Home Interviews సామాజిక సమరసత అందరి బాధ్యత

సామాజిక సమరసత అందరి బాధ్యత

0
SHARE

జాగృతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ ఎస్‌సి కమిషన్‌ అధ్యక్షుడు రామ్‌ శంకర్‌ కఠేరియా

సామాజిక సమరసత కోసం సమాజంలోని అన్ని వర్గాలూ కలిసి పని చేయాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో, ఎస్‌సి కమిషన్‌తో కలిసి ఈ దిశగా నడవాలని జాతీయ ఎస్‌సి కమిషన్‌ అధ్యక్షుడు రామ్‌ శంకర్‌ కఠేరియా పిలుపునిచ్చారు. జాగృతి ప్రతినిధికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎస్సీ యువత విద్యార్జన చేసి, ఐకమత్యంతో పనిచేసి, సమాజాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఆయన హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఎస్సీ సంఘాలతో కలిసి ఎస్సీ సముదాయానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. తెలంగాణ రాష్రప్రభుత్వ అధికారులతో షెడ్యూల్డు కులాల కోసం ఉద్దేశించిన పథకాల అమలు గురించి సవివరంగా చర్చించారు.

ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు :

ప్రశ్న: గతంలో యుపిఏ హయాంలో ఉన్న ఎస్‌సి కమిషన్‌ దృక్పథానికి, విధానాలకు, నేడున్న ఎస్‌సి కమిషన్‌ ఆలోచనా విధానానికి ఏదైనా మౌలికమైన తేడా ఉందా?

సమాధానం : యుపిఏ ప్రభుత్వంలోనూ ఇవే పథకాలు ఉండేవి. కాని వాటి అమలు సరిగ్గా జరిగేది కాదు. క్షేత్రస్థాయిలో వాటి అమలును పట్టించుకునే ఏర్పాట్లు కూడా ఉండేవి కావు. ప్రధానమంత్రి మోది పరిపాలనలో పథకాల అమలుకు ప్రాతిపదిక పేదవాడు. పేదవాడి బాగుకోసమే ఈ పథకాలను రూపొందించడం, అమలు చేయడం జరుగుతోంది. ఫలితంగా అట్టడుగు స్థాయి ప్రజలకు నేరుగా లబ్ది చేకూరుతోంది. ఉదాహరణకు పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, అట్టడుగు వర్గాలకు బ్యాంకులను చేరువ చేసే జనధన్‌ యోజన, ఉచిత విద్యుద్దీకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్‌ కనెక్షన్ల వంటివి పేద, బడుగు వర్గాల మేలు కోసం ఉద్దేశించిన పథకాలే. వీటన్నిటి వల్ల ఎస్సీ వర్గాలకు, బడుగులకు లాభం కలుగుతోంది.

ప్ర: సామాజిక సమరసత విషయంలో ఎస్‌సి కమిషన్‌ దృక్పథం ఏమిటి ?

స: ఎస్‌సి కమిషన్‌ ప్రధాన లక్ష్యం ఎస్సీల పట్ల అన్యాయం జరిగితే వారికి న్యాయం జరిగేలా చూడటం. సమాజంలో ఉన్న అసమానతలు, భేదాలు, అస్పృశ్యత, ఎస్సీల పట్ల అన్యాయాలను తొలగించే దిశగా కమిషన్‌ పనిచేస్తుంది.

ప్ర: ‘గరీబీ హటావో’ నినాదం ముందునుంచే ఉంది కదా ? అలాగే గతంలో ఎస్సీలకు భూములు కూడా ఇచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూములను తిరిగి తీసుకుంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

స: గరీబీ హటావో కేవలం నినాదంగా మాత్రమే ఉండిపోయింది. నిజానికి భూమిహీనులైన పేదలకు భూమినిచ్చే ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. అలా చేయని పక్షంలో ఎస్‌సి కమిషన్‌ ప్రభుత్వాలను నిలదీస్తుంది. ఎస్సీలకు మేలు చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఈ దిశగా నిజాయితీతో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా సరైన చర్యలు చేపట్టాలి.

