Home News అంగ రంగ వైభవంగా ఆరంభమైన “సేవా సంగమం”

అంగ రంగ వైభవంగా ఆరంభమైన “సేవా సంగమం”

0
SHARE

విజయవాడ సిద్ధార్థ నగర్ లోని సిద్ధార్థ కళాశాలలో గల సిద్ధార్థ ఆడిటోరియం నందు నేడు సేవా సంగమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, కాకినాడ శ్రీ పీఠం సంస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి, ఆర్ ఎస్ ఎస్ అఖిలభారత సేవా ప్రముఖ శ్రీ పరాగ్ అభ్యంకర్, ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యాం కుమార్, సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె. ఎస్. ఎన్. చారి, సేవా భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రావణ్ కుమార్, సేవా సంఘం ఆహ్వాన సమితి సభ్యులు శ్రీ తొండేపి హనుమంతరావు, డాక్టర్ చదలవాడ సుధలు వేదికను అలంకరించారు.

జాతీయ గీతం జన గణ మన, జాతీయ గేయం వందేమాతరంలతో ప్రారంభమైన సభలో మొదటిగా సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే ఎస్ ఎన్ చారి గారు సేవా భారతి కార్యకలాపాలను, సేవా సంగమం యొక్క ఉద్దేశ్యాలను వివరించారు.


ప్రసంగిస్తున్న సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కే. ఎస్. ఎన్ చారి

డాక్టర్ కే ఎస్ ఎన్ చారి మాట్లాడుతూ భారతదేశం యొక్క ప్రేరక మంత్రం “ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ… ” అని, కానీ విదేశీ దండయాత్రల సమయంలో కొల్లగొట్టబడిన కారణంగా భారతదేశం నేటి ఈ స్థితికి చేరుకున్నది తెలిపారు. మన దేశంలో నేడు రెండు కోట్ల మంది అనాధలు, నాలుగు కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని, అట్టి వారందరికీ స్వావలంబన చేకూర్చి దేశాన్ని పరమ వైభవ స్థితికి చేర్చడం సేవాభారతి యొక్క లక్ష్యం అని తెలిపారు.

స్వయంసేవకుల నిర్విరామ కృషి ఫలితంగా  సేవా భారతి అనేక సేవా ప్రగల్పాలు నడుపుతున్నదని ఆయన అన్నారు. నేడు ఈ సేవా సంగమంలో అనేక సంవత్సరాలుగా వివిధ సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న వివిధ సేవా సంస్థలు పాల్గొంటున్నాయని, ఈ సేవా సంగమం కుంభమేళా అంతా పవిత్ర కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో వివిధ సేవా సంస్థలు తమ అనుభవాలను పంచుకుంటాయని శ్రీ చారి తెలిపారు.

1989లో అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ బాలా సాహెబ్ దేవరస్ జీ సేవా భారతిని ప్రారంభించారని, నేడు సేవా భారతి 1, 72, 700 సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నూ,  మన రాష్ట్రంలో సుమారు 1500  సేవా కార్యక్రమాలను  నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు. వాటిలో సుమారు 500 అభ్యాసికలు, 6 ఆవాస విద్యాలయాలు, 5 ఆసుపత్రులు, ఆరు సంచార వైద్యశాలలు, ఒక మహా రోగి ఆరోగ్య కేంద్రం, ఒక గోశాల, 3 ఆశ్రిత ఆవాస విద్యాలయాలు, మత్స్యకార గ్రామాలలో 100 బాల సంస్కార కేంద్రాలు, 3 కుట్టు శిక్షణ కేంద్రాలు, 3 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఇలా అనేకం నడుస్తున్నాయని, వాటి ద్వారా లక్షా నలభై వేల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి తమ వంతు సాయం చేస్తున్న దాతలకు ఈ సందర్భంగా సేవాభారతి తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యాం కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ద్వారా నిర్మితమైన వ్యక్తులు తమకు ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమిస్తూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.

సేవ, త్యాగాలు భారతదేశం యొక్క ఆదర్శాలని,  మనం నేర్చుకునే భాష, మన వేషం, మనం తినే ఆహారం, మనం కట్టే బట్ట, నేర్చే విద్య అన్నీ మనకు సమాజం వల్లనే లభ్యమవుతున్నాయనీ, కనుక సమాజం యొక్క ఋణం తీర్చుకోవడం మనందరి కర్తవ్యం అని తెలిపారు.


