Home Telugu Articles శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసు చర్య (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-5)

శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసు చర్య (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-5)

0
SHARE

హైద్రాబాద్‌లో సంస్థానంతో శాంతి భద్రతల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌లో సైన్యాన్ని పంపింది. మూడు రోజుల ప్రతిఘటన తరువాత నిజాం మోకరిల్లాడు. సెప్టెంబర్ 17వ తేదీ హైద్రాబాద్ విముక్తి చెందింది. హైద్రాబాద్ సైనిక ప్రభుత్వం నెలకొంది. నారాయణబాబు మృత్యువు జీవనాభిలాషలోకి పరిణితి చెందింది. తనకు రాజకీయ ఖైదీహోదా ఇవ్వాలని కోరాడు. కాని సైనిక ప్రభుత్వం గమనించలేదు. ప్రభుత్వ ఔదాసీన్యం, ఉపేక్షాధోరణి వల్ల ఆయనకు బాధవేసింది. ఫలితంగా 19 రోజుల పాటు నిరాహారదీక్ష వహించాడు. మూత్రంలోంచి రక్తం రాసాగింది. డాక్టర్ మేల్కోటే వ్యక్తిగతంగా వెళ్ళి నచ్చ చెప్పి నిరాహారదీక్ష విరమింపచేసి, చివరకు రాజకీయ ఖైదీ హోదాను ఇప్పించ గలిగారు. నారాయణబాబు, గంగారాంల విడుదలకు ప్రజల ఒత్తిడి తీవ్రంకాసాగింది.

అయినా జైళ్ళ ఇన్‌స్పెక్టర్ జనరల్ వీరిద్దరినీ క్షమాపణ పత్రం వ్రాసి ఇమ్మని అడిగాడు. “తమకు విముక్తి భిక్ష అక్కరలేదని చెప్పి వారిద్దరు తీవ్రంగా మందలించారు. తన కుమారుని క్షమాభిక్ష వేడుకొమ్మని చెప్పి విడిపించుకోవటం తండ్రి పండరీనాథ్‌రావ్‌కు కూడా ఇష్టం లేదు. గంగారామ్ తల్లికూడా స్వాభిమానంతో క్షమాపణపత్రం వ్రాయడానికి నిరాకరించింది. చివరకు భేషరతుగానే 1949 ఆగస్టు 10వ తేదీ నారాయణబాబు, గంగారాంలను విడుదల చేశారు. వీరిద్దరు ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళగా నారాయణబాబు వీపు తడుతూ, “నువ్వు నిజాంపై బాంబులు వెయ్యవలసి వచ్చింది. నేను కాల్పులు జరుపవలసి వచ్చింది” అని ప్రశంసించారు.

హైద్రాబాద్‌ను విముక్తం చేయాలనే స్వప్పం సాఫల్యం చెందిన తర్వాత కుటుంబ పోషణార్థం ఏదో ఉద్యోగం చేయక తప్పలేదు. అసంపూర్ణంగా ఉన్న విద్యాయోగ్యత వల్ల ఎలక్ట్రిసిటీ శాఖలో క్లర్కుగా ఉద్యోగం సంపాదించారు. కాని నలభై ఐదు రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగంలోంచి తీసివేశారు. నారాయణబాబు పేరు పోలీసు బ్లాక్ లిస్టులో ఉందనీ, అందువల్ల ప్రభుత్వోద్యోగం చేయడానికి వీల్లేదని అన్నారు. ఆ నలభై ఐదు రోజుల జీతం కూడా ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యం చాలా మంది దేశభక్తుల పట్ల జరిగింది. ఆ తరువాత ఎప్పటికో నారాయణబాబు పేరు బ్లాక్ లిస్టులోంచి తొలగించబడింది.

ఉమ్రీ బ్యాంక్ దోపిడీ 

1947 తర్వాత ఉక్కుమనిషి సర్దార్ పటేల్ భారతదేశంలో చిన్న పెద్ద సంస్థానాలన్నింటినీ కేంద్రంలో విలీనం చేశారు.  కాని నిజాం పెత్తనం కింద ఉన్న హైద్రాబాద్ మాత్రం మొండిగా స్వతంత్ర ప్రతిపత్తిని కోరింది. అందువల్ల శస్త్రచికిత్స అవసరమైంది. ఆ శస్త్ర చికిత్సయే పోలీస్ చర్యగా పరిణమించింది. అంతకు పూర్వమే అనేకమంది విప్లవవీరులు మాజీ సంస్థాన నిరంకుశ పాలనకు అనేక బాకుపోట్లు పొడిచారు. అనేక మంది యువక వీరులు ప్రాణాలు అర్పించారు. ఈ సంఘటనలలో ఒకటి ఈ “ఉమ్రీ బ్యాంక్ దోపిడి”.

ముదఖేడ్‌కర్ బలిదానం

1946 డిసెంబర్ 16 నాటి సాయంత్రం ఉమ్రీ స్టేట్‌బ్యాంక్ (హైద్రాబాద్) ఆవరణలో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులకు దత్తాత్రేయ ముదఖేడ్‌కర్ భూమిమీద వొరిగాడు. అతని అన్న దిగంబర్‌రావ్ కూడ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల చప్పుడు తర్వాత స్థబ్దత వ్యాపించింది. బ్యాంక్ వాచ్‌మన్ అరబ్బీవాడు జరిపిన కాల్పులకు ముదఖేడ్‌కర్ సోదరులలో ఒకడు నేలకొరిగాడు. మాజీ హైద్రాబాద్ సంస్థానంలో ఉమ్రీపట్టణం ప్రత్తి వ్యాపారానికి ముఖ్యకేంద్రం. ఆ రోజుల్లో ప్రత్తితో నిండిన బండ్లు ఉమ్రీమార్కెట్టుకు వందల సంఖ్యలో వస్తున్నాయి. అది ప్రత్తిపంట కోసిన కాలం.

కాల్పులకు దారితీసిన అసలు విషయం చాలా మామూలైనది. ఉమ్రీ పట్టణంలో మత కలహాలు రెచ్చగొట్టేవారున్నారు ఆ రోజుల్లో. ఒక ముస్లిం ఒక దుకాణానికి వెళ్ళి అగ్గిపెట్టె కొన్నాడు. ఆరుపైసల హాలీకి బదులు ఏడు పైసలహాలీకి ఆ దుకాణదారుడు అగ్గిపెట్టెని అమ్మాడు. ఒక్కపైసాపై గొడవ బయలుదేరింది. హైద్రాబాద్ సంస్థానంలో ఆ రోజుల్లో ముస్లింలందరూ తమకు తామే పాలకులుగా, హిందువులను పాలితులుగా భావించేవారు.

(విజయక్రాంతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here