Home News సంఘ కార్యమే వారి జీవితం….హల్దేకర్‌జీ, జయదేవ్‌జీ శ్రద్ధాంజలి సభలో పలువురు వక్తలు

సంఘ కార్యమే వారి జీవితం….హల్దేకర్‌జీ, జయదేవ్‌జీ శ్రద్ధాంజలి సభలో పలువురు వక్తలు

0
SHARE

”హల్దేకర్‌జీ, జయదేవ్‌జీలు సైద్ధాంతిక కాంతి పుంజాలు. వారి వెలుగు ఎప్పుడూ మనకు దారి చూపుతూనే ఉంటుంది. వారికి మరణం లేదు” అని సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య అన్నారు. వారి జీవితమంటే భక్తి, శ్రద్ధ, విశ్వాసమని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్‌ కాలేజ్ పటేల్‌ హాల్‌లో జరిగిన(9.3.17) హల్దేకర్‌జీ, జయదేవ్‌జీల శ్రద్ధాంజలి సభలో పాల్గొని వారిద్దరికీ నివాళులర్పించారు.

‘కార్యంలో మృత్యువే విశ్రాంతి’ అని హల్దేకర్‌జీ తరుచు అనేవారని, ఆలాగే చివరి వరకూ సంఘకార్యంలో నిమగ్నమయ్యే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉండే హల్దేకర్‌జీ తమ ద్వితీయవర్ష శిక్షావర్గలో ఒకరోజు ఏకంగా 58 నిముషాలపాటు గణసమత చేయించడం ఇప్పటికీ గుర్తుందని, అప్పుడు అలా చేయడం చాలా కష్టమనిపించినా అంతసేపు గణ తీసుకోవడంలో హల్దేకర్‌జీ సామర్థ్యం, క్షమత తలుచుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుందని అన్నారు. హల్దేకర్‌జీ సంఘటనా వ్యవస్థను తుచ తప్పక పాటించారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా కొత్తవారితో పరిచయాలు, వారిని సంఘకార్యానికి జోడించే ప్రయత్నం సాగుతూనే ఉండేది. వ్యవస్థకు పూర్తిగా సమర్పితమైన వ్యక్తి ఆయన. వ్యవస్థాపరంగా తీసుకున్న ఏ నిర్ణయంపట్ల వ్యతిరేకతగానీ, అసంతృప్తిగానీ ఆయన ఎప్పుడూ చూపలేదని భాగయ్య అన్నారు. కార్యకర్తలు చెప్పినవి ఓపిగ్గా వినే లక్షణం, స్థానిక కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం హల్దేకర్‌జీ, జయదేవ్‌జీలు ఇద్దరిలో కనిపించేదని గుర్తు చేసుకున్నారు. వాళ్లిద్దరూ యుగానుకూలంగా ఆలోచించేవారని, వాళ్ళు నిజమైన ఆధునికులని అన్నారు. కార్యకర్తలపట్ల హల్దేకర్‌జీ మాతృప్రేమ చూపేవారని, వేదుల సత్యనారాయణ, చిలుకూరి సుబ్రమణ్యశాస్త్రి మొదలైన వారికి అనారోగ్యం చేసినప్పుడు వారి గురించి ఎంతో ఆందోళన పడ్డారని అన్నారు. కార్యకర్తలకు పని అప్పచెప్పడంలో కూడా ఎంతో ముందు చూపు ఉండేదని, సరైన వారికి సరైన పని అప్పచెప్పేవారన్నారు. అనునిత్యం పూజ చేసిన హల్దేకర్‌జీ అఖండ భారతాన్ని పూజించారని, ఆ విధంగా అఖండభారత సాధన సంకల్పాన్ని మనముందు ఉంచారని భాగయ్య అన్నారు. రెండు ప్రాంతాలకు (తెలంగాణా, ఆంధ్ర) పెద్దదిక్కు అయిన హల్దేకర్‌జీ లేని లోటు తీర్చలేనిదే ఆయినా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భాగయ్య ముగించారు.