ప్రసంగిస్తున్న ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యాం కుమార్

“దేశంలో ఎందరో అభాగ్యులు, దుఃఖితులు, పీడితులు ఉన్నారు. రెండు పూటలా భోజనానికి నోచుకోని వారు కూడా ఉన్నారు.  మనందరము జీవించి ఉండగా వారు అలాంటి కష్టాలను ఎందుకు అనుభవించాలి?” అని ఆయన ప్రశ్నించారు.

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధి దేవోభవ అనే వాక్యానికి స్వామి వివేకానంద దరిద్ర దేవోభవ, మూర్ఖ దేవోభవ, రోగి దేవోభవ అని చేర్చారని, అంటే దానర్థం తల్లిదండ్రులు, గురువు, అతిథి తో పాటుగా సమాజంలోని దరిద్రులు, తెలివి తక్కువ వారు, రోగులు కూడా దైవంతో సమానం అని, వారిని సేవించడమే నిజమైన మాధవ సేవ అని శ్యాంజీ తెలిపారు.

వ్యాసభగవానుడు’ పరోపకారాయ పుణ్యాయ – పాపాయ పరపీడనం’ అని చెబుతూ ఇదే కోటి గ్రంథాల సారాంశం అని బోధించారని, దీని ద్వారానే జీవన సాఫల్యం ఉన్నదని ఆర్ ఎస్ ఎస్ విశ్వసిస్తుందని తెలిపారు.

తల్లి ఏ విధంగా అయితే ప్రతిఫలాపేక్ష లేకుండా తన సంతానానికి సేవలు చేస్తుందో, మనం కూడా అంతే నిస్వార్థ భావన తో సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. దీనదయాళ్ జీ చెప్పినట్లుగా ఆఖరి పంక్తిలోని ఆఖరి వ్యక్తికి కూడా సేవ అందాలని, అది నిరహంకార భావనతో చెయ్యాలని తెలిపారు. సోదరి నివేదిత భారత దేశానికి వస్తానన్నప్పుడు “నువ్వు సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తున్నావా? సేవ చెయ్యడానికా?” అని ప్రశ్నించారని, కర్తవ్య భావనతో సేవ చెయ్యాలని, ఇతరులలో కూడా సేవా భావాన్ని కలిగించాలని తెలిపారు. సేవా కార్యంలో నిమగ్నులైన స్వయంసేవకులెందరో బలిదానమయ్యారని శ్రీ శ్యాంజీ పేర్కొన్నారు.

అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరి చందన్ చేతుల మీదుగా సేవా సంగమం యొక్క స్మరణికను విడుదల చేయించారు. గవర్నర్ మాట్లాడుతూ సామాజిక పరివర్తన లో సేవా భారతి భాగస్వామ్యం అనన్య సామాన్య మని కొనియాడారు.

వ్యవసాయంలో మన ప్రాచీన విధానాలను అవలంబించడం ద్వారా విషాహార ఉత్పత్తిని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని సేవా భారతిని కోరారు.


ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

వైద్యరంగంలో డాక్టర్ చదలవాడ సుధా గారు సాగించిన కృషిని ప్రశంసిస్తూ ఆమెను గవర్నర్ సత్కరించారు. అలాగే సేవా భారతి సభ్యులు శ్రీ సాంబశివరావు, సుధాకర్ లు గవర్నర్ను ఘనంగా సత్కరించారు.

అనంతరం కాకినాడ శ్రీపీఠం సంస్థాపకులు పూజ్య పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ కనకదుర్గమ్మ పాదాల సన్నిధిలో, ఆమె ఒడిలో జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత పవిత్రమైనదని తెలిపారు. నదీ సంగమంతో ఎలాగైతే పరిసరాలు పుష్కలం అవుతాయో, అలా ఈ నిస్వార్ధ సేవా సంగమం ఒక పవిత్ర యజ్ఞం అని, సత్రయాగం వంటిదని పేర్కొన్నారు. మన పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు మన బాధ్యతను, కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించమని చెబుతున్నాయని అలా చేస్తే అసలు ‘సేవ’ అవసరమేలేదని పేర్కొన్నారు.

