Home Telugu Articles ప్రియమైన అమెరికా శాసనకర్తల్లారా, మీ ‘మిషనరీ’ సేవలు ఇక చాలు!

ప్రియమైన అమెరికా శాసనకర్తల్లారా, మీ ‘మిషనరీ’ సేవలు ఇక చాలు!

0
SHARE

భారత్‌లో ఒక క్రైస్తవ ఎన్‌జీవోను ఎందుకు నిషేధించవలసి వచ్చిందో వివరిస్తూ అమెరికా శాసన నిర్మాతలకు వ్యాసకర్త, బీజేపీ సీనియర్ నాయకులు బల్బీర్ పుంజ్ రాసిన బహిరంగ లేఖ ఇది.

‘నాకే గనుక అధికారముండి, చట్టాలు చేయగలిగితే నేను మొదట చేసే పని మత మార్పిడులను నిషేధించడమే’నని మహాత్మాగాంధీ అన్నారు.

ప్రియమైన శాసనకర్తా,

ఇటీవల, మీలో (అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు– రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) 107 మంది భారత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, అమెరికా దాతృత్వ సంస్థ ‘కంపాషన్‌ ఇంటర్నేషనల్‌’ (సీఐ) భారత్‌లో తన సేవా కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ, ఒక లేఖ రాశారు. మీ సందేశం ఒక స్నేహశీల వివరణతో ప్రారంభమయింది: ‘ప్రపంచంలో అతి పెద్ద, పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థలుగా భారత్‌, అమెరికాల మధ్య అనుబంధాలు రాజకీయ బహుత్వవాదం, చట్టబద్ధ పాలనను ఔదల దాల్చడంలో వేళ్ళూనుకొని వున్నాయి’. అనంతర వాక్యాలలో మీ అసలు ఉద్దేశం వెల్లడయింది. ‘ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్స్‌) ఆక్ట్‌’ను మీ ప్రభుత్వం అమలుపరుస్తున్న తీరుతెన్నుల్లో పారదర్శకత, స్థిరత్వం కొరవడడంపై మా తీవ్ర ఆందోళనను వ్యక్తంచేయడానికి మేమీ లేఖ రాస్తున్నాము. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఐ చుట్టూ కొనసాగుతోన్న వివాదం అనేకానేక మంది భారతీయ బాలల శ్రేయస్సుకు హాని కలిగించే విధంగా పర్యవసించవచ్చు. ఈ కారణంగానే, అమెరికా కాంగ్రెస్‌లో సీఐ వ్యవహారాన్ని తీవ్రంగా పట్టించుకోవడం జరుగుతోంది’.

ప్రియమైన అమెరికా శాసనకర్తల్లారా, ఒక సుదూర వర్ధమాన దేశంలో దురదృష్టవంతులైన అనాథ బాలల సంక్షేమం గురించిన మీ శ్రద్ధాసక్తులు మా మనస్సులను కదిలించి వేశాయి. అయితే, దురదృష్టవంతులైన భారతీయ బాలలకు భవ్య భవిష్యత్తును నిర్మించేందుకై ఎటువంటి స్వార్థానికి తావివ్వని శుద్ధ దయార్ధ్ర దృక్పథమే సీఐ కార్యకలాపాలకు ప్రేరణ అని మీరు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారా? సీఐ మానవీయ సేవల వెనుక రహస్య ఎజెండా లేదా? 1968లో భారత్‌లో సీఐ తన కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి ఆ సంస్థ రికార్డు ఏమిటి? అనాథ బాలల శ్రేయస్సే భారత్‌లో సీఐ కార్యకలాపాల ప్రధాన లక్ష్యమైతే, అటువంటి సేవలను అమెరికాలోనే అందించవల్సిన అవ సరం ఎంతైనా వున్నదనేది ఒక వాస్తవం. 2011లో, అమెరికాలో బాలల పేదరికం అంతకుమున్నెన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగింది. ప్రపంచపు అతి సంపన్న దేశంలో 16.7 మిలియన్‌ బాలలు అభద్ర కుటుంబాలలో నివసిస్తున్నారని 2011లో వెల్లడయింది. ఈ దురదృష్టవంతులైన బాలల సంఖ్య 2007లో కంటే 35 రెట్లు అధికం. మొత్తం అభివృద్ధిచెందిన దేశాలలో బాలల పేదరికం విషయంలో అమెరికాది ద్వితీయ స్థానం!

అర్బన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2016లో నిర్వహించిన ఒక అధ్యయనంలో అల్పాదాయ కుటుంబాలకు చెందిన టీనేజర్లు తమ ఆకలిదప్పులను తీర్చుకోవడానికై మాదక ద్రవ్యాలను విక్రయించడం లేదా వ్యభిచారానికి పాల్పడక తప్పని దుస్థితిని ఎదుర్కొంటున్నారని వెల్లడయింది. ఉండడానికి ఎటువంటి ఇల్లు లేని బాలల సంఖ్య 2013లో రికార్డు స్థాయిలో 25 లక్షలకు (ప్రతి 30 మంది బాలల్లో ఒకరు ఇల్లులేని వారే) పెరిగిందని నేషనల్‌ సెంటర్ ఆన్ ఫ్యామిలీ హోమ్‌లెస్‌నెస్ తన 2014 వార్షిక నివేదికలో పేర్కొంది.

