Home News సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు

సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు

0
SHARE

–పి. విశాలాక్షి

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

మన భారతదేశం ఆదినుంచీ వేదాలనే ప్రమాణంగా, సూర్య, ఇతర గ్రహచలనం వల్ల జరిగే కష్ట నష్టాలకు విరుగుడుగా ప్రతి జీవి తన అభివృద్ధికి దోహదం చేసే కొన్ని సూత్రాలను ఆచరించి చూపే మహర్షులకు ఆటపట్టు. ఆషాఢ మాసంలో ఏకాదశి నుండి మహర్షులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకే ప్రదేశంలో నాలుగు నెలలూ ఉండి, ప్రజలను తమ వాక్సుధా రసంతో ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళే మార్గాలను తెలపడం ఒక ఆచారం. శంకర పీఠాలలోనూ, మఠాలలోనూ తమ ప్రవచనాలతో ప్రజలలో జీవబ్రహ్మైక్య సంధానం, అధ్యాత్మo అన్నీ సులభ మార్గాలతో తెలుపుతారు. ఆషాఢ శుద్ధపౌర్ణమిని, గురు పౌర్ణమి పర్వదినoగా జరుపుకుని ప్రజలంతా గురువులను ఆరాధిoచి తరిస్తారు.

జగద్గురువు శ్రీ కృష్ణుడు భగవద్గీతలో మునులలో `వ్యాసుడను నేనే’ అని చెప్తాడు.

“వృష్ణీనాo వామదేవోస్మి
పాండవానాo ధనంజయః
మునీనామప్యహం వ్యాసః
కవీనాముశనా కవి:”
 10-37

మహావిష్ణువు అంశగా ఆషాఢ పౌర్ణమినాడు జన్మించి సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు. ఆయన శస్త్రచికిత్సావేత్త కూడా. కుంతీదేవిపై ఈర్ష్యతో గాంధారి దిగజార్చుకున్న గర్భస్తపిండాన్ని పరిరక్షించి, అందులో నూటోక్క శిశువులు ఉండడం గుర్తించి, నేర్పుతో ఆ పిండాన్ని విభాగించి, నేతికుoడలలో నిక్షిప్తం చేసి పోషింపచేసి, జీవమిచ్చిన వైద్యుడు. వైద్యవిద్యానిది, మేధోనిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించుటకు ఉద్దిష్టమైన పండుగ గురు పూర్ణిమ.

ప్రాచీన వేద వాంగ్మయాన్ని, క్రమపద్ధతిలో నాలుగు వేదములుగా కూర్చి అందించాడు వ్యాస భగవానుడు. పంచమవేదoగా భావించే `మహాభారత’ ఇతిహాసాన్ని, దానిలోని భగవద్గీత, విష్ణు సహస్రానామావళితో సహా మనకు అందించిన మహర్షి వ్యాసుడు. అలాగే 18 అష్టాదశ పురాణాలు ఆయనే రచించారు. మహాభారతాన్ని, పురాణాలను వ్యాస భగవానుడు చెపుతుండగా సాక్షాత్తు మహాగణపతి వాటిని వ్రాసారు. ఎక్కడా ఏ మాత్రం ఆగకుండా చెప్తేనే వ్రాస్తానని వినాయకుడు షరతు పెట్టగా, అయితే ప్రతి మాట అర్ధం చేసుకుని మరీ వ్రాయాలని వ్యాసులవారు కోరారని పురాణ కధ. ఉత్తరాఖండ్ లో బదరీనాథ క్షేత్రానికి సమీపాన, సరస్వతీనది ఒడ్డున, భారత-టిబెట్ సరిహద్దులోఉన్న `మన’ గ్రామంలో వ్యాస భగవానుడు తపస్సు చేసిన `వ్యాస గుహ’ను భక్తులు సందర్శిస్తుంటారు. ఇక్కడే వ్యాసుడు చెప్తుoడగా, మహా గణపతి మహాభారతం వ్రాసారని ప్రతీతి. వ్యాసులవారు ఆయన గ్రంథాల్లో, దేశభక్తిని కూడా ఎన్నోసార్లు ప్రతిబింబించారని శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తమ ప్రసంగాల్లో తెలియచేసారు. దేవీభాగవతంలో `భరతవర్షంలో ఋషులు సంపాదించుకున్నారు గంగమ్మను, భరతవర్షంలో ఋషులు సంపాదించుకున్నారు తులసీదేవిని’ `భరతవర్షే పుణ్యే భారతే’ అని వ్రాసారని చెప్పారు.

