Home Telugu Articles భాగ్యనగరంలో విజయ సంకల్ప శిబిరం

భాగ్యనగరంలో విజయ సంకల్ప శిబిరం

0
SHARE

ఆర్.ఎస్.ఎస్ అంటే తెలియని వారు ఉండరు. దేశభక్తికి, జాతీయవాదానికి, హిందూ సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకున్న సేవా సంస్థగా శతవసంతాల వైపు దూసుకువెడుతోంది.  అణువణువునా  భారతీయతను నింపుకొని, భరతమాత బిడ్డలుగా  చెప్పుకొని, భారతీయ సంస్కృతిని చాటుతూ భరత ఖండాన్ని పరిరక్షించుకునే దిశగా అలుపెరుగని పోరాటం చేస్తోంది.  విమర్శలు, నిషేధాలు, నిందలు మోస్తూనే …  తెగువతో అడుగులు వేస్తుంది. తన మూల సిద్ధాంతాల్లోని ఒక్కో లక్ష్యాన్ని ఓర్పుగా, నేర్పుగా నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఒకప్పుడు కొన్ని రాజకీయపక్షాలకు అంటరాని సంస్థ గా ఉన్నా… ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న అతి పెద్ద సేవాధార్మిక  సంస్థ ఆర్.ఎస్.ఎస్. ఇజాలు పద్ధతులు ఏవైనా, ఎవరికైనా కష్టం వస్తే అక్కడ అడుగుపెట్టి సాయం చేయడంలో ఆ సంస్థ సభ్యులకు ఉన్న చిత్తశుద్ధిని శంకించే వారు లేరు.  రాజకీయ విభేదాలు, సిద్ధాంత రాద్ధాంతాలున్నా చైనాతో యుధ్ధ సమయంలో ఆర్.ఎస్.ఎస్ అందించిన సేవలను నెహ్రూ, శాస్త్రి మెచ్చుకున్న విషయం జాతికి  తెలుసు. మొదట చెప్పుకున్నట్లు రెండుసార్లు నిషేధానికి గురై…. పట్టుదలతో  మరింత విస్తరించి… ఓ వటవృక్షంలా ఎదిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇప్పుడు హైదరాబాదులో విజయ సంకల్ప శిబిరం  నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ఆ సంస్థ ప్రస్థానం మననం చేసుకోవడం ఓ అవసరం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) మూలాలు భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉన్నప్పుడు భారత్ కు మాత్రం ఉంటే తప్పేమిటని ఆ సంస్థ తొలి తరం నాయకులు వాదించేవారు. ఇపుడు అన్ని సంస్థల మాదిరిగానే ఆ సంస్థలోను సరళీకరణ విధానాలు వచ్చాయి. నిజానికి దేశభక్తిని  జాతీయవాదాన్ని అందించడమే లక్ష్యంగా అవతరించిన సంస్థ ఆర్.ఎస్.ఎస్. ఈ సంస్థను స్థాపించిన కేశవ బలిరాం హెగ్డేవార్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం సమైక్య శంఖారావాన్ని పూరించారు. ఆయన ఉపన్యాసాలు సూటిగా, సూదంటురాయిలా ఉండేవి. దాంతో బ్రిటిష్ పాలకులు ఆయనను జైల్లో పెట్టారు.1925లో ఆయన ఆర్ఎస్ఎస్ నెలకొల్పారు. హెగ్డేవార్ పూర్వీకులు తెలంగాణ ప్రాంతం వారే. ఋగ్వేద పండిత వంశానికి చెందిన హెగ్డేవార్ అధ్యయన కేంద్రం గోదావరి, మంజీర, హరిద్రా నదుల త్రివేణి సంగమం. నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా కందకుర్తి వారి స్వగ్రామం . 1800 సంవత్సరంలో హెడ్గేవార్ ముత్తాత నరహరిశాస్త్రి హెగ్డేవార్ నిజాం పాలకుల వేదింపులకు కందకుర్తి వద్ద నాగపూర్ కి మకాం మార్చారు.

నిజానికి ఆ సంస్థ కార్యక్రమాలను నిశితంగా, కూలంకషంగా పరిశీలిస్తే ఇతర వర్ణాల వారి కోసం అందరికన్నా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ వారే ఎక్కువ శ్రమిస్తున్నారు అనడం అతిశయోక్తి  కాదు.  ఉదాహరణకు గిరిజన సంక్షేమం కోసం గడిచిన ఏడు దశాబ్దాలుగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీఏ వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. అవి ఇప్పటికీ అమలు జరుగుతున్నప్పటికీ వాటి ఫలాలను కొందరే పొందుతున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రచారక్ లు  అడవుల్లో  గిరిజనులను సమీకరించి వారిని విద్యావంతులను చేయడం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. తమ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం గురించి బోధిస్తున్నాయి. ఎవరో చెప్పిందే నమ్మడం ఆదివాసీలకు ఆదినుంచి అలవాటు.  తమకు ఏది మంచిది అనిపిస్తే ఆ విధానాన్ని, ఆచారవ్యవహారాలను ఆచరించమని దశాబ్దాలుగా బోధిస్తున్నది సంఘపరివార్ నాయకులే. మతాన్ని ప్రచారం చేయడం కోసం, మతాంతరీకరణలను ప్రోత్సహించడం కోసం గిరిజన ప్రాంతాల్లో వనవాసి కళ్యాణ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నా లెక్క చేయడం లేదు. ఈమధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ప్రసంగం ఆదివాసులను ఆకట్టుకుంది.

