Home News సర్వ జన హితమే హిందూత్వం – డా. మోహన్ భాగవత్

సర్వ జన హితమే హిందూత్వం – డా. మోహన్ భాగవత్

0
SHARE

“సంఘ్ కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న మూడురోజుల విజయసంకల్ప శిబిరంలో భాగంగా ఈ రోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సార్వజనిక సభలో ఆయన మాట్లాడారు.

స్వార్ధంతో నీతినియమాలను మరచి తమ మేలు మాత్రమే కోరుకునేది ఆసురీ ప్రవృత్తి అని, వారు సాధించదలచెది అసురి విజయమని ఆయన అన్నారు. దీని వల్ల సర్వత్ర విధ్వంసం మాత్రమే జరుగుతుందని అన్నారు. అలాగే కీర్తిప్రతిష్టాలతో, అధికారం కోసం ప్రయత్నించేది రాజసిక విజయమని, అది పూర్తి స్వార్ధపూరితమైనదని డా. మోహన్ భాగవత్ అన్నారు. వీటన్నిటికంటే ధర్మవిజయమే ఉత్తమమైనది. ఎందుకంటే ఇలాంటి విజయం కోసం కృషి చేసే వ్యక్తులు ఎంతటి వ్యతిరేకత ఉన్నప్పటికి అందరి మేలు కోసమే పనిచేస్తారు. ఎవరో వచ్చి దేశ ప్రగతిని, హితాన్ని సాధిస్తారని ఆశించరాదని, అందరూ కలిసి ఆ కార్యాన్ని సాధించడానికి కృషి చేయవలసిందేనని డా. భాగవత్ అన్నారు. సర్వ సృష్టి ఆ పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి అందరిపట్ల సమాన భావాన్ని కలిగిఉండడమే హిందూ లేదా భారతీయ దృక్పధం. ఈ దేశంలో పరంపరాగతంగా ఇదే కనిపిస్తుందని, ఇక్కడ స్వేచ్చా, స్వాతంత్ర్యం ఉంటాయి కానీ అరాచకత్వం, విశృంఖలత్వం ఉండవని ఆయన అన్నారు. సమాజంలో సాధారణ ప్రజానీకం కొందరు శ్రేష్ట వ్యక్తులను అనుసరిస్తారు. వీరినే రవీంద్రనాధ్ ఠాగూర్ నాయక్ అన్నారని, ఏకత్వ సాధనే మన సమాజ లక్షణమని, సమాజ పరివర్తనతోనే ఉద్ధరణ, ఉన్నతి సాధ్యపడతాయని డా. మోహన్ భాగవత్ అన్నారు. అది కూడా హిందూ మార్గం, దృక్పధం ద్వారానే సాధ్యపడుతుందని ఠాగూర్ అన్నారని వివరించారు. ఈ దేశాన్ని తన మాతృభూమిగా తలచి ఇక్కడి సంస్కృతిని ఆచరించేవాడు, సర్వ సృష్టిని ఒకటిగా భావించేవాడు హిందువని, అలాంటి హిందువులను కలపడమే సంఘ కార్యమని, ఆ కార్య సాధనకు, ధర్మ విజయానికి స్వయంసేవకులు కృషి చేస్తారని డా. మోహన్ భాగవత్ అన్నారు. మొత్తం సమాజాన్ని కలుపుకుని దేశ ఉన్నతి కోసం సంఘ 90 ఏళ్లుగా పనిచేస్తోందని అన్నారు.

అంతకు ముందు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత బివిఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విలువలను ఆచరించడం, స్త్రీశక్తి పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమని అన్నారు. డబ్బు, ఆరోగ్యం పోయినా తిరిగి సాదించుకోవచ్చని, కానీ విలువలు కోల్పోతే తిరిగి పొందలేమని అన్నారు. మన ప్రవర్తనే సంస్కృతి అని శ్రేష్టులైన వ్యక్తులు ఏది ఆచరిస్తారో అదే ఇతరులు కూడా అనుసరిస్తారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ ఈ సాంస్కృతిక విలువలను కాపాడి సమాజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నందుకు అభినందించాలని మోహన్ రెడ్డి ప్రశంసించారు.

8వేలమంది స్వయంసేవకుల యోగాసన ప్రదర్శన, ఇతర సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముందు పురవిధుల్లో స్వయంసేవకుల పథసంచలన (రూట్ మార్చ్) శోభాయమానంగా సాగింది.