Home News “సంకల్పబద్ధులం కావాలి”: శ్రీ రామనవమి పర్వదిన సందర్భంగా మాననీయ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి సందేశం

“సంకల్పబద్ధులం కావాలి”: శ్రీ రామనవమి పర్వదిన సందర్భంగా మాననీయ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి సందేశం

0
SHARE
File photo - Bhaiyyaji Joshi

నేడు శ్రీ రామనవమి పండుగ. ఈసారి కొంత భిన్నమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాము. భగవాన్ శ్రీ రాముడు విష్ణువు అవతారం. ఆయన రాక్షస శక్తులను ఎదిరించి మానవ సమాజాన్ని, ధార్మిక విలువలను రక్షించారు. నేడు మనం ఒక కొత్త ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రపంచమంతా ఈ ప్రమాదం వల్ల భయాందోళనకు గురవుతోంది. అంటురోగం వ్యాపించింది. దీనిని అరికట్టాలంటే దాని వ్యాప్తిని అడ్డుకోవాలి. వైద్యులు, ప్రభుత్వం సూచించిన సలహాలను అందరూ పాటించాలి. అప్పుడే మనం ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతాం. కాబట్టి ఈ పర్వదినాన మనం సంకల్పబద్దులమై ఈ సంకటాన్ని అధిగమించాలి. ప్రపంచం ముందు ఒక ఆదర్శాన్ని ఉంచాలి.

దేశవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు సేవాకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి అవసరాలు వస్తే వాటిని తీర్చడానికి  స్వయంసేవకులు సేవాభావంతో పనిచేస్తున్నారు. నేడు 10వేల స్థలాల్లో లక్షలాదిమంది స్వయంసేవకులు వివిధ సమాజ అవసరాలను తీర్చడానికి నిరంతరం పనిచేస్తున్నారు. ఈ విధంగా దాదాపు 10 లక్షల కుటుంబాలను స్వయంసేవకులు కలుస్తున్నారు. లక్షమంది స్వయంసేవకులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా భోజన సామగ్రి అందజేయడం, సానిటైజర్ మొదలైన వస్తువులు అందించడం, ఆసుపత్రుల్లో సేవ చేయడం వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను..

మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో ఘుమంతు తెగకు చెందినవారి నివాసాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘ స్వయంసేవకులు కొన్ని బస్తిల్లో భోజన సదుపాయం కలిగించారు. వెయ్యిమంది స్వయంసేవకులు ఒక ఆసుపత్రిలో రక్తదానం చేసి అక్కడి అవసరాన్ని తీర్చారు. అలాగే వివిధ ప్రదేశాల్లో రాత్రిపగలు విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బందికి భోజనం, అల్పాహారం మొదలైనవి స్వయంసేవకులు సమకూరుస్తున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం కరపత్రాల వితరణ, చిన్న చిన్న సమూహాలు, కుటుంబాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం చేస్తున్నారు.

ఉపాధికోసం వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకునేవారు చాలామంది కనిపిస్తారు. ఇలాంటివారు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనిశ్చితి, అభద్రత మధ్య వాళ్ళు తమ సొంత ఊళ్ళకు పయనమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో జనం ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అందుకని ఇలాటివారిలో సమాజం మాకు అండగా ఉంది అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపడం చాలా అవసరం. సంఘ స్వయంసేవకులు ఈ పని కూడా చేస్తున్నారు.

నగరాలు, పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు భయంతో వీరిని గ్రామాలలోకి అనుమతించని సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. అలా ఊళ్ళకు తిరిగి వస్తున్నవారికి అవసరమైన వైద్య పరీక్షలు ముందుగా చేస్తే ఇలాంటి ఇబ్బందులు రావు. అయితే చాలామంది గ్రామంలో ప్రవేశించలేక ఊరు బయటనే ఉండాల్సివస్తోంది. ఇది కూడా ఒక ముఖ్యమైన సమస్య.

పోలీసులు, వైద్య సిబ్బంది అత్యవసర సేవలు అందిస్తున్నారు. వీరికి మనం ఎలా సహకరించవచ్చన్నది కూడా ఆలోచించాలి.

మనమంతా సమాజాన్ని సంఘటిత పరచడానికి ప్రయత్నిస్తాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాన్ని, లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ స్వయంసేవకులు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధన చేస్తున్నారు. అలాగే తమ తమ కుటుంబాల్లో కూడా సానుకూల వాతావరణం నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంకా రెండు వారాలు గడవాలి. ఈ రెండు వారాలు ఇలాగే నియమాలను పాటిస్తే ఆ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను విశ్వసిస్తున్నాను.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సేవ కార్యక్రమాలు చేపట్టాలన్నది మన చుట్టుపక్కల ప్రదేశాల్లో అవసరాలను బట్టి మనమే నిర్ణయించుకోవాలి. మనతోపాటు పనిచేయడానికి, అవసరమైన ఆర్ధిక సహాయం అందించడానికి అనేకమంది ఆసక్తి చూపుతున్నారు.

అనేక ప్రాంతాల నుంచి సలహాలు కూడా వస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో కలిసి పనిచేయాలన్న ఆసక్తి చాలమందిలో కనిపిస్తోంది. ఇలాంటివారిని కలుపుకుని మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అది శక్తివంచన లేకుండా పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. అనేక సేవ కార్యక్రమాల్లో నిమగ్నమైన స్వయంసేవకులు అభినందనీయులు. ప్రస్తుత పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో మనకు తెలుసు. అయినా వీటిలోనే మన ధైర్యంగా, సాహసంతో పనిచేస్తే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది.

శ్రీ రామచంద్రుడిని మరోసారి తలుచుకుంటూ మనం ఈ సంకట స్థితి నుంచి బయటపడతామని భావిస్తున్నాను. రాగల రెండు వారాలపాటు మనం ఈ విధంగానే పని చేయాలి. సమాజంలో అవగాహన పెంచి, ఇతరులు కూడా మనతో కలిసి పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. శ్రీ రామనవమి పండుగ మనకు సమాజ సురక్ష, సేవ, సామాజిక జాగరణ సందేశాన్ని మనకు ఇస్తున్నది. మరోసారి  అందరికీ  శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here