Home News ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిస్తున్న పోలీస్ అధికారి

ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిస్తున్న పోలీస్ అధికారి

0
SHARE

రోజులో 24 గంటలు డ్యూటీలో ఉండేది పోలీస్‌ ఒక్కరే. శాంతిభద్రతల రక్షణ తప్ప మరో విషయం గురించి ఆలోచించే తీరిక కూడా వారికి ఉండదు. కానీ ఒకవైపు డ్యూటీ సమర్థంగా నిర్వర్తిస్తూనే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు బేగంపేట్‌ పోలీ్‌సస్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉయ్యాల మధు. తను పని చేసే ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని స్నేహితులు, స్థానికులతో కలిసి ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

మనసులో సహాయం చేయాలనే ఆకాంక్ష ఉంటే కావాల్సినంత సమయం దొరుకుతుంది. మేము సైతం అంటూ నలుగురు తోడవుతారు. బేగంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి ఇందుకు మంచి ఉదాహరణ. ఈ పాఠశాలలో నలభైమంది విద్యార్థులు చదువుతున్నారు. బోధన తెలుగు మీడియంలోనే. ఇక వసతుల సంగతి చెప్పనక్కర్లేదు. అపరిశుభ్ర వాతావరణం, మూత్రశాలలు ఉన్నా ఉపయోగించేందుకు వీలు లేకుండా ఉన్నాయి. ఇలా అనేక కారణాల వల్ల ఆ పాఠశాలకు వెళ్లాలంటేనే పిల్లలకు అనాసక్తి ఏర్పడే వాతావరణం తయారైంది.

ఫలితంగా విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. క్రమంగా పాఠశాల ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదంతా గతం. ఇప్పుడు పాఠశాల ఆవరణలో పరిశుభ్ర వాతావరణం, శుభ్రమైన మరుగుదొడ్లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు..ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సదుపాయాలు వచ్చి చేరాయి. అందుకు కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆయనే బేగంపేట్‌ పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఉయ్యాల మధు.

అనుకోకుండా కలిసి..

శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌ ప్రాంతానికి చెందిన హజిటోచర్‌, సత్యనారాయణ అనే వ్యక్తులు ఒకరోజు ఏదో పని మీద ఎస్సై మధుని కలిశారు. మాటల్లో తమ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల దుస్థితి గురించి వివరించారు. వారి మాటలకు చలించిన ఎస్సై పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తానని మాటిచ్చారు. అలా పాఠశాల అభివృద్ధికి బీజం పడింది. పోలీస్‌ ఉద్యోగంలో చేరకముందు లెక్చరర్‌గా విద్యార్థులకు పాఠాలు బోధించిన అనుభవం ఎస్సైకి ఉంది.

ఆయన దగ్గర పాఠాలు విన్న విద్యార్థుల్లో చాలా మంది ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. విద్యార్థుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి మధు. అందుకే మాటలు చెప్పి వదిలేయకుండా స్థానికులతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న అసౌకర్యాలను దగ్గరుండి చూశారు. పిల్లలు తాగేందుకు మంచి నీరు కూడా లేకపోవడం చూసి ఆవేదన చెందారు. తన దగ్గర విద్య నేర్చుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారికి సమాచారం అందించారు. మరికొంతమంది మిత్రులతోనూ చర్చించారు. తరువాత పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధికి నడుం బిగించారు.

వాట్సప్‌ గ్రూప్‌తో సహాయం

విద్యార్థులకు బ్యాగులు, బూట్లు, నోట్‌పుస్తకాలు, ఆట వస్తువులు, కంప్యూటర్స్‌, ఇతర సదుపాయాలు, వైద్య సదుపాయం, ఇంగ్లీషు క్లాసులు అవసరమని గుర్తించారు. ఈ అవసరాలను తీర్చడం కోసం టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. ‘హెల్ఫ్‌ మి టు స్టడీ’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్‌లో పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు, కావలసిన వస్తువులు, తదితర విషయాలను పోస్టు చేశారు. సమస్యలు తీర్చేందుకు అవసరమైన కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. పనుల పర్యవేక్షణకు స్థానికుల సహకారాన్ని తీసుకున్నారు.

 సేవకు శ్రీకారం….

పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. రోజూ పాఠశాల అవరణను శుభ్రం చేసేందుకు ఒక స్వీపర్‌ను నియమించారు. పాఠశాల అవరణలో కొంత భాగం ప్లోరింగ్‌ చేసి ఆటస్ధలంగా మార్చారు. పిల్లలు ఆడుకునేందుకు కొన్ని ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. పిల్లలకు శుద్ధి చేసిన తాగు నీటిని అందించేందుకు వీలుగా ఆర్వో ప్లాంట్‌కు మరమ్మత్తులు చేయించారు.

 ఉపయోగంలో లేని మూత్రశాలలు, మరుగుదొడ్లను బాగు చేయించి వాడుకలోకి తెచ్చారు. పాఠశాలకు అనుకుని ఉన్న ప్రహారీగోడ మరమ్మతులు చేయించారు. భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విద్యాశాఖ ఉన్నతాధికారి చేతుల మీదుగా పిల్లలకు అవసరమైన నోట్‌పుస్తకాలు, బ్యాగులను అందజేశారు.

 అంతేకాకుండా తెలుగు మీడియం పాఠశాల కావడంతో ఇక్కడ విద్యార్థులకు ఇంగ్లీషు నేర్పించడానికి ప్రత్యేక టీచర్‌ను నియమించాలని నిర్ణయించారు. ఇందుకోసం సొంత ఖర్చుతో ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసి ప్రత్యేక ఇంగ్లీషు క్లాసులు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పోలీస్‌ అధికారి చొరవతో ఒక ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆ పాఠశాలను చూసి స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 కార్పొరేట్‌కు దీటుగా….

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా అభివృద్ధి చేసుకోవాలి. పోలీస్‌ ఉద్యోగం రాక ముందు కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులకు ఐఐటి పాఠాలు చెప్పేవాణ్ణి. నేను పాఠాలు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్ధిరపడ్డారు. ప్రస్తుతం వారి సహకారం, స్థానికుల అండదండలతో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాను. ఇక్కడ నుంచి బదిలీ అయ్యేలోగా ఈ పాఠశాలను కార్పొరేట్‌ పాఠశాల స్థాయికి తీసుకెళ్లాలన్నది నా ధ్యేయం.

 

 – మధు ఉయ్యాల, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, బేగంపేట

వేటపాలెం వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)