Home Telugu Articles ‘సంఘ్‌’పై రాహుల్‌ అపనిందలు

‘సంఘ్‌’పై రాహుల్‌ అపనిందలు

0
SHARE

రాహుల్‌ గాంధీ తన ఐరోపా పర్యటనలో వెలువరించిన ఉపన్యాసాలలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పట్ల వ్యతిరేకత, ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై తప్పుడు అవగాహన ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. మోదీ ద్వేషులు ఆ ఉపన్యాసాలకు హర్షధ్వానాలు చేసివుండవచ్చు గానీ, నిజానికి అవి నిరాశా నిస్పృహల్లో ఉన్న, పరాయీకరణ చెందిన రాజకీయవేత్త ఒకరు విదేశీయులతో జరిపిన సంభాషణలే.

రాహుల్‌ గాంధీ ఇటీవల యూరోప్‌లో పర్యటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా ఆయన గతంలో ఐరోపా దేశాలలో పలుమార్లు పర్యటించకపోలేదు. అయితే అవి చాలవరకు రహస్య పర్యటనలు కావడంతో వాటి వివరాలు మన మీడియాలో వెలువడలేదు. ఇటీవల జర్మనీ, బ్రిటన్‌లో రాహుల్‌ పర్యటనలకు విస్తృత ప్రచారం లభించింది. యూరోపియన్‌ దేశాలలోని ప్రవాస భారతీయులను, తన భావి భారత దార్శనికతతో ప్రభావితం చేసి, కాంగ్రెస్‌కు అనుకూలంగా వారి మద్దతును సమీకరించే ప్రయత్నంలో భాగంగా ఆ పర్యటనలు జరిగాయి. పైగా, భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రథమ కుటుంబం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఈ పర్యటనల కార్యక్రమాన్ని రూపొందించిన దృష్ట్యా సహజంగానే రాహుల్‌ పర్యటనలకు మన మీడియా విశేష ప్రాధాన్యమిచ్చింది.

సరే, భారత్‌ మరోసారి సార్వత్రక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలోని పరిస్థితుల గురించి ప్రవాస భారతీయులకు రాహుల్‌ ఏమి చెప్పారో చూద్దాం. గత నెల లండన్‌లోని ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌’లో రాహుల్‌ ఒక ఉపన్యాసాన్ని వెలువరిస్తూ ఇలా అన్నారు: ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌’ (ఆరెస్సెస్‌) భారతదేశ స్వభావాన్ని మార్చివేయడానికి ప్రయత్నిస్తోంది. భారతీయ జీవనాన్ని సంపూర్ణంగా తన ప్రభావ పరిధిలోకి తీసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రగాఢంగా కాంక్షిస్తోంది. సకల భారతీయ సంస్థలనూ వశపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది… పర్యవసానంగా మనం పూర్తిగా ఒక కొత్త భావనతో తలపడవలసివస్తోంది. నిజానికి అది పునర్‌ జన్మించిన పాత భావనే. అరబ్‌ దేశాలలోని ‘ముస్లిం బ్రదర్‌హుడ్‌’ (1928లో ఈజిప్ట్‌లో నెలకొల్పబడిన ఒక అంతర్జాతీయ ఇస్లామిక్‌ రాజకీయ సంస్థ)కు తుల్యమైనది. ప్రతి జీవన రంగమూ, మానవ కార్యకలాపమూ ఒకే భావజాలంతో నిర్వహింపబడాలని అది విశ్వసిస్తుంది. ఆ భావజాలానికి మినహా మరే భావనలకు ఎటువంటి ఉనికి లేకుండా సమాజ పునర్నిర్మాణం జరగాలని ప్రతిపాదిస్తోంది’.

అంతకుముందు హాంబర్గ్‌ (జర్మనీ)లోని బసెరియస్‌ సమ్మర్‌ స్కూల్‌లో రాహుల్‌ ప్రసంగిస్తూ ఆరెస్సెస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చారు. ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల వారిని అభివృద్ధి ప్రక్రియ నుంచి మినహాయిస్తున్నారని, ప్రగతి ఫలాలు ఆ వర్గాల వారికి అందకుండా చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. ఇలా మైనారిటీ వర్గాల పట్ల వివక్ష చూపుతూ, వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్న కారణంగానే తిరుగుబాటు కార్యకలాపాలు ప్రజ్వరిల్లి ఉధృతమవడానికి ఆస్కారమేర్పడిందని, హింసాకాండ పెచ్చరిల్లిపోతోందని రాహుల్‌ అన్నారు.

