Home Hyderabad Mukti Sangram ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్లగక్కిన ఖాసిం రజ్వీ.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-24)

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్లగక్కిన ఖాసిం రజ్వీ.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-24)

0
SHARE

రజాకార్ల సాలారే ఆజమ్ (సర్వసైన్యాధిపతి) ఖాసిం రజ్వీ ఉపన్యసిస్తూ హిందువులకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్ళగక్కాడు. అదే సందర్భంలో తన మనస్సులో ఇమ్‌రోజ్ పట్లవున్న విద్వేషాన్ని కూడా పరోక్షంగా వెదజల్లుతూ తన అనుయాయులను ఉద్దేశించి ఇలా ఆదేశించాడు.

“ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు. భారత ప్రభుత్వ ఏజెంట్లుగా ఉంటూ మా సమైక్యతను ధ్వంసం చేయాలనే కీలుబొమ్మల చేతులు ఉండడానికి వీలులేదు. ఆ చేతులు క్రిందికి దిగాలి. లేదా నరికి వేయబడాలి.”

రజ్వీ ఆ విధంగా పరోక్షంగా తన అనుయాయులను హెచ్చరించారు. షోయీబ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలో భావగర్భితంగా చెప్పాడు.

1948 ఆగస్టు 21న రజాకార్ల హింసాకాండ మితిమీరిపోయింది. సంస్థానంలో ముఖ్యంగా హిందువుల ప్రాణాలు, మానాలు, ఆస్తులు అన్నీ రజాకార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి. నగరంలో హిందువులందరూ సాయంత్రం ఆరుగంటలు కాగానే ఇంటిదారి పట్టేవారు. ఏడుగంటల తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. బయటి నుండి వచ్చిన ముస్లిం శరణార్థులు కూడా హిందువులకు సమస్యగా పరిణమించారు. ఎన్నో హిందూ కుటుంబాలు సంస్థానాన్ని వదిలివెళ్ళిపోయాయి.

చెప్పుల బజారు చౌరస్తా కూడా ఆ రోజు రాత్రి కాగానే నిర్మానుష్యమైపోయింది. ఈ బస్తీ కాచిగూడా స్టేషన్‌కు వెళ్ళేదారిలో ఉంది. దాదాపు ఇళ్ళలో ఎక్కడా దీపాలు లేవు. బూర్గుల రామకృష్ణారావుగారి ఇంటిలోని ఒక భాగంలో ఉన్న “ఇమరోజ్‌” కార్యాలయంలో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి. మరుసటి రోజు రావలసిన పత్రిక పని ముగించుకొని సంపాదకుడు షోయీబ్, పత్రికా నిర్వాహకుడు మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ కొద్దిదూరంలో ఉన్న ఇళ్ళకు వెళుతున్నారు. లింగంపల్లి చౌరస్తా దగ్గర ఉన్న ఇళ్ళకు వాళ్ళు ఇద్దరూ వెళుతున్నపుడు అర్ధరాత్రి గడిచిపోయింది. చౌరస్తా దాటి ఉన్న అడుగులు వెళ్ళేసరికి వెనకాల నుండి కొంతమంది పరుగెత్తుకు వచ్చారు.

అందులో ఒకడు షోయీబ్ ముందుకు వచ్చి ఇప్పుడే ఇలా ఒకడు పరుగెత్తిపోయాడు. మీరు చూశారా? అని ప్రశ్నించాడు. షోయీబ్ లేదు, అని సమాధానం ఇవ్వగానే ఆ ప్రశ్నించిన వ్యక్తి నమస్కరించి వెనక్కి తిరిగాడు. వెంటనే షోయీబ్ వెనకాల ఉన్న వ్యక్తి తుపాకీ పేల్చాడు. వరుసగా మూడు తుపాకీ గుండ్లు తగలగానే షోయీబ్ నేలకూలి పోయాడు. వెంటనే ఆ వ్యక్తులు షోయీబ్ రెండు చేతులను కత్తితో నరికివేశారు. అడ్డుపడిన ఇస్మాయిల్ చేతిని కూడా నరికివేశారు. మరో చేతిలో ఒకవేలు మాత్రం తెగిపోయింది. హంతకులు పని ముగించుకొని చీకట్లో కలిసిపోయారు. కేకలు విని షోయీబ్ ఇంటి వాళ్ళందరూ పరుగెత్తుకు వచ్చారు. షోయీబ్ చివరి క్షణంలో కూడా తన భార్యకు ధైర్యం చెప్పాడు. ఆమెకు శ్రీరామకృష్ణదూత్, శ్రీ రామాచారిలాంటి వకీళ్ళు సహాయపడతారని చెబుతూ ప్రాణాలు వదిలాడు. అప్పుడు తెల్లవారుజాము మూడున్నర గంటలు కావస్తున్నది.

