Home Telugu Articles సంస్కృతిని నిలబెట్టే పదసంపదను కాపాడుకోవాలి – డా. మన్మోహన్‌ వైద్య

సంస్కృతిని నిలబెట్టే పదసంపదను కాపాడుకోవాలి – డా. మన్మోహన్‌ వైద్య

0
SHARE
डॉ. मनमोहन वैद्य (लेखक राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह हैं)

మన భాష, మాండలీకం, పదాలు ఉపయో గించకపోతే క్రమంగా కనుమరుగవుతాయి. ‘భాష ఒక వ్యక్తి, సమాజపు గుర్తింపు అవుతుంది. అలాగే అది సంస్కృతిని నిలబెట్టిఉంచే, వ్యాపింపచేసే వాహకం.’ కానీ నేడు అనేక భారతీయ భాషల వాడకం క్రమక్రమంగా తగ్గిపోతోంది. అలాగే అనేక విదేశీ భాషా పదాలు మన భాషల్లోకి చొచ్చుకు వచ్చేశాయి. ఇప్పటికే అనేక భారతీయ భాషలు, మాండలీకాలు మాయమయ్యాయి. ఇది చాలా విచారించవలసిన విషయం.

కొన్ని పదాలు వాడుకలోనుంచి పోవడం నేను గమనించాను. కొన్ని సంవత్సరాల క్రితం మాట. నేను ఉత్తర్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఒకసారి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాను. ఆ కుటుంబంలో అందరూ హిందీ మాట్లాడతారు. కాలేజీ విద్యార్థిని అయిన వాళ్ళ అమ్మాయి మాకు వడ్డిస్తోంది. తల్లి వేడి వేడి రొట్టెలు చేస్తోంది. భోజనం చాలా రుచిగా ఉందని అమ్మకు చెప్పమని ఆ అమ్మాయికి చెప్పాను. భోజనం పూర్తిచేసి, చేతులు కడుక్కుని వచ్చిన తరువాత తల్లిగారిని కలిసాము. నమస్కారం చెప్పిన తరువాత ‘మీ అమ్మాయి మీకు ఏమైనా చెప్పిందా’ అని అడిగాను. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి ఏమి చెప్పలేదని. ఎందుకంటే స్వాదిష్ట్‌ (రుచికరంగా) అనే మాటకు ఆమెకు అసలు అర్ధమే తెలియదు. ఆ అమ్మాయికి ‘టేస్టీ’ అనే ఇంగ్లీష్‌ మాటే తెలుసు.

అలాగే ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లినప్పుడు అక్కడ ఒక కార్యకర్త కుమార్తె పరిచయం అయింది. ఆమె బుగ్గలపై అందమైన సొట్టలు పడుతున్నాయి. వాటిని ఆంగ్లంలో ‘డింపుల్‌’ అంటారు. కానీ ఈ ‘డింపుల్‌’ను మరాఠీ, గుజరాతీలో ఏమంటారో తెలుసు కానీ హిందీలో ఏమంటారో తెలియదు. అదే విషయం ఆ అమ్మాయి అమ్మని అడిగాను. హిందీలో కూడా వాటిని ‘డింపుల్‌’ అనే అంటారని ఆమె చెప్పారు. కానీ ‘డింపుల్‌’ అనేది ఆంగ్ల పదం కదా అన్నాను. ఆవిడకు కూడా హిందీ పదం ఏమిటో తెలియదు. గూగుల్‌ లో చూడమని ఆ అమ్మాయికి చెప్పాను. ఆమె చూసి బుగ్గలపై సొట్టాలను హిందీలో ‘హిల్కోరే’ అంటారని చెప్పింది. ఆ తరువాత హరియానా, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ మొదలైన హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నిటిలో చాలామంది పండితులు, మేధావులు, పిహెచ్‌ డి చేసినవారిని ఇదే విషయం అడిగాను. కానీ వాళ్లెవరికి సమాధానం తెలియలేదు. హిందీలో కూడా ‘డింపుల్‌’ అనే అంటారని అంతా చెప్పారు. కొద్దిమంది మాత్రం ‘గడ’ అంటారని చెప్పారు. అప్పుడే నాకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రతినిధి సభల్లో ఆమోదించిన తీర్మానం గుర్తుకువచ్చింది. మన భాష, మాండలీకం, శబ్దాలు ఉపయోగించక పోతే క్రమంగా కనుమరుగవుతాయని ఆ తీర్మానంలో పేర్కొన్న విషయం నిజమనిపించింది. ఆ తీర్మానంలో ‘భాష ఒక వ్యక్తి, సమాజపు గుర్తింపు అవుతుంది. అలాగే అది సంస్కృతిని నిలబెట్టి ఉంచే, వ్యాపింపచేసే వాహకం.’ అని పేర్కొన్నారు. నేడు అనేక భారతీయ భాషల్లో అనేక పదాలు క్రమంగా మాయమవుతున్నాయి. వాటి స్థానంలో విదేశీ భాషా పదాలు వచ్చి చేరుతున్నాయి. అనేక భాషలు, మాండలీకాలు ఇప్పటికే మాయమయ్యాయి. మరికొన్నిటి అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఇది చాలా విచారించదగిన విషయం.

ఈ పరిస్థితి మారాలంటే మనమే పూనుకోవాలి. వారంలో ఒక రోజు ఒక అరగంట పాటు ఇంట్లోవారంతా ఒక్క ఆంగ్ల పదం ఉపయోగించ కుండా మాతృభాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయగలమా? అప్పుడు కూడా మాతృభాషకు సంబంధించి ఏదైనా పదం తెలియకపోతే భారతీయ భాషల్లో దానికి సమాన అర్ధం ఇచ్చే పదాన్ని ఉపయోగించాలి తప్ప ఆంగ్ల పదాన్ని వాడకూడదు. ఇలా చేయడం సాధ్యపడుతుందా? మొబైల్‌, ఇంటర్‌ నెట్‌ వంటి పదాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి కాబట్టి వాటిని అలాగే ఉపయోగించవచ్చును. కానీ ‘హిల్కోరే’ (బుగ్గ సొట్టలు) అనే మాట బ్రిటిష్‌ వాళ్ళు ఈ దేశంలో అడుగుపెట్టడానికి బాగా ముందునుంచి ఇక్కడ వాడుకలో ఉంది. అలాగే ‘స్వాదిష్ట్‌’ (రుచికరమైన) అనే పదం ముందునుంచి ఉంది. కానీ ‘హిల్కోరే’  ‘డింపుల్‌’గా, ‘స్వాదిష్ట్‌’ ‘టేస్టీ’గా ఎప్పుడు మారాయో పరిశీలించవలసిన విషయమే.

– డా. మన్మోహన్‌ వైద్య, సహ సర్‌ కార్యవహ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌

(లోకహితం సౌజన్యం తో)