మీ దేశంలో బాలలు పేదరికంతో పాటు కుటుంబాల విచ్ఛిత్తి వల్ల కూడా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతి 36 సెకండ్లకు ఒక జంట విడాకులు తీసుకొంటుంది. అంటే రోజుకు దాదాపు 2400, వారానికి 16,800, సంవత్సరానికి 8,76,000 విడాకులు మంజూరవుతున్నాయి. మరి ఇన్నివేల కుటుంబాలు విచ్ఛిత్తికి గురవ్వడం వల్లే కేవలం 45 శాతం మంది బాలలు మాత్రమే మొదటి వివాహంలో వున్న తమ ఇద్దరు తల్లితండ్రులతో కలిసి జీవిస్తున్నారు. 1960వ దశకంలో వివాహం జరిగిన ఏడాదికే పిల్లలకు జన్మనివ్వడం పరిపాటిగా వుండగా ఇప్పుడు మీ దేశంలో కొత్తగా పుట్టే ప్రతి పది మంది బిడ్డలలోనూ నలుగురికి అవివాహిత లేదా ఒక భాగస్వామితో కలిసి జీవిస్తున్న మహిళలే మాతృమూర్తులుగా వుంటున్నారు.

అమెరికా శాసనకర్తల్లారా, సుఖ సంతోషాలకు నెలవైన గృహం, మానవ సంబంధాలు పటిష్ఠంగా ఉన్న కుటుంబం పేదరికాన్ని ఎదుర్కోవడంలో బాలలకు మెరుగ్గా దోహదపడతాయన్న విషయాన్ని మీరు అంగీకరిస్తారు. మీ దేశంలో అసంఖ్యాక బాలలు అనేక ప్రతికూలతలతో కృంగిపోతున్నారు. గృహఛిద్రం వల్ల ఎదురయిన సమస్యలను ఎదుర్కోవడంలో బాలలకు సమాజం నుంచి ఆర్థికపరమైన సహాయంతో పాటు భావోద్వేగపరమైన మద్దతు విశేషస్థాయిలో అవసరమవుతుంది. మరి ఇటువంటి నిస్సహాయ బాలలను ఆదుకోవాలని కంపాషన్ ఇంటర్నేషనల్‌ ఆరాటపడుతుందా? దాని హృదయం ఆ నిర్భాగ్యుల బాగు కోసం తపిస్తుందా? భారత్‌లో ‘మానవతా పూరిత సహాయం’ కింద సీఐ ఏటా ఐదు కోట్ల డాలర్లను వ్యయం చేస్తుంది. ఎందుకు? అనాథ బాలలను క్రైస్తవులుగా తీర్చిదిద్దడానికి! అమెరికాలో అనాథ బాలలు ఎలాగూ క్రైస్తవులే కదా. మరింత స్పష్టంగా చెప్పాలంటే క్రైస్తవ మత వ్యాప్తికే సీఐ సేవా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ప్రియమైన అమెరికా శాసనకర్తల్లారా, మా పార్లమెంటుకు, న్యాయవ్యవస్థకు జవాబుదారీగావున్న భారతీయ అధికారులు కూడా మా చట్టాల పరిధిలో సీఐ కార్యకలాపాలపై దర్యాప్తు జరిపారు. మా వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవడం న్యాయబద్ధమేనా? భారత్‌లో కరుణా బాల వికాస్‌ ట్రస్ట్‌ ద్వారా సీఐ పనిచేస్తుంది. ప్రతిరోజూ క్రైస్తవ ప్రార్థనలు జరపడం, క్రైస్తవ పండుగలను మాత్రమే జరపడం, బైబిల్ పఠనం విషయంలో బహుమతులు ఇవ్వడం మొదలైనవి ఆ సంస్థ నిర్వహించే బాలల ‘సంక్షేమ’ కార్యకలాపాలలో భాగంగా వున్నాయి. సీఐ లక్ష్యాలు ఏమిటో స్పష్టం కాలేదా?

అలాంటి ‘సేవ’ ఇక మాకు చాలు. 15వ శతాబ్దిలో గోవా తీరానికి పోర్చుగీస్ నావికులు వచ్చిన తరువాత అటువంటి ‘సేవ’ను మేము ఎంతో పొందాం. ఈస్టిండియా కంపెనీ అధికార పత్ర చట్టం (ఛార్టర్‌ ఆక్ట్‌) –1813 లో ఒక నిబంధనను చేర్పించడంలో చర్చ్‌ సఫలమవడంతో బ్రిటిష్‌ మిషనరీలకు మన దేశపు ద్వారాలు తెరుచుకున్నాయి. ‘సేవ’ పేరుతో మిషనరీలు కుటుంబాలను విచ్ఛి న్నం చేశారు; సామాజిక వర్గాలను విడదీశారు. మతం మార్చుకున్న వ్యక్తులను వారి జన్మభూమి సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తిగా దూరం చేశారు.