అంతకు ముందు అఖిలభారత సహ సేవాప్రముఖ్‌ శ్రీ అజిత్‌ప్రసాద్‌ మహాపాత్ర హల్దేకర్‌జీకి శ్రద్ధాంజలి సమర్పించారు. భౌతికంగా దూరమైనా హల్దేకర్‌జీ సంఘకార్యం ద్వారా మనతోనే ఉన్నారని అన్నారు. ఒడిశా వరదలు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలలో ఆయన మార్గదర్శనం అద్భుతం, అనితరసాధ్యమని అజిత్‌ మహాపాత్ర గుర్తు చేసుకున్నారు. మృతుల్లో స్వయంసేవకుల్ని వెతక కూడదని, అందరూ మనవారేనని కార్యకర్తలకు తెలియచెప్పిన హల్దేకర్‌జీ పునరావాస కార్యక్రమాల్లో కూడా తనదైన ముద్ర వేశారని అన్నారు. నీట మునిగిన పంట భూముల్ని వెంటనే బాగు చేసి కనీసం ఒక పంట వేసుకునేందుకైనా అనువుగా తయారుచేసి ఇవ్వాలన్న ఆయన ఆలోచనను నిజం చేయడానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. హల్దేకర్‌జీ కోరుకున్నట్లుగానే పేద రైతులకు ఆర్థికమైన ఆసరా లభించింది. ఒక పంట వేయడానికి అనువుగా మూడువేల ఎకరాలు తయారయ్యాయి. అలాగే వరదల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల కోసం ఒకే అనాధాశ్రమం ఏర్పాటు చేయడం కాకుండా, వారివారి గ్రామాలకు దగ్గరగా వేరువేరు కేంద్రాలు తెరవాలన్నది కూడా హల్దేకర్‌జీ ఆలోచనే అని ఆయన గుర్తు చేసుకున్నారు.

దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్‌ శ్రీ నాగరాజుగారు కూడా హల్దేకర్‌జీ, జయదేవ్‌జీలకు శ్రద్ధాంజలి ఘటించారు. సామాజిక చైతన్యంతో పనిచేసే వారు అందరికీ స్ఫూర్తిని ఇస్తారని, హల్దేకర్‌జీ, జయదేవ్‌జీలు అలాంటి వారని ఆయన అన్నారు. సంఘకార్యమే జీవన కార్యంగా జయదేవ్‌జీ గడిపారని, అనేక మంది కార్యకర్తల్ని తీర్చిదిద్దారని అన్నారు. యాదవరావ్‌జీ, శేషాద్రిజీల ప్రేరణతో రాష్ట్రోత్థాన పరిషత్‌ను ప్రారంభించిన జయదేవ్‌జీ ఎంతో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి తక్కువ జీతానికే ఆ సంస్థలో పనిచేశారు, సంస్థను తీర్చిదిద్దారు. అపారమైన సహనం కలిగిన జయదేవ్‌జీ కార్యకర్తలు చెప్పే విషయాల్ని ఓపికగా, శ్రద్ధగా వినేవారు. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వారికి మార్గదర్శనం చేసేవారు. వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు, పనుల మధ్యలోనే సంఘకార్యాన్ని చేయాలని కార్యకర్తలకు చెప్పేవారు. చేయాల్సిన పనుల జాబితా రాసి వాటన్నింటి పైన ఎర్ర సిరాతో సంఘకార్యం అని రాసుకోవాలని, అలా సంఘకార్యానికి ప్రధమ ప్రాధాన్యతనివ్వాలని జయదేవ్‌జీ చెప్పేవారు. రాష్ట్రోత్థానతోపాటు అనేక సంస్థల్ని కూడా జయదేవ్‌జీ తీర్చిదిద్దారు. ముఖ్యంగా కొనఊపిరితో ఉన్న మిథిక్‌ సొసైటీ వంటి సంస్థల్ని పునరుద్ధరించడమేకాక వాటిని అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా తీర్చిదిద్దారు. అయితే ఏ సంస్థలోనూ ఆయన పదవి చేపట్టలేదు. సమాజంపై స్వామీజీల ప్రభావాన్ని బాగా గుర్తించిన జయదేవ్‌జీ కొత్తగా సన్యాసం స్వీకరించే స్వాములకు జాతీయ విషయాలపై అవగాహన కలిగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చినప్పుడు వివిధ మఠాధిపతులు అందుకు తగిన కార్యక్రమం రూపొందించే పని ఆయనకే అప్పగించారు. అలా భారతీయ సంస్కృతి పరిషత్‌ ఊపిరిపోసుకుంది. ఈ పరిషత్‌ ఆధ్వర్యంలో సన్యాసులకు 15రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇలా వివిధ సంస్థల్లో మమేకమైన జయదేవ్‌జీ క్షేత్ర బాధ్యత తీసుకోవాలని సంఘ పెద్దలు చెప్పిన వెంటనే సంఘ కార్యమే సర్వస్వంగా పనిచేశారని శ్రీ నాగరాజు అన్నారు.

