Home News దేశవ్యాప్తంగా ఆర్‌.ఎస్‌.ఎస్ స్థిరంగా విస్తరిస్తున్నది – డాక్టర్ మన్మోహన్ వైద్య

దేశవ్యాప్తంగా ఆర్‌.ఎస్‌.ఎస్ స్థిరంగా విస్తరిస్తున్నది – డాక్టర్ మన్మోహన్ వైద్య

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్ సంఘ కార్యం  స్వయం సేవకుల కఠినమైన పరిశ్రమ, సమాజంలో అనుకూలమైన వాతావరణం కారణంగా ఆర్‌.ఎస్‌.ఎస్ సంఘ కార్యం  దేశవ్యాప్తంగా నిరంతరం విస్తరిస్తోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఈ కార్యంలో పాలుపంచుకుంటున్నారని ఆర్‌.ఎస్‌.ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య తెలిపారు. అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాల సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భువనేశ్వర్ లోని ‘శిక్షా, అనుసంధాన్’ విశ్వవిద్యాలయంలో మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరిగాయి.

సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ రామాలయ నిర్మాణం రాజకీయ సమస్య కాదని ఆయన అన్నారు. ఇది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయమని అన్నారు. ఆర్టికల్ 370 ను రద్దు గురించి మాట్లాడుతూ  అది  రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధన అన్నారు.  మరో ప్రశ్నకు సమాధానమిస్తూ  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జాతీయవాద ఆలోచనలు  ఉన్నవారిపై దాడులు జరుగుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.

సమాజానికి సంబంధించినవన్నీ  ఏ ప్రభుత్వమూ పూర్తిగా నెరవేర్చలేదు. సమాజమే అందుకు పూనుకోవాలి. అందుకనే సమాజ సంస్కరణ కోసం  ఆర్‌.ఎస్‌.ఎస్ స్వయంసేవకులు చురుకుగా కృషి చేస్తున్నారని డాక్టర్ వైద్య అన్నారు. స్వయం సేవకులు 1998 లో ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ఫలితం ఈ రోజు కనిపిస్తున్నదని ఆయన అన్నారు. అలాగే కుల వివక్షను తొలగించి, సమాజంలోని అన్ని వర్గాలలో అవగాహన కల్పించడం ద్వారా సామరస్యాన్ని తీసుకురావడానికి ఆర్‌.ఎస్‌.ఎస్ స్వయంసేవకులు కృషి చేస్తున్నారు. దేశీయ భారతీయ ఆవు జాతులను పరిరక్షించడానికి కూడా వారు కృషి చేస్తున్నారు, ఇప్పుడు చిన్నకుటుంబాల ప్రాబల్యం పెరిగిన కారణంగా, కుటుంబ విలువలు క్షీణిస్తున్నాయని, వాటిని పునరుద్ధరించడానికి స్వయం సేవకులు ‘కుటుంబ ప్రబోధన్’ కార్యక్రమం చేపట్టారు.  పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నాటడం, జల సంరక్షణ, ‘ప్లాస్టిక్ వద్దు’ అనే నినాదంతో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలాంటి  కీలకమైన కార్యక్రమాలు చేపట్టారని డా. వైద్య వివరించారు.

ప్రస్తుతం 57,411 రోజువారీ శాఖలు, 18,923 ‘వారంతపు శాఖలు’ (సాప్తాహిక్ మిలన్) ఉన్నాయని డాక్టర్ వైద్య తెలిపారు. 2009 లో విస్తరణ కార్యక్రమం చేపట్టారు.  2010 నుండి ఆర్ఎస్ఎస్ శాఖలు 19,584 పెరిగాయి. 2010 నుండి 2014 వరకు సుమారు 6000 శాఖలు పెరిగాయి. ప్రస్తుతం ఆర్‌.ఎస్‌.ఎస్ స్వయం సేవకులు దేశంలోని 6000 బ్లాక్ లలో నిర్వహిస్తున్నారని, ఇవి మొత్తం బ్లాక్ లలో 90 శాతం అని ఆయన అన్నారు.

శాఖలకు హాజరయ్యే వారిలో 60 శాతం మంది విద్యార్థులు లేదా యువత అని, సుమారు 29 శాతం స్వయంసేవకులు 20-40 సంవత్సరాల వయస్సు గలవారు, 40 ఏళ్లు పైబడిన వృద్ధులు 11 శాతం ఉన్నారని డాక్టర్ వైద్య చెప్పారు.