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాట నిలబెట్టేందుకు జరిపిన వనవాసం  పురుషోత్తమునిగా  చేసినట్టు, ఆదివాసులతో సహవాసం కారణంగానే ఆయన పురుషోత్తముడైనట్టు మోడీ అభివర్ణించారు. రామాయణాన్ని కథగా పరిగణించినా  ఆ కథలో శ్రీరామచంద్రుని  వనవాస ప్రస్తావన వస్తుంది.  గుహుడు  చేసిన సహాయాన్ని మన పౌరాణికులు తరచూ ప్రస్తావిస్తుంటారు. అలాగే రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి కూడా అడవుల్లో సంచరించిన వ్యక్తి. కనుక, మన భారతీయ మూలాలు తెలుసుకోవాలంటే అడవులకు వెళ్లాలని ఆదివాసీలతో జత కట్టాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చెబుతున్నదీ అదే. అంతవరకూ ఎందుకు వర్గ రహిత సమాజం కోసం ఐదున్నర దశాబ్దాలు పైగా పోరాడుతున్న వామపక్ష తీవ్రవాదులు ఇప్పటికీ అడవిలోనే  ఉంటూ సాయుధ పోరాటం సాగిస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ సంస్కరణలను  అంటే సామాజిక మార్పులను తీసుకుని వచ్చేందుకే  వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందుకు ఆ సంస్థ అనుబంధ సంస్థలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి భారతీయ విద్యా విధానంలో ప్రచారం కోసంమే ప్రతి నగరం, పట్టణంలో శిశు మందిర్ లను, కేశవ భవన్ లను నిర్వహిస్తోంది. వృత్తి విద్యల్లో  నైపుణ్యం పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ తరం వారికి తెలియ జేస్తోంది. ఇందులో మత ప్రసక్తి తేవడం ఎందుకో  విమర్శకులే చెప్పాలి. మత వ్యాప్తి కోసం విశ్వహిందూ పరిషత్ అనే సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. నిజానికి  ఈ సంస్థల భావజాలాలలో సారూప్యత ఉండవచ్చు కానీ రెండు ఒకటి కావు. విశ్వహిందూ పరిషత్ లో పార్టీలతో నిమిత్తం లేకుండా హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళంతా ఉండవచ్చు.  అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపక పదవులు నిర్వహించే వారు సభ్యులుగా ఉండవచ్చు.

గతంలో ఆర్ఎస్ఎస్ విస్తృతత్వాన్ని పొందకపోవడం వల్ల ఈ రెండు సంస్థలు ఒకరే పని చేస్తున్నట్లుగా కనిపించేది. ఇప్పుడు సంఘపరివార్ సిద్ధాంతాలు అవే అయినా, అది  ప్రజా బాహుళ్యానికి చేరువ కావడానికి తనను తాను సంస్కరించుకుంటూ వస్తోంది. ఎవరి విమర్శలకో  భయపడి కాదు. సమాజంలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పోవాలని భావన ఇపుడు ఆర్ఎస్ఎస్ లో పెరుగుతుంది. ఈ భావనకు గురుజీ  గోల్వాల్కర్, దేవరస్, రాజేంద్ర సింగ్, కె.ఎస్. సుదర్శన్ వంటి హేమా హేమీలు ఆర్ఎస్ఎస్ కు నేతృత్వం వహించారు. అంటరానితనం నిర్మూలన కోసం దేవరస్ విశేషంగా కృషి చేశారు. భారతీయ జనసంఘ్ లో కీలకపాత్ర వహించిన నానాజీ దేశ్ముఖ్ కూడా ఆర్ఎస్ఎస్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దశాబ్దాల క్రితమే నీటి కొరత ప్రమాదాన్ని గుర్తించి జల సంరక్షణ ఉద్యమాన్ని ఆయన చాలా కాలం నిర్వహించారు. వీరిలో కొందరు సిద్ధాంతాల పట్ల పట్టువీడని వైఖరి ప్రదర్శించినా, ఆధునిక కాలంలో సరళీకృత విధానాలు అన్ని రంగాల్లో వస్తున్నట్టే ఆర్ఎస్ఎస్ లోనూ వస్తున్నాయి.  మూల సిద్ధాంతానికి దూరం కాకుండా సమాజంలో అరమరికలు లేని రీతిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలన్న  ఉదారవాదం ఆర్ఎస్ఎస్ లో  పెరుగుతోంది. ప్రస్తుత అధిపతి మోహన్ భగవత్ ఈ వాదాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు.