రాహుల్‌ ఇంకా ఇలా అన్నారు : ‘అమెరికా 2003లో ఇరాక్‌ను ఆక్రమించుకున్నప్పుడు ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట తెగ ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి అనర్హులు. అప్పట్లో అది అపాయకరంగాని నిర్ణయంగా కన్పించింది. అయితే కొద్ది నెలల వ్యవధిలోనే ఆ నిషిద్ధ తెగ (టిక్రిత్‌) ముస్లింలకు, ఇరాక్‌లోని సెల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లతో అవినాభావ సంబంధమేర్పడింది. అలాగే గ్రామాలలో మిగిలిపోయిన ఫిరంగి గుండ్లనూ టిక్రిత్‌లు స్వాయత్తం చేసుకోవడం జరిగింది. వివక్షకు గురైన టిక్రిత్‌లకు నవీన కమ్యూనికేషన్ల సదుపాయాలు, ఆయుధ సామగ్రి లభించడంతో అమెరికన్ దురాక్రమణదారులపై తిరుగుబాటు పెచ్చరిల్లింది. అమెరికన్‌ సైనికులు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. కథ అంతటితో ముగియలేదు. తిరుగుబాటు కార్యకలాపాలు ఇరాక్‌లో ప్రశాంతంగా ఉన్న ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. పొరుగున ఉన్న సిరియాకు కూడా వ్యాపించాయి. దరిమిలా అవి, ఇంటర్నెట్‌ ఆలంబనతో ఐఎస్‌ఐఎస్‌ అనే మహా భయానక భావన ఆవిర్భావానికి కారణమయ్యాయి’. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఒక విదేశీ గడ్డపై ఈ వెర్రి మాటలు మాట్లాడారు! వాస్తవాలేమిటి?

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీకి న్యూఢిల్లీలో ఆతిథ్యమిచ్చింది. ముస్లిం బ్రదర్‌హుడ్‌లో మోర్సీ ఒక కీలక నాయకుడు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఏడు ఒప్పందాలపై ఆ సందర్భంగా భారత్‌, ఈజిప్ట్‌లు సంతకాలు చేశాయి. ఇది జరిగిన కొద్దికాలానికే మోర్సీని అధికారం నుంచి కూలదోశారు. ఇప్పుడు ఆయన జైలులో ఉన్నాడు. జాతి హితులైన భారతీయులు తమ మాతృదేశం మారాలని, మరింత మెరుగైన , సంపద్వంతమైన భారత్‌ ఆవిర్భవించాలని కోరుకోవడంలేదూ? అవినీతికి తావులేని, ఆశ్రిత పెట్టుబడివారీ విధానం లేని, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంలేని పాలనావ్యవస్థ గల భారతదేశాన్ని వారు కోరుకొంటున్నారు.