ప్ర: దేశంలో నేటికీ అక్కడక్కడ ఎస్సీలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వార్తలు వింటున్నాం. వీటిని నిలువరించే దిశగా ఎస్‌సి కమిషన్‌ ఏం చేస్తోంది? ఎలాంటి చర్యలు చేపడుతోంది ?

స: దురదృష్టవశాత్తు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సామాజిక సమరసతను నిర్మాణం చేసి, బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకో వాల్సింది. ఇది ఇప్పటికే జరగాల్సి ఉంది. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సామాజిక సమరసత దిశగా పలు సామాజిక సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా పనిచేస్తున్నాయి. కమిషన్‌ కూడా ఈ దిశగా పనిచేస్తోంది.

ప్ర: పలు చోట్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎస్‌సి రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే అందుతున్నాయన్న ఆక్షేపణలు కూడా వినిపిస్తు న్నాయి. దీనిపై మీరేమంటారు?

స: రిజర్వేషన్ల వల్ల లాభం అందరికీ చేకూరాలి. ఎస్సీలలోని అన్ని జాతులు, ఉపజాతులకు రిజర్వేషన్ల లాభాలు అందాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ దిశగా నాకు కూడా పలు వినతులు అందాయి. రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలోనూ నాకు పిటిషన్లు అందాయి. వాటిని లోతుగా అధ్యయనం చేయిస్తాం. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై కూడా నాకు వినతి పత్రాలు ఇచ్చారు. తదుపరి దీనిపై ఏం చేయాలన్న విషయంలో ఆలోచిస్తాం. రిజర్వేషన్లు ఎస్సీల ప్రగతి కోసమే ఉద్దేశించినవి. వారందరికీ దీని వల్ల లబ్ది చేకూరాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు.

ప్ర: కొన్ని చోట్ల ఎస్సీలను వివిధ ప్రలోభాలు, ఆకర్షణలు చూపి మతం మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ?

ఇలాంటివి మా దృష్టికి వస్తే మేం ఆ ప్రాంతాలలో పర్యటన చేసి, వాస్తవాలను తెలుసుకుంటాం. ఎస్సీలను ప్రలోభనల ద్వారా, మోసపూరితంగా మతం మార్చకూడదు. ఏవరైనా తమంతట తాముగా నిర్ణయం తీసుకుని మతం మారితే అభ్యంతరం లేదు. కానీ మోసపూరితమైన పద్ధతుల్లో, బలవంతంగా, ఆకర్షణలు చూపించి మతం మార్చడం సరైనది కాదు. మా దృష్టికి వస్తే మేం చర్యలు తీసుకుంటాం. ఇటీవల హర్యానాలో ఇలాంటి సంఘటన జరిగింది. ఎస్‌సి కమిషన్‌ ఆ ప్రాంతంలో పర్యటించి, మోస పూరితంగా మతం మార్చిన వారిపై చర్యలను చేపట్టింది కూడా. అలాగే కొన్ని విద్యాలయాల్లో ఎస్సీ బాలికలపై లైంగిక వేధింపులు జరిగినట్లు కూడా కమిషన్‌ దృష్టికి వచ్చింది. అలాంటప్పుడు కమీషన్‌ తక్షణం స్పందించి, చర్యలు తీసుకుంది. భవిష్యత్తు లోనూ ఇలాగే తీసుకుంటుంది.

ప్ర: చివరగా ఎస్సీ యువతీ, యువకులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

స: బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎస్సీల యువతీ, యువకులకు విద్యార్జన చేయమని పిలుపునిచ్చారు. విద్యార్జన చేసి, ఐకమత్యంతో పనిచేసి, సమాజం కోసం, జాతి కోసం పనిచేయాలని ఆయన సందేశం ఇచ్చారు. ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి. ఆ తరువాత జాతిని సరిచేయాలి. ఎస్సీ యువత ఈ సందేశాన్ని స్వీకరించాలి.

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here