1857 ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటంలో తిరుగుబాటు జరిగిన ప్రాంతాలలో బ్రిటిష్‌ వారికి విధేయులుగా వున్నవారు కేవలం మతం మార్పిడితో క్రైస్తవులైన భారతీయులు మాత్రమే. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో వున్నాం. అయితే మీలో కొంతమంది ఇంకా 18వ శతాబ్దంలోనే జీవిస్తున్నట్టుగా వున్నది! విగ్రహారాధకుల ఆత్మలను కాపాడి వారిని నాగరీకులను చేయడం దేవుడు తమపై మోపిన భారంగా శ్వేత జాతీయులు విశ్వసించిన శతాబ్దమది. ఆ ‘ఉత్కృష్ట’ బాధ్యతా నిర్వహణను పాశ్చాత్య క్రైస్తవ మిషనరీలు, సంస్థలు తలకెత్తుకున్న కాలమది. మరి 21వ శతాబ్దిలో కూడా 18వ శతాబ్ది విశ్వాసాలతో ప్రపంచాన్ని చూడడం ఎంతవరకు సబబు?

క్రిస్టోఫర్‌ కొలంబస్‌ 1492లో క్రైస్తవ ప్రపంచం కోసం అమెరికా ఖండాలను ‘కనుగొన్నాడు’. మహాసముద్రాలలో వేల మైళ్ళు ప్రయాణించి అమెరికాల తీరానికి చేరే నాటికి కొలంబస్, అతడి సహచరులు పూర్తిగా అలసిపోయారు. తదనంతర కాలంలో ‘రెడ్ ఇండియన్లు’గా పిలవబడ్డ స్థానికులు (అమెరికాల మూలవాసులు) ఆ యూరోపియన్ నావికులకు సాదర స్వాగతం పలికారు. మరి కొలంబస్, అతడి సహచరులు, వారి వారసులు ఆ మూల వాసుల ఆతి థ్యానికి ఎలా బదులు తీర్చుకున్నారో మనందరికీ బాగా తెలుసు. ఆ మూలవాసుల సంస్కృతి ఇప్పుడు వారి సొంతగడ్డపై కేవలం మ్యూజియంలలో మాత్రమే కన్పిస్తుంది. అమెరికాల నిజమైన భూమిపుత్రులు ఇప్పుడు అత్యంత స్వల్పంగా మాత్రమే కన్పిస్తున్నారు. ఈ కాల వైపరీత్యాలను ప్రస్తావించినందుకు మీరు నా భావాలను ఒక హిందూమత దురభిమానివిగా భావించవద్దు. అమెరికా శాసనకర్తల్లారా, మహాత్మా గాంధీ సైతం క్రైస్తవ మిషనరీల అనైతిక కార్యకలాపాలకు ఎంతగానో నివ్వెరపోయారు, తీవ్రంగా నొచ్చుకున్నారు. ‘నాకే గనుక అధికారముండి, చట్టాలు చేయగలిగితే నేను మొదట చేసే పని మతమార్పిడులను నిషేధించడమే’నని ఆయన 1935లో అన్నారు. మతాంతరీకరణలలో అత్యధిక భాగం దగాకోరు పద్ధతులు లేదా ప్రలోభాలతో జరుగుతున్నవి గనుకే ఆయనలా అన్నారు. ఈ వాస్తవాలను మీరు గుర్తుంచుకోవాలి.

మీరు, అమెరికా ప్రజాస్వామ్యపు ప్రముఖ నాయకులు. రొట్టె ముక్కను విసిరి ఆత్మలను కొనుగోలు చేసే కుంభకోణంలో దయచేసి భాగస్వాములు కావద్దు. నా యీ అభ్యర్థనను మీరు వినకపోతే జీసస్ క్రీస్తు మిమ్ములను క్షమించడు గాక క్షమించడు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి ఒక్కరి మత విశ్వాసమూ పవిత్రమైనదిగా పరిగణింపబడి, గౌరవం పొందే మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం మీరూ, మేమూ కలసిపనిచేద్దాం. ప్రలోభాలు లేదా మోసాలు లేదా నిర్బంధ పద్ధతుల ద్వారా మతాంతరీకరణలకు ఇక తావు లేదు. అందుకు ఎలాంటి ఆస్కారమివ్వకూడదు. ఆ పరాత్పరుడిని మనం ఏ పేరుతో పిలిచినా, ఆయన సన్నిధికి చేరుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణించినా ఆయన ఒక్కడే.

– బల్బీర్ పుంజ్

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)