Home News తీర్మానం -1: భారతీయ కుటుంబ వ్యవస్థ – మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక

తీర్మానం -1: భారతీయ కుటుంబ వ్యవస్థ – మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2019, గ్వాలియర్

తీర్మానం -1: భారతీయ కుటుంబ వ్యవస్థ – మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక

కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది.   బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం. కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది.

మన పవిత్రమైన సాంస్కృతిక వారసత్వానికి అత్యుత్తమ ప్రతీక అయిన మన కుటుంబ వ్యవస్థ ఇటీవల విచ్చిన్నం అవుతున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడానికి ప్రధాన కారణం స్వార్థం,  భౌతికవాద ధోరణి.  భౌతికమైన అవసరాలపై దృష్టి పెట్టె ఆలోచన కారణంగా, స్వార్థ పూరితమైన, ఎబ్బెట్టుగా ప్రవర్తన, అదుపులేని కోరికలు, దురాశ, ఒత్తిడి, వైవాహిక సంఘర్షణ మొదలైనవి పెరిగిపోతున్నాయి. మన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. అతి చిన్న వయసులోనే పిల్లలను హాస్టల్ లో పెట్టె ధోరణి కూడా పెరుగుతోంది. కుటుంబం నుంచి వచ్చే మానసికమైన భద్రత లేక, యువతరంలో ఒంటరితనం పెచ్చరిల్లుతోంది. దీని కారణంగా, మత్తు పదార్ధాలకు అలవాటు పడడం, హింస, హేయమైన నేరాలు, ఆత్మహత్యలు ఆందోళనకరమైన స్థాయికి చేరుతున్నాయి. కుటుంబ రక్షణ లేక వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం.

మన కుటుంబ వ్యవస్థలో చైతన్యవంతమైన, విలువలతో కూడిన లక్షణాన్ని కాపాడేందుకు సమగ్రమైన, పటిష్టమైన ప్రయత్నం జరగాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ  విశ్వసిస్తోంది. మన రోజువారీ ప్రవర్తన, నడవడిక ద్వారా, మన కుటుంబ జీవనం వ్యక్తిత్వాన్ని, జీవన విలువలను పెంపొందించి, పరస్పర సంబంధాలను పటిష్ఠపరచేలా చూసుకోవాలి. భోజనం, ప్రార్థన, పండుగలు, తీర్థయాత్రల ద్వారానూ, మాతృభాష వాడకం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, కుటుంబ సామాజిక సంప్రదాయాలను కాపాడడం ద్వారా కుటుంబ జీవనం ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబం, సమాజం పరస్పర పూరకమైనవి. సామాజిక బాధ్యత ఉండేలా ప్రేరేపించడం, సామాజిక, ధార్మిక, విద్యా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కుటుంబ వ్యవస్థలో లక్షణాలు కావాలి.

తల్లి మన కుటుంబ వ్యవస్థకు కీలకం. మాతృశక్తిని గౌరవించడం ప్రతి కుటుంబ సభ్యుడికి నేర్పించాలి. సమిష్టి నిర్ణయాలు కుటుంబంలో అలవాటు కావాలి. హక్కులు కాక, బాధ్యతలు, విధులు ప్రాధాన్యతగా కుటుంబంలో చర్చలు జరగాలి. మన విధులను మనం నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కుల పరిరక్షణ జరుగుతుంది.

కాలం గడుస్తుంటే, మన సమాజంలోకి కొన్ని వక్రీకరణలు, కొంత ప్రతికూలత వచ్చి చేరాయి. వరకట్నం, అంటరానితనం, వివక్ష, భారీగా దుబారా ఖర్చు, మూఢ నమ్మకాలు మదలైనవి మన సమాజం సర్వతోముఖాభివృద్ధికి ఆటంకాలుగా పరిణమించాయి. మన కుటుంబాల నుంచి సమాజం వరకు అందరూ ఈ దురాచారాలను లోపాలను పెకలించి, విలువలు ఆధారితంగా ఉండే సామరస్యపూర్వకంగా సమాజం కోసం కృషి చేయాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది.

పరమ పూజనీయులైన సాధువులు, సామాజిక, మత, విద్యా, వైజ్ఞానిక సంస్థలు సామాజికాభివృద్ధిలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కుటంబాన్ని పటిష్టపరిచేందుకు ప్రయత్నించాలని ప్రతినిధి సభ వారిని కోరుతోంది. సమాజానికి విలువలు నేర్పడంలో మీడియా మంచి సాధనం. ఆ రంగంలో ప్రముఖులు కుటుంబ వ్యవస్థ మూలలను బలపరచి, కొత్త తరం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చూసేందుకు స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం, ఇతర కార్యక్రమాలు రూపొందించడం చేయాలనీ ప్రతినిధి సభ కోరుతోంది. విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు, కుటుంబ సంబంధ చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా ఆలోచించాలని కూడా కోరుతోంది.

పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాల్లో ఉండేవారు తమ పూర్వీకుల కుటుంబంలో అందరితో సంబంధాలు పెట్టుకుని, వీలైనప్పుడల్లా, ఉమ్మడిగా వారితో సమయం గడపాలి. మన పూర్వీకుల స్థలంతో సంబంధం కలిగి ఉండడం అంటే మన మూలలను మళ్ళీ స్పృశించినట్లే. అందువల్ల కుటుంబంగా కలిసి ఉండడం, కలిసి సేవా కార్యక్రమాలు చేయడం వంటివి జరపాలి. కుటుంబ, సామాజిల బంధాలను దృఢం చేసేందుకు పిల్లల ప్రాధమిక విద్య స్థానిక వాతావరణంలో జరగాలి. మనం నివసించే ప్రాంతాల్లో పండుగలు, కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలకి కూడా పెద్ద కుటంబంలో భాగం అన్న భావన కలుగుతుంది. చిన్న పిల్లలు, కిశోర బాలలకు బాల గోకులం, సంస్కార వర్గ వంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల వారి పెరుగుదల సమతూకంతో జరుగుతుంది.

త్యాగం, సంయమనం, ప్రేమ, ఆత్మీయత, పరస్పర సహకారం సంతోషకరమైన కుటుంబానికి ప్రాతిపదికలు. ఈ లక్షణాలన్నీ కల కుటుంబం తన సభ్యులందరికీ ఆనంద జీవనం అందించగలుగుతుంది. అత్యంత విలువైన కుటుంబ వ్యవస్థను మరింత విలువలతో కూడుకున్న చైతన్యవంతమైన వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలనీ స్వయం సేవకులు, ముఖ్యంగా యువతరం, యావత్ సమాజానికి అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here