వ్యాసులవారు మహర్షి పరాశరునికి, నావనడిపే `మత్స్యగంధి’ సత్యవతికి, యమునానదిలోని ద్వీపంలో జన్మించాడు, నల్లని ఛాయతో ద్వీపంలో పుట్టిన వాడు కాబట్టి ఆయన `కృష్ణ ద్వైపాయనుడు’ అయాడు. ఆయనకు పుట్టిన కొడుకు `బ్రహ్మర్షి’ అవుతాడని పరాశారునికి వరం ఉంది. వ్యాసుడు వసిష్ఠ మహర్షి మునిమనవడు, శక్తి మహామునికి మనవడు. తరువాత కాలoలో సత్యవతి శoతన మహారాజుని వివాహం చేసుకుని కురు సామ్రాజ్యానికి మహారాణి అయింది, వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కుమారులు; చిత్రాంగదుడు గంధర్వుల ద్వారా చంపబడగా, భీష్ముడు విచిత్రవీర్యుడితో వివాహానికి కాశీరాజు కుమార్తెలను ఎత్తుకొచ్చాడు. అయితే అనూహ్యంగా విచిత్రవీర్యుడు కూడా మరణించాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞ్య కారణంగా వివాహానికి నిరాకరించగా, సత్యవతి వ్యాసుడిని పిలిపించి కురువంశ సంతానానికై అర్ధించగా, వ్యాసుడి ద్వారా అoబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, ఒక దాసీ స్త్రీ ద్వారా విదురుడు జన్మించారు. ఆ విధంగా వ్యాసుడు మహాభారత గ్రంథకర్తే కాక, మహాభారత ఇతిహాసంలో కురువంశo నిలబడడానికి కారణమయాడు కూడా. అయితే వ్యాసుని నిజమైన వారసుడు, ఆయనకు పింజల ద్వారా జన్మించిన శుక మహాముని.

గుర్వారాధనము విశేష ప్రయోజనకారి అని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. `యస్యదేవే పరాభక్తి, యదా దేవేయా తదా గురౌ:’ అని శ్వేతాశ్వతరోపనిషత్తు తెలియజేస్తోంది. ఇందు వేదమాత, ఈశ్వరారాధనతోటి తుల్య గౌరవము, సమాన ప్రాధాన్యతను గురు పూజకి ఇచ్చుచున్నది. స్మృతి కర్తలు తెలిపినట్లు, `దైవేఋష్టే గురుస్తాతా, గురౌ రుష్టేన కశ్చన’ అనగా దైవానుగ్రహమునకు గురు అనుగ్రహం అనివార్యం. అందుకే `ఆచార్య దేవోభవ’ అంటారు. మహర్షి వ్యాసుల జన్మదినమైన గురుపూర్ణిమ రోజున కర్మ, జ్ఞ్యాన, భక్తి మార్గాలలో దేని అధారంగానైనా గురువును పూజించడం మహర్షులు ఆచరించి చూపించారు. శిష్యుడు తప్పు చేస్తే గురువు తప్ప, భగవంతుడు కూడా కాపాడలేడు. దైవోపచారం చేస్తే గురువు రక్షించగలడు, అదే గురువుకి కోపo వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరు.

జ్ఞానాన్ని అందించే గురువుని సేవించి, గురుకృప పొందిన మహనీయులు ఎందరో ఉన్నారు. గురువులు మనలోని అజ్ఞ్యానాన్ని పోగొట్టి, జ్ఞ్యానమనే వెలుగుని ప్రసాదిస్తారు. అందుచేత జ్ఞ్యానవంతులైన ఆదిశంకరులు కూడా గురువును ఆశ్రయించారు. సాక్షాత్తు అవతార పురుషులైన బలరామకృష్ణులు కూడా సాందీపని ముని వద్ద ఆశ్రమంలో ఉన్నారు. ధర్మస్వరూపుడైన ధర్మరాజు, భీష్ముడిని గురువుగా భావించి ఎన్నో ధర్మసూక్ష్మాలు గ్రహించాడు. భగవద్గీతలో “జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాo, తమాహు: పండితం బుధాః” అని జగద్గురువులైన శ్రీ కృష్ణులవారే సెలవిచ్చారు. అందుకే గురువానుగ్రహం తత్వదర్శనకారి.

నారాయణ సమారంభాo, శంకరాచార్య మధ్యమాo! అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!” గురువులందరూ చిరస్మరణీయులే; లోక సంరక్షణార్ధం తమ తపశ్శక్తితో సదుపదేశాల ద్వారా ముక్తి పొందే మార్గాలు ఆచరించి చూపారు. గురువానుగ్రహ ప్రాప్తిరస్తు!

(నేడు వ్యాస పూర్ణిమ సందర్భంగా..)

This article was first published in 2020