Home News గాంధీ ఆస్పత్రిలో సేవాభారతి సేవలు

గాంధీ ఆస్పత్రిలో సేవాభారతి సేవలు

0
SHARE

‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు. కానీ ఆ వైద్యుడు రోగికి సరైన వైద్యం చేయాలంటే తగిన పరిస్థితులు, సౌకర్యాలు కూడా ఉండాలి. అవి లేనప్పుడు వైద్యుడు ఎంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో తన పని చేయాలనుకున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. పేదలకు ఆధారమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాల లేమి కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.ముఖ్యంగా భాగ్యనగర్‌లోని గాంధీ, ఉస్మానియావంటి ప్రధాన, పెద్ద ఆసుపత్రుల్లో ఈ లోటు బాగా ఉంది. ప్రతిరోజు వేలసంఖ్యలో రోగులు, వారితోపాటు సహాయకులు వస్తుంటారు. ఏ వార్డు ఎక్కడ ఉందో, ఏ డాక్టర్‌ను ఎప్పుడు కలవాలో చెప్పేవారు లేక ఇబ్బందులు పడతారు. అలాగే రోగులతోపాటు వచ్చిన సహాయకులు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఇక వార్డుల్లో కూడా సదుపాయాలు అంతంతమాత్రమే.

ఈ సమస్యలను తీర్చడానికి సేవాభారతి ముందుకు వచ్చింది. ఆసుపత్రి పాలనాధికారుల అభ్యర్థన మేరకు అవుట్‌ పేషెంట్‌, రేడియాలజీ, గైనకాలజీ, ప్రసూతి వార్డుల్లో ‘సహాయకేంద్రాల’ను సేవాభారతి నిర్వహిస్తోంది. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఏ డాక్టర్‌ దగ్గరకి వెళ్ళాలి మొదలైన సమాచారాన్ని సహాయకేంద్రంలోని స్వచ్ఛంద కార్యకర్తలు అందజేస్తారు. అలాగే నడిచి వెళ్ళలేని స్థితిలో ఉన్న రోగులకు చక్రాల కుర్చీలు కూడా ఏర్పాటుచేస్తారు.

ఆసుపత్రి నిర్వహణలో కూడా సేవాభారతి తనవంతు సహాయాన్ని అందిస్తోంది. ఏకం ఫౌండేషన్‌తో కలిసి ముఖ్యమైన కొన్ని వార్డుల్లో నర్సులను నియమించడమేకాక, ఆ వార్డుల నిర్వహణలో కూడా పాలుపంచుకుంటోంది. అత్యవసరసేవలు, ప్రమాదాలు, రేడియాలజీ, ప్రసూతి వార్డు మొదలైనచోట్ల 60మందికి పైగా నర్సులను నియమించింది. ముఖ్యంగా రేడియాలజీ విభాగం నిర్వహణలో సేవాభారతి తోడ్పాటు ఎంతో బాగుందని ఆసుపత్రి అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు రోగులకు మనో ధైర్యాన్ని కలిగించేందుకు కూడా సేవాభారతి కార్య కర్తలు కౌన్సిలింగ్‌ సేవలు అందిస్తున్నారు. తమవారే తమను సరిగా పట్టించుకోని స్థితిలో సేవాభారతి కార్యకర్తలు చూపుతున్న శ్రద్ధ, అభిమానంపట్ల రోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వైద్యంకోసం వచ్చే రోగులు ఎదుర్కొనే సమస్యల కంటే వారితోపాటు వచ్చే సహాయకులకు ఎదురయ్యే ఇబ్బందులు ఎక్కువ. రోగులు ఉండే వార్డుల్లో ఉండటానికి వీలుండదు. వేళకి ఆహారం కూడా దొరకదు. ఈ సమస్యని పరిష్కరించాలని ఆసుపత్రి అధికారులు భావించినప్పుడు మళ్ళీ సేవాభారతి ముందుకు వచ్చింది. ఆసుపత్రి ఆవరణలోనే శివానందాశ్రమం నిర్మించిన రెండతస్థుల భవనంలో ‘నివాసకేంద్రాన్ని’ నిర్వహిస్తోంది. రోగులతోపాటు వచ్చే సహాయకులు ఇక్కడ నిశ్చింతగా ఉండవచ్చు. వారికి ఇక్కడే రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం కూడా లభిస్తుంది. ఈ సదుపాయాల కోసం రోజుకు కేవలం పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆసుపత్రి ఆవరణలో శుభ్రమైన మంచినీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు సేవాభారతి వాటర్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ సదుపాయాలన్నిటికీ అవసరమయ్యే ధనసహాయం అందించడానికి అనేకమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రోగుల సహాయకులకోసం నిర్వహించే నివాస కేంద్రంలో 250మందికి ఒకరోజు భోజన సదుపాయానికి అయ్యే ఖర్చును భరించడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. సన్నిహితుల పుట్టినరోజు మొదలైన సందర్భాల్లో ఒకరోజు భోజనఖర్చును భరిస్తున్నారు.

(లోకహితం సౌజన్యం తో)