తన భావజాలానికి మరింత విస్తృత ప్రాచుర్యం సాధించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఆరాటపడుతోంది. ఇందులో తప్పేమీ లేదు. అయితే స్వతంత్ర భారతదేశంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నెహ్రూ– గాంధీ కుటుంబం నాయకత్వాన్నే ఔదలదాలుస్తూ, ఆ కుటుంబానికి చెందని మరెవ్వరి నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదన్నది ఒక వాస్తవం కాదూ? ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రతి రెండో సంస్థకూ నెహ్రూ– గాంధీ కుటుంబ సభ్యుని పేరే పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఆరెస్సెస్‌, బీజేపీలతో పోల్చడం మహా ఘోరం. ముస్లిం బ్రదర్‌ హుడ్‌ ఒక ఉగ్రవాద సంస్థ అని కొన్ని దేశాలు ప్రకటించాయి. మరి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు 90 సంవత్సరాల అనుపమాన సేవా చరిత్ర ఉన్నది. ఆ సంస్థ కార్యకర్తలు భారత్‌లో ఎక్కడ ప్రాకృతిక విపత్తులు సంభవించినా అక్కడ బాధితుల సహాయ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు; వారి పునరావాసానికి విశేషంగా తోడ్పడుతుంటారు. కాలాతీత సమ్మళిత విలువలు, విశ్వజనీన దృక్పథం గల హిందూత్వ తన భావజాలమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్పష్టంగా ప్రకటించింది. మత సంకుచితత్వాన్ని సంఘ్‌ స్పష్టంగా వ్యతిరేకిస్తుంది. సామాజిక న్యాయాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తుంది. ఆలోచనలో, ఆచరణలో ప్రగతిశీలి ఆరెస్సెస్‌. వామపక్ష భావజాల స్ఫూర్తితో ఐదు దశాబ్దాలకు పైగా ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా చాలా విష ప్రచారం జరుగుతోంది. అయినా సంఘ్‌ ఇప్పటికీ భారత్‌లోనూ, ప్రపంచంలో భారతీయులు ఉన్న ప్రతి చోటా తన ప్రభావాన్ని అమితంగా నెరపుతోంది. ఎవరూ విస్మరించడానికి వీలులేని ఒక మహాసంస్థగా వెలుగొందుతోంది.

చాలా మంది భారతీయ ముస్లింలు జాతీయ ప్రధాన స్రవంతికి దూరమయ్యారనడంలో సందేహం లేదు. అయితే ఇది అమెరికా, క్రైస్తవులు అత్యధికంగా ఉండే పలు యూరోపియన్‌ దేశాల విషయంలో కూడా నిజమే. ఆ దేశాలలో ఎక్కడా ముస్లింలు జాతీయ ప్రధాన స్రవంతిలో భాగంగా లేరన్నది ఒక వాస్తవం. పాశ్చాత్యదేశాల దాకా ఎందుకు, మన పొరుగున ఉన్న పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్‌ మొదలైన ఇస్లామిక్‌ దేశాలలో కూడా ముస్లింలు, ఇతర మతాల అనుయాయులతో తీవ్రంగా ఘర్షిస్తున్నారు. అంతేకాదు ఒకే మతం వారై వుండి కూడా శాఖా బేధాలతో తమలో తాము అంతే తీవ్రంగా పోట్లాడుకుంటున్నారు.

ముస్లిం సామాన్య ప్రజానీకాన్ని ఆధునిక విద్యావంతులుగా రూపొందించడం ద్వారా ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని నియంత్రించవచ్చని పలువురు విశ్వసిస్తున్నారు. అయితే వాస్తవాలు ఈ విశ్వాసాన్ని బలపరిచేవిగా లేవు సుమా! ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ తీవ్రవాదులను చూడండి. ఒసామా బిన్‌ లాడెన్‌ ఒక కెమికల్‌ ఇంజనీరు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌, అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌) నాయకుడు అబు అల్‌–బాగ్దాదికి ఇస్లామిక్‌ స్టడీస్‌లో పిహెచ్‌.డి ఉన్నది. అమెరికాకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 11 ఉగ్రవాద దాడులలో లో కీలక పాత్ర వహించిన అల్‌ –జవాహిరి ఒక ఫిజీషియన్‌. అలాగే క్యాంప్‌ చాప్‌మాన్‌ ఆత్మాహుతి బాంబర్ హమామ్ ఖలీల్‌ అల్‌ బలా కూడా ఒక ఫిజీషియనే. టైమ్స్‌ స్క్వేర్‌ బాంబర్‌ ఫైసల్‌ షాజాద్‌కు మేనేజ్‌మెంట్‌లో ఒక డిగ్రీ ఉన్నది.

సరే, మళ్ళీ మన రాహుల్‌ వద్దకు వెళదాం. ఒక నిర్దిష్ట సామాజిక బృందానికి ప్రభుత్వోద్యోగాలు ఇవ్వడానికి తిరస్కరించడం వల్లే ఐ ఎస్‌ ఐఎస్ ఉనికిలోకి వచ్చిందని ఆయన అన్నారు కదా. అయితే ఆ ఉగ్రవాద సంస్థ 1999 లోనే జోర్డాన్‌లో ప్రారంభమయినట్టు రికార్డులు స్పష్టంగా చెప్పుతున్నాయి. అప్పటికి ఇరాక్‌ ఇంకా సద్దాం హుస్సేన్‌ పాలనలో ఉన్నది.