రజ్వీ ఇచ్చిన ఉపన్యాస ఫలితంగా ఈ హత్యాకాండ జరిగింది. ముస్లిం దుశ్చర్యలకు వ్యతిరేకంగా రాసిన చేతులు నరికివేయబడ్డాయి. ఒక విధంగా షోయీబ్ తన విద్యార్థి కాలం నాటినుండి కలాన్ని ఆయుధంగా వాడుతూ వచ్చాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ మాసపత్రికలో రచయితగా, చిత్రకారుడిగా, సంపాదక వర్గంలో తన ప్రత్యేకతను నిరూపించుకునేవాడు.

వారపత్రిక ‘తాజ్’ తన కలం బలంపై చాలాకాలం నడిపాడు. నిజాం మత విద్వేషకర చర్యలను తాజ్‌లో షోయీబ్ నిర్భయంగా ఖండించాడు. అదే విధంగా ‘రయ్యత్’ కూడా నిజాం ఫాసిస్టు చర్యలని ప్రజలముందు బట్టబయలు చేశాడు. చివరికి తన “ఇమ్‌రోజ్‌” పత్రిక ద్వారా సాహసోపేతమైన పోరాటాన్ని సాగించాడు. న్యాయం, నీతి, మతసహనం కోసం నిర్భయంగా నిలుచున్నాడు.  అడుగడుగునా ఆర్థికమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ప్రభుత్వ సెన్సారింగ్ విధానాలను తట్టుకుంటూ తన స్వతంత్రమైన పత్రికా రచనను కొనసాగించాడు. ఆ రోజుల్లో నిజాం సంస్థానం భారత్‌లో విలీనం కావాలని అన్నందుకే నవాబ్ మంజూరుజంగ్ లాంటి వ్యక్తి పెన్షన్‌ను నిజాం రద్దుచేశాడు.

అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి షోయీబ్ నిజాయితీతో, ఉత్సాహంతో, ధైర్యంతో సత్యంకోసం తన పత్రికా రచనను అంకితం చేశాడు. వ్యక్తిగతంగా షోయీబ్ గాంధీ విధానాలను సమర్థించేవాడు. సామంత ప్రభుత్వాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజల్లో సమానత్వం నెలకొనాలని షోయీబ్ కలలు కనేవాడు. జాతీయ ఆదర్శాలు గల యువకునిగా తన నిస్వార్థ జీవితాన్ని గడిపాడు. షోయీబ్ హత్య జరిగిన తరువాత నిజాం పోలీసులు శవాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. అధిక సంఖ్యలో కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రికి వచ్చారు.

అక్కడే ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు వచ్చిన వాళ్ళను హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. పోస్ట్‌మార్టం జరిగిన తరువాత శవయాత్రకు అనుమతి ఇవ్వలేదు. గోషామహల్ కుంట ఎదురుగా ఉన్న శ్మశానంలో షోయీబ్‌ను సమాధి చేశారు. బంధువులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఒకరిద్దరు మహమ్మదీయులు మాత్రమే ఖనన క్రియకు హాజరైనారు. చుట్టూ గూఢచారి విభాగం వాళ్ళు కాపలా కాశారు.

మరుసటిరోజు పత్రికల్లో ఒక అధికార ప్రకటన వెలువడింది. గూఢచారి విభాగం దర్యాప్తు జరిగిందని ఈ హత్య వెనకాల ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, వ్యక్తిగతమైన శత్రుత్వమే హత్యకు దారితీసిందని, పోలీసులు ఇంకా విస్తృతంగా దర్యాప్తు జరుపుతున్నారని ఆ ప్రకటన స్పష్టం చేసింది. పోలీసులు హంతకులను ఆనాడు పట్టుకోలేక పోయారు.

షోయీబ్ హత్య హైద్రాబాద్ సంస్థానంపై పోలీసు చర్య అవసరాన్ని మరింతగా స్పష్టం చేసింది. అంతకాలం నిజాం చర్యలను హిందూ ముస్లిం సమస్యగా మాత్రమే తీసుకున్న నెహ్రూ క్రమంగా వాస్తవాన్ని గ్రహించారని ఆ తరువాత ముందుముల నర్సింగరావుగారు చెప్పారు.

పోలీస్ చర్యల తరువాత షోయీబ్ హంతకులు పట్టుబడ్డారు. ప్రత్యక్షంగా హత్య చేసిన వాళ్ళలో రజాకార్లు మొయినీఖాన్ తదితరులు ఉన్నారు. ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో కుట్రదారుగా రజ్వీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మొయిన్‌ఖాన్ తదితరులకు శిక్షపడినా, రజ్వీ మాత్రం తప్పించుకోగలిగాడు.

Source: Vijaya Kranthi