపచేయాలని ప్రచారం కొనసాగించారు. ప్రత్యేకించి ఇంగ్లీషులో “క్లెరియన్‌” అనే వార్తాపత్రిక ఇతని సంపాదకత్వాన వెలువడేది. నారాయణబాబు ఈ వ్యక్తిని హత్య చేయాలని నిశ్చయించుకొని రివాల్వర్‌కోసం ప్రయత్నించాడు. కాని సమయానికి ఎవరూ ఇవ్వలేదు. నారాయణబాబు వెనుకాడక ముస్లిం వేషంలో అఫ్జల్ హుస్సేన్ పేరుతో ఇంటికి వెళ్ళి కలుసుకున్నాడు.  డాక్టర్ లతీఫ్ “క్లెరియన్‌” ప్రతులు కూడా ఇచ్చాడు. వరంగల్‌లో ముస్లిం ఉద్యమాన్ని తీవ్రం చేయాలని, మీలాంటి యువకులే మాకవసరమని డాక్టర్ లతీఫ్ వీపు తట్టాడు. కాని తన కోరిక తీర్చుకోకుండానే నారాయణబాబు తిరిగి రావలసి వచ్చింది.

(విజయక్రాంతి సౌజన్యం తో )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here