Home Telugu Articles సంక్షోభాలు తట్టుకునే శక్తి భారత్ సొంతం

సంక్షోభాలు తట్టుకునే శక్తి భారత్ సొంతం

0
SHARE

— ఆర్ సుందరం

ప్రతి తరంలో ఏదో ఒక అనిశ్చిత, హఠాత్పరిణామం ఏర్పడుతూ ఉంటుంది. కోవిడ్ 19 అటువంటిదే. నాలుగు నెలలుగా ఇది ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ దేశం ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య లక్షలు, మరణించినవారి సంఖ్య వేలల్లో ఉంటే మన దేశంలో మాత్రం వ్యాధి సోకినవారు వేలల్లో, చనిపోయినవారు వందల్లో ఉన్నారు(కొన్నిరోజుల క్రితమే ఈ సంఖ్య వెయ్యి దాటింది). ఈ మెరుగైన స్థితికి కారణం ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలు, ప్రజల్లో అత్యధిక స్థాయిలో ఉన్న రోగనిరోధక శక్తి. రాగల రెండు, మూడు నెలల్లోనే సాధారణ స్థితి నెలకొంటుందని కొందరు అప్పుడే అంచనా వేస్తున్నారు.

ఈ లాక్ డౌన్ మూలంగా రోజు కూలీ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త వరకు అందరూ ఎంతోకొంత కోల్పోయారు, నష్టపోయారు. చాలా మంది పూట గడవని పరిస్థితిలో ఉన్నా అసహనానికి, అలజడికి మాత్రం గురికావడం లేదు. ఎంతో సహనాన్ని, సంయమనాన్ని, దేశభక్తి భావాన్ని కనబరుస్తున్నారు. ఈ స్ఫూర్తే మళ్ళీ మన ఆర్ధిక వ్యవస్థను చక్కబెట్టగలుగుతుంది.

కరోనాకు ముందు కూడా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు క్షీణిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం 5శాతం, ప్రపంచ స్థూల ఉత్పత్తి 2.5 నుండి 3 శాతం ఉండేది. అవి ఇప్పుడు 3శాతానికి వచ్చాయి. ఒకప్పుడు 2.2 ట్రిలియన్ డాలర్లు ఉన్న అంతర్జాతీయ పెట్టుబడులు 80వ దశకంలో 15 ట్రిలియన్ లకు, 2013నాటికి 15 ట్రిలియన్ స్థాయిని అందుకున్నా ఇప్పుడు మళ్ళీ దిగజారి 2.5 ట్రిలియన్ లకు వచ్చాయి. ఒకప్పుడు చాలా పట్టుదలగా వైశ్వీకరణ విధానాన్ని ప్రచారం చేసి, పాటించిన దేశాలన్నీ ఇప్పుడు సొంత ప్రయోజనాలకే పెద్దపీటవేస్తున్నాయి. కోవిడ్ 19 వల్ల ఈ ధోరణి మరింత ముదిరి భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం మరింత వ్యవస్థీకృతం అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వచ్చే ఈ మార్పులను పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ, దత్తోపంత్ ఠేంగ్డే ఎప్పుడో చెప్పారు. ఇదే స్వదేశీ ధోరణి.

భవిష్యత్తులో వికేంద్రీకృత ఆర్ధిక కార్యకలాపాలు ప్రధానంగా సాగుతాయి. రాష్ట్రాల స్థాయిలోనే ప్రణాళికలు సిద్ధమవుతాయి. భారత్ లోని రాష్ట్రాలకు వేరువేరు ప్రాధామ్యాలు, అవసరాలు, బలాలు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ను ఒక దేశంగా పరిగణిస్తే, అప్పుడు అది జనాభాపరంగా ప్రపంచంలో 5వ స్థానం ఆక్రమిస్తుంది. కేరళ పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది. ఒడిశ, జార్ఖండ్ లకు గనులు ముఖ్యం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మొదలైనవి వస్తు ఉత్పత్తికి పెట్టింది పేరు. ఇలా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆర్ధిక నమూనా, అభివృద్ధి ప్రణాళిక అవసరం. ఇలా రాష్ట్రాల స్థాయిలో ఆర్ధిక ప్రణాళిక రూపొందించడం వల్ల స్థానికంగా ఆర్ధిక వనరులు, నాయకత్వం బలపడతాయి.