ఐఎస్‌ఐఎస్‌ మాతృసంస్థ పేరు జమాత్‌ అల్‌–త్వాహిద్‌వాల్‌–జిహాద్‌ (ఏకేశ్వరవాద, పవిత్ర యుద్ధ సంస్థ). దీనిని జోర్డాన్‌ దేశస్థుడైన అబు మసబ్‌ అల్‌–జర్ఖావి నెలకొల్పాడు. అమెరికా సేనలు ఇరాక్‌ను ఆక్రమించుకోక ముందు తన సంస్థకు మద్దతు సమీకరించడానికై జర్ఖావి ఇరాక్‌ అంతటా పర్యటించాడు. ఇతడే 2004లో ‘ఇరాకి అల్‌–కాయిదా’ను ఏర్పాటు చేశాడు. 2006లో అమెరికా సేనలు జర్ఖావిని హతమార్చాయి. అతని వారసుడు అబు అయ్యబ్‌ అల్‌–మస్రి తమ గ్రూపుకు ఇస్లామిక్ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌గా నామకరణం చేశాడు. 2010లో మస్రి హతమయ్యాడు. ఆయన స్థానంలో అబు అల్‌–బాగ్దాది నాయకత్వాన్ని చేపట్టాడు. ఆ తరువాత అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న సిరియా తిరుగుబాటుసేనలు ఇస్లామిక్ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌లో చేరడంతో అది ఇస్లామిక్ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్‌)గా రూపాంతరం చెందింది. ఒక సామాజిక బృందానికి ప్రభుత్వోద్యోగాలివ్వడానికి తిరస్కరించిన కారణంగా ఐఎస్‌ఐఎస్‌ ఉనికిలోకి రాలేదు. ఐఎస్‌ఐఎస్‌ ఆవిర్భావం ఇస్లామిక్ ధర్మశాస్త్రం స్ఫూర్తితో నిరంతరాయంగా కొనసాగిన ఒక ప్రక్రియ. ఐరోపాలో ఇస్లాంకు మారిన క్రైస్తవులందరూ ఉగ్రవాదులుగా పరిణమించారు.

మరి ఈ ఇస్లామిక్‌ తీవ్రవాదులు అభివృద్ధికి విఘాతం కల్గించడం లేదూ? ముస్లింల పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించిన నాయకుడు మన జాతి పిత మహాత్మా గాంధీ కంటే మరెవ్వరైనా ఉన్నారా? ఆనాటి ఉమ్మడి భారతదేశంలో ముస్లింల డిమాండ్లు ఎన్నిటినో ఆయన అంగీకరించారు. తద్వారా వలసపాలకులపై పోరాటంలో వారిని కలుపుకుపోయేందుకు ఆయన ప్రయత్నించారు. ముస్లింలతో ఎంతగా సర్దుబాటు చేసుకున్నప్పటికీ దేశ విభజనను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారు. రాహుల్‌ గాంధీ తన ఐరోపా పర్యటనలో వెలువరించిన ఉపన్యాసాలలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పట్ల వ్యతిరేకత, ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై తప్పుడు అవగాహన ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. మోదీ–ద్వేషులు, భారతదేశ ఉదారవాద, సహనశీల, విశ్వజనీన చింతనా సంప్రదాయాలను ఆమోదించని వారు ఆ ఉపన్యాసాలకు హర్షధ్వానాలు చేసివుండవచ్చు గానీ నిజానికి అవి నిరాశా నిస్పృహల్లో ఉన్న, పరాయీకరణ చెందిన రాజకీయవేత్త ఒకరు విదేశీయులతో జరిపిన సంభాషణలే. స్వదేశంలోని రాజకీయ ప్రత్యర్థులపై నిందలు మోపడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు భారత్‌ ప్రయోజనాలకు హాని కలిగించారనడంలో సందేహం లేదు.

బల్బీర్‌ పుంజ్‌

(వ్యాసకర్త సీనియర్‌ బీజేపీ నాయకుడు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here