జయదేవ్‌జీ మాదిరిగానే హల్దేకర్‌జీ కూడా సంఘకార్యమే జీవనకార్యంగా గడిపారని అన్నారు. ఆయన సమాజంలోని అందరితో స్నేహసంబంధాలు కలిగి ఉండేవారన్నారు. ముఖ్యంగా ఎంతకాలమైనా స్వయంసేవకులు, వారి కుటుంబాలతో వారి ఆత్మీయ సంబంధం కొనసాగేది. 2007 శ్రీ గురూజీ జన్మశతాబ్ది సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. 100 గ్రామాల్లో పాత కార్యకర్తల్ని కలిసి వారిని మళ్ళీ క్రియాశీలురుగా చేసే కార్యం చేపట్టారు. చెప్పినట్లుగానే సంవత్సర కాలంలో 100 గ్రామాల్లో పర్యటించి, అనేకమంది కార్యకర్తల్ని కలిశారు. అవరోధాలు, అడ్డంకులను దాటుకుని ప్రతికూల పరిస్థితుల్లో కూడా పని చేయడం, అసాధ్యంగా కనిపించే పనుల్ని కూడా సుసాధ్యం చేయడం వంటివి జయదేవ్‌జీ, హల్దేకర్‌జీలు ఇద్దరిలో మనకు కనిపించే పోలికలని శ్రీనాగరాజు అన్నారు.

రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత సంపర్క ప్రముఖ్‌ సునీతా హల్దేకర్‌ కూడా కార్యక్రమంలో హల్దేకర్‌జీకి శ్రద్ధాంజలి సమర్పించారు. సునీతా హల్దేకర్‌ స్వయంగా హల్దేకర్‌జీ అన్నగారి కుమార్తె. హల్దేకర్‌జీ చివరి వరకూ కన్నతల్లి, సొంత ఊరిని మరచిపోలేదని సునీతాజీ అన్నారు. ప్రతి ఏడాది ఒక రోజు పుట్టిన ఊరైన హల్దీగావ్‌ కు వచ్చేవారని, వారు రావడమే ఊరిలో ఒక పండగని గుర్తు చేసుకున్నారు. ఊరిలోకి అడుగుపెట్టగానే మట్టిని తీసి నుదిటిన రాసుకునేవారని, విశిష్టమైన సంఘకార్యాన్ని చేసే అవకాశం ఈ ఊరే తనకు కలిగించిందని కృతజ్ఞత తెలుపుకునేవారని అన్నారు. అలాగే కులదేవత అయిన మాహుర్‌దేవి రేణుకామాతను కూడా సంవత్సరానికి ఒకసారి తప్పక దర్శించుకునేవారు. తాను ప్రచారికగా జీవితం ప్రారంభించేప్పుడు సమాజంలో పనిచేయాలంటే సంవేదనాశీలమైన మనస్సు ఉండాలని చెప్పారని సునీతాజీ గుర్తుచేసుకున్నారు. ఫోన్‌లలో మాట్లాడటం కాకుండా ఉత్తరాలు రాయాలని, అప్పుడే ఆత్యీయ సంబంధాలు నిలుస్తాయని చెప్పేవారని అన్నారు.

కార్యక్రమంలో తెలంగాణా ప్రాంత సంఘచాలక్‌ శ్రీ ప్యాటా వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రాంత సంఘచాలక్‌ శ్రీ సుందరమూర్తి, శ్రీ హరిహరశర్మ, శ్రీ పర్వతరావు, శ్రీ రాజవర్థన్‌, శ్రీ లక్ష్మణ్‌ కూడా హల్దేకర్‌జీ, జయదేవ్‌జీలకు శ్రద్ధాంజలి ఘటించారు.