ప్రస్తుతం భారత్ యువదేశం. జనాభాలో 60శాతం యువత. అందువల్ల మానవ వనరుల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మన దేశంలోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల కంటే వెనుకబడినవి (బీమారు) రాష్ట్రాలుగా పేరుపడిన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లలో యువత ఎక్కువ. ఇక్కడ వస్తు ఉత్పత్తి పరిశ్రమలు పెంచితే అప్పుడు వలసలను నిరోధించవచ్చును. ఎందుకంటే కోవిడ్ సంక్షోభ సమయంలో దేశం ఎదుర్కొన్న పెద్ద సవాళ్లలో వలస కార్మికుల సమస్య కూడా ఒకటి.

కోవిడ్ 19 సంక్షోభకాలంలో దేశంలోని సృజనాత్మక శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. చవకైనా వెంటిలేటర్లు, పీపీఈ లు, రక్త నమూనాలు సేకరించడానికి కియోస్క్ లు, పరీక్ష కిట్ లను DRDO తయారుచేస్తే, కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఏకంగా రోబోట్ లను కొన్ని కంపెనీలు రూపొందించాయి. ఇలా చెపితే చాలానే ఉన్నాయి. ఈ సృజనాత్మక, స్వదేశీ శక్తిని మరింత పెంపొందించుకోవాలి, కాపాడుకోవాలి. పెద్ద పెద్ద లెబరోటరీలలోనేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నో ఆవిష్కారాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ IIM కు చెందిన ఒక ప్రొఫెసర్ ఇలాంటి గ్రామీణ ఆవిష్కారాలను గుర్తించి వాటి వివరాలను HONEY BEE అనే పేరుతో ఒకచోట నమోదుచేస్తున్నారు. ఈ రకం సృజనాత్మక శక్తినే సాంకేతిక పరిభాషలో పరిజ్ఞాన ఆర్ధిక వ్యవస్థ (Knowledge Economy) అంటారు. ఇది మన దేశంలో పుష్కలంగా ఉంది. దీనిని మరింత బలపరచుకోవాలి.

కరోనా సంక్షోభం పొదుపు ప్రాధాన్యతను కూడా మరోసారి మనకి గుర్తుచేసింది. ఆర్భాటాలు, అనవసర ఖర్చులకు పోకుండా ఉన్నదాంట్లోనే కొంత దాచుకోవాలనే ఆలోచనను ప్రజల్లో బాగా కలిగించాలి. సంయమనంతో కూడిన, అవసరమైన మేరకే ఖర్చు చేయాలనే విషయాన్ని అందరూ గుర్తించాలి, అలవాటు చేసుకోవాలి.

రసాయన వ్యవసాయం వల్ల అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు బలిగొంటున్నాయి. కాబట్టి రసాయనాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సేంద్రీయ, గోఆధారిత వ్యవసాయానికి మరలాలి. ఇలాంటి ఉత్పత్తులకు మన దేశంలోనేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గిరాకీ ఉంది. మన రైతులు ఇలాంటి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు.

ఇప్పటివరకు పర్యావరణంపై ఆర్ధిక కార్యకలాపాల ప్రభావం పెద్దగా తెలియలేదు. కానీ ఇక మీదట అది మనకు బాగా తెలుస్తుంది.

చిన్నచిన్న కిరాణా దుకాణాలు ఈ సంక్షోభ కాలంలో మనల్ని ఎలా ఆదుకున్నాయో అందరికీ తెలిసింది. నిత్యావసర వస్తువుల సరఫరాకి అవరోధం ఏర్పడకపోవడానికి కారణం ఈ చిన్న దుకాణాలే. కాబట్టి పెద్ద పెద్ద మాల్స్ వ్యామోహంలో పడకుండా చిన్న దుకాణాలను ప్రోత్సహించాలి.

కరోనా బాధితులకు పౌర సమాజం చేసిన సేవ, అందించిన సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతీయుల్లో ఉండే ఈ సహజ సేవా గుణం ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత ఊపునిచ్చింది.

అన్నింటికంటే ముఖ్యమైనది ఎలాంటి సంక్షోభం నుంచైనా త్వరగా తేరుకోగలిగిన శక్తి. అది భారత్ కు పుష్కలంగా ఉందని గతంలో అనేకసార్లు ఋజువైంది. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుంచి మొదటగా తెరుకున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇప్పుడు కూడా కరోనా లాక్ డౌన్ మూలంగా పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయినా ఆ తరువాత ఏం చేయాలన్న విషయాన్ని ప్రజలు ముందుగానే ఆలోచించారు. అందుకు తమనుతాము సిద్ధం చేసుకున్నారు. నైపుణ్యాలను పెంచుకున్నారు. లాక్ డౌన్ ఎత్తివేయగానే పూర్తి శక్తితో, ఉత్సాహంతో పనిచేసి దేశాన్ని అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

 

(రచయిత ప్రముఖ ఆర్ధిక విశ్లేషకులు, చార్టెడ్ ఎకౌంటెంట్)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here