Home News వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే : సుప్రీంకోర్టు

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే : సుప్రీంకోర్టు

0
SHARE

వ్యక్తిగత గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్త్రత ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది. ఆర్టికల్‌ 21 ప్రకారం.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తేల్చింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆధార్‌ను అనుసంధానం చేయడంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఇకపై ఆధార్‌ అనుసంధానంపై పరిమితులుండే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్‌ కార్డును కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌ అనుసంధానంతో వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ 2015లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు జులై 18న సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలని, వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణను చేపడుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అరవింద్‌ దాతర్‌, శ్యామ్‌ దివాన్‌, గోపాల్‌ సుబ్రమణ్యం, ఆనంద్‌ గ్రోవర్‌లు తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌తో పాటు.. న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్‌, ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఆర్‌కే అగర్వాల్‌, రోహిన్‌టన్‌ ఫాలీ నారీమన్‌, అభర్‌ మనోహర్‌ సాప్రే, సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఉన్నారు.

గతంలోనూ విచారణలు..

వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టులో చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. 1954లో ఎంపీ శర్మ కేసులో భాగంగా వ్యక్తిగత గోప్యతపై చర్చ జరిగింది. దాల్మియా జైన్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని అప్పట్లో కేసు నమోదైంది. దీంతో దాల్మియా గ్రూపుకు చెందిన కొన్ని ప్రదేశాల్లో సోదాలు జరిపారు. దీంతో సోదాల్లో రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ ఎంపీ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సోదాలు చేయడం అంటే.. తాత్కాలికంగా హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని, అయితే ఇది చట్టబద్ధంగా నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం జరిగితే తప్పులేదని కోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని, రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదని.. ఎనిమిది మందితో కూడిన ధర్మాసనం చెప్పింది.

ఆ తర్వాత 1963లో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. దోపిడీ కేసులో తగిన సాక్ష్యం లేదని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఖారక్‌సింగ్‌ను విడుదల చేశారు. దీంతో యూపీ పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో తన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ ఖారక్‌సింగ్‌ 1963లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ సమయంలో ఆరుగురు సభ్యులతో కూడిన ధర్మాసం ఖారక్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొనలేదని స్పష్టం చేసింది.

ఆధార్‌తో మరోసారి..

ఆ తర్వాత 1970,80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు దీనికి విరుద్ధంగా అభిప్రాయపడినా.. సంఖ్యాపరంగా అవి చిన్న ధర్మాసనాలు కావడంతో.. 1954, 63లో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆధార్‌ అనుసంధానం చేయడంతో మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. అయితే గతంలో పరస్పర విరుద్ధ తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్త్రతమైన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్‌ రోహత్గీ కోర్టుకు నివేదించారు. దీంతో తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవంగా తేల్చింది.

(ఈనాడు సౌజన్యం తో)