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో  ఉంది. అది ఒక దుర్గంగా ఉండేది ఇప్పుడు అన్ని వర్గాల వారూ ఆ దుర్గంలోకి సులభంగా ప్రవేశిస్తున్నారు. ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ తదితరులంతా ఆర్ఎస్ఎస్ భావజాలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వారే.  ఆ తరం వారిలో అనేకమంది  బీసీలు ఇతర వర్ణాల నాయకులు ప్రముఖ పాత్ర వహించారు. ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొని ప్రజలకు దగ్గరైంది. 42 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో దివిసీమలో ఉప్పెన  ఊళ్లను ఊడ్చిపెట్టినప్పుడు  అవనిగడ్డ, నాగాయలంక తదితర ఊళ్లలో శవాలు తేలాయి. వాటిని సృశించడానికి పారిశుద్ధ్య కార్మికులు విముఖత  వ్యక్తం చేసిన సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు  ఉప్పెనలో మరణించిన వారి శవాలను సేకరించి సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు.  వారి సేవలకు యావత్ తెలుగు జాతికే కాదు. భారతదేశం జోహార్లు అర్పించింది అలాగే గుజరాత్ లో  భుజ్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు శిథిలాల నుంచి మృతదేహాలను తొలగించేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సేవలను అపుడే  ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మోడీ ఉపయోగించుకున్నారు.  మోడీకి ఆ సంస్థతో ఉన్న సంబంధాల కారణంగానే సంఘసేవకులు ఆగమేఘాలపై వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ అధిపతిగా మోహన్ భగవత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా బాహుళ్యం లోకి ఆ సంస్థను  తీసుకుని వెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అంతకుముందు ఈ పదవిని చేపట్టిన వారు కూడా భారతీయ జనసంఘ్ తోనూ,ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతోనూ సంబంధాలు ఏర్పరుచుకుని సంఘ భావజాలాన్ని వ్యాపింప చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే,  వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పరివార్ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేవారన్న వార్తలు తరచూ వచ్చేవి. ఇప్పుడు ఆ అవసరం రాకుండానే   సంఘ్ అజెండాను ప్రధాని మోడీ అమలు చేయడంతో ఘర్షణ కనిపించడం లేదు. బిజెపిలోనూ  వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి పార్టీ రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాశ్మీర్ కు 370 అధికరణం రద్దు మొదలు,  ముమ్మారు తలాక్ రద్దు వరకు ఆయన తీసుకున్న చర్యలన్నీ  ఆర్ఎస్ఎస్ అజెండాలోనివే.  ఆర్ఎస్ఎస్ కు  విస్తృత ప్రాతిపదిక గల సంస్థగా తీర్చిదిద్దేందుకు మోహన్ భగవత్ కు  మోడీయే సలహాలు ఇస్తున్నారు. అంతే కాకుండా బిజెపికి దగ్గరగా ఉన్నట్టు ముద్ర పడినప్పటికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి కాంగ్రెస్ మూలాలు ఉన్ననాయకులను నాగపూర్ లోని  తమ కార్యాలయానికి ఆహ్వానించి సన్మానించడం వంటి చర్యలు భగవత్ చేపడుతున్నారు. మాజీ ప్రధాని

వాజ్ పేయి, మాజీ ప్రధాని అద్వానీ, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి తదితర పాతతరం నాయకులే  కాదు, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతివెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ పలువురు నాయకులు ఆర్ఎస్ఎస్  నేపథ్యం ఉన్నవారే.  ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నందుకు తానెంతో గర్విస్తున్నానని  వెంకయ్యనాయుడు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు.  ప్రస్తుత  సర్ సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ అధిపతి) పదవిని  మోహన్ భగవత్ 2009లో చేపట్టారు. తర్వాత రెండుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో  ఆర్ఎస్ఎస్ అధిపతుల మాదిరిగా దూకుడుగా కాకుండా సౌమ్యంగా, అందరినీ  కలుపుకొని పోయే రీతిలో ఆయన పదేళ్ల నుంచి ఆ బాధ్యతలను  నిర్వహిస్తున్న వివాద రహితుడు. ఆయన మృదుభాషి. సరళమైన వాగ్దాటితో అందరిని మెప్పించగల మేధావి. శతవసంతంలోకి అడుగుపెడుతున్న సంఘ భవిష్యత్ కార్యక్రమాలకు  ఆయన ఈ నెల చివర లో  హైదరాబాద్ లో  జరిగే హేమంత శిబిరంలో కార్యకర్తలకూ, శ్రేణులకూ  మార్గదర్శనం చేయనున్నారు.

Courtesy: Andhra Prabha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here