పూర్వకాలంలో భారతదేశంలో దేవాలయాలు, గురుకులాలు సేవా కేంద్రాలని, దేవాలయాలు, గురుకులాల కేంద్రంగానే మన దేశంలో విద్య, వైద్యం ఉచితంగా అందాయని కానీ నేడు రాజకీయ జోక్యం కారణంగా అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రసంగిస్తున్న పూజ్య పరిపూర్ణానంద స్వామీజీ

ఎలాంటి కీర్తిని, పేరు ప్రతిష్టలను కోరుకోకుండా ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న నిస్వార్థ సేవ అందరికీ ఆదర్శమని, ఆ ప్రేరణతో, తమ గురువుగారి ఆదేశంతో తాము కూడా తమ ఆశ్రమం తరపున సంధ్యా గురుకులాల పేరుతో సాయంత్రం పూట పేద పిల్లలకు విద్యను, సంస్కారాలను నేర్పించే పనిని ప్రారంభించామని, నేడు ఆ పిల్లలు తమ కుటుంబాలలో సైతం గొప్ప పరివర్తనకు కారణం అవుతున్నారని, విడిపోయిన తమ తల్లిదండ్రులను కూడా కలుపుతున్నారని స్వామి తెలిపారు.

చివరిగా ఆర్ ఎస్ ఎస్ అఖిలభారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ జీ అభ్యంకర్ మాట్లాడుతూ సేవ పొందిన వారు ఎప్పుడూ సేవ పొందే వారిగానే వుండి పోకూడదన్నది సేవా భారతి ఉద్దేశ్యమని, వారు కూడా స్వావలంబన సాధించి వేరొకరికి చేయూతనివ్వగలిగేలా చెయ్యడమే సేవాభారతి లక్ష్యమని వివరించారు.

ఆర్ ఎస్ ఎస్ తన విశేష ప్రయత్నంతో రాజస్థాన్లో చెత్త ఏరుకుని జీవించే వీధి బాలలకు చదువు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిందని తెలిపారు.

అలాగే మహారాష్ట్రలో ఆంగ్లేయుల కాలం నుంచి నేరస్తులుగా, దొంగలుగా ముద్ర పడిన ఒక వర్గాన్ని కలిసి వారి పిల్లలకి విద్యా బోధన చేయడం ద్వారా వారు నేడు సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, అవమానకర జీవనం నుంచి నేడు గౌరవప్రదమైన జీవనం వైపు పయనిస్తున్నారని తెలిపారు.


ప్రసంగిస్తున్న అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్

అదే మహారాష్ట్రలో భిక్షాటనతో జీవించే ‘గోపాల్’ అనే  వర్గానికి చెందిన వారికి సంఘ స్వయం సేవకులు సంగీతంలో ఇప్పించిన శిక్షణ కారణంగా నేడు గౌరవప్రదంగా జీవించగలుగుతున్నారని తెలిపారు.

మృతులైన ఉగ్రవాదుల పిల్లలతో సేవా భారతి నడుపుతున్న ఒక ఆవాసంలో ఒక ఆరవ తరగతి విద్యార్థిని “నువ్వు పెద్దయ్యాక ఎమవుదామనుకున్తున్నావ్?” అని తన పర్యటనలో సంఘ అధికారి ఒకరు ప్రశ్నించినప్పుడు “మా నాన్నను చంపిన భారత సైనికులను చంపడానికి నేను కూడా ఉగ్రవాదినవుతాను” అని చెప్పాడు.  మరో మూడేళ్ల తర్వాత మరో సంఘ  అధికారి పర్యటనలో అదే బాలుడు “నేను మా నాన్నను ఉగ్రవాదం వైపు ప్రేరేపించిన వారిని చంపే సైనికుడనవుతాను” అన్నాడు. ఈ విధంగా సేవా భారతి తన కృషి ద్వారా మనుషులలోనూ, మనసులలోనూ కూడా పరివర్తన తీసుకొస్తోందని ఆయన తెలిపారు.

అనంతరం వివిధ సేవాకార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న అనంతపురానికి చెందిన శ్రీ కసిరెడ్డి వజ్ర భాస్కర్ రెడ్డి, శ్రీ వక్కలంక రామకృష్ణలను పూజ్య పరిపూర్ణానంద స్వామి సత్కరించారు.

Source: vskandhra.org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here